అప్పర్‌ భద్రకు అనుమతులు సరికాదు | Permissions for Upper Bhadra project are incorrect says AP Govt To CWC | Sakshi
Sakshi News home page

అప్పర్‌ భద్రకు అనుమతులు సరికాదు

Published Wed, Dec 15 2021 3:58 AM | Last Updated on Wed, Dec 15 2021 3:58 AM

Permissions for Upper Bhadra project are incorrect says AP Govt To CWC - Sakshi

అప్పర్‌ భద్ర ప్రాజెక్టు

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్‌)లో దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) హైడ్రలాజికల్‌ క్లియరెన్స్‌ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ అనుమతులను పునఃసమీక్షించి.. ప్రాజెక్టు పనులు చేపట్టకుండా కర్ణాటకను ఆదేశించాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఆర్కే సిన్హాను రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలు డిమాండ్‌ చేశారు. కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు అప్పర్‌ భద్రపై ఏపీ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో ఆర్కే సిన్హా మంగళవారం వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు.

కేటాయించిన నీటిని వాడుకోవడానికే అప్పర్‌ భద్ర చేపట్టామని కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి ఎన్‌.లక్ష్మణ్‌రావు పీష్వా పేర్కొనడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–1.. అప్పర్‌ భద్రకు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదన్నారు. ప్రాజెక్టుల ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఎక్కడా తగ్గలేదని కేడబ్ల్యూడీటీ–2 తేల్చిచెప్పినా.. దానికి భిన్నంగా మిగులు ఉందంటూ.. వాటిని వాడుకోవడానికే అప్పర్‌ భద్ర చేపట్టామని కర్ణాటక పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఏపీలో కృష్ణా బేసిన్‌ ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి
అప్పర్‌ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి.. భద్ర ప్రాజెక్టు నుంచి 29.90 టీఎంసీలను తరలించేలా కర్ణాటక అప్పర్‌ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని ఏపీ అధికారులు వివరించారు. నీటిని తరలించే క్రమంలో కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) మధ్య వేదవతిపై రిజర్వాయర్‌ను నిర్మిస్తోందన్నారు.

ఈ రిజర్వాయర్‌ను నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పర్‌ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌ కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల ఆయకట్టుతోపాటూ కేసీ కెనాల్‌ కింద ఏపీ, ఆర్డీఎస్‌ కింద ఏపీ, తెలంగాణల్లోని ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో జాప్యం చోటు చేసుకుంటుందన్నారు. ఇది ఆ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు ఇబ్బందులను సృష్టిస్తుందన్నారు. దీనిపై ఆర్కే సిన్హా స్పందిస్తూ.. ప్రాజెక్టుపై అభ్యంతరాలను కర్ణాటక సర్కార్‌కు పంపాలని సూచించారు. వాటిపై కర్ణాటక సర్కార్‌ వివరణ ఇచ్చిన తర్వాత మరోసారి 2 రాష్ట్రాల అధికారులతో సమావేశమై.. అప్పర్‌ భద్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేయకున్నా..
అప్పర్‌ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనను.. నీటి లభ్యత లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చిందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేయకున్నా సరే.. అప్పర్‌ భద్ర ద్వారా 29.90 టీఎంసీలను వినియోగించుకుని 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా కర్ణాటక చేపట్టిన ఈ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్‌ 24న సీడబ్ల్యూసీ టీఏసీ అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపారు. దీనికి ఈ ఏడాది మార్చి 25న కేంద్ర జల్‌ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చిందన్నారు.

కేడబ్ల్యూడీటీ–1, కేడబ్ల్యూడీటీ–2లు అప్పర్‌ భద్రకు 10 టీఎంసీలు కేటాయించనే లేదన్నారు. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్స్‌ ఆధునికీకరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటాగా దక్కిన నీటిలో 2, కృష్ణా బేసిన్‌లో అదనపు మిగులు జలాల రూపంలో 6 టీఎంసీల లభ్యత ఉందని.. ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ మిగిలిన నీటిని అప్పర్‌ భద్ర ద్వారా వాడుకుంటామని కర్ణాటక పేర్కొందన్నారు. కానీ.. వాటి ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని.. అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 ఎత్తిచూపిన అంశాన్ని గుర్తు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement