annamayya project
-
ఏది నిజం?: ‘అన్నమయ్య’పై అన్ని అబద్ధాలా?
గ్లాసులో 80 శాతం నిండుగా ఉన్నా...పైనున్న ఆ 20 శాతం ఖాళీని చూపిస్తూ...‘ఖాళీ గ్లాసు’ అని ప్రచారం చేసే వాళ్లను ఏమనుకోవాలి? ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసినా... కొనసాగుతున్న ఒకటి రెండు పనులను చూపించి ఇంకా ఏమీ కాలేదంటూ విషం చిమ్మే మాయావులను ఏమనుకోవాలి? సమాధానం ఒక్కటే!. దాన్ని ‘ఈనాడు’ పత్రిక అనుకోవాలి. అంతే!!. శనివారంనాడు ‘‘హామీల గట్టుపై కన్నీటి వేదన..’’ అంటూ ఈనాడు రాసిన ‘కథనం’ ఇలాంటిదే. శవాల గుట్టపై సంపద వెతుక్కునే రామోజీరావు తత్వానికి మచ్చుతునక ఈ కథనం. ఊహించని విపత్తులో నష్టపోయిన జనాన్ని సర్కారు అడుగడుగునా ఆదుకుంది. మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షల చొప్పున అందజేసింది. క్షతగాత్రులకూ పరిహారం చెల్లించింది. ఇక అర్హులైన వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించటమే కాక నగదు సాయమూ అందించింది. పొలాల్లోని ఇసుక మేటలు తానే తొలగించింది. ఒకవేళ రైతులు తొలగించుకున్న పక్షంలో హెక్టారుకు రూ.12,500 చొప్పున చెల్లిస్తామని చెప్పి... చెల్లించింది. నష్టానికి తక్షణ పరిహారం చెల్లించటమే కాక... బాధితులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అర్హుల కోసం 412 ఇళ్ల నిర్మాణమూ మొదలు పెట్టింది. మరో నెల రోజుల్లో 140 ఇళ్లు పూర్తికానున్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ.. కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల సహాయానికి సంబంధించిన వాస్తవాలు. కానీ రామోజీరావు రాసిన కథనంలో ఈ వాస్తవం ఒక్కటీ లేదు. ప్రతి అంశానికీ తనదైన రంగేసి మరీ విషం చిమ్మారు. ఈ రాతల్లోని నిజానిజాలివిగో... ఏడాదిన్నర కిందట 2021 నవంబర్‌లో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టులోకి ఊహించని వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉవ్వెత్తున వరద నీరు తరలివచ్చింది. ఎగువనున్న పింఛా ప్రాజెక్టు మట్టి కట్టలు తెగిపోయాయి. ఆ వరద ప్రభావం అన్నమయ్య ప్రాజెక్టుపై పడింది. అప్పటికే నిండు కుండలా ఉన్న ప్రాజెక్టుకు అదనపు నీరు ఉవ్వెత్తున చేరటంతో అన్నమయ్య ప్రాజెక్టు కరకట్టలు తెగిపోయి ఒక్కమారుగా ఉపద్రవం ముంచెత్తింది. వరదనీరు బీభత్సం సృష్టించింది. ఆ రోజు 2021 నవంబరు 19న కార్తీక పౌర్ణమి కావడంతో.. ఉదయాన్నే అక్కడి శివాలయానికి వెళ్లిన గ్రామీణులను వరద చుట్టుముట్టింది. నీటి ఉధృతిలో కొందరు కొట్టుక పోయారు. మూగ జీవాలు మరణించాయి. ఊళ్లు మునిగిపోయాయి. యావత్తు జిల్లా అదిరిపడిన ఇంతటి తీవ్ర విపత్తును... ప్రభుత్వం తక్షణం స్పందించి సమర్థంగా ఎదుర్కొంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు... వరద నీటిలో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందాయి. వరద బాధిత గ్రామాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... 10 రోజల తరవాత డిసెంబర్ 2న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మందపల్లె, పులపత్తూరు గ్రామాల్లో వరద బాధితులను స్వయంగా కలిశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 33 మందికి రూ.1.65 కోట్లు పరిహారం చెల్లించారు. కొద్దిరోజుల్లోనే ఈ చెల్లింపులూ పూర్తయ్యాయి. వరదలు కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఒక్కొక్క ఇంటికి రూ.95,100 చొప్పున 453 ఇళ్లకు రూ.4.30 కోట్లు వెంటనే చెల్లించారు. పాక్షికంగా దెబ్బతిన్న 601 ఇళ్లకు రూ.5,200 చొప్పున నష్టపరిహారం అందించారు. అది కూడా అందరికీ అందింది. ఇక మందపల్లె, పులపత్తూరు, తొగురుపేట, శేషమాంబపురం, గుండ్లూరు గ్రామాల్లో దాదాపు 376 పశువులు చనిపోయాయి. వాటికి రూ.1.41 కోట్ల పరిహారం చెల్లించారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ పంటలు నష్టపోయిన 2,196 మంది రైతులకు రూ. 3.05 కోట్లు పరిహారం దక్కింది. 21రోజులు పాటు 9 క్యాంపుల ద్వారా 5వేల మందికి పునరావాసం కల్పించారు. వీటిలో ఏ ఒక్కటీ జాప్యం కాలేదు. అన్ని చెల్లింపులూ కొద్దిరోజుల్లోనే పూర్తయ్యాయి. పులపత్తూరు లేఅవుట్లో 412 ఇళ్లు మంజూరు.... వరద బాధితులకు పటిష్టమైన ఇళ్లు నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 412 మంది అర్హులకు ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నిటికీ మ్యాపింగ్, జియోట్యాగింగ్, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయి. వాటిలో 107 ఇళ్లు రూఫ్ లెవెల్ పూర్తి చేసుకున్నాయి. మరో 32 ఇళ్లు ఆర్సీ లెవెల్ చేరాయి. త్వరలో శ్లాబ్‌లు ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇవన్నీ ఒకటి రెండు నెలల్లో పూర్తికాబోతున్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కూడా పూర్తి చేస్తామని, అర్హులందరికీ వీలైనంత వేగంగా ఇళ్లు అందిస్తామని కలెక్టర్ గిరీషా బాధితులకు స్పష్టం చేశారు కూడా. డ్వాక్రా గ్రూపులకు రూ. 8.98 కోట్ల రుణమాఫీ... వరద ప్రభావిత గ్రామాల్లో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పొలాల్లో ఉన్న ఇసుక మేటలు తొలగిస్తామని చెప్పారు. అర్హులకు ఇళ్లు, ఉచిత పట్టాలు ఇస్తామన్నారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబాలకు వారం, పది రోజుల్లోనే 33 మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున రూ.1.65 కోట్లు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారు. అలాగే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేశారు. 189 గ్రూపుల సభ్యులకు రూ.8.98 కోట్ల రుణాలను మాఫీ చేశారు. సమీపంలోని పాలేశ్వరస్వామి ఆలయం (శివాలయం) నిర్మాణం కూడా టీటీడీ ద్వారా దాదాపు పూర్తయ్యింది. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులకు కొత్త రూపు... అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపు తీసుకువస్తోంది. పటిష్టమైన సిమెంట్ ప్రొటెక్షన్ వాల్స్ ఏర్పాటుతో పాటు ఏకకాలంలో అన్నమయ్య నుంచి 5.60 లక్షల క్యూసెక్కులు నీరు డిశ్చార్జి చేసేలా రూపొందించారు. ఇదివరకూ 5 గేట్లు మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసే వెసులుబాటు ఉండేది. వాటి స్థానంలో 25 గేట్లు ఏర్పాటు చేసి 5.6 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జి చేసేలా విస్తారమైన స్పిల్‌వే ఏర్పాటు చేస్తున్నారు. ఆ మేరకు రూ. 660 కోట్లుతో పనులు చేసేందుకు టెండర్లు ఖరారయ్యాయి కూడా. టెండరు దక్కించుకున్న కంపెనీతో నెలన్నర కిందట అగ్రిమెంటు కూడా పూర్తయింది. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థ డిజైన్ రూపొందించాల్సి ఉంది. పింఛా ప్రాజెక్టుకు సైతం రూ.68 కోట్లుతో టెండర్లు పూర్తయ్యాయి. ఈ సంస్థతోనూ నెలన్నర కిందట అగ్రిమెంటు పూర్తి కాగా... పనులు మొదలై దాదాపు 20 శాతం అయ్యాయి కూడా. ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలు. కానీ వీటితో పనిలేని ‘ఈనాడు’ మాత్రం యథాప్రకారం బురద జల్లటానికే ప్రాధాన్యమిచ్చింది. హవ్వా...రక్షణ గోడలో అవినీతా? ఇదెక్కడి నీతి? రూ.3 కోట్లతో రక్షణ గోడ నిర్మించారని, అందులో వైఎస్సార్సీపీ నేతలు అవినీతికి పాల్పడి నాసిరకం నిర్మాణాలు చేపట్టారని రామోజీరావు రాసి పారేశారు. నిజానికి ‘ఈనాడు’కు గానీ, రామోజీరావుకు గానీ వాస్తవాలతోను, క్షేత్రస్థాయి అంశాలతోను సంబంధం లేదు కాబట్టి ఏదైనా రాసేస్తారు. ఎందుకంటే వాస్తవానికి అక్కడ రక్షణ గోడలే ఏర్పాటు చేయలేదు. గ్రామాల్లో తెగిపోయిన ప్రొటెక్షన్ వాల్ మరమత్తులు మాత్రం చేశారు. కానీ చేయని పనిని చేసినట్లు, అందులో అవినీతికి పాల్పడినట్లు రాయటమేంటని ఇరిగేషన్ ఈఈ వెంకట్రామయ్య తీవ్రంగా విమర్శించారు. ఇసుక మేటలు తొలగింపు... వరద ప్రభావిత ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుకమేటలు తామే తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు తొలగించారు కూడా. రైతుల పొలాల్లో పూర్తిగా తొలగించగా... 20 శాతం పోరంబోకు, ప్రభుత్వ భూముల్లో ఇసుక మేటలున్నాయి. వాటిలో ఉన్న ఇసుకను కావాల్సిన రైతులు ఎగువ ప్రాంతంలో ఉన్న తమ పొలాలకు తరలించుకుంటున్నారు. కానీ రామోజీ మాత్రం ఇసుక మేటలు తొలగించనట్లే వండేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకున్నాం అన్నమయ్య, పింఛా డ్యాములు తెగిపోయి వరద తాకిడికి గురైన గ్రామాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంది. విపత్తు తలెత్తిన మర్నాటి నుంచే యంత్రాంగం యావత్తూ అక్కడే ఉండి ఆర్థికసాయం మొదలు అన్ని సహాయక చర్యలూ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసింది. మందపల్లె, పులపత్తూరు, తొగురుపేట, గుండ్లూరు గ్రామాలకు సంబంధించి 186 మంది ఇల్లు కట్టించాలని కోరారు. వారికి పూర్తి స్థాయిలో కట్టిస్తున్నాం. ఇప్పటికే 140 మంది గృహాలు రూఫ్ లెవల్‌కు వచ్చాయి. మరో నెలరోజుల్లోపు అందరి గృహాలు పూర్తవుతాయి. 42 మంది తాత్కాలికంగా గుడారాల్లో ఉంటున్నారు. వారిక్కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే సౌకర్యాలు కల్పించింది. ఇప్పటివరకు వరద తాకిడికి మృతి చెందిన వారికి పరిహారం, మూగజీవాల మృతి, ఇసుక మేటల తరలింపు, ఇతరత్రా సదుపాయాల కల్పనకు రూ. 22 కోట్ల మేరకు ఖర్చు చేశాం. జాబ్‌మేళాల ద్వారా 325 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అందులో కొందరు వెళ్లారు... మరికొందరు వెళ్లలేదు. వరదతో మృతి చెందిన వారి కుటుంబాల్లో తొమ్మిది మందికి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాం. 80 శాతం పొలాల్లో ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించింది. సాగుకు అనుకూలంగా మార్చింది. మరో 20 శాతం ప్రభుత్వ పోరంబోకు భూములు, ఇతర భూములు కలిగిన వారు మేమే తొలగించుకుంటామని చెబితే వారికి అవకాశమిచ్చాం. పలుమార్లు నేనే వెళ్లి పరిశీలిస్తూ బాధితులకు సమస్యలు రాకుండా చూశా. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల నూతన నిర్మాణాలకు వేగంగా చర్యలు చేపడుతున్నాం. – పీఎస్ గిరీషా, జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా రోడ్లు పూర్తయ్యాయి.. ఇళ్లు అవుతున్నాయి.. పులపత్తూరు గ్రామంలో అన్ని సౌకర్యాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.50 లక్షలతో పొలాలను కనెక్ట్ చేయటానికి రోడ్లు వేశారు. విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. మరికొందరికి కాంట్రాక్టు పద్ధతిలో ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు. దాదాపు లేఅవుట్స్‌లో అన్ని మౌలిక సదుపాయాలనూ కల్పిస్తున్నారు. నాలుగు నెలల్లో ఇవన్నీ పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తాయి. గుడారాల్లో ఉన్న వారికోసం కడుతున్న ఇళ్లు నెలలో శ్లాబ్ పూర్తి చేసుకుంటాయి. త్వరలో గృహప్రవేశాలు జరుగుతాయి. – జగన్, గ్రామప్రతినిధి, పులపుత్తూరు నాకు ఏపీఎండీసీలో ఉద్యోగం వచ్చింది వరదలకు సర్వం కోల్పోయిన మా గ్రామానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఆదుకోవాలని కోరాను. వరదనీటిలో మా అమ్మ శంకరమ్మ కొట్టుకుపోయింది. కుటుంబమంతా ఆర్థికంగా నష్టపోయింది. నిలదొక్కుకోలేకపోయాము. మా గోడు ముఖ్యమంత్రికి చెప్పుకున్నాం. ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన దయతో నాకు ఏపీఎండీసీలో ఉదోగ్యం వచ్చింది. సంతోషంగా ఉంది. ఇప్పుడు పనిచేసి కుటుంబానికి ఆధారంగా నిలబడుతున్నా. – చలిమెల్ల, వెంకటసుబ్బరాజు, పులపత్తూరు పక్కా ఇంటిలో నివాసం ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇంట్లో నివాసం ఉంటున్నాం. గుడారాల్లో ఉండకుండా జగనన్న కాలనీలోని ఇంటిలోకి చేరుకున్నాం. ఓ వైపు ఇంటి నిర్మాణం ఇంకా కొంత జరుగుతోంది. ప్రభుత్వం కల్పించిన నీడ వల్ల తలదాచుకుంటున్నాం. ఇంటి నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. – ఈశ్వరయ్య కుటుంబం , పులపత్తూరు మాకు రూ.6.78 లక్షల రుణం మాఫీ అయింది... ప్రభుత్వం అందిస్తున్న రుణ మాఫీ సాయం మామూలుది కాదు. ఇది స్వయం సహాయక సంఘాల మహిళ కుటుంబాల్లో ఆర్ధికభారాన్ని తీర్చింది. మా అందరిలో మనో ధైర్యాన్ని పెంచింది. సర్వం కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వం అన్ని రకాలుగా అదుకుంది. మా సంఘాల రుణాలు మాఫీ చేయటం వల్ల నా కుటుంబానికి రూ.6.78లక్షల మాఫీ అయింది. – టి.సుబ్బలక్షమ్మ, మారమ్మ ఎస్‌హెచ్‌జీ, పులపుత్తూరు ఈనాడు ఎందుకు అలా రాసిందో.. ఫోటోలు తీసుకెళ్లి రాశారు... ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరయింది. ఇంటి నిర్మాణం జరుగుతోంది. పూర్తవతానే అందులోకి వెళతాము. ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తానంటోంది. ఇటీవల ఫోటోలు తీసుకుని వెళ్లారు. మేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పినట్లు రాశారు. మాకేమీ తెలీదు. మేమేం చెప్పలేదు. – గీత, పులపత్తూరు అనలేని మాటల్ని రాశారు... పక్కా ఇళ్ల కోసం ప్రభుత్వం సాయం చేస్తోంది. సొంతంగా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోతే, తామే కట్టిస్తామని ముందుకొచ్చింది. మా ఇల్లు కూడా అలాగే కడుతున్నారు. ముఖ్యమంత్రి మా గ్రామానికి వచ్చి ఏవైతే చెప్పారో అవన్నీ జరుగుతున్నాయి. ఆయన మాట నిలబెట్టుకోలేదని నేను అననే లేదు. కానీ ‘ఈనాడు’లో తప్పు రాశారు. – రవి, పులపత్తూరు -
రూ.635.21 కోట్లతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్ 19న చెయ్యేరుకు వచ్చిన ఆకస్మిక భారీ వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించే పనులకు రూ.635.21 కోట్ల అంచనాతో జలవనరులశాఖ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. లంప్సమ్–ఓపెన్ విధానంలో రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని షరతు విధించింది. జనవరి 10వ తేదీలోగా టెండర్లో పాల్గొనేందుకు షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఆర్థిక బిడ్‌ను జనవరి 17న ఉదయం 11 గంటలకు తెరిచి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు టెండర్ అప్పగించాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్.ఎల్.టి.సి.)కి ప్రతిపాదనలు పంపుతారు. కాంట్రాక్టు సంస్థ అర్హతలను మరోసారి పరిశీలించి, నిబంధనల ప్రకారం టెండర్‌ను ఎస్.ఎల్.టి.సి. ఆమోదిస్తుంది. తర్వాత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగిస్తూ జలవనరుల శాఖ ఒప్పందం చేసుకుంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును 2.24 టీఎంసీల సామర్థ్యంతో పునరుద్ధరించేలా పనులను కాంట్రాక్టు సంస్థ చేపడుతుంది. చెయ్యేరుకు భారీ వరద వచ్చినా చెక్కుచెదరకుండా నిలబడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. -
సీఎం జగన్ ఆదేశాలు.. ‘అన్నమయ్య’ పునరుద్ధరణకు శ్రీకారం
సాక్షి, అమరావతి: అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెయ్యేరుకు ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. రూ.635.21 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్–ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో రూపొందించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జలవనరుల శాఖ ఎస్ఈ కె.శ్రీనివాసులు బుధవారం జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు ముందుకొచ్చిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. ఎన్నడూ లేని రీతిలో.. చెయ్యేరుకు వందేళ్లకు ఒకసారి గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, రెండు వందల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది నవంబర్ 19న చెయ్యేరు నుంచి అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తింది. ఆ స్థాయిలో వరదను దిగువకు విడుదల చేసే సామర్థ్యం స్పిల్ వేకు లేకపోవడంతో మట్టికట్ట తెగిపోయింది. ఈ నేపథ్యంలో చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ పనులు చేపట్టడానికి రూ.787.77 కోట్లతో జలవనరుల శాఖ నవంబర్ 2న పరిపాలన అనుమతి ఇచ్చింది. నిపుణుల నివేదికపై టీడీపీ సర్కారు పెడచెవి ♦అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించి 2001కి పూర్తి చేశారు. ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ♦వరదను దిగువకు విడుదల చేసేలా 206.65 మీటర్ల ఎత్తుతో 94 మీటర్ల పొడవున స్పిల్ వే, అనుబంధంగా 336 మీటర్ల పొడవున మట్టికట్టను నిర్మించారు. స్పిల్ వేకు 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో ఐదు గేట్లు అమర్చారు. ♦ 2012లో జల వనరుల శాఖ నిర్వహించిన 3–డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గరిష్టంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయవచ్చని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని అందచేసిన నివేదికను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసింది. ♦గతేడాది నవంబర్ 16, 17, 18, 19 తేదీల్లో శేషాచలం– నల్లమల అడవులు, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8 గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. అదే రోజు రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19న తెల్లవారుజామున 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో మట్టం గరిష్ట స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దీంతో 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. చదవండి: బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా.. టెండర్ నిబంధనలు ఇవీ.. ♦కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రమాణాల ప్రకారం చెయ్యేరుకు గరిష్టంగా వచ్చే వరదపై అధ్యయనం చేసి అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో వరదను దిగువకు విడుదల చేసేలా స్పిల్ వే నిర్మించాలి. ♦సీపీడబ్ల్యూఆర్‌ఎస్ (సెంట్రల్ పవర్ వాటర్ రీసెర్చ్ స్టేషన్), ఏపీఈఆర్‌ఎల్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్), సీడబ్ల్యూసీ లాంటి అధీకృత సంస్థలతో అధ్యయనం చేపట్టి జలవనరుల శాఖ సూచనల ప్రకారం ప్రాజెక్టును పునరుద్ధరించాలి. ♦ప్రాజెక్టు వద్ద భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం నిర్వహించి డయాఫ్రమ్ వాల్ / ఇతర పద్ధతుల్లో పునాది నిర్మాణంపై నిర్ణయించాలి. -
