అన్నమయ్య కీర్తనలతో.. ఏడో సీడీ | seventh cd of annamayya keerthanas released by vasurao saluri | Sakshi
Sakshi News home page

అన్నమయ్య కీర్తనలతో.. ఏడో సీడీ

Published Tue, May 5 2015 2:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

అన్నమయ్య కీర్తనలతో.. ఏడో సీడీ

అన్నమయ్య కీర్తనలతో.. ఏడో సీడీ

అదివో అల్లదివో... తందనానా ఆహి... బ్రహ్మకడిగిన పాదము...
జనబాహుళ్యంలోకి విస్తృతంగా ప్రచారమైన సంకీర్తనలు...
మరిన్ని కీర్తనలను స్వరపరిచి, ప్రచారంలోకి తీసుకొస్తోంది అన్నమయ్య ప్రాజెక్టు...
ఇందులో భాగంగా సాలూరి వాసూరావు వంద కీర్తనలు స్వరపరుస్తున్నారు...
ఇప్పటికి ఆరు సీడీలు విడుదలయ్యాయి.
ఏడుకొండలవాడి ఏడో సీడీ మే 5న, అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా సాలూరి వాసూరావు తన అనుభవాలను 'సాక్షి'తో పంచుకున్నారు...

అన్నమయ్య మొత్తం 32 వేల సంకీర్తనలు రచించాడని, అందులో సుమారు 10 వేలు మాత్రమే లభ్యమయ్యాయని చరిత్ర చెబుతోంది. అందులో కొన్ని కీర్తనలను ఇప్పటికే నేదునూరి కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారు స్వరపరిచి విస్తృతంగా ప్రచారం చేశారు. మరిన్ని కీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్టు ఈ బృహత్కార్యాన్ని కొందరు సంగీత దర్శకులకు అప్పచెప్పింది. అన్నమయ్య సంకీర్తనలు ఇప్పటి వరకు 1600 స్వరపరిచారు. 1601 నుంచి 1700 వరకు స్వరపర్చమని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు నన్ను నిర్దేశించింది. 2014, గురుపూర్ణిమ నాడు ఈ యజ్ఞం ప్రారంభించాను.

ఇలా చేశాను...
ముందుగా పది సంకీర్తనలను స్వరపరచుకుని, పిల్లలకు నేర్పాను. ఇందులో వీణ, మృదంగం, వయొలిన్ వంటి సంప్రదాయ వాద్య పరికరాలన్నిటినీ సాధ్యమైనంత వరకు వాడాం. కీబోర్డును కీబోర్డుగా కాకుండా, వైబ్రో ఫోన్, బెల్స్ కోసం వాడుతున్నాను. నాకు పదకోశం లేకుండా ఈ కీర్తనలకు అర్థం, విరుపులు అన్నీ చిర్రావూరి మదన్‌మోహన్ వివరిస్తూ బాగా సహకరిస్తున్నారు. ఎన్. హనుమంతరావు సంగీత సహకారం అందిస్తున్నారు. తిరుపతిలో 'శ్రీవెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్' అని అతి నూతన ప్రో టూల్ ఎక్విప్‌మెంట్‌తో స్టూడియో నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణానికి నేను సహకరించాను. మా పాటలన్నీ ఆ స్టూడియోలోనే రికార్డింగ్ జరగాలి. అది అన్నమయ్య ప్రాజెక్టు వారి నియమం.

ఎంపిక ఇలా...
స్వరపరిచేటప్పుడు రాగాల ఎంపిక ప్రధానం. కీర్తన గంభీరంగా ఉంటే నాటరాగం, అఠాణా రాగాలు, కొంచెం మృదువుగా ఉంటే మోహన, కల్యాణి వంటి రాగాలలో స్వరపరుస్తున్నాను. పాడేవారు చిన్నపిల్లలు కావడంతో వారిని దృష్టిలో ఉంచుకుని సంకీర్తనలను స్వరపరుస్తున్నాను. ఒక్కో సంకీర్తన నేర్చుకోవడానికి పిల్లలకు సుమారు 15 రోజుల సమయం పడుతోంది. ఈ బాల గానామృతం ప్రాజెక్టు పూర్తయ్యాక, ప్రముఖ గాయకులతో పాడించి మరింత ప్రచారంలోకి తీసుకురావాలనేది నా ఆకాంక్ష.

నాన్నగారి బాటలో...
సాహిత్యానికి అనుగుణంగా నాన్నగారు స్వరపరిచిన బాటలోనే నేనూ స్వరపరుస్తున్నాను. నా మీద పెద్ద భారం ఉంది.రాజేశ్వరరావుగారి అబ్బాయి 'ఇలా చేశాడేంటి' అనకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాను. ఇప్పటివరకు 70 సంకీర్తనలు పూర్తయ్యాయి.

ఆమోదముద్ర పడాలి...
సీడీ పూర్తయ్యాక ఇద్దరు సంగీత నిష్ణాతులు వాటికి ఆమోదముద్ర వేయాలి. ప్రముఖ వయొలిన్ కళాకారిణి శ్రీమతి కన్యాకుమారి, లలిత సంగీత దర్శకులు చిత్తరంజన్ వీరిద్దరూ ఆమోదించిన తర్వాతే సీడీని విడుదల చేస్తారు. మొదటి సీడీ చేసినప్పుడు ఒక అరుదైన వాద్యపరికరం ఉపయోగించాను. కాని వారు 'అది వాడకపోతే బావుంటుంది. మన శాస్త్రీయ సంగీత వాద్యపరికరం వాడితే బాగుంటుంది' అని సలహా యిచ్చారు. అప్పుడు ఆ వాద్యం తొలగించి మళ్లీ రికార్డు చేశాను.  

భవిష్య ప్రణాళికలు...
త్వరలో చెన్నైలో ఉండే పిల్లలతో కూడా పాడించబోతున్నాను. వాళ్లకు మన భాష రాకపోయినా దగ్గరుండి వాళ్లతో పలికించాలి. నేను అదే చేయబోతున్నాను. అన్నమయ్య సంకీర్తనలలో భాష అంత తొందరగా అర్థం కాదు. అందుకే మదన్‌మోహన్‌గారు ఆరు నెలలపాటు అన్నమయ్య కీర్తనలను క్షుణ్నంగా అధ్యయనం చేసి వాటి అర్థాలు, విరుపులు నాకు వివరించారు. కీర్తనలోని భాష, భావం ఆయనతో చెప్పించుకుని ఆ తరవాత స్వరపరుస్తున్నాను. చిన్నారులతో పది సీడీలు పూర్తయ్యాక, యువతతో మరో పది సీడీలు చేయబోతున్నాను. నా ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఫ్యూజన్ చేద్దామనుకుంటున్నాను. ఆ తరవాత ఇతర భాషలకు చెందిన గాయనీమణులతో అంటే శ్రేయాఘోషల్, అనురాధా పొడ్వాల్, ఆషాభోంస్లేలతో అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీలు విడుదల చేయాలని నా కోరిక. అన్నమయ్య కీర్తనలు బాగా ప్రసిద్ధిలోకి వచ్చాక కరోంకే చేసి, దానితో పాటు సంకీర్తన అచ్చు వేసిన కాగితం కూడా ఇచ్చేలా చేద్దామనుకుంటున్నాను. అందరూ అది పెట్టుకుని వారి గాత్రానికి జతపరచుకోవచ్చు కదా. అలాగే కేవలం వాద్యపరికరాల మీద చేయాలనే యోచనలో ఉన్నాను. ఇవన్నీ కూడా తక్కువ ధరకి అందచేయాలని అనుకుంటున్నాను. 'సాలూరి లలిత సంగీతం' అని చేయబోతున్నాను. సి.నా.రె. వడ్డేపల్లి కృష్ణ, ప్రభాశర్మ, మదన్‌మోహన్, ఎం.కె. రాము వీళ్లతో రాయించి చేయాలనేది నా సంకల్పం.

వీరితో కూడా...
అమెరికాలో కూడా పాడే వాళ్లుంటే వారి చేత కూడా పాడిస్తాను. ముఖ్యంగా, నాన్నగారు స్వరపరచిన 'కలగంటి కలగంటి' గీతం ఆలపించిన పరమేశ్వరావుతో కూడా పాడించాలనుకుంటున్నాను. సంగీతంలో ఎక్కడైనా సందేహం వస్తే, పెద్దలతో సంప్రదించి పూర్తి చేస్తున్నాను.

ఇంతవరకు...
ఇంతవరకు వచ్చిన అన్నమయ్య కీర్తనలు ఎక్కువ భాగం హిందోళం, మధ్యమావతి రాగాలలో స్వరపరిచారు. నేను ఆ రాగాలను కొంచెం తక్కువ వాడుతున్నాను. సారమతి రాగాన్ని ఇంతకు మునుపు ఎక్కువగా వాడలేదు. అలాగే హంసనాదం. వీటిని నేను ఎక్కువగా ఉపయోగిస్తున్నాను.

విజ్ఞాపన...
ఈ సంకీర్తనలు విస్తృత ప్రచారం పొందడానికి రకరకాలుగా కృషి చేసి తీరాలి. ముఖ్యంగా ఎస్‌విబిసి చానల్‌లో పిల్లలకు పోటీలు నిర్వహించమని కోరదామనుకుంటున్నాను. అలా వీటిని పాపులర్ చేయవచ్చు. ఇప్పటివరకు 54 సినిమాలు, 515 టీ వీ సీరియల్స్‌కి సంగీతం సమకూర్చాను. వృత్తిని దైవంగా భావించాలి. అన్నమయ్య సంకీర్తనలకు ఆద్యులైన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
 - ఫొటో, సంభాషణ: డా. పురాణపండ వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement