
తిరుపతి తుడా: లతామంగేష్కర్ పలుమార్లు తిరుమల శ్రీవారిని దర్శించి తన భక్తిని చాటుకున్నారు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా శ్రీవారి ప్రచారకురాలిగా, శ్రీవారి ఆస్థాన విద్వాంసురాలుగా గుర్తింపు పొందారు. శ్రీవారి ముందు తన మధుర గాత్రంతో స్వామి వారిని కీర్తించి అనుగ్రహం పొందారు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంస్కృత సంకీర్తనలను గానం చేశారు.
2010 సంవత్సరంలో ఎస్వీ సంగీత నృత్యకళాశాలలోని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్‌లో ఆ సంకీర్తనలను రికార్డు చేసి సంగీత ప్రపంచానికి అందించారు. అన్నమయ్య స్వర లతార్చన పేరుతో సీడీని రూపొందించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆ సీడీని నాటి సీఎం రోశయ్య, గవర్నర్ నరసింహన్, టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆవిష్కరించారు. ఈ సీడీలో మొత్తం 10 సంకీర్తనలు రికార్డు చేశారు.