annamayya keerthanas
-
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
అభినవ అన్నమయ్య పద్మశ్రీ ‘శోభారాజు’ 40 ఏళ్ల సంకీర్తనా ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తిరుపతి వేదికగా 1978లో ఒక గొంతుక ‘అదివో అల్లదిహో’ అనే పాటను తొలి సారిగా ఆలపించింది. ఆ గానంతో యావత్ తెలుగు జాతి అంతా ఒక్క సారిగా అన్నమయ్య సంకీర్తనల పై దృష్టిసారించింది. తెలుగు ప్రజలు ‘అభినవ అన్నమయ్య’గా పిలుచుకునే శోభారాజుది ఆ స్వరం. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేసి, భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనే ధ్యేయంతో 1983లో ‘అన్నమాచార్య భావనా వాహిని’ స్థాపించింది. మాదాపూర్ వేదికగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించగా అక్కడ అన్నమయ్యపురాన్ని నిర్మించి సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె నిబద్ధత, కృషికి ఫలితంగా భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇలాంటి విశేష సేవలందిస్తున్న ‘అన్నమాచార్య భావనా వాహిని’ ఈ నెల 30న 40 వసంతాలకు చేరువ కానుంది. అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి తొలి కళాకారిణిగా.. సినిమాలకు పాటలు పాడాలనే కలలు కన్న శోభారా జు భవిష్యత్ కాలంలో అన్నమయ్య సంకీర్తనలకు ముగ్దురాలై, కేవలం అన్నమయ్య రచనలు, సంకీర్తనల ను తెలుగు ప్రజలకు దగ్గర చేయడమే లక్ష్యంగా మా ర్చుకుంది. నేదునూరి కృష్ణమూర్తి తదితర మహా విద్వాంసుల వద్ద శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సాధించి, 1976లో తిరుమల తిరుపతి దేవస్థాన ‘అన్నమాచార్య ప్రాజెక్ట్’లో తొలి కళాకారిణిగా స్కాల ర్ షిప్ అందుకున్నారు. ఆమె అంకితభావమే తిరుమ ల తిరుపతి క్షేత్రంగా అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి శోభారాజును తొలి కళాకారిణిగా నియమించేలా చేసింది. 1978లో టీటీడీ తొలి సారిగా నిర్వహించిన అన్నమయ్య జయంతి ఉత్సవంలో శోభారాజు స్వయంగా తాను రూపొందించిన ‘అన్నమయ్య కథ’ అనే సంగీత రూపకాన్ని అన్నమయ్యకు తొలి కానుకగా సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నమయ్యకు సంబంధించి ఏ విషయం కావాలన్నా తన కళా రూపమే మాతృకగా నిలుస్తుంది. ఆమె ఆలపించిన ‘కొండలలో నెలకొన్న’, ‘చాలదా హరినామ సౌఖ్యామృతము’, ‘గోవిందాశ్రిత గోకులబృంద’, ‘ఏమొకో చిగురటధరమున’, ‘శిరుత నవ్వులవాడు శినెక’, ‘కులుకక నడువరో’ తదితర సంకీర్తనల ఆల్బమ్‌లు ప్రతి తెలుగు ఇంటా మారు మోగాయి. జీవితమంతా సంకీర్తనం... 1983 నుంచి హైదరాబాద్ వేదికగా తను నిర్వహించిన కార్యక్రమాలు తన జీవితానికి పరమార్థంగా నిలిచాయని ఆమె తెలిపారు. దేశ విదేశాల్లో ఇప్పటి వరకు 20 వేలకు పైగా ఔత్సాహికులకు అన్నమయ్య సంకీర్తనలు నేర్పారని, ఆరు వేలకు పైగా సంకీర్తనా కచ్చేరీలు ఏర్పాటు చేశానని అన్నారు. మానసికంగా సాంత్వన చేకూర్చాలనే లక్ష్యంతో ‘ఉపశమన సంకీర్తన’ కార్యక్రమాన్ని ప్రారంభించి చంచల్ గూడ జైల్లో 1200 ఖైదీలకు సంకీర్తనా సేవలందించినట్లు తెలిపారు. అనారోగ్య సమయంలో సంగీతం, సాహిత్యం కోలుకునేలా చేస్తుందని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ‘సంకీర్తనౌషధం’ పేర నాద చికిత్సా కార్యక్రమాన్ని, ఏటా ‘నాద బ్రహోత్సవ్’ పేర నవరాత్రులలో కళాకారులతో అనేక కార్యక్రమాలను నిర్వహించి కళలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అన్నమయ్య కృషిని భారత ప్రభుత్వానికి తెలియజేసి 2004లో అన్నమయ్య తపాలా బిళ్లను విడుదలయ్యేలా చేశానన్నారు. అన్నమయ్య పైన తన పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు చాలా మందికి తెలియని 39 అన్నమయ్య సంకీర్తనలను తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీ నుంచి సేకరించి ‘అన్నమయ్య గుప్త సంకీర్తనాధనం’ అనే పుస్తకంగా ప్రచురించాం. దూరదర్శన్ సహకారంతో రచన, స్క్రీన్ ప్లే, సంభాషణలు, సంగీతం సమకూర్చి దర్శకత్వం వహించిన ‘శ్రీ అన్నమాచార్య’ టెలీ సీరియల్‌ను కూడా రూపొందించామన్నారు. తమ క్షేత్రంలో అన్నమయ్య జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ఇద్దరికి కలిపి ఒకే ఆలయాన్ని నిర్మించి అన్నమయ్య పురంగా తయారు చేశానని, దేశ ప్రధాన మంత్రులు పీవీ, వాజ్ పాయి, ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, రామారావు, రాజశేఖర్ రెడ్డితో పాటు ఎంఎస్ సుబ్బు లక్ష్మి , ఏఎన్నార్ తదితర ప్రముఖులు సందర్శించారన్నారు. వైఎస్‌ది కళా హృదయం.. తన కృషికి గుర్తించిన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తెలియకుండానే రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేశారని తెలిపారు. కళలకు, కళాకారులకు వైఎస్ అందించిన గౌరవం ప్రత్యేకమైనదని ఆమె కొనియాడారు. అమెరికా, కెన్యా, మలేషియా తదితర దేశాల్లో నిర్వహించిన సంకీర్తనా కార్యక్రమాలకు గాను ఎన్నో అవార్డు, డాక్టరేట్లు, బిరుదులు పాందానని, తానా ఆధ్వర్యంలో అన్నమయ్య పదకోకిల బిరుదు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నట్లు ఆమె వివరించారు. -
అన్నమయ్య సంకీర్తనలను కించపరిచేలా సింగర్ భార్గవి వ్యవహరించింది
-
దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్..
Singer Sravana Bhargavi Deleted Okapari Song: టాలీవుడ్లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది శ్రావణ భార్గవి. తన యూట్యూబ్ ఛానెల్లో విభిన్నమైన వ్లోగ్స్ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. అయితే ఆమె గతకొంతకాలంగా వివాదస్పదంలో చిక్కుకుంది. దీంతో సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి పేరు మారుమోగిపోతోంది. ఇందుకు కారణం ఆమె చిత్రీకరించిన 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోనే. అన్నమయ్య కీర్తనను వెకిలీ చేష్టలతో చిత్రీకరించి వీడియో రిలీజ్ చేసిందని అన్నమయ్య వంశస్తులు ఆమెపై మండిపడ్డారు. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆమె చేసిన వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అది మీ చూపులోనే ఉందని, దుప్పటి కప్పుకున్న అశ్లీలంగానే కనిపిస్తుందని శ్రావణ భార్గవి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అభ్యంతరకరంగా ఉంటే దైవానుగ్రహం దక్కదని, అందుకే వీడియోను డిలీట్ చేసేది లేదని తేల్చిచెప్పింది. ఇక తీవ్ర ఆగ్రహానికి లోనైన తిరుపతి వాసులు గళం విప్పారు. శ్రావణ భార్గవి తీరుపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలువురు నిరసనలు కూడా తెలిపారు. చదవండి: మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్ దీంతో చేసేదిలేక శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ నుంచి 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోను డిలీట్ చేసింది. శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను తొలగించడంతో తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏందయ్యా రాహుల్ ఈ తమాషా.. నటుడి న్యూడ్ పిక్ వైరల్ -
దుప్పటి కప్పుకున్నా అశ్లీలంగానే కనిపిస్తుంది : శ్రావణ భార్గవి
Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తనపై వస్తోన్న విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు' అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది. -
చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక
Annamayya Family Fires On Sravana Bhargavi: అనేక గీతాలను ఆలపించి టాలీవుడ్ ప్రముఖ సింగర్‌గా గుర్తింపు పొందింది శ్రావణ భార్గవి. అయితే గత కొద్ది కాలంగా ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె తాజాగా వివాదంలో చిక్కుకుంది. అందుకు కారణం ఆమె పాడిన పాటే. విషయంలోకి వెళితే..తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది. శృంగార సంకీర్తన పట్ల గాయని శ్రవణా భార్గవి చేసిన వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు మండిపడుతున్నారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడం పట్ల తప్పుబట్టారు. అలాగే ఆమె అందాన్ని వర్ణించడానికి ఆ కీర్తనను ఉపయోగించటం తప్పు అని ఆగ్రహిస్తున్నారు. ఈ విషయంపై శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె బాధ్యతరాహిత్యంగా సమాధానిచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని ఆయన అన్నారు. చదవండి: డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. -
శ్రీవారికి స్వర‘లతా’ర్చన
తిరుపతి తుడా: లతామంగేష్కర్ పలుమార్లు తిరుమల శ్రీవారిని దర్శించి తన భక్తిని చాటుకున్నారు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా శ్రీవారి ప్రచారకురాలిగా, శ్రీవారి ఆస్థాన విద్వాంసురాలుగా గుర్తింపు పొందారు. శ్రీవారి ముందు తన మధుర గాత్రంతో స్వామి వారిని కీర్తించి అనుగ్రహం పొందారు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంస్కృత సంకీర్తనలను గానం చేశారు. 2010 సంవత్సరంలో ఎస్వీ సంగీత నృత్యకళాశాలలోని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్‌లో ఆ సంకీర్తనలను రికార్డు చేసి సంగీత ప్రపంచానికి అందించారు. అన్నమయ్య స్వర లతార్చన పేరుతో సీడీని రూపొందించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆ సీడీని నాటి సీఎం రోశయ్య, గవర్నర్ నరసింహన్, టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆవిష్కరించారు. ఈ సీడీలో మొత్తం 10 సంకీర్తనలు రికార్డు చేశారు. -
ఘనంగా 4వ అన్నమయ్య శతగళార్చన
సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో సింగపూర్ నుంచి 4వ అన్నమయ్య శతగళార్చన ఆన్లైన్ పద్దతిలో ఫేస్బుక్ , యూట్యూబ్ లైవ్ ద్వారా ఘనంగా నిర్వహించారు. మూడుగంటలపాటు నిర్వహించిన ఈ ప్రత్యక్ష ప్రసారానికి యూట్యూబ్ ద్వారా 2500కి పైగా వీక్షణలు వచ్చాయని నిర్వాహకులు తెలియచేశారు. మే 26, 2020 అన్నమయ్య జయంతి నాడు జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, సప్తగిరి సంకీర్తనలను పిల్లలు పాడిన అన్నమయ్య కీర్తనలతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించింది. ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో పిల్లలు నమోదు చేసుకోగా, వారి నుంచి ఎంపికైన 25 మంది పిల్లల కీర్తనలను ప్రత్యక్షప్రసారం చేశారు. అలాగే 180 మందికి పైగా పాడిన 7 సప్తగిరి సంకీర్తనలను శతగళార్చనగా కూర్చి, వాటిని ఈ కార్యక్రమం ద్వారా విడుదల చేశారు. పెద్దలు వివిధ ప్రాంతముల నుంచి తమ కీర్తనలతో అందరినీ అలరించారు. సింగపూర్, భారత దేశములనుంచే కాక అమెరికా, యూకే, మలేషియా దేశాల నుంచి కూడా పాల్గొనుట ఈ సారి కార్యక్రమానికి మంచి శోభను చేకూర్చింది. చిన్నారులలో మన సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, చిన్నారులు మౌర్య, దంటూ శ్రీయలు వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గణనాధ్యాయి, భాగవత ప్రచార సమితి వ్యవస్థాపకులు ఊలపల్లి సాంబశివరావు గారు విచ్చేసి అన్నమయ్య ప్రాశస్త్యాన్ని గురించి చక్కటి సందేశం ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్ గారు, రామాంజనేయులు చమిరాజు గారు వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. ఈ అంతర్జాల అన్నమయ్య శతగళార్చన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన ఆర్కే వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని), వీడియో ఎడిటింగ్ చేసిన ఆక్వా వర్క్స్ (రాజేష్ వి ఎం మూర్తి) ఆడియో సహకారం అందించిన జ్యోత్స్నా శ్రీకాంత్ (వయోలిన్), అభిషేక్ ఎం (మృదంగం), శరత్ శ్రీనివాస్ (మిక్సింగ్)లకు భాగవత ప్రచార సమితి తరపున హృదయ పూర్వక ధన్యవాదములు. చివరగా ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి, ముఖ్యంగా నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల గారు, విద్యాధరి కాపవరపు, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, కుమారి దంటు శ్రీయ, చి. మౌర్య ఊలపల్లిలకు మా సంస్థ హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ మహత్కార్యక్రమాన్ని చూసిన వారికి, సహకరించిన వారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనములు. చదవండి: ‘నీ ఇంటిని 1 మీటరు జరుపు లేదంటే రూ.1.6కోట్లు కట్టు’ -
దేవుడికి మాటిచ్చాను
‘‘కాలుష్యం నిండిన ఆలోచనల్ని దివ్య సంగీతంతో నిర్మూలించండి’’... హైదరాబాద్, మాదాపూర్‌లోని అన్నమయ్య భావన వాహినిలోకి అడుగుపెట్టగానే నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం తల మీదుగా ఈ వాక్యం కనిపించింది. అన్నమయ్య భావన వాహిని స్థాపించి మొన్న శనివారం (నవంబర్ 30) నాటికి 36 ఏళ్లు నిండాయి. అన్నమయ్య కీర్తనల గానమే శ్వాసగా కూనిరాగాలు తీసుకుంటూ, ఏవో పేపర్లు చూసుకుంటూ కనిపించారు శోభారాజు గారు. చిత్తూరు జిల్లా వాయల్పాడు నుంచి తిరుపతి, హైదరాబాద్ మీదుగా ఖండాంతరాలకు సాగిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘వాయల్పాడులో పురాతనమైన వీరరాఘవ స్వామి ఆలయం ఉంది. ఆ స్వామి మీద అన్నమయ్య రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. మా అమ్మకు అవేవీ తెలియదు, గర్భంతో ఉన్నప్పుడు తరచూ ఆ ఆలయానికి దర్శనానికి వెళ్లేదట. అలా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు అన్నమయ్య కీర్తనలతో బంధం ఏర్పడింది. వాయల్పాడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఉన్న మా నాన్నను భారత ప్రభుత్వం ప్రత్యేకమైన బాధ్యతలతో నేపాల్‌కు పంపించింది. అలా నాలుగేళ్ల్ల వయసులో నేపాల్‌లో నా పాఠశాల విద్య మొదలైంది. అక్కడ ఒక గుళ్లో ఎర్రని బాల కృష్ణుడు కళ్లముందు మెదలిన సంఘటన నాకింకా గుర్తుంది. అయితే అది నా భ్రమనో, వాస్తవమో ఇప్పటికీ తెలియదు. ఆ క్షణంలో ఆ కృష్ణుడి మీద ఆశువుగా పాట పాడాను. ఇండియాకి వచ్చిన తర్వాత బాలానందం, స్కూలు వేడుకల్లోనూ, కర్నూలులో ఉన్నప్పుడు చిన్మయ మిషన్, భగవద్గీత పఠనం, ఇతర సాంస్కృతిక వేడుకల్లో పాటలు పాడేదాన్ని. నాన్నకు ప్రకాశం జిల్లాకు బదిలీ కావడంతో మా చదువుల కోసం కుటుంబాన్ని తిరుపతిలో పెట్టారు. ఇంటర్ పద్మావతి కాలేజ్‌లో చదివాను. కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో ఆరితేరాను. ఎస్వీ యూనివర్సిటీలో బీఏ మ్యూజిక్ చేసేటప్పుడు చండీఘర్‌లో జాతీయ స్థాయి పాటల పోటీల్లో ఎస్వీయూనివర్సిటీని రిప్రజెంట్ చేశాను, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నా గమ్యం... పాటలే మా ఇల్లు అలిపిరిలోని వెంకన్న పాదాల గుడికి ఫర్లాంగు దూరంలో ఉండేది. ఏ పోటీలకు వెళ్తున్నా సరే... ఆ గుడికి వెళ్లి స్వామి పాదాలను తల మీద పెట్టుకుని ప్రదక్షణ చేసి ‘నేనిలా వెళ్తున్నాను స్వామీ, ప్రైజ్ ఇప్పించు’ అని అడిగేదాన్ని. డిగ్రీ అయిపోగానే మా అమ్మ ‘పీజీలో చేరకపోతే పెళ్లి చేస్తా’నని బెదిరించింది. ఆ భయంతోనే ఎంఏ హిస్టరీలో చేరాను. పది రోజులకే నా గమ్యం ఇది కాదనిపించి కాలేజీ మానేశాను. రోజూ సాయంత్రం స్వామి పాదాలు మొక్కి, సంగీతంలో నైపుణ్యం కోసం మంచి సంగీతకారుడి దగ్గర శిక్షణ తీసుకునే భాగ్యం కల్పించమని కోరేదాన్ని. అటు సినిమా ఇటు వేంకటేశ్వరుడు మద్రాసులో అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనే ప్రయత్నంలో ఉండగా... టీటీడీ చైర్మన్ అన్నారావు గారు నా గాత్రం బావుందని అన్నమాచార్య కీర్తనల ప్రచార ప్రాజెక్టులో ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టమనడం, నాకు స్కాలర్షిప్ ఇచ్చి, నేదునూరి గారి దగ్గర శిక్షణ ఇప్పించాలని నిర్ణయించడం జరిగిపోయింది. అప్పుడు నాలో కలిగిన సందిగ్ధం చిన్నది కాదు. ఎటూ తేల్చుకోలేక ‘నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను స్వామీ’ అని చెప్పి రోజూ కపిల తీర్థంలోని నమ్మాళ్వార్ ఆలయానికి వెళ్లి ధ్యానం చేశాను. తొమ్మిదో రోజుకి నాలోనే లోపలి నుంచి ఒక తీవ్రమైన అనుభూతి, దృఢమైన సంకల్పం కలిగాయి. ఆ మరుసటి రోజు కొండకు నడిచి వెళ్లి దర్శనం చేసుకున్నాను. తలెత్తి వేంకటేశ్వరస్వామిని చూడగానే దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘నాకంటే గొప్ప గాయకులెందరో ఉన్నారు. వాళ్లను కాదని నాకు అవకాశం ఇచ్చావు. జీవితాంతం నీ పాటలే పాడుతాను. నీ కీర్తనలకు ప్రపంచం అంతటా విస్తృతి కల్పించడానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను’ అని ఆ స్వామికి మాటిచ్చాను. టీటీడీ ఇచ్చిన ఆర్డర్ కాపీని తిరుమలలో ఉన్న అన్నమాచార్య వారసులకు చూపించి, 1978 మే ఐదవ తేదీన ఉద్యోగంలో చేరాను. అలా దేవుడిచ్చిన అవకాశాన్ని ఆనందంగా స్వీకరించి స్వామి సేవలో తరిస్తున్న సమయంలో నా మనసు నొచ్చుకునే సంఘటన ఒకటి జరిగింది. దాంతో 1992లో రాజీనామా చేశాను. కొంతకాలం భద్రాచలం రాముడి సేవ చేసి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత 1983, నవంబర్ 30న నా పుట్టినరోజు నాడు ‘అన్నమయ్య భావన వాహిని’ని స్థాపించాను. నా జీవితంలో మరో చేదు అనుభవం కారణంగా నాకు పిల్లలు వద్దనుకున్నాను. నా భర్త కూడా అందుకు అంగీకరించారు. అయితే స్వామి సేవలో భాగంగా దేశవిదేశాల్లో వేలాది మంది పిల్లలకు అన్నమయ్య కీర్తనలు నేర్పించాను. వారందరిలో నా బిడ్డలను చూసుకున్నాను. అన్నమయ్య స్త్రీ అభ్యుదయ సమాజాన్ని ఆకాంక్షించారు. కానీ ఇంకా అది రాలేదనడానికి ఎన్నో ఉదంతాలు. నా జీవితమే పెద్ద ఉదాహరణ. స్త్రీ అయిన కారణంగా నా ప్రయాణం ఇంత వరకు ఎదురీతతోనే సాగింది... అలానే కొనసాగుతోంది. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు పాడుతూనే ఉంటాను. అన్నమయ్య పాటలే నాకు ప్రాణం’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి పెండెంట్ అలా వచ్చింది నా స్టూడెంట్ ఒకామె నన్ను ఎంతగానో ఇష్టపడేది. ఆమెకి ఎనభై ఏళ్లు. ఎప్పుడూ నాకు బంగారు పెండెంట్ చేయిస్తానంటుండేది. అలా నాలుగేళ్లు గడిచాక ఓ రోజు పట్టుపట్టి నన్ను, మా అక్కను షాప్‌కి తీసుకెళ్లిందామె. అపుడు నేను ‘ఓం నమో నారాయణాయ’ అనే అక్షరాలు, వేంకటేశ్వరుడు, అన్నమయ్య ఉండేటట్లు డిజైన్ని పేపర్ మీద గీసిచ్చాను. దానిని చేయడానికి లక్షన్నర అవుతుందన్నారు షాపువాళ్లు. అంత ఖరీదైన బహుమతులు తీసుకోకూడదని వచ్చేశాను. నేను అక్కడితో ఆ సంగతి మర్చిపోయాను. కానీ మా అక్క ఆ పేపర్ని దాచుకుంది. మా సిస్టర్స్ అందరూ కలిసి ఈ పెండెంట్ చేసి పబ్లిక్ మీటింగ్‌లో ‘ఎలాంటి అవసరం వచ్చినా అమ్మకూడద’ని చెప్పి మరీ ఇచ్చారు. స్వామి సేవకు డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం అమ్మేస్తుంటాను. అలాగే ఆ పెండెంట్‌ని కూడా అమ్మేస్తానని మా అక్క భయం. స్వామి రూపం ఉన్న కారణంగా పెండెంట్‌ని అమ్మకుండా కాపాడుకుంటున్నాను. అయితే స్వామికి కుంభాభిషేకం చేయడానికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో ఓ సారి ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టాను. కానీ స్వామి నన్ను వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. అన్నమయ్య నోట... సమసమాజ పాట అన్నమయ్య పాడిన... ‘అందరికీ శ్రీహరే అంతరాత్మ, నిండార రాజు నిదురించే నిద్ర– బంటు నిద్ర ఒక్కటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి– చండాలుండేటి సరిభూమి’ అనే పదాల్లోని సామాజిక చైతన్యం ఇప్పటికీ నిత్యనూతనమే. మన సమాజంలో వేళ్లూనికుని ఉన్న కులవ్యవస్థను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న సోషలిస్టు అన్నమయ్య. ఆయన స్త్రీవాది కూడా. ‘పురుషులూ జీవులే, పొలతులూ జీవులే’ అని స్త్రీపురుష సమానత్వాన్ని దాదాపు ఆరువందల ఏళ్ల కిందటే చెప్పాడు. సమాజంలో అవసరమైన మార్పుని అన్నమయ్య నోటి నుంచి పలికించాడు ఆ శ్రీవేంకటేశ్వరుడు. సంగీతాన్ని పామరులకు అర్థమయ్యే భాషలో చిన్న చిన్న పదాలతో గొప్ప భావాన్ని పలికించిన వాగ్గేయకారుడు ఆయన. నేను కొత్తగా ఏమీ చేయడం లేదు. ఆనాడు అన్నమయ్య పాడిన కీర్తనలను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి జీవితాన్ని అంకితం చేస్తానని ఆ వేంకటేశ్వరుడికి మాట ఇచ్చాను. ఆ దేవదేవుడికిచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నమే ఇదంతా. – పద్మశ్రీ శోభారాజు, అన్నమయ్య భావన వాహిని స్థాపక కర్త -
అన్నమయ్య కీర్తనలతో.. ఏడో సీడీ
అదివో అల్లదివో... తందనానా ఆహి... బ్రహ్మకడిగిన పాదము... జనబాహుళ్యంలోకి విస్తృతంగా ప్రచారమైన సంకీర్తనలు... మరిన్ని కీర్తనలను స్వరపరిచి, ప్రచారంలోకి తీసుకొస్తోంది అన్నమయ్య ప్రాజెక్టు... ఇందులో భాగంగా సాలూరి వాసూరావు వంద కీర్తనలు స్వరపరుస్తున్నారు... ఇప్పటికి ఆరు సీడీలు విడుదలయ్యాయి. ఏడుకొండలవాడి ఏడో సీడీ మే 5న, అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సాలూరి వాసూరావు తన అనుభవాలను 'సాక్షి'తో పంచుకున్నారు... అన్నమయ్య మొత్తం 32 వేల సంకీర్తనలు రచించాడని, అందులో సుమారు 10 వేలు మాత్రమే లభ్యమయ్యాయని చరిత్ర చెబుతోంది. అందులో కొన్ని కీర్తనలను ఇప్పటికే నేదునూరి కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారు స్వరపరిచి విస్తృతంగా ప్రచారం చేశారు. మరిన్ని కీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్టు ఈ బృహత్కార్యాన్ని కొందరు సంగీత దర్శకులకు అప్పచెప్పింది. అన్నమయ్య సంకీర్తనలు ఇప్పటి వరకు 1600 స్వరపరిచారు. 1601 నుంచి 1700 వరకు స్వరపర్చమని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు నన్ను నిర్దేశించింది. 2014, గురుపూర్ణిమ నాడు ఈ యజ్ఞం ప్రారంభించాను. ఇలా చేశాను... ముందుగా పది సంకీర్తనలను స్వరపరచుకుని, పిల్లలకు నేర్పాను. ఇందులో వీణ, మృదంగం, వయొలిన్ వంటి సంప్రదాయ వాద్య పరికరాలన్నిటినీ సాధ్యమైనంత వరకు వాడాం. కీబోర్డును కీబోర్డుగా కాకుండా, వైబ్రో ఫోన్, బెల్స్ కోసం వాడుతున్నాను. నాకు పదకోశం లేకుండా ఈ కీర్తనలకు అర్థం, విరుపులు అన్నీ చిర్రావూరి మదన్మోహన్ వివరిస్తూ బాగా సహకరిస్తున్నారు. ఎన్. హనుమంతరావు సంగీత సహకారం అందిస్తున్నారు. తిరుపతిలో 'శ్రీవెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్' అని అతి నూతన ప్రో టూల్ ఎక్విప్మెంట్తో స్టూడియో నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణానికి నేను సహకరించాను. మా పాటలన్నీ ఆ స్టూడియోలోనే రికార్డింగ్ జరగాలి. అది అన్నమయ్య ప్రాజెక్టు వారి నియమం. ఎంపిక ఇలా... స్వరపరిచేటప్పుడు రాగాల ఎంపిక ప్రధానం. కీర్తన గంభీరంగా ఉంటే నాటరాగం, అఠాణా రాగాలు, కొంచెం మృదువుగా ఉంటే మోహన, కల్యాణి వంటి రాగాలలో స్వరపరుస్తున్నాను. పాడేవారు చిన్నపిల్లలు కావడంతో వారిని దృష్టిలో ఉంచుకుని సంకీర్తనలను స్వరపరుస్తున్నాను. ఒక్కో సంకీర్తన నేర్చుకోవడానికి పిల్లలకు సుమారు 15 రోజుల సమయం పడుతోంది. ఈ బాల గానామృతం ప్రాజెక్టు పూర్తయ్యాక, ప్రముఖ గాయకులతో పాడించి మరింత ప్రచారంలోకి తీసుకురావాలనేది నా ఆకాంక్ష. నాన్నగారి బాటలో... సాహిత్యానికి అనుగుణంగా నాన్నగారు స్వరపరిచిన బాటలోనే నేనూ స్వరపరుస్తున్నాను. నా మీద పెద్ద భారం ఉంది.రాజేశ్వరరావుగారి అబ్బాయి 'ఇలా చేశాడేంటి' అనకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాను. ఇప్పటివరకు 70 సంకీర్తనలు పూర్తయ్యాయి. ఆమోదముద్ర పడాలి... సీడీ పూర్తయ్యాక ఇద్దరు సంగీత నిష్ణాతులు వాటికి ఆమోదముద్ర వేయాలి. ప్రముఖ వయొలిన్ కళాకారిణి శ్రీమతి కన్యాకుమారి, లలిత సంగీత దర్శకులు చిత్తరంజన్ వీరిద్దరూ ఆమోదించిన తర్వాతే సీడీని విడుదల చేస్తారు. మొదటి సీడీ చేసినప్పుడు ఒక అరుదైన వాద్యపరికరం ఉపయోగించాను. కాని వారు 'అది వాడకపోతే బావుంటుంది. మన శాస్త్రీయ సంగీత వాద్యపరికరం వాడితే బాగుంటుంది' అని సలహా యిచ్చారు. అప్పుడు ఆ వాద్యం తొలగించి మళ్లీ రికార్డు చేశాను. భవిష్య ప్రణాళికలు... త్వరలో చెన్నైలో ఉండే పిల్లలతో కూడా పాడించబోతున్నాను. వాళ్లకు మన భాష రాకపోయినా దగ్గరుండి వాళ్లతో పలికించాలి. నేను అదే చేయబోతున్నాను. అన్నమయ్య సంకీర్తనలలో భాష అంత తొందరగా అర్థం కాదు. అందుకే మదన్మోహన్గారు ఆరు నెలలపాటు అన్నమయ్య కీర్తనలను క్షుణ్నంగా అధ్యయనం చేసి వాటి అర్థాలు, విరుపులు నాకు వివరించారు. కీర్తనలోని భాష, భావం ఆయనతో చెప్పించుకుని ఆ తరవాత స్వరపరుస్తున్నాను. చిన్నారులతో పది సీడీలు పూర్తయ్యాక, యువతతో మరో పది సీడీలు చేయబోతున్నాను. నా ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఫ్యూజన్ చేద్దామనుకుంటున్నాను. ఆ తరవాత ఇతర భాషలకు చెందిన గాయనీమణులతో అంటే శ్రేయాఘోషల్, అనురాధా పొడ్వాల్, ఆషాభోంస్లేలతో అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీలు విడుదల చేయాలని నా కోరిక. అన్నమయ్య కీర్తనలు బాగా ప్రసిద్ధిలోకి వచ్చాక కరోంకే చేసి, దానితో పాటు సంకీర్తన అచ్చు వేసిన కాగితం కూడా ఇచ్చేలా చేద్దామనుకుంటున్నాను. అందరూ అది పెట్టుకుని వారి గాత్రానికి జతపరచుకోవచ్చు కదా. అలాగే కేవలం వాద్యపరికరాల మీద చేయాలనే యోచనలో ఉన్నాను. ఇవన్నీ కూడా తక్కువ ధరకి అందచేయాలని అనుకుంటున్నాను. 'సాలూరి లలిత సంగీతం' అని చేయబోతున్నాను. సి.నా.రె. వడ్డేపల్లి కృష్ణ, ప్రభాశర్మ, మదన్మోహన్, ఎం.కె. రాము వీళ్లతో రాయించి చేయాలనేది నా సంకల్పం. వీరితో కూడా... అమెరికాలో కూడా పాడే వాళ్లుంటే వారి చేత కూడా పాడిస్తాను. ముఖ్యంగా, నాన్నగారు స్వరపరచిన 'కలగంటి కలగంటి' గీతం ఆలపించిన పరమేశ్వరావుతో కూడా పాడించాలనుకుంటున్నాను. సంగీతంలో ఎక్కడైనా సందేహం వస్తే, పెద్దలతో సంప్రదించి పూర్తి చేస్తున్నాను. ఇంతవరకు... ఇంతవరకు వచ్చిన అన్నమయ్య కీర్తనలు ఎక్కువ భాగం హిందోళం, మధ్యమావతి రాగాలలో స్వరపరిచారు. నేను ఆ రాగాలను కొంచెం తక్కువ వాడుతున్నాను. సారమతి రాగాన్ని ఇంతకు మునుపు ఎక్కువగా వాడలేదు. అలాగే హంసనాదం. వీటిని నేను ఎక్కువగా ఉపయోగిస్తున్నాను. విజ్ఞాపన... ఈ సంకీర్తనలు విస్తృత ప్రచారం పొందడానికి రకరకాలుగా కృషి చేసి తీరాలి. ముఖ్యంగా ఎస్విబిసి చానల్లో పిల్లలకు పోటీలు నిర్వహించమని కోరదామనుకుంటున్నాను. అలా వీటిని పాపులర్ చేయవచ్చు. ఇప్పటివరకు 54 సినిమాలు, 515 టీ వీ సీరియల్స్‌కి సంగీతం సమకూర్చాను. వృత్తిని దైవంగా భావించాలి. అన్నమయ్య సంకీర్తనలకు ఆద్యులైన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. - ఫొటో, సంభాషణ: డా. పురాణపండ వైజయంతి