‘అన్నమయ్య’ పునర్నిర్మాణం.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలతో గతేడాది నవంబర్ 19న తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.787 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పునర్నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈమేరకు పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. చెయ్యేరుకు వందేళ్లలో ఒకసారి గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, 200 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో గతేడాది అన్నమయ్య ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ నేపథ్యంలో చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వే నిర్మించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. నాడు.. అదనపు స్పిల్‌వే నిర్మించకపోవడంతోనే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించగా 2001కి పూర్తి చేశారు. 206.65 మీటర్ల ఎత్తుతో 94 మీటర్ల పొడవున స్పిల్‌వే, అనుబంధంగా 336 మీటర్ల పొడవున మట్టికట్టను నిర్మించారు. స్పిల్‌వేకు 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో ఐదు గేట్లు అమర్చారు. ఈ ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 2012లో జల వనరుల శాఖ 3–డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గరిష్టంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయవచ్చని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్‌వే నిర్మించాలని ఇచ్చిన నివేదికను టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. గతేడాది నవంబర్ 16, 17, 18, 19వతేదీల్లో శేషాచలం– నల్లమల అడవులు, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8 గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. ఆ రోజు రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తేసి 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19న అర్థరాత్రి 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కులు రావటంతో మట్టం గరిష్ట స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దీంతో 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. 440 మీటర్ల పొడవు.. 4 లక్షల క్యూసెక్కులు దాటినా చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువగా వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా దృఢంగా అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో మట్టికట్ట కాకుండా 440 మీటర్ల పొడవున కాంక్రీట్ కట్టడం (స్పిల్‌వే)తో ప్రాజెక్టును నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించింది. నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా దిగువకు విడుదల చేసేలా గేట్లను సులభంగా నిర్వహించేందుకు హైడ్రాలిక్ సిలిండర్ హాయిస్ట్ విధానంలో పనులు చేపట్టాలని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.787 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
వరద బీభత్సం.. ఊరికి అండగా నిలబడిన సాహస వీరులు
సాక్షి, కడప: రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య డ్యాం తెగి వరద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి.. పదుల సంఖ్యలో ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. ఆస్తులు కుప్పకూలాయి. ఆప్తులు చెల్లాచెదురయ్యారు..ఆ దృశ్యాన్ని తలుచుకుని గజగజ వణికిపోతున్నారు అక్కడి పల్లెజనం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు యువకులు తాము బతికి బయటపడితే చాలు అనుకోకుండా తెగువ చూపారు. నీళ్లలో చిక్కుకుని మృత్యుఒడికి చేరువయ్యే స్థితిలో ఉన్న వారిని సైతం కాపాడి ప్రాణం నిలిపారు. నవంబరు 19వ తేదీ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చెయ్యేరు వరద ఊరిపై పడి ఉరకలెత్తుతున్న సమయంలో రక్షణలో ఊరికి అండగా నిలబడిన సాహస వీరులను పలువురు అభినందిస్తున్నారు. ప్రాణాల మీద ఆశ వదలుకున్నా నా పేరు ఈశ్వరయ్య. మందపల్లె గ్రామం. వరద వచ్చిన రోజు కార్తీక పౌర్ణమి కావడంతో దీపం వెలిగిద్దామని నా భార్య చెప్పడంతో పులపత్తూరు శివాలయానికి నేను, నా భార్య, నా తల్లి వెళ్లాము. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే వరద ముంచెత్తింది. వెంటనే అక్కడున్న కల్యాణ మండపం పైకి పూజారి కుటుంబంతోపాటు మేము ఎక్కాం. ఆ వరద ఉధృతికి కల్యాణ మండపం కొట్టుకుపోవడంతో మేము నీటిలో చిక్కుకున్నాం. ఈ సమయంలో లోపల నీటిలో రాళ్లు, ఇంకా చెట్టు, ఏవేవో కాళ్లకు కోసుకుపోయాయి. నాకు ఈత రావడంతో అలలతోపాటు కొట్టుకుపోతూ ఈదుతూ వచ్చాను. ఒక్కసారి అల ఎంతో ఎత్తుకు లేపి అలా ముంచేసింది. ఇక బతకను అనుకున్నా...కొంతదూరం వెళ్లాక అలలు తగ్గి ముఖం బయటికి రావడంతో నాకు ధైర్యం వచ్చింది. అప్పుడు ఈత కొట్టేశక్తి కూడా లేదు. చేతులు ఆడిస్తుండగా సమీపంలో మందపల్లె కనిపించడంతో ధైర్యం వచ్చింది. చిన్నగా మొద్దును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాను. బతికినప్పటికీ కాళ్లకు బలమైన రాళ్ల దెబ్బలు తగలడంతో నరకం అనుభవిస్తున్నాను. నా కళ్ల ముందే నా భార్య, మా అమ్మ, పూజారి కుటుంబం కూడా కొట్టుకుపోవడం కళ్లలో మెదలుతోంది. సంఘటన తలుచుకుంటే నిద్ర పట్టడం లేదు...ఆహారం లోపలికి పోవడం లేదు. అందరినీ అప్రమత్తం చేస్తూ.. పులపత్తూరు సర్పంచ్ శ్రీదేవమ్మ కుమారుడు బి.జగన్మోహన్రెడ్డి సరిగ్గా ఆరోజు ఉదయాన్నే పని నిమిత్తం రాజంపేటలో ఉన్నారు. అంతలోపే కట్ట తెగిందని ఫోన్ రావడంతో నేరుగా ఊరికి చేరుకున్న జగన్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా దళితవాడకు వెళ్లాడు. చెయ్యేరు నదికి ఆనుకుని గట్టున ఉన్న కాలనీలంతా ఒక్క ఉదుటున ఖాళీ చేయించాడు. ఇంతలో చెయ్యేరు ఉపద్రవం ఆయన్ను చుట్టుముట్టింది. పరుగెత్తి ఓ ఇంటి వద్ద రక్షణ పొందాడు. ఇంతలోనే వరద జగన్ కుటుంబ సభ్యుల్లో ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఊరందరినీ రక్షించినా తన కుటుంబ సభ్యులు వరదలో కొట్టుకుపోవడంతో జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆపద సమయంలో గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి రక్షించిన జగన్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులు అభినందించారు. పండుటాకును రక్షించేందుకు వెళ్లి.. ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుల పేర్లు రామకృష్ణ, కార్తీక్, బి.శివకుమార్. ముగ్గురూ పులపత్తూరు గ్రామానికి చెందిన వారు. వరద ముంచెత్తిన సమయంలో చెయ్యేరు నదికి ఆనుకుని ఇంటిలో చిక్కుకున్న పండుటాకు సావిత్రమ్మను కాపాడేందుకు వెళ్లిన వీరు వరదలో చిక్కుకున్నారు. సావిత్రమ్మను అతికష్టంపై బయటికి తీసుకు వచ్చి ఒక ఇంటిలోకి పంపిస్తుండగా వరద పెరిగింది. అంతే...కార్తీక్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కగా, రామకృష్ణ చెట్టుపైకి, శివకుమార్ ఇంటిపైకి ఎక్కాడు. అయితే విద్యుత్ స్తంభం మీద ఉన్న కార్తీక్ పట్టుతప్పితే నీటిలో పడిపోవడం ఖాయం. ఒక పక్క స్తంభం ఊగుతుంటే ఆ క్షణాల్లో అతను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేనిది. అలాగే రామకృష్ణ కూడా చెట్టుపైనే భయంభయంగా గడిపాడు. కొద్దిసేపటి తర్వాత వరద నీరు కొంచెం తగ్గగానే బయటపడ్డారు. అయితే అంతలోనే మరోసారి వచ్చిన అల ధాటికి కార్తీక్ ఎక్కిన విద్యుత్ స్తంభం పడిపోయింది. ఇలా వరద సమయంలో తమ ప్రాణాలు లెక్కచేయకుండా పండుటాకులను యువకులు కాపాడారు. రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య డ్యాం తెగి వరద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి.. పదుల సంఖ్యలో ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. ఆస్తులు కుప్పకూలాయి. ఆప్తులు చెల్లాచెదురయ్యారు..ఆ దృశ్యాన్ని తలుచుకుని గజగజ వణికిపోతున్నారు అక్కడి పల్లెజనం. ఉప్పెనను ఎదిరించిన చిన్నోడు మందపల్లె గ్రామానికి చెందిన పూజారి కుటుంబంతోపాటు పులపత్తూరు గ్రామ శివాలయానికి వెళ్లిన వారిలో 15 ఏళ్ల చిన్నోడూ ఉన్నాడు. దిగువ మందపల్లెలో 10వ తరగతి చదువుతున్న కొర్రపాటి హేమంత్‌కుమార్, తండ్రి మల్లికార్జునతోపాటు 11 మంది నవంబరు 19న కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయానికి వెళ్లారు. అయితే పూజలు నిర్వహిస్తుండగా వరద ఉప్పొంగి వస్తున్న తీరును చూసి కుటుంబ సభ్యులంతా కల్యాణ మండపం పైకి ఎక్కారు. తాను మాత్రం శివాలయం పైకి చేరుకున్నాడు. ఒక్కసారిగా ఎర్రటి నీటితో కూడిన అల ఉధృతంగా రావడంతో శివాలయం స్తంభాలు కూలిపోయాయి. అంతే అందరూ కొట్టుకుపోయారు. ఆ క్షణం అనుభవం ఆ చిన్నోడి మాటల్లోనే.. ‘మా నాన్న గట్టువైపు ముందుగానే బయటికి వెళ్లడంతో సేఫ్ అయ్యారు. నేను నీళ్లలో పడిపోయాను. చెయ్యేరు మధ్యలో 20 అడుగుల అల ఒక్కసారిగా పైకి లేపి లోపల ముంచేసింది. తర్వాత భయంభయంగా రెండు కిలోమీటర్లు నదిలోనే వెళ్లాను. పులపత్తూరు నుంచి మందపల్లెకు వెళ్లేటప్పుడు నది వరదలో నుంచి మిద్దెపైనున్న మా తాతయ్యను చూసి అరుస్తున్నా.. కానీ అందరూ ఉన్నా ఎవరికీ వినబడటం లేదు. అక్కడి నుంచి ఒక కిలోమీటరు నదిలోనే కొట్టుకుపోయాను. పాపిరాజుపల్లె వద్ద ఒక మొద్దు దొరికింది. దాన్ని పట్టుకుని మరో కిలోమీటరు వెళ్లిన తర్వాత వరద మొద్దును తోసేసింది. దీంతో మొద్దుతోపాటు నేను ఒక చెరువులోకి వరద నీటిలో పోయాం. చెరువును చూడటానికి వచ్చిన గ్రామస్తులు నన్ను చూసి చిన్నగా తాళ్లువేసి బయటికి తీసుకు వచ్చారు’. ఉప్పెన విషయాన్ని ఊరూరా చెప్పిన రామయ్య ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితోపాటు అన్నమయ్య కట్ట తెగుతుండడంతో రామయ్య ఊరూరికి ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. 18వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 19వ తేదీ ఉదయం 7.00 గంటల వరకు పల్లెలకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అన్నమయ్య డ్యాం కింది భాగంలో రామయ్య నివసిస్తున్నారు. అంతకుమునుపు లస్కర్‌గా పనిచేస్తూ ఇటీవలి జూన్‌లో ఉద్యోగ విరమణ చేశారు. కట్ట తెగే ప్రమాదముందని అర్ధరాత్రి చెప్పిన రామయ్య...తెల్లవారిన తర్వాత కట్ట తెగిందని, ఉధృతంగా వరద వస్తోందని,ఊరు విడిచి వెళ్లాలంటూ చాలామందికి ఫోన్ చేశాడు. తెలిసిన వారికి, బంధువులకు, పల్లె జనాలకు చెప్పాలని ప్రయతి్నంచాడు. చాలామందికి ఫోన్ చేసి ఆపద విషయం తెలియజేయడంతో రామయ్య మాట వారికి దేవుడి మాటగా మారింది. -
రామోజీ మార్కు ‘వైఫల్యం’
కావాల్సిన బాబు అధికారంలో ఉంటే మానవ తప్పిదాన్ని ప్రకృతి విపత్తుగా చిత్రీకరిస్తారు. వేరొకరు అధికారంలో ఉంటే ప్రకృతి విపత్తునూ మానవ తప్పిదంగా వక్రీకరిస్తారు. ఇదీ రామోజీ మార్కు జర్నలిజం. ‘ఈనాడు’ రాతల్లో నీతి. 2003 అక్టోబర్ 30. అప్పటికి రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టు నిండిపోయింది. గేట్లు ఎత్తితే నీరు దిగువకు వెళ్లేది. గేట్లు ఎత్తడానికి జనరేటర్ ఆన్ చేయబోతే... దాన్లో డీజిల్ లేదు. ఫలితం... సకాలంలో ఎత్తకపోవడంతో గేట్లు కొట్టుకుపోయాయి. అపార నష్టం వాటిల్లింది. జనరేటర్‌ను చెక్ చేసుకోకపోవటం మానవ తప్పిదం. నాటి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం. కానీ దాన్ని ‘ఈనాడు’ ప్రకృతి విపత్తుగానే రాసింది. 2021 నవంబరు 19. అప్పటికి మూడు రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంతో పాటు చెయ్యేరు, బహుదా, పింఛా, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఈ స్థాయి కుంభవృష్టిని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేదు. ఏ నది నుంచి ఎంత ప్రవాహం వస్తుందో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కూడా అంచనా వేయలేదు. సామర్థ్యానికి మించి వరద ముంచెత్తడంతో పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్ తెగింది. ఆ వరదకు బహుదా, చెయ్యేరు, మాండవ్య ప్రవాహాలు తోడయ్యాయి. ఏకంగా 3.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అన్నమయ్య ప్రాజెక్టులోకి దూసుకొచ్చింది. సామర్థ్యానికన్నా ఒకటిన్నర రెట్లు అధిక వరద కావడంతో... స్పిల్ వే నుంచి వరదను దిగువకు విడుదల చేసే అవకాశంలేదు. ఫలితం... కట్టపై నుంచి వరద పారింది. మట్టికట్ట తెగింది. ప్రకృతి విపత్తు వల్లే ఇది జరిగినట్లు ప్రాజెక్టును చూసిన కేంద్ర బృందం నివేదించింది. సాగునీటి నిపుణులు, జలవనరుల శాఖ అధికారులూ అదే చెబుతున్నారు. ‘ఈనాడు’ మాత్రం అనూహ్యంగా వరద వచ్చిదంటూనే ఇదంతా సర్కార్ వైఫల్యమంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం మొదలెట్టింది. ఈ రోతరాతల్లో నిజానిజాలేంటి? ఏది నిజం?. – సాక్షి, అమరావతి ఏది నిజం? చరిత్రలోనే గరిష్ఠ వరద.. తెగిన పింఛా మట్టికట్ట..: వైఎస్సార్ కడప జిల్లా టి.సుండుపల్లె మండలం ముదుంపాడు వద్ద 0.32 టీఎంసీల సామర్థ్యంతో పింఛా నదిపై పింఛా ప్రాజెక్టును నిర్మించారు. దాన్లోకి గరిష్ఠంగా 58 వేల క్యూసెక్కులకు మించి వరద వచ్చే అవకాశం లేదనే అంచనాతో స్పిల్ వే నిర్మించారు. కానీ గతనెల్లో ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. స్పిల్ వే సామర్థ్యం కంటే 72 వేల క్యూసెక్కుల వరద అదనం. దాంతో 18న అర్ధరాత్రి రింగ్ బండ్ (మట్టికట్ట) తెగింది. ఆ వరద మొత్తం అన్నమయ్య ప్రాజెక్టు వైపు ఉరికింది. అన్నమయ్యకు... అంచనాలకు అందని వరద... వైఎస్సార్ జిల్లాలో రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించి.. 2001కి పూర్తి చేశారు. దీన్లోకి 100 ఏళ్లకు ఓసారి గరిష్ఠంగా 2.40 లక్షల క్యూసెక్కులు.. 200 ఏళ్లకోసారి గరిష్ఠంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనేది అధికారుల అంచనా. 2.85 లక్షల క్యూసెక్కుల వరదొచ్చినా దిగువకు విడుదల చేసేలా 94 మీటర్ల పొడవుతో స్పిల్ వేను నిర్మించారు. దీనికి 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో 5 గేట్లు అమర్చారు. 2012లో జల వనరుల శాఖ 3–డీ అధ్యయనంలో స్పిల్‌వే నుంచి గరిష్ఠంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయొచ్చునని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ.. 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. కానీ.. నాటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. గత నెల 16, 17, 18–19 తేదీల్లో నల్లమల, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ... వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. 18న రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తేసి.. 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19 అర్థరాత్రి 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కులు రావటంతో మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దాంతో.. 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. ఇదీ వాస్తవం. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అన్నమయ్య ప్రాజెక్టు దిగువన చెయ్యేరు పరివాహక ప్రాంతంలోని గ్రామాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. భారీ ప్రాణనష్టం నివారించారు. కేంద్ర బృందమూ దీన్నే నిర్ధారిస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కానీ.. ఈ వాస్తవం రామోజీ మార్కు జర్నలిజానికి కన్పించటం లేదు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలే అక్కడ పతాక శీర్షికలవుతున్నాయి. తమ వాడు అధికారంలో లేడన్న అక్కసు.. తామేం చెప్పినా నమ్ముతారనే అతివిశ్వాసమే ‘ఈనాడు’ అబద్ధాలకు మూలం. కానీ తెలుగు నేలపై ఇపుడా పరిస్థితి లేదన్నది నూరుశాతం నిజం!!. -
విపత్తువల్లే మట్టికట్ట తెగింది
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తువల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిందేగానీ మానవ తప్పిదంవల్ల కానేకాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టంచేశారు. గోదావరి పుష్కరాల్లో నాటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో ఒకేసారి ప్రజలను వదిలేయడంవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారని.. మానవ తప్పిదమంటే ఇదని చెప్పారు. రాయలసీమలో సహజంగా వరదలు రావని.. 140 ఏళ్ల తర్వాత కుంభవృష్టితో ఊహించని రీతిలో వరదలు ముంచెత్తడంవల్లే అన్నమయ్య, ఇతర ప్రాజెక్టులు తెగిపోయాయని కూడా కేంద్ర బృందం నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబైనా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అయినా వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మానవ తప్పిదంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యం అసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని మండిపడ్డారు. అసహనంలో కూరుకుపోయిన బాబు వరద బాధితులను యుద్ధప్రాతిపదికన పునరావాస శిబిరాలకు తరలించి.. అన్ని విధాలా ఆదుకునేలా అధికారులతో సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారని అంబటి చెప్పారు. సొంతూళ్లకు వరద బాధితులను చేర్చాక క్షేత్రస్థాయిలోకి సీఎం వైఎస్ జగన్ వెళ్లి.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్‌పై వరద బాధితులు తమ ప్రేమను తెలియజేస్తే.. దాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బాధితులు సీఎం జగన్‌పై తిరగబడితే రాక్షసానందం పొందాలని చూసిన చంద్రబాబు.. పరిస్థితులు తద్భిన్నంగా ఉండటంతో తీవ్ర అసహనంలో కూరుకుపోయారన్నారు. అందువల్లే ప్రజలకు బుద్ధిలేదంటూ చంద్రబాబు తిడుతున్నారని చెప్పారు. కష్టనష్టాల్లో తోడునీడగా ఉండి.. ఉదారంగా ఆదుకుని, అండగా నిలిచే సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు ప్రేమగా పలకరిస్తారని.. కుట్రలు, కుతంత్రాలతో కీడు చేయాలని చూసే చంద్రబాబును చూస్తే ప్రజలకు మొట్టబుద్ధి అవుతుందన్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గుంటూరు, విజయవాడల్లో ప్రజలను ఇదే రీతిలో చంద్రబాబు తిడితే.. జనం తగిన రీతిలో బుద్ధిచెప్పారని అంబటి గుర్తుచేశారు. చంద్రబాబును ‘ఎర్రగడ్డ’లో చేర్చాలి ఒక వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టడానికే చంద్రబాబు వెళ్లారని అంబటి రాంబాబు చెప్పారు. అనూహ్యంగా ముంచెత్తిన వరదవల్ల సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలను తెలుసుకోకుండా, తన భార్యను ఎవరూ దూషించకున్నా దూషించినట్లుగా వక్రీకరించి చెప్పుకున్నారన్నారు. వీటిని పరిశీలిస్తే చంద్రబాబు మానసిక స్థితి సరిగాలేదన్నది స్పష్టమవుతోందని.. తక్షణమే ఆయన్ని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. ఇక వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన కేంద్ర బృందం.. దేశంలో ఎక్కడాలేని రీతిలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారని అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిందని గుర్తుచేశారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదికను ఒక్కసారి పరిశీలించి ఆ తర్వాత మాట్లాడాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సూచించారు. ఓటీఎస్ అప్పుడెందుకు గుర్తుకురాలేదు? ఇళ్లకు సంబంధించి పేదలకు ప్రయోజనం చేకూర్చే ఓటిఎస్ పథకం తీసుకొస్తే.. డబ్బులు కట్టొద్దని, తాను అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓటీఎస్ పథకం ఎందుకు గుర్తుకురాలేదని అంబటి ప్రశ్నించారు. పేదలు బాగుపడటం చంద్రబాబుకు ఇష్టంలేదని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. -
విపత్తులోనూ శవ రాజకీయాలా?
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తు వల్ల జరగరాని నష్టం జరిగితే.. దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను రక్షించి, భరోసా కల్పించిన ప్రభుత్వాన్ని, అధికారులను కించపరచడం తగదని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్నా వరదలపై చంద్రబాబు, టీడీపీ నేతల అనైతిక రాజకీయాలను తుర్పారబట్టారు. మంత్రి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. సోమశిలకు ఇంత వరద వస్తుందని వారే అంచనా వేయలేదు పెన్నా నది చరిత్రలో గత నెలలో భారీ వరద వచ్చింది. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) లెక్కల ప్రకారం 1882లో సోమశిలకు 5 లక్షల క్యూసెక్కులు వచ్చింది. 140 ఏళ్ల తర్వాత గత నెల 19న 6 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిందంటే పెన్నా బేసిన్లో ఏ స్థాయిలో కుంభవృష్టి కురిసిందో అర్థం చేసుకోవచ్చు. పెన్నాకు ఈ స్థాయిలో వరద వస్తుందని సీడబ్ల్యూసీగానీ, బాబు ఆయనే ఏర్పాటు చేశానని చెప్పుకుంటున్న వ్యవస్థగానీ అంచనా వేయలేదు. అన్నమయ్య ప్రాజెక్టుకు ఒక్కసారిగా 3.20 లక్షల క్యూసెక్కులు వచ్చింది అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్ వే ప్రవాహం విడుదల గరిష్ట సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు. గత నెల 17న వరద రాలేదు. 18న ఉదయం 10 గంటలకు 12 వేల క్యూసెక్కులు వస్తే.. అంతకంటే ఎక్కువ స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేసి, ప్రాజెక్టును ఖాళీ చేశాం. రాత్రి 8 గంటలకు 42 వేల క్యూసెక్కులకు ప్రవాహం పెరిగితే అంతే స్థాయిలో విడుదల చేశాం. ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశాం. పింఛా ప్రాజెక్టు స్పిల్ వే వరద విడుదల సామర్థ్యం 50 వేల క్యూసెక్కులు. అయితే, అక్కడకు 1.30 లక్షల క్యూసెక్కులు రావడంతో రింగ్ బండ్ తెగిపోయింది. గత నెల 19న రాత్రి పింఛా, బాహుదా, చెయ్యేరు బేసిన్లలో 20 సెంటీమీటర్ల కుండపోత వర్షం పడటంతో తెల్లవారుజామున 3 – 4 గంటల ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టుకు ఒక్కసారిగా 3.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టుకు ఉన్న ఐదు గేట్లలో ఒక్కో గేటు నుంచి 40 వేల క్యూసెక్కులు విడుదల చేయవచ్చు. సామర్థ్యం కంటే ఒకటిన్నర రెట్లు వరద వస్తే దిగువకు వరద ఎలా వెళ్తుంది? అందువల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీని వల్లే కొంత మంది చనిపోయారని కేంద్ర బృందం చెబుతోంది. ఈ పాపం చంద్రబాబుదే ప్రకృతి విపత్తు వల్ల జరగరానిది జరిగితే దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడం చంద్రబాబు అవగాహన రాహిత్యానికి నిదర్శనం. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని, 40 ఏళ్లు రాజకీయ అనుభవముందని చెప్పుకునే వ్యక్తి ఇలా వ్యవహరించడం హేయం. డ్యామ్ సేఫ్టీ కమిటీ 2017లో అన్నమయ్య ప్రాజెక్టును తనిఖీ చేసి.. 1.30 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో అదనంగా స్పిల్ వే నిర్మించాలని నివేదిక ఇచ్చింది. అదనపు స్పిల్ వే నిర్మించకుండా రెండున్నరేళ్లపాటు చంద్రబాబు గాడిదలు కాశారా? అదే నిర్మించి ఉంటే ఈ రోజున అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయే అవకాశమే ఉండేది కాదు. ఈ పాపానికి మూలకారణం చంద్రబాబే. రాజకీయ అవసరాల కోసమే షెకావత్ అవాస్తవాలు ప్రకృతి విపత్తు వల్లే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందని కేంద్ర బృందం నివేదిక ఇచ్చింది. కానీ.. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదు. చంద్రబాబు ఏజెంట్లు సీఎం రమేష్, సుజనా చౌదరి మాటలు విని, రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం తగదు. గతేడాది హిమానీ నదాలు కరగడం వల్ల ఒక్క సారిగా వచ్చిన వరదకు ఉత్తరాఖండ్‌లో 170 మంది మరణించారు. ఆ పాపం కేంద్రానిదా లేక ఉత్తరాఖండ్ సర్కార్‌ది అని అనుకోవాలా? సహాయక కార్యక్రమాలకే సీఎం జగన్ పెద్దపీట ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్తే వరద బాధితులకు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు సూచించారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం నుంచి సహాయక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. బాధితులను వేగంగా పునరావాస శిబిరాలకు తరలించి ఆదుకున్నారు. వరద తగ్గాక ప్రజలను సొంతూళ్లకు చేర్చాం. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాం. సహాయక చర్యలు ముగిశాక బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. సహాయం అందిందో లేదో తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తరహాలో ప్రచార పిచ్చితో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగేలా సీఎం జగన్ వ్యవహరించలేదు. గోదావరి పుష్కరాల్లో ప్రచార పిచ్చితో, బోయపాటి సినిమా కోసం 38 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకూ, సీఎం వైఎస్ జగన్‌కూ ఇదీ తేడా! -
అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగింది.. ఎలా రక్షించారు
సాక్షి, అమరావతి: అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగింది.. జలప్రళయం నుంచి ఎలా రక్షించారు వంటి తదితర వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలిపారు కడప జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల్లో వరద, అనంతరం తీసుకున్న చర్యలను వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సమగ్రంగా ముఖ్యమంత్రికి వివరించారు కలెక్టర్. ఆయన అందించిన వివరాలు ప్రకారం.... ►కడపజిల్లాలో భారీవర్షాలు, వరదలకు దారితీసిన పరిస్థితులు చాలా అనూహ్యమైనవి. ►చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో ఏకకాలంలో అతిభారీ వర్షాలు కురిశాయి. ►జిల్లాలో ఒక ప్రాంతంలోనే కాదు, జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో, అతి తక్కువ సమయంలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ►నవంబర్ 18వ తేదీ, గురువారం ఉదయం 8:30 గంటలకు పింఛ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో కేవలం 3,845 క్యూసెక్కులు మాత్రమే. ►కాని అదే రోజు సాయంత్రం 6 నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఇన్‌ఫ్లో ఒకేసారి 90,464 క్యూసెక్కులకు చేరింది. ►గురువారం ఉదయం 8 గంటలనుంచి శుక్రవారం ఉదయం వరకూ కడప జిల్లాలోని మొత్తం 50 మండలాల్లో కూడా సగటున 10.7 పెం.మీ వర్షపాతం కురిసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ►దీనికితోడు తిరుపతి సహా చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో... శేషాచల పర్వతశ్రేణికి వెనకవైపున కురిసిన భారీ వర్షాలు, వాటి వరదనీరు అంతా చెయ్యేరు పరీవాహక ప్రాంతానికి చేరుకుంది. ►మరోవైపు పీలేరులో, రాయచోటిలో కూడా అధిక వర్షం కురిసింది. ఇదంతా ఏకకాలంలో జరిగింది. ►జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు అయిన అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, చిత్రావతి, మైలవరం, గండికోటలకు భారీగా నీరు వచ్చి చేరింది. గంటల వ్యవధిలోనే ఈపరిస్థితి తలెత్తింది ►చెయ్యేరు నదిపై మొదట పింఛా ప్రాజెక్టు, దానికింద అన్నమయ్య ప్రాజెక్టు ఉంది. ►పింఛా డ్యాం విడుదల సామర్థ్యం కేవలం 48వేల క్యూసెక్కులు. ►నవంబర్ 18వ తేదీ, గురువారం సాయంత్రం పింఛాకు 50వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇదే స్థాయిలో ఇన్‌ఫ్లో కూడా ఉంది. ►ఇలాంటిది.. 18వ తేదీ అర్థకాత్రి పింఛా ప్రాజెక్టులో 1.17 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. విడుదల సామర్థ్యం కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ వరద నీరు వచ్చింది. ►రింగ్‌బండ్‌ను ప్రొటెక్ట్‌చేసినా.. ఈ నీటిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. ►అదే రోజు రాత్రి 1 గంట సమయానికి అన్నమయ్యలో ఇన్‌ఫ్లో 2.3 లక్షలకు చేరుకుంది. ►నవంబర్ 19, శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో ఉదయం 5:30 గంటలకు 3.2 లక్షలు దాటింది. ►పింఛా తెగిపోయి మొత్తం నీరంతా ఒకేసారి అన్నమయ్యకు రాడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ►అన్నమయ్య ప్రాజెక్టు విడుదల సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు అయితే, 19వ తేదీ ఉదయం 3.2 లక్షలు దాటింది. ►అన్నమయ్య ప్రాజెక్టు కట్టిన 50 సంవత్సరాల తర్వాత ఇంత నీరు ఎప్పుడూ రాలేదు. ►కొన్ని గంటల వ్యవధిలోనే ఈపరిస్థితి తలెత్తింది. 19 వ తేదీ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో డ్యాం తెగిపోయింది ►అధికారులు ముందస్తుగానే, 18వ తేదీ సాయంత్రం 6 గంటలకే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యింది. వాలంటీర్, వీఆర్వోలనుంచి మొత్తం అందర్నీ అలర్ట్ చేశారు. ►అన్నమయ్య కింద కుడి వైపు ఉన్న పుల్లపొత్తూరు, దిగుమందూరు, కేశాంబవరం, గండ్లూరు, హేమాద్రిపురం తదితర గ్రామాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించారు. వీఆర్వోల ద్వారా, సర్పంచుల ద్వారా అక్కడున్నవారందర్నీ అప్రమత్తం చేశారు. ►సుమారు 1250 కుటుంబాల్లోని ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని.. అప్రమత్తంచేశారు. ►లోతట్టులో ఉన్న సుమారు 400 కుటుంబాలను ఎత్తైనప్రాంతాలకు తరలించారు. ►19 వ తేదీ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో డ్యాం తెగిపోయింది. ►18వ తేదీ సాయంత్రం నుంచి యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి, వందలమంది ప్రాణాలను కాపాడింది. ఆ రెండు ఘటనల్లో సుమారు 20 మంది వరకూ మృతి, గల్లంతు ►నందులూరు వద్ద బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న 4 బస్సులు ముంపునకు గురయ్యాయి. వీటిలో ఒక బస్సు 20 మీటర్లు కింద పడింది. 10 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన బస్సుల్లో ఉన్న 45 మందిని ఎస్డీఆర్ఎఫ్ టీం కాపాడింది. ►అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామంలో నది తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న శివాలయంలో కొంతమంది పూజలు చేస్తూ పూజారి కుటుంబం ప్రమాదానికి గురయ్యింది. ►ఈ రెండు ఘటనల్లోనే సుమారు 20 మంది వరకూ మరణించడం, గల్లంతు కావడం జరిగింది. ►అధికార యంత్రాంగం అప్రమత్తత వల్లే వందలమంది ప్రాణాలు కాపాడగలిగారు. ►అధికార యంత్రాంగం ముందస్తుగానే ప్రయత్నాలు చేయడంతో శుక్రవారం సాయంత్రానికల్లా హెలికాప్టర్లు చేరుకున్నాయి. ►శనివారం ఉదయం నుంచి ముంపు గ్రామాలకు, తాగునీరు, ఆహారం అందించాం. ►జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఏకకాలంలో బుగ్గవంక, గండికోట, మైలవరం అన్నీ పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చాయి. ►ఒక్క బుగ్గ వంకనుంచే 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. ►వెలిగల్లు నుంచి... పాపాఘ్నిలోకి 90 వేల క్యూసెక్కలు నీరు వచ్చింది. ►అనంతపురం నుంచి చిత్రావతిద్వారా 80వేల క్యూసెక్కులకు వచ్చింది. ►మైలవరం నుంచి 1.5 లక్షక్యూసెక్కుల నీరు వచ్చింది. ►మొత్తం ఈ నీరంతా పెన్నాలోకి వచ్చింది. సహాయక చర్యలు ఇలా సాగాయి ►జిల్లాలో ఇతర ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను చేపడుతూనే అన్నమయ్య ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను తీవ్రం చేశారు. ►అన్నమయ్య డ్యాం తెగిన సుమారు 24 గంటల తర్వాత నీటి మట్టం తగ్గలేదు. ►ఈలోగా నేవీ, ఎయిర్‌ఫోర్స్ నుంచి హెలికాప్టర్లు తెప్పించుకున్నారు. ►హెలికాప్టర్లు..., బోట్ల ద్వారా తాగునీరు, ఆహారాన్ని అందించారు. ►ఆవెంటనే వాలంటీర్లు నదీతీర ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ పరిశీలించారు. ►బాధిత కుటుంబాల్లో ఇంటికి చేరగానే.. ప్రతి ఒక్కరి వివరాలూ నమోదు చేసుకున్నారు. ►ఆవివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందించారు. ►అన్నమయ్య ప్రాజెక్టు కింద ప్రతిగ్రామానికీ ఒక డిప్యూటీ కలెక్టర్, ఇద్దరు తహశీల్దార్లు, ఇంజినీర్లు, ఇతర అధికారుల బృందాన్ని నియమించారు. ►జేసీబీలు, ఇతర యంత్రాలతో పారిశుద్ధ్యంతోపాటు, ఇతర పనులను చేపట్టి ఈ గ్రామాలలో సాధారణ స్థితిని తీసుకురాగలిగారు. ►మృతదేహాలు దొరికిన వారికి వెంటనే రూ.5 లక్షల పరిహారం ఇచ్చాం. రేషన్ సరుకులను, ముంపునకు గురైన కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం అందించాం. -
AP: ముంచెత్తిన వరద..వందలాది గ్రామాల్లోకి నీరు
సాక్షి ప్రతినిధి, కడప/నెల్లూరు(అర్బన్)/సాక్షి నెట్వర్క్: రెండు రోజులుగా బెంబేలెత్తించిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టగా.. వరద బీభత్సం నుంచి మాత్రం ఇంకా ఉపశమనం లభించలేదు. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుంభ వృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ జిల్లాను వరద ముంచెత్తింది. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కడప ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా, మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 58 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పింఛాకు లక్షా 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం, 2 లక్షల 20 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న అన్నమయ్య ప్రాజెక్టుకు 3 లక్షల 20 వేల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో రెండు ప్రాజెక్టులు శుక్రవారం తెల్లవారుజామున తెగిపోయిన విషయం తెలిసిందే. పర్యావసానంగా చెయ్యేరు గట్లు దాటి ప్రవహించింది. దీంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల పరిధిలో 17 గ్రామాల్లోకి నీరు చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు మునిగిపోగా, కొందరు వరదల్లో కొట్టుకుపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, రెస్క్యూ టీములు హెలికాఫ్టర్ల ద్వారా శుక్రవారం నుంచే గాలింపు చర్యలు చేపట్టాయి. శనివారం సాయంత్రం నాటికి 15 మృతదేహాలు బయటపడ్డాయి. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. వరి, మినుము, సజ్జ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు నీటమునిగాయి. పెన్నా నది వరద ఉధృతికి నీట మునిగిన నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ నిండుకుండలా 1,451 చెరువులు ► భారీ వర్షాలతో వైఎస్సార్ జిల్లాలో 1,451 చెరువులు పూర్తిగా నిండగా, 250 చెరువులు 50 శాతం నిండాయి. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు, కాలువలకు భారీ నష్టం వాటిల్లింది. ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్లు, ఆర్టీసీకి నష్టం వాటిల్లింది. ► కడప–తిరుపతి, కడప–అనంతపురం, కడప–నెల్లూరు, రాయచోటి–వేంపల్లెతో పాటు పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ► ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే వివిధ రకాల పశువులు 3,370 మృతి చెందాయి. వేలాది ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. తెగిపోయిన అన్నమయ్య డ్యాం కట్ట ప్రాంతాన్ని శనివారం ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్‌కుమార్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పరిశీలించారు. తిరుపతి ఎంఆర్‌పల్లిలో వరద ఉధృతికి నీట మునిగిన కాలనీ కుంగిపోయిన పాపాఘ్ని వంతెన వల్లూరు (కమలాపురం): కడప– అనంతపురం రోడ్డు మార్గంలో కమలాపురం–వల్లూరు మధ్య పాపాఘ్ని వంతెన కుంగిపోయింది. రాకపోకలను నిలిపివేశారు. 50 మీటర్ల పొడవు మేరకు 2 మీటర్ల లోతుకు వంతెన కుంగింది. ప్రత్యేక నిపుణులతో పరిశీలించిన తర్వాత కొత్త వంతెనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలా.. లేక మరమ్మతులు చేయాలో నిర్ణయం తీసుకుంటామని నేషనల్ హైవే ఈఈ ఓబుల్ రెబ్డి తెలిపారు. వంతెన తాత్కాలిక మరమ్మతులకు రూ.3 కోట్ల వరకు అవసరం అవుతుందన్నారు. పెన్నా తీరం.. భయం భయం ► పెన్నా నదికి వస్తున్న వరద కారణంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జల దిగ్బంధంలోనే ఉంది. సోమశిల ప్రాజెక్ట్ నుంచి శనివారం 3.30 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. దీంతో దామరమడుగు, వీర్లగుడిపాడు, కోలగట్ల దళితకాలనీ, పడుగుపాడు, గుమ్మళ్లదిబ్బ, పల్లిపాళెం, కుడితిపాళెం, పెనుబల్లి తదితర గ్రామాలు నీట మునిగాయి. ► నెల్లూరు నగరంలోని తూకుమానుమిట్ట, జయలలితనగర్, అలీనగర్, అహ్మద్‌నగర్, ఉప్పరపాళెం, భగత్‌సింగ్ కాలనీని, జనార్దన్‌రెడ్డికాలనీ, వెంకటేశ్వరపురంలోని కొంతభాగం, స్టౌబీడీ కాలని తదితర ప్రాంతాల్లో ఉన్న నివాసాలను వరద చుట్టు ముట్టింది. ► దామరమడుగు వద్ద హైవే పైకి వరద చేరుకోవడంతో ముంబయి జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ చేశారు. మలిదేవి పొంగడంతో మన్మధరావుపేటకు పక్కనే ఉన్న విడవలూరుకు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ► బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన షేక్ కరిముల్లా, అతని కొడుకు వరద నీటిలో చిక్కుకుని విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని వారిని రక్షించాయి. తిరిగి బయటకు వచ్చే క్రమంలో శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ (విజయనగరం 5వ బెటాలియన్) లైఫ్ జాకెట్ తెగిపోవడంతో వరద నీటిలో చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. శ్రీనివాసులది శ్రీకాకుళం జిల్లా కండిస గ్రామం. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ► బుచ్చిరెడ్డిపాళెం మండలం శ్రీరంగరాజపురానికి చెందిన డీ బుజ్జయ్య (63) అనే రైతు పొలంలో ఉన్న మోటార్‌ను వరద నీటి నుంచి రక్షించుకుందామని వెళ్లి వరదలో చిక్కుకుని మృతి చెందాడు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ► శనివారం మధ్యాహ్నం నుంచి చెన్నై నుంచి విశాఖ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లను నెల్లూరు రైల్వేస్టేషన్లో నిలిపేశారు. వరద ఉధృతి తగ్గేదాకా పూర్తిగా రైళ్ల రాకపోకలను నిలిపేస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ► చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో మూతకనవారిగుంట చెరువు, ఎర్రగుంట చెరువులకు గండ్లుపడ్డాయి. ముష్ఠూరు గ్రామం వద్ద వరద నీటి ప్రవాహానికి కాజ్వే కొట్టుకుపోయింది. దెబ్బతిన్న వంతెనలు, చెరువు కట్టలు, రోడ్లను అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టారు. తిరుచానూరు స్వర్ణముఖి నదిపై దెబ్బతిన్న బ్రిడ్జిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు. ► అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి, జయమంగళి, కుముద్వతి నదుల ప్రవాహం కొనసాగుతోంది. చెరువులన్నీ మరువలు పారుతున్నాయి. ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 16 మందిని బోటు ద్వారా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిశాయి. పంట నష్టం అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ధ్వంసమైన సోమేశ్వరాలయం సోమశిల: నెల్లూరు జిల్లా సోమశిలలోని శతాబ్దాల చరిత్ర కలిగిన కామాక్షి సమేత సోమేశ్వరాలయం పెన్నానది ప్రళయానికి ధ్వంసమైంది. ఆలయ గాలిగోపురం కూలిపోవడంతో పాటు అన్నపూర్ణాదేవి గర్భగుడి, నవగ్రçహాల ఆలయం, కల్యాణ మండపం నేలమట్టమైంది. ఆలయ ప్రహరీ కూలిపోయింది. కాగా, వరద ఉధృతికి ధ్వంసమైన శివాలయ ప్రాంతంలో కొత్తగా మరో శివలింగం ప్రత్యక్షమైంది. భారీ వర్షాల నుంచి ఉపశమనం సాక్షి, విశాఖపట్నం: తీవ్రమైన వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రానికి శనివారం కొంత ఉపశమనం లభించింది. మరో ఐదు రోజులపాటు ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలే తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బలహీనపడిన వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా మారి కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. 26న మరో అల్పపీడనానికి చాన్స్ ఈ నెల 26న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపుగా వెళ్లనుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో 27వ తేదీ తర్వాత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గడచిన 24 గంటల్లో మచిలీపట్నంలో 99 మి.మీ., కనెకల్లులో 67, బొమ్మనహల్‌లో 65.5, పెదగంట్యాడలో 53.5, బుక్కరాయ సముద్రంలో 47, పలమనేరులో 44, బొల్లపల్లెలో 42.5, బెస్తవారిపేటలో 42, గాజువాకలో 38 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాజంపేట జీవనచిత్రం మారనుందా
అన్నమయ్య ప్రాజెక్టు నిరంతర జలకళ సంతరించుకోనుందా.. రాజంపేట జీవనచిత్రం మారనుందా .. కొత్త ప్రతిపాదనలతో ఇది సాధ్యమేనంటున్నారు ఇంజినీరింగ్ అధికారులు..విద్యార్థులు.. తమ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే 70,000 ఎకరాలకు సాగునీరందుతుందని కుండబద్ధలుకొట్టి చెబుతున్నారు. జీఎన్ఎస్ఎస్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఇది సాధ్యమేనంటున్నారు. తమ ఆలోచనలకు పదును పెట్టి ప్రాజెక్టు దిగువ భాగాన పాక్షిక సబ్‌సర్ఫేస్ డ్యామ్ నిర్మించాలనే ప్రతిపాదనలను ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి నివేదించారు. డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. సాక్షి, కడప : అన్నమయ్య ప్రాజెక్టులో నిత్యం నీరుండే పరిస్థితి కనిపించడంలేదు. ఒక ఏడాది నీరు కనిపిస్తే మరో రెండేళ్లు జలకళకు దూరమవుతోంది. దీని మీద ఆశలు పెట్టుకున్న రైతాంగానికి అండగా నిలబడలేకపోతోంది. ఏటా ఒకేతరహా నీరు నిల్వ ఉండేలా ఈ ప్రాజెక్టు ఉండాలంటే ఏం చేయాలి.. దీని పరిధిలో మరిన్ని ఎకరాలకు సాగు నీరందించాలంటే ఎలా..ఈ ప్రశ్నలకు సమాధానం తమ వద్ద ఉందని చెబుతున్నారు గతంలో ఇక్కడ నీటిపారుదల ఈఈగా పనిచేసిన రమేష్.. ఈ ప్రాజెక్టుపై ఆయ న తన పరిధిలోని ఇంజినీర్లతో కలిసి మెదడుకు పదును పెట్టారు. కేఎస్ఆర్ఎం, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు ప్రాజెక్టు వర్కులో భాగంగా తమ వైవిధ్యమైన ఆలోచనలను ఇంజినీర్లతో పంచుకున్నారు. ఫలితంగా కొత్త ప్రతిపాదనలను ఆవిష్కరించగలిగారు. ప్రాజెక్టు ప్రస్తుతం ఇలా : అన్నమయ్య ప్రాజెక్టు నీటి కెపాసిటీ 2.24 టీఎంసీలు.1996 వరకు ఈ ప్రాజెక్టు చెయ్యేరు ప్రాజెక్టుగా(సీపీసీ) డివిజన్ కింద ఉండేది. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టుగా మారింది.అన్నమయ్య ప్రాజెక్టుకు ఫించా,బాహుదానది,మాండవి నుంచి నీరు చేరేది. 2001లో ప్రాజెక్టు పూర్తయిన కొన్ని నెలలకే 5 గేట్లలో మొదటి గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ పరిశీలించి వెల్డింగ్ సరిగాలేదని పేర్కొంది. మళ్లీ 5 గేట్లను నిర్మించారు. 2012 వరకూ ఈ నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. 2015 నవంబర్‌లో తొలిసారిగా ప్రాజెక్టుకు 2.01 టీఎంసీల నీరు చేరింది. 2016లో చుక్క నీరు కూడా రాలేదు. 2017లో 2.24 టీఎంసీల మేర నీరు చేరింది. గత ఏడాది నీరు లేక ప్రాజెక్టు జలకళ తప్పింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.55 టీఎంసీల నీరుంది.. కొత్త ప్రతిపాదనలు ఇలా: అన్నమయ్య ప్రాజెక్టులో నిరంతరం నీరుండేలా అధికారులు కొత్త ప్రతిపాదనలు తయారుచేశారు. ఈ ప్రతిపాదనల రూపకల్పనలో కేఎస్ఆర్ఎం, అన్నమాచార్య ఇంజనీరింగ్ విద్యార్థుల మేథస్సును కూడా వినియోగించుకున్నారు. ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా విద్యార్థులు గత ఈఈ రమేష్ బృందంలో చేరి ఆలోచనలు పంచుకున్నారు. ప్రాజెక్టుకు జీఎన్ఎస్ఎస్ రెండోదశ ప్రధాన కాలువ కిలోమీటరు దూరంలో ఉంది. అక్కడి నుంచి ఎత్తిపోతల కింద ప్రాజెక్టుకు నీటిని తరలించే కోణంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 20 మీటర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించవచ్చని అంచనాకు వచ్చారు. రోజుకు 800 క్యూసెక్కుల మేర 36 రోజులలో 2.4 టీఎంసీల నీటిని పంపింగ్ చేసి ప్రాజెక్టు సామర్ధ్యం మేర తరలించవచ్చని భావించారు. ఇప్పుడున్న 10,236 ఎకరాల ఆయకట్టుతోపాటు దిగువనున్న 12,500 ఎకరాలకు కూడా కొత్త ప్రతిపాదనల ద్వారా నీటి అందించవచ్చంటున్నారు. . ఇందుకు రూ.101 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించారు. 2.4 టీఎంసీలు నింపగలిగితే దిగువనున్న సుమారు వంద గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. దిగువకు నీటిని వదిలినపుడు ఆ ప్రాంతంలోని 36 ఊట కుంటలు ఎప్పుడూ నీటితో ఉండేలా 36 పాక్షిక సబ్ సర్ఫేజ్ డ్యాములను నిర్మించాలనేది కూడా కొత్త ప్రతిపాదనలో భాగం. సర్ఫేజ్ డ్యాముకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వ్యయమవుంది. అంటే సుమారు రూ.94 కోట్లు అవసరమవుతాయి. 100 నుంచి 200 మీటర్ల లోతులో మూడు మీటర్ల వెడల్పుతో సర్ఫేజ్ డ్యాములను నిర్మించాల్సి ఉంటుంది. సైన్స్ కాంగ్రెస్‌లో ప్రశంస యోగి వేమన యూనివర్శిటీలో గతంలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో ఈ ప్రతిపాదనను ప్రవేశ పెట్టారు. అక్కడ ప్రశంసలు అందుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల మేధస్సును ఉపయోగించుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయడంపై వ్రశంసల జల్లు కురిసింది. గతంలో ఈఈగా పనిచేసిన రమేష్ సాక్షితో మాట్లాడుతూ తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించి అభినందించారన్నారు. వీలైనంత త్వరలో డీపీఆర్ ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. తాజా ప్రతిపాదన వల్ల రాజంపేట జీవన పరిస్థితులు మారిపోయే అవకాశాలున్నాయి. 2015 నవంబరులో ప్రాజెక్టు నుండి ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పండ్ల తోటల ద్వారా రూ. 400 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. నిరంతరం నీరు ఉంటే కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. 70వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం కాలువల ఆధునీకరణకు రూ.32 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం. పాక్షిక సబ్ సర్ఫేజ్ డ్యాముల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపాం. జీఎన్ఎస్ఎస్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టులను నింపే ప్రతిపాదన ప్రభుత్వానికి అందజేశాం. – రవి కిరణ్, ఈఈ, అన్నమయ్య ప్రాజెక్టు -
అన్నమయ్య కీర్తనలతో.. ఏడో సీడీ
అదివో అల్లదివో... తందనానా ఆహి... బ్రహ్మకడిగిన పాదము... జనబాహుళ్యంలోకి విస్తృతంగా ప్రచారమైన సంకీర్తనలు... మరిన్ని కీర్తనలను స్వరపరిచి, ప్రచారంలోకి తీసుకొస్తోంది అన్నమయ్య ప్రాజెక్టు... ఇందులో భాగంగా సాలూరి వాసూరావు వంద కీర్తనలు స్వరపరుస్తున్నారు... ఇప్పటికి ఆరు సీడీలు విడుదలయ్యాయి. ఏడుకొండలవాడి ఏడో సీడీ మే 5న, అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సాలూరి వాసూరావు తన అనుభవాలను 'సాక్షి'తో పంచుకున్నారు... అన్నమయ్య మొత్తం 32 వేల సంకీర్తనలు రచించాడని, అందులో సుమారు 10 వేలు మాత్రమే లభ్యమయ్యాయని చరిత్ర చెబుతోంది. అందులో కొన్ని కీర్తనలను ఇప్పటికే నేదునూరి కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారు స్వరపరిచి విస్తృతంగా ప్రచారం చేశారు. మరిన్ని కీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్టు ఈ బృహత్కార్యాన్ని కొందరు సంగీత దర్శకులకు అప్పచెప్పింది. అన్నమయ్య సంకీర్తనలు ఇప్పటి వరకు 1600 స్వరపరిచారు. 1601 నుంచి 1700 వరకు స్వరపర్చమని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు నన్ను నిర్దేశించింది. 2014, గురుపూర్ణిమ నాడు ఈ యజ్ఞం ప్రారంభించాను. ఇలా చేశాను... ముందుగా పది సంకీర్తనలను స్వరపరచుకుని, పిల్లలకు నేర్పాను. ఇందులో వీణ, మృదంగం, వయొలిన్ వంటి సంప్రదాయ వాద్య పరికరాలన్నిటినీ సాధ్యమైనంత వరకు వాడాం. కీబోర్డును కీబోర్డుగా కాకుండా, వైబ్రో ఫోన్, బెల్స్ కోసం వాడుతున్నాను. నాకు పదకోశం లేకుండా ఈ కీర్తనలకు అర్థం, విరుపులు అన్నీ చిర్రావూరి మదన్మోహన్ వివరిస్తూ బాగా సహకరిస్తున్నారు. ఎన్. హనుమంతరావు సంగీత సహకారం అందిస్తున్నారు. తిరుపతిలో 'శ్రీవెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్' అని అతి నూతన ప్రో టూల్ ఎక్విప్మెంట్తో స్టూడియో నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణానికి నేను సహకరించాను. మా పాటలన్నీ ఆ స్టూడియోలోనే రికార్డింగ్ జరగాలి. అది అన్నమయ్య ప్రాజెక్టు వారి నియమం. ఎంపిక ఇలా... స్వరపరిచేటప్పుడు రాగాల ఎంపిక ప్రధానం. కీర్తన గంభీరంగా ఉంటే నాటరాగం, అఠాణా రాగాలు, కొంచెం మృదువుగా ఉంటే మోహన, కల్యాణి వంటి రాగాలలో స్వరపరుస్తున్నాను. పాడేవారు చిన్నపిల్లలు కావడంతో వారిని దృష్టిలో ఉంచుకుని సంకీర్తనలను స్వరపరుస్తున్నాను. ఒక్కో సంకీర్తన నేర్చుకోవడానికి పిల్లలకు సుమారు 15 రోజుల సమయం పడుతోంది. ఈ బాల గానామృతం ప్రాజెక్టు పూర్తయ్యాక, ప్రముఖ గాయకులతో పాడించి మరింత ప్రచారంలోకి తీసుకురావాలనేది నా ఆకాంక్ష. నాన్నగారి బాటలో... సాహిత్యానికి అనుగుణంగా నాన్నగారు స్వరపరిచిన బాటలోనే నేనూ స్వరపరుస్తున్నాను. నా మీద పెద్ద భారం ఉంది.రాజేశ్వరరావుగారి అబ్బాయి 'ఇలా చేశాడేంటి' అనకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాను. ఇప్పటివరకు 70 సంకీర్తనలు పూర్తయ్యాయి. ఆమోదముద్ర పడాలి... సీడీ పూర్తయ్యాక ఇద్దరు సంగీత నిష్ణాతులు వాటికి ఆమోదముద్ర వేయాలి. ప్రముఖ వయొలిన్ కళాకారిణి శ్రీమతి కన్యాకుమారి, లలిత సంగీత దర్శకులు చిత్తరంజన్ వీరిద్దరూ ఆమోదించిన తర్వాతే సీడీని విడుదల చేస్తారు. మొదటి సీడీ చేసినప్పుడు ఒక అరుదైన వాద్యపరికరం ఉపయోగించాను. కాని వారు 'అది వాడకపోతే బావుంటుంది. మన శాస్త్రీయ సంగీత వాద్యపరికరం వాడితే బాగుంటుంది' అని సలహా యిచ్చారు. అప్పుడు ఆ వాద్యం తొలగించి మళ్లీ రికార్డు చేశాను. భవిష్య ప్రణాళికలు... త్వరలో చెన్నైలో ఉండే పిల్లలతో కూడా పాడించబోతున్నాను. వాళ్లకు మన భాష రాకపోయినా దగ్గరుండి వాళ్లతో పలికించాలి. నేను అదే చేయబోతున్నాను. అన్నమయ్య సంకీర్తనలలో భాష అంత తొందరగా అర్థం కాదు. అందుకే మదన్మోహన్గారు ఆరు నెలలపాటు అన్నమయ్య కీర్తనలను క్షుణ్నంగా అధ్యయనం చేసి వాటి అర్థాలు, విరుపులు నాకు వివరించారు. కీర్తనలోని భాష, భావం ఆయనతో చెప్పించుకుని ఆ తరవాత స్వరపరుస్తున్నాను. చిన్నారులతో పది సీడీలు పూర్తయ్యాక, యువతతో మరో పది సీడీలు చేయబోతున్నాను. నా ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఫ్యూజన్ చేద్దామనుకుంటున్నాను. ఆ తరవాత ఇతర భాషలకు చెందిన గాయనీమణులతో అంటే శ్రేయాఘోషల్, అనురాధా పొడ్వాల్, ఆషాభోంస్లేలతో అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీలు విడుదల చేయాలని నా కోరిక. అన్నమయ్య కీర్తనలు బాగా ప్రసిద్ధిలోకి వచ్చాక కరోంకే చేసి, దానితో పాటు సంకీర్తన అచ్చు వేసిన కాగితం కూడా ఇచ్చేలా చేద్దామనుకుంటున్నాను. అందరూ అది పెట్టుకుని వారి గాత్రానికి జతపరచుకోవచ్చు కదా. అలాగే కేవలం వాద్యపరికరాల మీద చేయాలనే యోచనలో ఉన్నాను. ఇవన్నీ కూడా తక్కువ ధరకి అందచేయాలని అనుకుంటున్నాను. 'సాలూరి లలిత సంగీతం' అని చేయబోతున్నాను. సి.నా.రె. వడ్డేపల్లి కృష్ణ, ప్రభాశర్మ, మదన్మోహన్, ఎం.కె. రాము వీళ్లతో రాయించి చేయాలనేది నా సంకల్పం. వీరితో కూడా... అమెరికాలో కూడా పాడే వాళ్లుంటే వారి చేత కూడా పాడిస్తాను. ముఖ్యంగా, నాన్నగారు స్వరపరచిన 'కలగంటి కలగంటి' గీతం ఆలపించిన పరమేశ్వరావుతో కూడా పాడించాలనుకుంటున్నాను. సంగీతంలో ఎక్కడైనా సందేహం వస్తే, పెద్దలతో సంప్రదించి పూర్తి చేస్తున్నాను. ఇంతవరకు... ఇంతవరకు వచ్చిన అన్నమయ్య కీర్తనలు ఎక్కువ భాగం హిందోళం, మధ్యమావతి రాగాలలో స్వరపరిచారు. నేను ఆ రాగాలను కొంచెం తక్కువ వాడుతున్నాను. సారమతి రాగాన్ని ఇంతకు మునుపు ఎక్కువగా వాడలేదు. అలాగే హంసనాదం. వీటిని నేను ఎక్కువగా ఉపయోగిస్తున్నాను. విజ్ఞాపన... ఈ సంకీర్తనలు విస్తృత ప్రచారం పొందడానికి రకరకాలుగా కృషి చేసి తీరాలి. ముఖ్యంగా ఎస్విబిసి చానల్లో పిల్లలకు పోటీలు నిర్వహించమని కోరదామనుకుంటున్నాను. అలా వీటిని పాపులర్ చేయవచ్చు. ఇప్పటివరకు 54 సినిమాలు, 515 టీ వీ సీరియల్స్‌కి సంగీతం సమకూర్చాను. వృత్తిని దైవంగా భావించాలి. అన్నమయ్య సంకీర్తనలకు ఆద్యులైన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. - ఫొటో, సంభాషణ: డా. పురాణపండ వైజయంతి