పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర జల్‌శక్తి బృందం సభ్యులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్–ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ పటిష్ఠతపై జాతీయ జల విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్‌హెచ్‌పీసీ)తో అధ్యయనం చేయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదా దెబ్బతిన్న భాగంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. ఇప్పటికే ఉన్న డయాఫ్రమ్ వాల్‌తో అనుసంధానం చేయాలా? అన్నది తేలుస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను శనివారం శ్రీరాం నేతృత్వంలో పరిశీలించిన సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్, సీడబ్ల్యూసీ రిటైర్డ్ సభ్యులు గోపాలకృష్ణన్, పీపీఏ, డీడీఆర్పీ, సీఎస్‌ఆర్‌ఎంస్, వ్యాప్కోస్ సంస్థల అధికారుల బృందం ఆదివారం కూడా మరోసారి పరిశీలించింది. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది.
దౌలిగంగా నదిపై ఎన్‌హెచ్‌పీసీ చేపట్టిన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఆ సంస్థ అధ్యయనం చేసిందని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ భార్గవ సమావేశంలో గుర్తుచేశారు. దాంతో ఆ సంస్థతోనే పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై కూడా అధ్యయనం చేయించాలని శ్రీరాం అధికారులకు సూచించారు.
వరద వచ్చేలోగా రక్షిత స్థాయికి పనులు
గోదావరికి వరద ఉద్ధృతి వచ్చేలోపు అంటే జూలైలోగా దిగువ కాఫర్ డ్యామ్‌ను రక్షిత స్థాయికి పూర్తిచేయాలని శ్రీరాం ఆదేశించారు. ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతంలో తొమ్మిది రకాల పరీక్షలను చేసి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వాలని.. వాటి ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తుందన్నారు.
ఇక కోతకు గురైన ప్రాంతం పూడ్చే పనులకయ్యే వ్యయాన్ని సీడబ్ల్యూసీ అంచనా వేస్తుందని.. దాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు. అలాగే, కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత.. డయాఫ్రమ్ వాల్‌పై స్పష్టత వచ్చాక ఈసీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించి.. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలన్నారు. ఈసీఆర్‌ఎఫ్ పనుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేసేందుకు సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) సంస్థ అధికారులతో పోలవరం ప్రాజెక్టు వద్దే లాబ్‌ను ఏర్పాటుచేయాలని శ్రీరామ్ ఆదేశించారు. దీనివల్ల పరీక్షల నివేదికలు ఎప్పటికప్పుడు వస్తాయని.. పనులు నిర్విఘ్నంగా చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నారు.
ప్రాజెక్టు పూర్తిపై కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు
ఇక రాష్ట్ర జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థ, పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, సీఎస్‌ఎంఆర్‌ఎస్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, వ్యాప్కోస్, కేంద్ర జల్‌శక్తి శాఖ సమన్వయంతో పనిచేయడం ద్వారా పోలవరాన్ని వేగంగా పూర్తిచేయాలని వెదిరె శ్రీరాం చెప్పారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తిచేయడానికి అవసరమైన నిధుల మంజూరుపై కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మేరకు నిధులు మంజూరుచేస్తామని ఆయన స్పష్టంచేశారు.
డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చారిత్రక తప్పిదమే
పోలవరం రూరల్: కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడమే గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆదివారం జరిగిన సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడంవల్లే భారీ వరదలవల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, ఇందులో ఎలాంటి సందేహంలేదని ఆయన స్పష్టంచేశారు.
డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నదీ పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర, రాష్ట్ర జలవనరుల నిపుణులు, కేంద్ర బృందం సభ్యులు శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇటువంటి సమస్య రావడం ప్రపంచంలోనే ఇది మొదటిసారన్నారు.
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కానీ, గత ప్రభుత్వం చేసిన అసమర్థ నిర్ణయమే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. దీని కారణంగా భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ 1.7 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నదని ప్రాథమికంగా అంచనా వేశారని, అంతేగాక పెద్ద అగాధాలు ఏర్పడ్డాయని అంబటి రాంబాబు తెలిపారు. సమస్యను పరిశీలించి, ఏ విధంగా అధిగమించాలన్న విషయంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment