Tirumala srivari visit
-
TTD: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు..
సాక్షి, తిరుమల: నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపీ బ్రేక్ దర్శన సమయం మారింది. ఉదయం 8 గంటలకు దర్శనం ప్రారంభమైంది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. ముందురోజు రాత్రి నుండి వేచిఉండే భక్తులకు ఉదయం నుండి శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. వసతిపై వత్తిడి తగ్గుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు తిరుపతి కౌంటర్ ప్రారంభమైంది. మాధవం అతిథి గృహంలో శ్రీవాణి భక్తులకు వసతి కల్పించనున్నారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం పాలకమండలి భేటీ అనంతరం ఆ నిర్ణయాలను ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం పనులు ప్రారంభం అవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన కూడా పాలకమండలి చర్చించింది. జనవరి 2, 2023 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకానుంది. 11వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. అలాగే రెండో ఘాట్రోడ్లో రక్షణ గోడల నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తిరుమల బాలాజీ నగర్లో మౌలిక వసతులకు రూ.3.70 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్దికి రూ.3.75 కోట్లు మంజూరు చేసినట్లు టీడీపీ వెల్లడించింది. టీటీడీ ఆస్పత్రుల్లో ఔషధాలు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.2.86 కోట్లు వెచ్చించనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. చదవండి: ఏపీలో పింఛన్ల పండగ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ -
TTD: శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్పు!
తిరుమల: డిసెంబర్ 1వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయం మారనుంది. రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులను ప్రస్తుతం ఉదయం 6 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. గురువారం(డిసెంబర్ 1) నుంచి ఉదయం 8 గంటలకు అనుమతించనుంది. ప్రొటోకాల్, శ్రీవాణి ట్రస్టు టికెట్ల భక్తులను ముందుగా అనుమతిస్తారు. స్వామికి రెండోగంట నివేదన తరువాత 10.30 గంటల నుంచి జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులను, తరువాత టీటీడీ ఉద్యోగుల కుటుంబసభ్యులను దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గనుంది. నెలరోజులు ఈ విధానాన్ని పరిశీలించి ఇలాగే కొనసాగించాలా, లేక పాత పద్ధతినే అమలుచేయాలా అని టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు బుధవారం అన్నమయ్య పాలక మండలిలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి భేటీ అయ్యింది. రేపటి నుంచి వీఐపీ దర్శన సమయంలో మార్పుతో పాటు ఆనంద నిలయం స్వర్ణమయం అంశంపై పాలకమండలి చర్చిస్తోంది. అంతేకాదు.. వసతి సమస్య నివారణ పైనా చర్చించినట్లు తెలుస్తోంది. 2014 నుంచి సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు శ్రీవారి ఆలయంలో 1994కి పూర్వం వీఐపీ బ్రేక్ దర్శనాలు లేవు. అప్పటివరకు భక్తులందరినీ స్వామి దర్శనానికి కులశేఖరపడి వరకు అనుమతిస్తుండడంతో వీఐపీలు ఏ సమయంలో వచ్చినా దర్శనానికి అనుమతించేవారు. ఆ తరువాత సిఫార్సు లేఖల విధానం మొదలైంది. సాయంత్రం నైవేద్య సమర్పణ తరువాత వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించేవారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కోరుకునే భక్తుల సంఖ్య పెరగడంతో టీటీడీ ఉదయం కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించింది. ఈ కారణంగా సామాన్య భక్తులకు దర్శన సమయం తగ్గిపోయిందంటూ టీటీడిపై విమర్శలు రావడంతో 2012లో గురువారం మినహా మిగిలిన రోజుల్లో సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేసింది. 2014 నుంచి సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దుచేసింది. ప్రస్తుతం ఉదయం పూట వీఐపీ బ్రేక్ దర్శనాలు మాత్రమే అమలవుతున్నాయి. ముందుగా ప్రొటోకాల్ పరిధిలోని వారిని, తరువాత శ్రీవాణి ట్రస్ట్‌కి విరాళాలు ఇచ్చినవారిని, అనంతరం సిఫార్సు లేఖలపై టికెట్లున్న భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ బ్రేక్ దర్శనాలకే మూడు నుంచి నాలుగుగంటలు పడుతుండడంతో సర్వదర్శన భక్తులు దర్శనం కోసం వేచి చూసే సమయం పెరుగుతోంది. సర్వదర్శనం క్యూ లైను ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతోంది. ముందురోజు అర్ధరాత్రి 12 గంటలకు నిలిపేసిన సర్వదర్శన క్యూ లైన్ తరువాత రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుండడంతో భక్తుల నిరీక్షణ సమయం పెరుగుతూ వస్తోంది. ఆ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ దర్శన విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వేకువజామున ఆలయం తెరిచి శ్రీవారికి కైంకర్యాలు, నివేదనలను పూర్తిచేసిన అనంతరం సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించి, తరువాత వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లున్నవారిని దర్శనానికి అనుమతిస్తే, సామాన్య భక్తులు దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది. దీనికితోడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకునే వెసులుబాటు లభిస్తుందని, దీంతో వసతి గదుల కేటాయింపు విషయంలో ఒత్తిడి తగ్గుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. నెలరోజులు పరిశీలించి ఈ విధానం అమలుపై నిర్ణయం తీసుకోనుంది. -
కాషన్ డిపాజిట్‌పై దుష్ప్రచారం
తిరుమల: కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మొద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కాషన్ డిపాజిట్ సొమ్ము భక్తుల ఖాతాలకే చేరుతోందని పేర్కొంది. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై టీటీడీ అధికారులు సోమవారం తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ విధానంలో గదులు బుక్ చేసుకుంటున్నారు. భక్తులు గదులు ఖాళీ చేసిన తర్వాతి రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు కాషన్ డిపాజిట్ రీఫండ్ ఎలిజిబిలిటి స్టేట్మెంట్ అధీకృత బ్యాంకులైన ఫెడరల్ బ్యాంకు లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు చేరుతుంది. ఈ బ్యాంకుల అధికారులు అదే రోజు అర్ధరాత్రి 12 గంటల్లోపు(బ్యాంకు పనిదినాల్లో) సంబంధిత మర్చంట్ సర్వీసెస్‌కు పంపుతారు. మర్చంట్ సర్వీసెస్ వారు మరుసటి రోజు కస్టమర్ బ్యాంకు అకౌంట్‌కు పంపుతున్నారు. కస్టమర్ బ్యాంకు వారు సంబంధిత అమౌంట్ కన్ఫర్మేషన్ మెసేజ్(ఏఆర్ నంబర్)ను, సొమ్మును సంబంధిత భక్తుల అకౌంట్‌కు పంపుతారు. కస్టమర్ బ్యాంకు వారు భక్తుల అకౌంట్‌కు సొమ్ము చెల్లించడంలో జాప్యం జరుగుతోందని టీటీడీ గుర్తించింది. ఒకవేళ భక్తులు సమస్యను.. యాత్రికుల సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్, ఈ–మెయిల్ ద్వారా టీటీడీ దృష్టికి తెచ్చిన పక్షంలో పైవివరాలతో సంబంధిత బ్యాంకుల్లో విచారణ చేయాలని భక్తులకు సూచిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 7 బ్యాంకు పని దినాల్లో కాషన్ డిపాజిట్ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలై 11 నుంచి 4, 5 రోజుల్లో రీఫండ్ చేరేలా టీటీడీ యూపీఐ విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల నేరుగా భక్తుల అకౌంట్‌కే రీఫండ్ సొమ్ము జమవుతోంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,478 మంది స్వామివారిని దర్శించుకోగా, 48,692 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.53 కోట్లు వేశారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది.. క్యూలైను ఆస్థాన మండపం వద్దకు చేరింది. నేడు టీటీడీ పాలకమండలి సమావేశం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో సోమవారం పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరగనున్న ఈ సమావేశానికి పాలకమండలి సభ్యులు హాజరు కానున్నారు. ఇందులో టీటీడీ ఉద్యోగులకు ప్రమాదాలపై భద్రత కల్పించడం, వారందరికీ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందేలా ఏర్పాటు చేయడం, శ్రీవారి భక్తుల కోసం టైం స్లాట్ టికెట్లు మంజూరు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది. -
అచ్చు ఆయనలానే.. జూ.ఎన్టీఆర్ తనయుడి ఫొటోలు వైరల్!
చూస్తుంటే నందమూరి అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి మెదటి కారణం 'ఆర్ఆర్ఆర్' మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో కారణం ఏంటంటే.. తమ అభిమాన హీరో కుమారులు చాలా కాలం తర్వాత బయటి ప్రపంచానికి కనిపించడం. అంతేకాదు వారిలో ఒకరు అచ్చం సీనియర్ ఎన్టీఆర్లాగే ఉండడంతో.. నందమూరి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా తారక్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తారక్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో పాటు మరికొంతమంది బంధువులు కూడా వీరితో పాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దీంతో అక్కడి మీడియా కన్ను ఎన్టీఆర్ ఫ్యామిలీపై పడింది. తారక్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే భార్గవ్ రామ్ పై మాత్రం నెటిజనులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. జూ.ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌ను చూస్తుంటే తమకు సీనియర్ ఎన్టీఆర్‌ను చూసినట్టే ఉందంటున్నారు నందమూరి అభిమానులు. భార్గవ్ రామ్ సాంప్రదాయ దుస్తులతో పాటు నుదుట విష్ణు నామంతో కనిపించాడు. భార్గవ్‌కి అన్నీ సీనియర్ ఎన్టీఆర్ పోలికలే అంటూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పెద్ద ఎన్టీఆర్ ముఖాకృతి తనలో కనిపిస్తోందని, అచ్చు గుద్దినట్టు ఎన్టీఆరే నంటూ అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం. -
శ్రీవారికి స్వర‘లతా’ర్చన
తిరుపతి తుడా: లతామంగేష్కర్ పలుమార్లు తిరుమల శ్రీవారిని దర్శించి తన భక్తిని చాటుకున్నారు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా శ్రీవారి ప్రచారకురాలిగా, శ్రీవారి ఆస్థాన విద్వాంసురాలుగా గుర్తింపు పొందారు. శ్రీవారి ముందు తన మధుర గాత్రంతో స్వామి వారిని కీర్తించి అనుగ్రహం పొందారు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంస్కృత సంకీర్తనలను గానం చేశారు. 2010 సంవత్సరంలో ఎస్వీ సంగీత నృత్యకళాశాలలోని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్‌లో ఆ సంకీర్తనలను రికార్డు చేసి సంగీత ప్రపంచానికి అందించారు. అన్నమయ్య స్వర లతార్చన పేరుతో సీడీని రూపొందించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆ సీడీని నాటి సీఎం రోశయ్య, గవర్నర్ నరసింహన్, టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆవిష్కరించారు. ఈ సీడీలో మొత్తం 10 సంకీర్తనలు రికార్డు చేశారు. -
త్వరలోనే శ్రీవారి సర్వ దర్శనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు, సేవలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కోవిడ్ పాజిటివిటీ రేటు 1 శాతానికి వస్తే సేవలు పునఃప్రారంభించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. కరోనా నేపథ్యంలో గతేడాది 2020 మార్చి 20 నుంచి స్వామి వారి సేవలు టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా కొన్నాళ్లు భక్తులకు దర్శనం కూడా నిలిపివేసింది. 2020 జూన్ 7నుంచి రోజుకు 5 వేల మందితో ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఆన్లైన్ ద్వారా టికెట్లు జారీ చేసి దర్శనాలు ప్రారంభించింది. ఆ తర్వాత సామాన్యులకు సైతం స్వామి దర్శనం కల్పించాలనే లక్ష్యం తో సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేసింది. వీటి కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఏర్పడటంతో టీటీడీ సర్వదర్శనం నిలిపివేసింది. స్వామివారి సేవలు ప్రారంభించాలని ఫోన్లు, మెయిల్ ద్వారా భక్తులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ అంశం పాలక మండలి సమావేశంలో చర్చించి ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి స్వామివారి సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈలోపు కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో ఈ నిర్ణయం వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రేటు 1 శాతానికి వచ్చి భక్తుల ఆరోగ్య భద్రతకు ఇబ్బంది లేని పరిస్థితి నెలకొంటే ఆగస్ట్‌లో స్వామి వారి సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడానికి టీటీడీ సమాయత్తమవుతోంది. సేవలతో పాటు సామాన్యులకు ఉచిత దర్శనం కల్పించడానికి సిద్ధమవుతోంది. -
శ్రీవారి సేవలో సాయి కుమార్
సాక్షి, తిరుపతి: కనిపించే మూడు సింహాలు.. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే అన్నారు సినీ నటడు సాయి కుమార్. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా.. స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగులు మొదలయ్యాయి. కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి సెల్యూట్ చేశారు. ‘పోలీసులు నిజమైన హీరోలు.. వారి గెటప్ వేస్తే.. మాలో ఒక పౌరుషం కనిపస్తుంది. నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో. ‘పోలీస్ స్టోరి’ చేసి 25 సంవత్సరాలు పూర్తి అయింది. త్వరలోనే ‘నాలుగో సింహం’ అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నాను’ అన్నారు సాయి కుమార్. (చదవండి: 13 ఏళ్లకు మళ్లీ...) తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డిపై సాయి కుమార్ ప్రశంసలు కురిపించారు. పోలీసు అధికారి పోలంలోకి దిగడం అంటేనే, ఆయన మనుషుల్లో ఎలా కలిసి పోయారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రమేష్ రెడ్డి లాంటి అధికారి ఉన్న చోట మంచి హ్యూమానిటీ కూడా ఉంటుందని తెలిపారు సాయి కుమార్. -
భక్తులకు అందుబాటులో రూ.300 ఆన్లైన్ టికెట్లు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ ప్రారంభించిన రూ.300 ఆన్లైన్ టికెట్లలో ఈనెల 27వ తేదీ నుంచి మార్చి 5వ తేది వరకు ఖాళీ వివరాలను బుధవారం రాత్రి ప్రజాసంబంధాల విభాగం విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన 10,025 టికెట్లు, 28న 5,647 టికెట్లు, మార్చి 1 ఆదివారం 7,499, 2వ తేదీన 11,253, 3వ తేదీన 13,673, 4వ తేదీన 13,769, 5వ తేదీన 12,911 టికెట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.