తిరుమల: తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాలను ఈవో ఏవీ ధర్మారెడ్డి భక్తులకు వివరించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 24న గజవాహనం, 25న గరుడ వాహనం, 27న రథోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసి నెల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేస్తామని, భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ నెల 7న కర్నూలు జిల్లా యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి వేస్తారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం తదితర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు.
ఈ నెల 9న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒంగోలు శివారులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు.
వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పు
Published Sun, Nov 6 2022 6:10 AM | Last Updated on Sun, Nov 6 2022 7:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment