వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు | TTD VIP Break Dharshan Canceled | Sakshi
Sakshi News home page

వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Published Wed, Apr 13 2022 2:56 AM | Last Updated on Wed, Apr 13 2022 7:49 AM

TTD VIP Break Dharshan Canceled - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఐదు రోజులపాటు నిలిపివేశారు. సాధారణ భక్తులకే ప్రాధాన్యత కల్పించారు. మంగళవారం ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుపతిలో టికెట్లు జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పరిస్థితులను చక్కదిద్దారు. టికెట్లు లేకుండానే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు.

భక్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు వెళ్లి దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ తీవ్రంగా పెరగడంతో బుధవారం నుంచి ఆదివారం వరకు పూర్తిగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. తద్వారా మరో 10 నుంచి 20 వేల మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దర్శనం టికెట్లు లేకపోయినా స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పీఆర్‌వో విభాగం తెలిపింది. 

తిరుమలకు పూర్వ వైభవం
కరోనా కనుమరుగు కావడంతో తిరుమలకు పూర్వ వైభవం వచ్చింది. గతంలో సాధారణ రోజుల్లో 60 నుంచి 80 వేలు, విశేష దినాల్లో లక్ష మంది దర్శనానికి వచ్చేవారు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం మార్చిలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా కొంత తగ్గడంతో 83 రోజుల అనంతరం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించింది. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. ప్రస్తుతం సామాన్య భక్తులను అనుమతిస్తోంది. నిత్యం 30 నుంచి 40 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. 
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌ వద్ద శ్రీవారి దర్శన టిక్కెట్ల కోసం క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు 

భక్తుల తోపులాట.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత
భక్తుల రద్దీ పెరగడంతో టోకెన్ల కోసం వేచి ఉన్న భక్తులకు మూడు రోజుల అనంతరం దర్శనం స్లాట్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆది, సోమ వారాల్లో రెండు రోజులపాటు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేశారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకున్న భక్తులు అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి వారి సత్రాల వద్ద సర్వదర్శనం టోకెన్ల కోసం కొద్ది గంటలుగా బారులు తీరారు. మంగళవారం మరింత మంది భక్తులు రావడంతో తోపులాట జరిగింది.

పలువురు భక్తులు, చిన్నపిల్లలు కింద పడిపోయారు. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ముగ్గురు భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు టికెట్ల జారీని నిలిపివేశారు. టికెట్లు లేకుండా తిరుమలకు అనుమతిస్తామని మైకుల్లో ప్రకటించారు. దీంతో భక్తులు అక్కడ నుంచి అలిపిరి చేరుకుని తిరుమలకు వెళ్లారు. రెండు రోజుల విరామం తర్వాత గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ దగ్గర టికెట్లు జారీ చేశారని, ఈ  కారణంగానే  భక్తుల రద్దీ పెరిగిందని విజిలెన్స్, పోలీసు అధికారులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి క్యూలైన్‌లో వేచిఉన్న భక్తులు 

టికెట్లు లేకున్నా అనుమతి
టికెట్ల జారీ కేంద్రాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తొక్కిసలాట జరగకుండా అధికారులు నివారించారు. టికెట్లు లేకుండానే తిరుమలకు అనుమతించారు. భక్తుల కష్టాలను ఎప్పటికప్పుడు గుర్తించి టీటీడీ చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం.     – వెంకటలక్ష్మి, విజయనగరం

సామాన్య భక్తులకు ప్రాధాన్యత
తిరుమలకు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు విపరీతంగా వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ ఐదు రోజుల పాటు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేయడం చాలా గొప్ప విషయం.
    – సునీతాదేవి, విజయవాడ

అన్నప్రసాదాలు పంపిణీ చేశారు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్న ప్రసాదాలు కూడా వితరణ చేయడం చాలా సంతోషం. ఎప్పటికప్పుడు మంచినీరు, అన్నప్రసాదాలు అందిస్తూ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చేశారు.
    – మీరా, మహారాష్ట్ర భక్తురాలు

మార్చి గణాంకాలు ఇలా ఉన్నాయి
తిరుమల శ్రీవారిని గత మార్చి నెలలో మొత్తం 19,72,741 మంది భక్తులు దర్శించుకున్నారు. 
24,10,133 మందికి అన్న ప్రసాదాలు అందించారు.
9,54,856 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.
1,49,408 మందికి గదులు అద్దెకు ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement