సాక్షి, తిరుమల: నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపీ బ్రేక్ దర్శన సమయం మారింది. ఉదయం 8 గంటలకు దర్శనం ప్రారంభమైంది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.
ముందురోజు రాత్రి నుండి వేచిఉండే భక్తులకు ఉదయం నుండి శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. వసతిపై వత్తిడి తగ్గుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు తిరుపతి కౌంటర్ ప్రారంభమైంది. మాధవం అతిథి గృహంలో శ్రీవాణి భక్తులకు వసతి కల్పించనున్నారు.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం పాలకమండలి భేటీ అనంతరం ఆ నిర్ణయాలను ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం పనులు ప్రారంభం అవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన కూడా పాలకమండలి చర్చించింది. జనవరి 2, 2023 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకానుంది. 11వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.
అలాగే రెండో ఘాట్‌రోడ్‌లో రక్షణ గోడల నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తిరుమల బాలాజీ నగర్‌లో మౌలిక వసతులకు రూ.3.70 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్దికి రూ.3.75 కోట్లు మంజూరు చేసినట్లు టీడీపీ వెల్లడించింది. టీటీడీ ఆస్పత్రుల్లో ఔషధాలు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.2.86 కోట్లు వెచ్చించనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది.
చదవండి: ఏపీలో పింఛన్ల పండగ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment