జనతంత్రం
వారెవ్వా! ఎంతటి వంచనాశిల్ప చాతుర్యము. శకుని మామ అనేవాడు బతికే ఉంటే ఈ చతురత ముందు మోకరిల్లి పొర్లు దండాలు పెట్టి ఉండేవాడే! జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల దర్శనా నికి వెళ్తే పెద్ద ఎత్తున అల్లరి జరగాలి. ఆయన మీద రాళ్లు రువ్వాలి. దాడులకు తెగబడాలి. అందుకు ఏర్పాట్లు కూడా జరి గాయి. వేలాదిమందిని సమీకరించి పెట్టుకున్నారు. వైసీపీ వాళ్లను గృహనిర్బంధం చేశారు. జగన్ యాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ ఆ పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లి ఉంటే విధ్వంసానికి రంగం సిద్ధం. అందుకు నెపాన్ని కూడా ఆయన పైనే∙వేయడా నికి స్క్రిప్టు రెడీ.
పరిస్థితిని గమనించి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ వెళ్లలేదనే ప్రచారం ప్రారంభం. ఈ ప్రచారానికి సాక్షాత్తూ ముఖ్య మంత్రే నాయకత్వం వహించారు. ఆయన ప్రెస్‌మీట్ నుంచి సందేశాన్ని అందుకున్న కూటమి నాయకులు పొట్టోడు, పొడు గోడు అనే తేడా లేకుండా డిక్లరేషన్ దండకాన్ని అందుకున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే జరిగింది.
తన వంద రోజుల పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఓ అభూతకల్పన సృష్టించారు. నిజా నిజాలు నిలకడ మీద తేటతెల్లమవుతున్నాయి. దేవస్థానం మార్కెటింగ్ విభాగం వారి నాణ్యతా పరీక్షలను దాటుకొని ప్రసాదం తయారీ చెంతకు కల్తీ నెయ్యి వెళ్లే పరిస్థితే అక్కడున్న వ్యవస్థలో ఉండదు.
అందువల్లనే కొన్ని డజన్ల పర్యాయాలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు వెనక్కు మళ్లాయి. అట్లా వెనక్కు పంపిన ట్యాంకర్లలోని ఒక శాంపుల్‌నే గుజరాత్‌లో ఉన్న ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పంపించింది. మైసూర్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించే సంప్ర దాయానికి భిన్నంగా ఈసారి గుజరాత్‌కు పంపించారు.
పంపించడానికి ఒకరోజు ముందు ఎన్‌డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్‌లతో టీటీడీ ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ భారత రాష్ట్ర పతి, ప్రధాని, చీఫ్ జస్టిస్‌లకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి గవర్నింగ్ బాడీ సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ లేఖలు రాశారు.
మైసూర్ ల్యాబ్‌కు కూడా ఇదే కంటైనర్‌లోని శాంపుల్‌ను పంపించినట్టు విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిందా? లేదా? వస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నది ఓ అంతుచిక్కని రహస్యం. వేణుగోపాల్ లేఖ మీద విచారణ జరిగితే చాలా అంశాలు బయటకు రావచ్చు.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దేశీయ గోసంపద వృద్ధి లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. కానీ ఎన్‌డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్‌లు ఆ కార్యక్రమాలకు తూట్లు పొడుస్తూ సంకర జాతి జెర్సీ ఆవులను ప్రోత్సహించారని కూడా వేణుగోపాల్ ఆరోపించారు.
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వారు సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి ఈ వివాదమంతా జరుగుతున్నది. వారు ఆన్‌లైన్ టెండర్‌లో పాల్గొని కేజీ నెయ్యికి 319 రూపాయలు కోట్‌చేసి ఎల్–వన్‌గా వచ్చినందువల్ల ఆనవాయితీ ప్రకారం 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆ డెయిరీకి అప్పగించారు.
ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన జూన్ నెలలోనే వారు నెయ్యి సరఫరాను ప్రారంభించారు. ఈ నెయ్యి ధర మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంత తక్కువ ధరకు మంచి నెయ్యిని ఎట్లా సరఫరా చేస్తారన్నది ఆయన ప్రశ్న.
డెయిరీ నిర్వాహకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆవు పాల సేకరణ ధర 35 రూపాయల లోపే వుంటే రూ.300లకు కిలో చొప్పున నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయడం అసాధ్య మేమీ కాదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆవు పాల సేకరణ ధర అంతకంటే తక్కువే ఉన్నది. కనుక ఏఆర్ డెయిరీ కోట్ చేసిన ధర అభ్యంతరకరమైనదేమీ కాదని డెయిరీ నిర్వాహకుల అభిప్రాయం.
ఏఆర్ డెయిరీని ఆపేసిన తర్వాత పిలిచిన టెండ ర్లలో యూపీకి చెందిన ఆల్ఫా ఫుడ్స్ అనే డెయిరీ ఎల్–వన్‌గా నిలిచింది. వాళ్లు రూ. 475 కోట్ చేశారు. పద్ధతి ప్రకారం ఎల్–వన్‌గా ఉన్న ఆల్ఫా ఫుడ్స్ 65 శాతం సరఫరా కాంట్రా క్టును, ఎల్–టూగా ఉన్న నందినీ డెయిరీ వారు 35 శాతం సర ఫరా కాంట్రాక్టును దక్కించుకున్నారు.
నందినీ డెయిరీ లోగోలోనే సంకర జాతి జెర్సీ ఆవు బొమ్మ ఉంటుందనీ, వాళ్లు సరఫరా చేసేది దేశీ ఆవు నెయ్యి కాదని స్వదేశీ గో ఉద్యమకారులు అభ్యంతరాలు చెబు తున్నారు. ఇది మరో చర్చనీయాంశం. ఇక ఎల్–వన్‌గా వున్న ఆల్ఫా ఫుడ్స్ డెయిరీ ప్లాంట్‌కు తిరుపతి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంత దూరాభారాన్ని మోస్తూ అక్కడినుంచి వాళ్లే సరఫరా చేస్తారా లేక అదే పేరుతో స్థానిక డెయిరీలు ఏవైనా ఆ పని చేస్తాయా, అనే చర్చ కూడా జరుగు తున్నది.
ఆల్ఫా డెయిరీ అనేది అన్‌లిస్టెడ్ కంపెనీయే కనుక అదేమీ అసాధ్యమైన వ్యవహారం కాదు. ఇక్కడింకో విచిత్రమైన విషయం ఏమిటంటే నెయ్యి నాణ్యత మీద చంద్రబాబు ఆరోప ణలు చేసిన రోజున అంటే సెప్టెంబర్ 19న ఆయన కుటుంబ యాజమాన్యంలోని హెరిటేజ్ డెయిరీ షేర్ విలువ రూ. 565. సరిగ్గా వారం రోజుల్లో సెప్టెంబర్ 27 నాటికి అది రూ.635 దాటింది. మొత్తంగా చూస్తే వారం రోజుల్లో హెరిటేజ్ సంపద 600 కోట్లు పెరిగింది. ఇది యాదృచ్ఛికమేనా?
ఇక డిక్లరేషన్ విషయానికొద్దాం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆధారాలు సుమారు 15 వందల ఏళ్ల క్రితం వరకూ చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. తిరు మలలో అన్యమతస్థులకు ప్రవేశం లేదనిగానీ, వారు డిక్లరేషన్ ఇస్తే తప్ప ప్రవేశించడానికి వీల్లేదని గానీ ఎన్నడూ లేదు.
ఈ డిక్లరేషన్ వ్యవహారం 1987లోనే ప్రారంభమైంది. అన్యమత స్థులు శ్రీ వేంకటేశ్వరునిపై భక్తి విశ్వాసాలున్నాయని ప్రకటిస్తూ ఒక ఫామ్‌పై సంతకం చేసి వెళ్లవచ్చునని నిబంధనను తీసు కొచ్చారు. ఇదో అర్థం లేని నిబంధన. ఎవరైనా దేవుడిని ఎందుకు దర్శించుకుంటారు? ఆ దేవునిపై భక్తి విశ్వాసాలు ఉంటేనే కదా!
తిరుమలేశుని దర్శనానికి రోజుకు సుమారు ఐదొందల నుంచి వెయ్యిమంది వరకు అన్యమతస్థులు వస్తుంటారని అంచనా. వారంతా అత్యంత భక్తి విశ్వాసాలతో తిరుమల దేవ స్థానం నిర్ణయించిన సంప్రదాయ డ్రెస్ కోడ్‌ను పాటిస్తూ దర్శనం చేసుకుంటారు. అంతే తప్ప రోజుకు ఒక్క డిక్లరేషన్ కూడా రాదు. డ్రెస్ కోడ్‌ను పాటించినంతవరకు దేవస్థానం సిబ్బంది కూడా ఎవరినీ డిక్లరేషన్ అడగదు.
గత రెండు రోజులుగా బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి చేస్తున్న హడావిడి విచిత్రంగా ఉన్నది. స్వామివారి వెండి వాకిలి చెంతనున్న బీబీ నాంచారమ్మ మూర్తిని కూడా రోజుకోసారి డిక్లరేషన్ ఇవ్వాలని ఈ సరికొత్త హిందూ భక్తులు డిమాండ్ చేస్తారేమోనన్న అనుమానం కూడా వస్తు్తన్నది. జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మాజీ ముఖ్యమంత్రి.
ఆ హోదాలో ఐదేళ్ల పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కూడా ఆరేడుసార్లు స్వామి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా దర్శించుకున్నారు. ఆయన చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించడానికి ముందూ, ముగించిన తర్వాత కూడా కాలినడకన వెళ్లి వేంకటనాథుని దర్శనం చేసుకున్నారు.
ఇంతకంటే విశ్వాస ప్రకటన ఇంకేముంటుంది? కాగితం మీద రాసి సంతకం పెట్టి తీరాలనడం వితండవాదం కాక మరేమిటి? ఈ దేశంలో మరే ఆలయంలోనైనా, మసీదులోనైనా, చర్చిలోనైనా, గురుద్వారాలోనైనా ఇటువంటి పట్టింపులు న్నాయా? మతం పేరుతో చేసే ఈ రకమైన పిడివాదనలను నూటా ముప్పయ్యేళ్ల కిందనే స్వామి వివేకానందుడు ఈసడించుకున్నారు.
మతం అనేది పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో, సంస్థలు పెట్టుకొనే నిబంధనల్లో ఉండదు. అది ఆత్మకూ పరమాత్మకూ మధ్యన ఉండే సంబంధమని లండన్ (1895)లో వివేకానందుడు ప్రకటించారు. షికాగోలో జరిగిన విశ్వవ్యాప్త సర్వమత సమ్మేళనంలో హైందవ విశిష్టతను విజయ పతాకంగా ఎగరేసి ప్రశంసలందుకున్న వివేకానందుని కంటే గొప్ప హిందువులా ఈ నడమంత్రపు నామాలవారు?
సహనం హిందూమతపు సహజ భూషణమని ఆయన ప్రకటించారు. సర్వమత సహనాన్ని పాటిస్తాం. అన్ని మతాలు సత్యమైనవనే నమ్ముతాం. ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ సము ద్రంలో చేరినట్టే, అన్ని రకాల ఆరాధనా మార్గాలూ ఆ సర్వే శ్వరుడినే చేరుతాయి. ఇది హిందూమత సారమని వివేకానందుడు ప్రకటించారు.
ఏది ఆ స్ఫూర్తి? అటువంటి సహనం నిన్న మొన్నటి వీరాలాపాల్లో కనిపించలేదే? కాషాయ వస్త్రాలు ధరించినవారు కూడా కళ్లెర్రజేసి పళ్లు కొరకడం సమంజసమేనా? హైందవాన్ని అర్థం చేసుకున్నవారేనా వీరు? లేక రాజకీయం కోసం, పబ్బం గడుపుకోవడం కోసం మతం రంగు పులుము కున్న పౌండ్రక వాసుదేవులా?
బీజేపీ సంగతి జగమెరిగిన సత్యమే. ఆ పార్టీ మనుగడకు హిందూమత భావోద్వేగాలే ఆలంబన. ఆర్థిక వృద్ధి, పారిశ్రా మికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి కబుర్లన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దాని పలుకుబడికి ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకోసం కొత్త స్థావరాలు కావాలి.
హిందూ ఎజెండా ఎత్తడానికి అవకాశం దొరికితే అది ఊరుకుంటుందా? ఆంధ్రలో వారి భాగస్వామి చంద్రబాబు ఆ ఎజెండా వారి మెడలో వేశారు. తిరుమలలో జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకుంటామంటూ తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీ అను యాయులు తరలివెళ్లారు.
కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఈమధ్య కాషాయ పార్టీ కంటే ఘాటుగా హిందూ భావజాలాన్ని ప్రకటి స్తున్నారు. ఈ సందర్భాన్ని కూడా ఆయన బాగానే ఉపయోగించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కిందకు ఆలయాల పరిపాలనను తీసుకురావాలనే డిమాండ్ కూడా చేశారు.
ఇది ఎప్పట్నుంచో ఆరెస్సెస్ పరివారం చేస్తున్న డిమాండే! ఆలయాల నియంత్రణ మొత్తం కేంద్రం కనుసన్నల్లోకి రావాలనేది వారి సంకల్పం. జమిలి ఎన్నికల ఉద్దేశం కూడా అదే! రాష్ట్రాల స్థాయిని తగ్గించి కేంద్రీకృత అధికారాన్ని పాదుకొల్పడం వారి ఎజెండా. అందుకోసం ఈ దేశంలోని బహుళత్వాన్నీ, భిన్నసంప్రదాయాలనూ కొనసాగించడానికి, గౌరవించడానికి వారు ఇష్టపడరు.
ఇక చంద్రబాబు ప్రస్తుతం ఏడుకొండలవాడే దిక్కనే పరి స్థితుల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క అడుగూ ముందుకుపడలేదు. వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేని ఏకైక రాష్ట్ర పాలకుడుగా ఇప్పటికే అపఖ్యాతి పాల య్యారు. వరదల నియంత్రణ కోసం పాటించవలసిన కనీస పాలనా పద్ధతులను కూడా పాటించలేక విజయవాడ మునకకు కారణమయ్యారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలను అటకెక్కించారు.
గ్రామ స్వరా జ్యానికి తూట్లు పొడిచారు. నాలుగు నెలలు నిండకముందే జనంలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూపై ఒక కల్పిత కథను సృష్టించారు. దాని చుట్టూనే రాజకీయాలు తిప్పి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంచుకున్న మార్గం చాలా ప్రమాద కరమైనది. భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment