అన్నమయ్య ప్రాజెక్ట్ (ఫైల్)
కావాల్సిన బాబు అధికారంలో ఉంటే మానవ తప్పిదాన్ని ప్రకృతి విపత్తుగా చిత్రీకరిస్తారు. వేరొకరు అధికారంలో ఉంటే ప్రకృతి విపత్తునూ మానవ తప్పిదంగా వక్రీకరిస్తారు. ఇదీ రామోజీ మార్కు జర్నలిజం. ‘ఈనాడు’ రాతల్లో నీతి. 2003 అక్టోబర్ 30. అప్పటికి రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టు నిండిపోయింది. గేట్లు ఎత్తితే నీరు దిగువకు వెళ్లేది. గేట్లు ఎత్తడానికి జనరేటర్ ఆన్ చేయబోతే... దాన్లో డీజిల్ లేదు. ఫలితం... సకాలంలో ఎత్తకపోవడంతో గేట్లు కొట్టుకుపోయాయి. అపార నష్టం వాటిల్లింది. జనరేటర్‌ను చెక్ చేసుకోకపోవటం మానవ తప్పిదం. నాటి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం. కానీ దాన్ని ‘ఈనాడు’ ప్రకృతి విపత్తుగానే రాసింది.
2021 నవంబరు 19. అప్పటికి మూడు రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంతో పాటు చెయ్యేరు, బహుదా, పింఛా, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఈ స్థాయి కుంభవృష్టిని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేదు. ఏ నది నుంచి ఎంత ప్రవాహం వస్తుందో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కూడా అంచనా వేయలేదు. సామర్థ్యానికి మించి వరద ముంచెత్తడంతో పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్ తెగింది. ఆ వరదకు బహుదా, చెయ్యేరు, మాండవ్య ప్రవాహాలు తోడయ్యాయి. ఏకంగా 3.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అన్నమయ్య ప్రాజెక్టులోకి దూసుకొచ్చింది. సామర్థ్యానికన్నా ఒకటిన్నర రెట్లు అధిక వరద కావడంతో... స్పిల్ వే నుంచి వరదను దిగువకు విడుదల చేసే అవకాశంలేదు. ఫలితం... కట్టపై నుంచి వరద పారింది. మట్టికట్ట తెగింది. ప్రకృతి విపత్తు వల్లే ఇది జరిగినట్లు ప్రాజెక్టును చూసిన కేంద్ర బృందం నివేదించింది. సాగునీటి నిపుణులు, జలవనరుల శాఖ అధికారులూ అదే చెబుతున్నారు. ‘ఈనాడు’ మాత్రం అనూహ్యంగా వరద వచ్చిదంటూనే ఇదంతా సర్కార్ వైఫల్యమంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం మొదలెట్టింది. ఈ రోతరాతల్లో నిజానిజాలేంటి? ఏది నిజం?.
– సాక్షి, అమరావతి
ఏది నిజం?
చరిత్రలోనే గరిష్ఠ వరద.. తెగిన పింఛా మట్టికట్ట..:
వైఎస్సార్ కడప జిల్లా టి.సుండుపల్లె మండలం ముదుంపాడు వద్ద 0.32 టీఎంసీల సామర్థ్యంతో పింఛా నదిపై పింఛా ప్రాజెక్టును నిర్మించారు. దాన్లోకి గరిష్ఠంగా 58 వేల క్యూసెక్కులకు మించి వరద వచ్చే అవకాశం లేదనే అంచనాతో స్పిల్ వే నిర్మించారు. కానీ గతనెల్లో ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. స్పిల్ వే సామర్థ్యం కంటే 72 వేల క్యూసెక్కుల వరద అదనం. దాంతో 18న అర్ధరాత్రి రింగ్ బండ్ (మట్టికట్ట) తెగింది. ఆ వరద మొత్తం అన్నమయ్య ప్రాజెక్టు వైపు ఉరికింది.
అన్నమయ్యకు... అంచనాలకు అందని వరద...
వైఎస్సార్ జిల్లాలో రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించి.. 2001కి పూర్తి చేశారు. దీన్లోకి 100 ఏళ్లకు ఓసారి గరిష్ఠంగా 2.40 లక్షల క్యూసెక్కులు.. 200 ఏళ్లకోసారి గరిష్ఠంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనేది అధికారుల అంచనా. 2.85 లక్షల క్యూసెక్కుల వరదొచ్చినా దిగువకు విడుదల చేసేలా 94 మీటర్ల పొడవుతో స్పిల్ వేను నిర్మించారు. దీనికి 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో 5 గేట్లు అమర్చారు. 2012లో జల వనరుల శాఖ 3–డీ అధ్యయనంలో స్పిల్‌వే నుంచి గరిష్ఠంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయొచ్చునని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ.. 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. కానీ.. నాటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు.
గత నెల 16, 17, 18–19 తేదీల్లో నల్లమల, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ... వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. 18న రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తేసి.. 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19 అర్థరాత్రి 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కులు రావటంతో మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దాంతో.. 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. ఇదీ వాస్తవం.
ఎగువ నుంచి వరద వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అన్నమయ్య ప్రాజెక్టు దిగువన చెయ్యేరు పరివాహక ప్రాంతంలోని గ్రామాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. భారీ ప్రాణనష్టం నివారించారు. కేంద్ర బృందమూ దీన్నే నిర్ధారిస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కానీ.. ఈ వాస్తవం రామోజీ మార్కు జర్నలిజానికి కన్పించటం లేదు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలే అక్కడ పతాక శీర్షికలవుతున్నాయి. తమ వాడు అధికారంలో లేడన్న అక్కసు.. తామేం చెప్పినా నమ్ముతారనే అతివిశ్వాసమే ‘ఈనాడు’ అబద్ధాలకు మూలం. కానీ తెలుగు నేలపై ఇపుడా పరిస్థితి లేదన్నది నూరుశాతం నిజం!!.
Comments
Please login to add a commentAdd a comment