av dharma reddy
-
టీటీడీ నిధులతో నిర్మాణాలకు పెద్దపీట
తిరుమల: టీటీడీ నిధులతో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్ నుంచి వకుళమాత ఆలయం వద్ద జాతీయ రహదారి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.21.10 కోట్లతో టెండర్ ఆమోదం. ఇది పూర్తయితే తిరుపతికి పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. ► ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ.1.65 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి పనులకు టెండర్ ఆమోదం. ► తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రుయా ఆస్పత్రిలో నూతన టీబీ వార్డు నిర్మాణానికి రూ.1.79 కోట్లతో టెండర్ ఆమోదం. ► స్విమ్స్ ఆస్పత్రిలో మరింత మంది రోగుల సౌకర్యం కోసం రూ.3.35 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనంపై మరో రెండు అంతస్తుల నిర్మాణానికి టెండరు ఆమోదం. ► స్విమ్స్‌లో నూతన కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి రూ.74.24 కోట్లతో టెండర్ ఖరారు. ► స్విమ్స్ ఆస్పత్రి భవనాల ఆధునికీకరణకు, పునర్నిర్మాణానికి రూ.197 కోట్లతో చేపట్టే పనులకు పరిపాలనా అనుమతికి ఆమోదం. మూడేళ్లలో దశలవారీగా చేపట్టేందుకు నిర్ణయం. ► నడక దారుల్లో భక్తుల భద్రత కోసం డిజిటల్ కెమెరా ట్రాప్‌లు, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూమ్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్ల మంజూరుకు ఆమోదం. ► కరీంనగర్లో శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్ల పనులకు టెండర్ ఆమోదం. 23న విశేష హోమం ► శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రారంభం. ఇందుకోసం టికెట్ ధర రూ.1000గా నిర్ణయం. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొనవచ్చు. ఈనెల 16న టీటీడీ ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తారు. ► టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రాష్ట్ర ప్రభుత్వ జీవో 114 విధివిధానాలకు లోబడి టీటీడీలో అమలుకు నిర్ణయం. ► తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ కలంకారీ, శిల్పకళలో ప్రాథమిక శిక్షణ సాయంకాలం కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం. -
తిరుపతి ఎస్వీ గోశాలలో ‘సరోగసి’ దూడ జననం
తిరుపతి రూరల్: దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం తిరుపతిలోని ఎస్వీ గోశాలలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా టీటీడీ పరిధిలోని తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో మేలుజాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారని చెప్పారు. వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కోసం దాతలు ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చా రని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో 324 సాహివాల్ గోజాతి దూడల ఉత్పత్తి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ సరోగసి పద్ధతిలో రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీన్లోభాగంగా పిండమార్పిడి చేసిన ఆవుల్లో ఇప్పటివరకు 11 గర్భం దాల్చినట్లు చెప్పారు. ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్ పెయ్యదూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరో పది సాహివాల్ దూడలు జన్మించనున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు రామ్సునీల్రెడ్డి, గో సంరక్షణశాల డైరెక్టర్ హరినాథరెడ్డి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ వీరబ్రహ్మయ్య, వెంకట్‌నాయుడు పాల్గొన్నారు. -
నూతన పరకామణి భవనంలో లెక్కింపు ప్రారంభం
తిరుమల: శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. నూతన పరకామణి భవనంలో ఆయన పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుమల పెద్దజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఆదివారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలను చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించినట్లు చెప్పారు. ఇకపై రోజూ అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. త్వరలో ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు వీలుగా తీర్చిదిద్దుతామన్నారు. -
TTD: డిసెంబరు నాటికి ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు
సాక్షి, తిరుపతి: తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియాన్ని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని అన్నారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది స్పష్టం చేశారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించామని ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తాన్నారు. ‘‘తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోంది. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళుతున్నాం. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో మొబైల్ యాప్‌ను ఇటీవల ప్రారంభించాం’’ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చునని ధర్మారెడ్డి పేర్కొన్నారు. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారన్నారు. ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహా శివరాత్రి పర్వదినం ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.78 లక్షలు కాగా, హుండీ ద్వాతా రూ.123.07 కోట్లు ఆదాయం చేకూరింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.07 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 37.38 లక్షలు, కాగట కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.51 లక్షలు. చదవండి: ఏకో ఇండియాతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ -
కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఊరట
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఊరట లభించింది. జైలు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది హైకోర్టు ధర్మాసనం. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈఓ ధర్మారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు ఏమిటి? టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రోగ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011లో జారీ చేసిన టీటీడీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, తమను ప్రోగ్రాం అసిస్టెంట్లుగా తమ స్వర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశించాలని కొమ్ము బాబు, రామావత్ స్వామి నాయక్, భూక్యా సేవ్లానాయక్‌లు పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరించాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదని పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్ 16న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్.. టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి నెలరోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు ధర్మాసనం స్టే విధించటంతో ఊరట లభించింది. ఇదీ చదవండి: సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మారెడ్డి అప్పీల్ -
వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పు
తిరుమల: తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాలను ఈవో ఏవీ ధర్మారెడ్డి భక్తులకు వివరించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 24న గజవాహనం, 25న గరుడ వాహనం, 27న రథోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసి నెల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేస్తామని, భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 7న కర్నూలు జిల్లా యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి వేస్తారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం తదితర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ నెల 9న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒంగోలు శివారులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు. -
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ
తిరుపతి అలిపిరి/తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పున:ప్రారంభించనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో 15 వేలు చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. టోకెన్ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఆధార్ నంబరు నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశం ఉంటుందన్నారు. తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తామని, అక్కడే గదులు కేటాయిస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 31 నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,131 మంది స్వామి వారిని దర్శించుకోగా, 31,188 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.47 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నేడు తిరుమలలో పుష్పయాగం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నిర్వహించనున్న పుష్పయాగానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య రుత్విక్వరణం (అర్చకులకు విధుల కేటాయింపు) నిర్వహించారు. సాయంత్రం ఆరుగంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులను ఆలయం నుంచి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది వరకు ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ చేశారు. టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, వీజివో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు. నేడు స్నపన తిరుమంజనం పుష్పయాగం సందర్భంగా మంగళవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవర్లకు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమిస్తారు. పుష్పయాగం కారణంగా మంగళవారం పలు సేవలు రద్దుచేసింది. -
టీటీడీ ఈవో పోస్టుకు ధర్మారెడ్డి అర్హుడే: హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: డిప్యుటేషన్‌పై టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏవీ ధర్మారెడ్డికి ఇన్చార్జ్ ఈవోగా బాధ్యతలు అప్పగించడంపై దాఖలైన కోవారెంటో పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈవోగా నియామకానికి ధర్మారెడ్డి అర్హుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్(ఐడీఈఎస్)లో ధర్మారెడ్డి జాయింట్ సెక్రటరీగా పనిచేశారని, అది రాష్ట్ర సర్వీసులో కార్యదర్శి స్థాయి పోస్టు అని, ఇదే సమయంలో కలెక్టర్ పోస్టు కన్నా పెద్ద పోస్టు అని.. కలెక్టర్ కన్నా ఎక్కువ హోదా కలిగిన పోస్టులో నియమితులయ్యేందుకు అర్హతలున్న వ్యక్తి టీటీడీ ఈవోగా నియమితులు కావొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. దీని ప్రకారం ధర్మారెడ్డిని పూర్తిస్థాయి ఈవోగా టీటీడీ నియమించడంలో ఎలాంటి తప్పులేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం తీర్పు వెలువరించారు. ఐడీఈఎస్ అధికారి అయిన ధర్మారెడ్డికి ఐఏఎస్ అధికారి నిర్వర్తించే టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించడం చట్ట విరుద్ధమంటూ తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో కోవారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గురువారం తీర్పు వెలువరించారు. అందులో ఈవో నియామకానికి సంబంధించిన చట్ట నిబంధనలపై సవివరంగా చర్చించారు. దేవదాయ చట్టంలోని సెక్షన్–107 కింద అఖిల భారత సర్వీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర సర్వీసులకు చెందిన ఏ అధికారినైనా ఈవోగా నియమించవచ్చని, అయితే, ఆ అధికారం కలెక్టర్ కన్నా ఎక్కువ హోదా ఉంటే సరిపోతుందన్న ధర్మారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణప్రసాద్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ధర్మారెడ్డి గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో పనిచేశారని న్యాయమూర్తి తన తీర్పులో గుర్తుచేశారు. నవీన్‌కుమార్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేశారు. -
27న తిరుమలకు ముఖ్యమంత్రి జగన్
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో శనివారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. 27వ తేదీ రాత్రి 7 గంటలకు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారని తెలిపారు. 28వ తేదీ ఉదయం పరకామణి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ భవనంలో కానుకల లెక్కింపును భక్తులు వీక్షించేందుకు రెండువైపులా అద్దాలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ఆలయానికి బంగారు తాపడం పనులకు సంబంధించిన విధి విధానాలపై అధ్యయనం చేస్తున్నారని.. వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను ఆలయ నిర్మాణాలకు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగిస్తున్నామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ ట్రస్టుకు రూ.516 కోట్ల విరాళాలు అందాయని.. ఈ నిధులతో ఏపీ, తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలుండే ప్రాంతాల్లో 1,342 ఆలయాల నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. 502 ఆలయాల నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. 110 పురాతన ఆలయాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశామన్నారు. -
టీటీడీ ఈవో ధర్మారెడ్డి సర్వీసు రెండేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి/తిరుమల: టీటీడీ ఈవో (ఎఫ్ఏసీ) ఏవీ ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఆయన డెప్యుటేషన్‌ను మరో రెండేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల విన్నవించింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి ఏవీ ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను పొడిగించింది. 2022, మే 14 నుంచి రెండేళ్లపాటు ఆయన డెప్యుటేషన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ –ట్రైనింగ్ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఆయన ఏడేళ్లుగా డెప్యుటేషన్‌పై ఉన్నారు. టీటీడీలో ధర్మారెడ్డి తెచ్చిన సంస్కరణలు.. ► భక్తులకు మహాలఘు దర్శనం, భక్తులు కోరుకున్న అన్ని లడ్డూలు, పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం, వసతి గదుల నిర్మాణం, అతి పెద్ద అన్నప్రసాద సముదాయం, దళారీల ఏరివేతలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ► శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి రెండేళ్లలో రూ.360 కోట్లను భక్తుల నుంచి విరాళాలుగా స్వామి వారికి అందించారు. ► వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో 1,000కి పైగా ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ► కొత్త అన్నదానం కాంప్లెక్స్ (రూ.30 కోట్లు) నిర్మాణం రోజువారీ భోజన సామర్థ్యాన్ని రోజుకు 10 వేల నుంచి లక్షకు పైగా పెంచారు. ► మాడ వీధులను విస్తరించి వాటి చుట్టూ గ్యాలరీలను నిర్మించారు. దీంతో రథసప్తమి, బ్రహ్మోత్సవాలు మొదలైన ప్రత్యేక రోజుల్లో 2 లక్షల మంది యాత్రికులు ఊరేగింపు దేవతలను చూసేందుకు వీలు కలుగుతోంది. ► ఆర్జిత సేవల టికెట్లను కంప్యూటరీకరించారు. ► 26 మంది పీఠాధిపతులు, మఠాధిపతుల ఆమోదంతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించారు. ► విరాళం ప్రాతిపదికన అలిపిరి ఫుట్‌పాత్ (రూ.25 కోట్లు)పై పైకప్పు పునర్నిర్మించారు. è బర్డ్ ఆసుపత్రిలో సేవల పరిధిని విస్తరించారు. -
టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి రిలీవ్
సాక్షి, అమరావతి/తిరుమల: టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. టీటీడీ ఈవోగా ప్రస్తుతానికి అదనపు బాధ్యతలను టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఇకనుంచి జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.సత్యనారాయణ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా కె.శారదాదేవి నియమితులయ్యారు. యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సి.నాగరాణిని రిలీవ్ చేశారు. సెర్ఫ్ సీఈవో ఎండీ ఇంతియాజ్‌కు మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్వజన్మ సుకృతం: జవహర్‌రెడ్డి కాగా ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయిన జవహర్‌రెడ్డి ఆదివారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి టీటీడీ ఈవో (ఎఫ్ఏసీ) బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి కొలువులో 19 నెలలు భక్తులకు సేవలందించానని, ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. టీటీడీ పాలన కాస్త భిన్నమైనదని, ఆలయ వ్యవహారాలు, అర్చక వ్యవస్థ కొత్త అనుభూతినిచ్చాయని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పేదవర్గాల వారికి స్వామివారి దర్శనం చేయించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. టీటీడీ ఈవో(ఎఫ్ఏసీ) ధర్మారెడ్డి టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేఈవో (ఆరోగ్యం, విద్య) సదాభార్గవి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. -
టీటీడీపై దుష్ప్రచారం తగదు
తిరుమల: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలలో నివసించిన స్థలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2003లో తిరుమల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వరాహ స్వామి ఆలయం వెనుక మఠాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు తొలగించారన్నారు. అప్పట్లో ఆయా మఠాల నిర్వాహకులు ఆ విగ్రహాలను తీసుకెళ్లారన్నారు. వరాహస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న అన్నమయ్య, ఆంజనేయస్వామి విగ్రహాలను కూడా అన్నమయ్య వంశస్థులు తీసుకెళ్లారని తెలిపారు. 2007లో తిరుమల నాలుగు మాడ వీధులను సందర్శించిన కొంతమంది సాధువులు విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రతిపాదించగా, ఆగమ సలహా మండలి మాడవీధుల్లో శ్రీవారు తప్ప వేరే విగ్రహాలను పూజించకూడదని నివేదిక సమర్పించిందన్నారు. శ్రీవారి సేవలో అన్నమయ్య వంశీకులు: శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, ఏకాంత సేవల్లో అన్నమయ్య వంశీకులు పాల్గొంటున్నారని ధర్మారెడ్డి చెప్పారు. నిత్యం సహస్ర దీపాలంకరణ సేవలో అన్నమాచార్యుల సంకీర్తనలు ఆలపిస్తారని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో 45 ఏళ్ల క్రితమే అన్నమాచార్య ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఏటా రూ.25 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. 1995నుంచి అన్నమయ్య జయంతి, వర్థంతి కార్యక్రమాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు. తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని టీటీడీ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లా పేరును అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసిందని వివరించారు. ఎస్వీబీసీ చానల్లో యువ కళాకారులతో అన్నమయ్య సంకీర్తనలపై అదివో అల్లదివో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. 14 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు తిరుమల శ్రీవారి ఆలయంలో 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లు ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. 14వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయ్యాక తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు 15న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు 16న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటుగా సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణీసమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని 14 నుంచి 16 వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, 15న నిజపాద దర్శనం సేవను టీటీడీ రద్దు చేసింది. -
భక్తులకు మరింత సులభంగా వసతి గదులు
తిరుమల: తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదులు పొందే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని సీఆర్వో వద్ద ఏర్పాటు చేసిన నూతన కౌంటర్లను అదనపు ఈవో శనివారం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు సీఆర్వో వద్ద మాత్రమే వసతి గదుల రిజిస్ట్రేషన్, కేటాయింపు చేసేవారన్నారు. ఇక్కడ రద్దీ అధికంగా ఉండడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసి, గదులు కేటాయించేందుకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో నూతన కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిల్లో సీఆర్వో వద్ద రెండు కౌంటర్లు, బాలాజీ మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగీచ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, జీఎన్సీ టోల్గేట్ వద్ద ఉన్న లగేజీ కౌంటర్ వద్ద రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు ఎస్ఎమ్ఎస్ ద్వారా వారికి కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తామన్నారు. అనంతరం వారికి గదులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చని ధర్మారెడ్డి తెలిపారు. -
శ్రీవారి భక్తులకు తీపి కబురు
తిరుమల: శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని సోమవారం నుంచి అందించనున్నామని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గం నుంచి కాలినడకన వచ్చే 20 వేల మంది భక్తులకు మాత్రమే ఉచిత లడ్డును అందిస్తున్నామని, ఇకపై శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ 175 గ్రాముల లడ్డును ఉచితంగా అందిస్తామన్నారు. గత నెల టీటీడీ బోర్డు తీర్మానం మేరకు ప్రతి భక్తునికి ఉచిత లడ్డును అందించనున్నట్లు చెప్పారు. రూ.50కు ఎన్ని లడ్డులైనా అందిస్తాం ప్రస్తుతం శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అదనంగా కోరుకునే భక్తులకు ఒక్కొక్కటి రూ.50 చొప్పున టీటీడీ ఇప్పటికే అందిస్తోందని ధర్మారెడ్డి చెప్పారు. ఇక ముందు అదే ధరకు కోరుకున్నన్ని అదనపు లడ్డులను అందిస్తామన్నారు. లడ్డు కేంద్రంలో ప్రస్తుతం నాలుగు ఎల్పీటీ కౌంటర్లు పనిచేస్తుండగా వాటి సంఖ్యను 12కు పెంచామని తెలిపారు. భక్తులకు లడ్డుల కొరత లేకుండా ప్రతిరోజూ నాలుగు లక్షల లడ్డులను సిద్ధంగా ఉంచనున్నామని వివరించారు. -
తిరుమలలో ‘వైకుంఠ’ ఏర్పాట్లు
తిరుమల: నూతన ఆంగ్ల సంవత్సరాది,జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ లోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 31, జనవరి 1వ తేదీల్లో అన్ని ఆర్జిత సేవలతో పాటు దాతలు, వృద్ధులు, దివ్యాం గులు, చంటిపిల్లల దర్శనాలు, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు, అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు చేసినట్టు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు ఆర్జిత సేవలతో పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలు, రూ. 300 దర్శన టికెట్లు, సర్వ దర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశామని వివరించారు. జనవరి 7న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 5 వేల మంది భక్తులకు గతంలోనే ఆన్లైన్లో కేటాయించామన్నారు. జనవరి 6న తెల్లవారుజామున 2 నుంచి వైకుంఠ ద్వార దర్శ నం ప్రారంభమవుతుందని తెలిపారు. నారాయణ గిరి ఉద్యానవనాల్లోని షెడ్లలో జనవరి 5న ఉదయం 11 నుంచి రాత్రి 12 వరకు నామసంకీర్తన యజ్ఞం నిర్వ హిస్తామని వెల్లడించారు. ఈ సమీక్షలో టీటీటీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఎస్ఈ–2 నాగేశ్వరరావు, ఎస్ఈ (ఎలక్ట్రికల్స్) వెంకటేశ్వర్లు, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, హెచ్డీపీపీ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ తదితరులు పాల్గొన్నారు. జనవరిలో విశేష ఉత్సవాలు జనవరి నెలలో తిరుమల ఆలయంలో పలు విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 6న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు, 7న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, అలాగే 7 నుంచి 13 వరకు ఆండాళ్ నీరాటోత్సవం, 11న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 14న భోగి, 15న మకర సంక్రాంతి. 16న శ్రీవారి పార్వేట ఉత్సవం, శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 19న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు, 30న వసంతపంచమి తదితర విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. -
దర్శన ప్రాప్తిరస్తు.. వసతి మస్తు
తిరుమల: సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. వారికి పారదర్శకంగా గదులు కేటాయిస్తోంది. గదులు దొరకని భక్తులకు యాత్రికుల వసతి సముదాయాల్లో ఉచితంగా లాకర్ సౌకర్యం కలి్పస్తోంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో ఇటీవల అందుబాటులోకి వచి్చన పద్మనాభ నిలయంతో కలిపి మొత్తం 5 యాత్రికుల వసతి సముదాయాలున్నాయి. ఇక్కడ ఉచితంగా లాకర్లు కేటాయిస్తారు. యాత్రికులు తమ సామగ్రిని ఇందులో భద్రపరుచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లి రావచ్చు. విశాలమైన హాళ్లలో చక్కగా విశ్రాంతి పొందొచ్చు. ఇక్కడ తలనీలాల సమర్పణకు మినీ కల్యాణకట్ట, మరుగుదొడ్లు, స్నానపు గదులు, జల ప్రసాదం, అన్నప్రసాదం తదితర సౌకర్యాలు ఉన్నాయి. అద్దె గదులు దొరకని వారు పీఏసీల్లో సౌకర్యవంతంగా బస చేయవచ్చు. రిసెప్షన్ పరిధిలోని పీఏసీ–1, పీఏసీ–2, కౌస్తుభం, నందకం, జీఎన్సీ, పద్మావతి కౌంటర్, ఎస్వీ విశ్రాంతి గృహం, హెచ్వీసీ, సప్తగిరి విశ్రాంతి సముదాయాల వద్ద యాత్రికులు తలనీలాలు సమరి్పంచేందుకు మినీ కల్యాణ కట్టలు ఉన్నాయి. అందుబాటులో దిండ్లు.. దుప్పట్లు అన్ని వసతి గదులు, íపీఏసీల్లో భక్తులకు ప్రత్యేక కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కిట్లలో చాపలు, దిండ్లు, దుప్పట్లు, ఉన్ని కంబళి ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో బస చేసే యాత్రికులు వీటిని అదనంగా పొందొచ్చు. ఒక రోజుకు 2 చాపలకు రూ.10, కవర్లతో కలిపి 2 దిండ్లకు రూ.10, ఒక దుప్పటికి రూ.10, ఒక ఉన్ని కంబళికి రూ.20 సేవా రుసుం వసూలు చేస్తారు. భక్తులు వీటిని బాగా వినియోగించుకుంటున్నారు. అన్నిచోట్లా స్వైపింగ్ యంత్రాలు శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం, ఎంబీసీ, టీబీ కౌంటర్ (కౌస్తుభం), సీఆర్వో కార్యాలయంలోని సీఆర్వో జనరల్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచారు. వీటిని యాత్రికులు బాగా వినియోగించుకుంటున్నారు. దీనివల్ల చిల్లర సమస్య కూడా తీరినట్లవుతోంది. పద్మావతి కౌంటర్లో 97 శాతం, ఎంబీసీలో 100 శాతం, టీబీ కౌంటర్లో 91 శాతం, సప్తగిరి విశ్రాంతి గృహాల వద్ద 62 శాతం, సూరాపురం తోట, రాంభగీచా, సీఆర్వో జనరల్ వద్ద దాదాపు 50 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. సామాన్య భక్తుల కోసం 10 కల్యాణ మండపాలు సామాన్య భక్తులు వివాహాలు చేసుకునేందుకు వీలుగా వసతి కల్పన విభాగం పరిధిలో ఎస్ఎంసీ వద్ద 6, ఏటీసీ వద్ద ఒకటి, టీబీసీ వద్ద 3 కలిపి మొత్తం 10 కల్యాణ మండపాలున్నాయి. 90 రోజుల ముందు నుంచి వీటిని కరంట్ బుకింగ్‌లో పొందవచ్చు. ఎస్ఎంసీ వద్ద రూ.200, ఏటీసీ వద్ద రూ.500, టీబీసీ వద్ద రూ.200 అద్దె ఉంది. ఇందుకోసం వధువు లేదా వరుడి తల్లిదండ్రులు సీఆర్వోలోని ఆర్వో–1 ఏఈవోను సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకు వరుడు, వధువు వయసు ధ్రువీకరణ పత్రం కాపీని సమర్పించాలి. వివాహం చేసుకునే వారు తప్పనిసరిగా హిందువులై ఉండాలి. అందరికీ వసతి కల్పించడమే లక్ష్యం తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికీ వసతి కలి్పంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. రద్దీ అధికంగా ఉన్న సమయంలో టీటీడీ సముదాయాల్లోనే బస చేయాలని భక్తులను కోరుతున్నాం. పీఏసీ హాల్లో చాపలు, దిండ్లు వుంటాయి. గదులు దొరకని భక్తులు లాకర్ తీసుకుని వీటిని వినియోగించుకోవచ్చు. – ఏవీ ధర్మారెడ్డి, అడిషనల్ ఈవో, టీటీడీ -
బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం
తిరుమల: ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 30 నుంచి అక్టోబర్ 8వతేది వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి తెలిపారు. భక్తులంతా టీటీడీ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తుల భద్రత, సామాన్యులకు స్వామివారి దర్శనం అందేలా తీసుకున్న చర్యల గురించి ఆయన ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలు ఇవీ... రూ.7.53 కోట్లతో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను రూ.7.53 కోట్లతో నిర్వహిస్తున్నాం. తిరుమలలో ఇంజనీరింగ్ పనులతోపాటు పలు నిర్మాణాలు చేపట్టాం. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులపాటు ఘాట్ రోడ్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. గరుడ వాహనం ముందు రోజు నుంచి తిరుమల రెండు ఘాట్ రోడ్లల్లో ద్విచక్ర వాహనాలను నిలిపివేస్తాం. గరుడ సేవ ముగిసిన అనంతరం అనుమతిస్తాం. నిరంతరం ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 406 బస్సులతో 1,669 ట్రిప్పులు తిప్పుతున్నాం. 90 వేల మంది తిరుమలకు చేరుకునేలా సదుపాయాలు కల్పించాం. బ్రహ్మోత్సవాల సమయంలో 2,200 ట్రిప్పులు నడిపి 2 లక్షల మందికి సరిపడేలా రవాణా సౌకర్యం కల్పిస్తాం.గరుడ వాహనం రోజు 3,176 ట్రిప్పులు నడపాలని ఆర్టీసీని కోరాం. భక్తుల కోసం 7 లక్షల లడ్డూ ప్రసాదాలు ఈసారి నాలుగు మాడ వీధుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులను అనుమతిస్తాం. చివరన ఉన్న భక్తులు సైతం ఉత్సవమూర్తులను సంతృప్తికరంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టాం. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఎలాంటి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఉండవు. ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. అక్టోబర్ 4న జరిగే గరుడ వాహన సేవ రోజు ప్రొటోకాల్ దర్శనాలు కూడా ఉండవు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి లడ్డూ అందించేలా ఏడు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నాం. 3 వేల మంది శ్రీవారి సేవకులు, 3,100 మంది పోలీసులు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షిస్తారు. గ్యాలరీల్లో నిరంతరం అన్నప్రసాదం.. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు, గ్యాలరీల్లో వేచిఉన్న వారందరికీ నిరంతరం నీటి సదుపాయంతో పాటు అన్నప్రసాదం వితరణకు ఏర్పాట్లు చేశాం. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాం. అన్నదాన వితరణ భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తాం. తిరుమల ప్రధాన కూడళ్లల్లో 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, మాడవీధుల్లో 12 అంబులెన్స్‌లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మెరుగైన పారిశుధ్యం కోసం అదనంగా 800 మంది కార్మికులను నియమించాం. 30న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 30వతేదీన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే సంబంధిత శాఖలతో చర్చించాం. తిరుమలలో రూ.42.86 కోట్లతో నిర్మించిన మాతృశ్రీ వకులాదేవి అతిథిగృహాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. పీఎసీ–5కి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తాం. భక్తుల వసతి కోసం రూ.79 కోట్లతో దీన్ని నిర్మిస్తాం. 2,256 మంది భక్తులకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ముగిస్తాం’ అని ధర్మారెడ్డి పేర్కొన్నారు. -
‘టీటీడీకి తక్కువ ధరకే బియ్యం’
సాక్షి, తిరుపతి : ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో కిలో రూ. 45 గల బియ్యాన్ని రైస్ మిల్లర్లు టీటీడీకి రూ.38 కు అందిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ రోజు సమీక్ష అనంతరం కిలో బియ్యం ధరను మరో రూపాయి తగ్గించినట్లు వెల్లడించారు. దీంతో టీటీడీకి 3 నెలలకు 15 లక్షల రూపాయలు ఆదా అవుతుందన్నారు. ఇంత వరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తునట్లు తెలిపిన ధర్మారెడ్డి.. బియ్యం కొనుగోలును దశల వారిగా తగ్గించి విరాళాలు పెంచాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ను కోరారు. ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీవారి అన్నప్రసాదం కు 375 క్వింటాల బియ్యాన్ని విరాళంగా అందించినట్లు తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డీఐజీ ప్రభాకరరావు, చిత్తూరుకు చెందిన ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు, టీటీడీ మాజీ ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి తదితరలు కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.