Department of Water Resources
-
కుడి ఎడమల దగా!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన(డీపీఆర్–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.చిరకాల స్వప్నం సాకారమైన వేళ.. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో చేసినా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.5 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు.డీపీఆర్–2లో తప్పుల పర్యవసానమే.. విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టికేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తిచూపి.. తాజా పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని, విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి రీయింబర్స్ చేయాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్ 5న నోట్ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.కళ్ల ముందు కరిగిపోతున్న స్వప్నం నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్ బ్యారేజ్‌గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఎత్తును తగ్గించడం ద్వారా భూసేకరణ, పునరావాసం వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
జల భద్రతతోనే సుస్థిర సాగు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గోదావరి మిగులు జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడం, యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం, భూగర్భజలాలను పరిరక్షించడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణరెడ్డి చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్‌లో రాష్ట్రంలో జలవనరుల వినియోగం, సుస్థిర సాగునీటి నిర్వహణకు చేపట్టిన చర్యలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధులకు వివరించారు. సదస్సులో ఆయన ఏం చెప్పారంటే.. ♦ రాష్ట్రంలో ఐదు పెద్ద నదులు, 35 చిన్న నదులు ఉన్నాయి. సాగుకు యోగ్యంగా 2 కోట్ల ఎకరాలున్నాయి. ఇప్పటిదాకా 1.067 కోట్ల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల కింద 90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ రాష్ట్రంలో ఏడాదికి సగటున 967 మి.వీు.ల వర్షపాతం కురుస్తుంది. దీని పరిమాణం 1,811 టీఎంసీలు. ఇందులో 54.8 శాతం అంటే 617.34 టీఎంసీలు భూమిలోకి ఇంకుతాయి. 510.03 టీఎంసీలు ఉపరితలంలో ప్రవహిస్తాయి. మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 983.39 టీఎంసీలు. ♦ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు చేపట్టాం. ఇందులో 14 పూర్తిగా, రెండు పాక్షికంగా పూర్తయ్యాయి. వీటి ద్వారా కొత్తగా 49.8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 33.3 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తాం. 1.17 కోట్ల మందికి తాగునీరు అందుతుంది. ♦ పోలవరం ప్రాజెక్టు ద్వారా 322.73 టీఎంసీలను వినియోగించుకుంటాం. 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుంది. ♦ దేశంలో మొదటిసారిగా 1863–70 సంవత్సరాలలో కేసీ (కర్నూల్–కడప) కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేశారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే.. కృష్ణాతో పాటు పెన్నా బేసిన్లో వర్షాభావం వల్ల ఏటా 100 నుంచి 500 టీఎంసీల కొరత ఏర్పడుతోంది. ♦ గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదులకు మళ్లించే పనులను దశలవారీగా చేపడతాం. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. రాయలసీమకు గ్రావిటీపై నీళ్లందించాలంటే.. గోదావరి జలాలను ఆ ఎత్తుకు ఎత్తిపోయాలి. తక్కువ ఖర్చుతో కృష్ణా, పెన్నా బేసిన్లకు నీటిని తరలించే విధానాలను సూచించాలని కోరుతున్నాం. ♦ రాష్ట్రంలో 1,254 ఫిజియోవీుటర్లను ఏర్పాటు చేసి.. 15 లక్షల బోరుబావులను జియోట్యాగింగ్ చేసి భూగర్భజలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, పరిరక్షిస్తున్నాం. 2017తో పోలిస్తే 2022 నాటికి భూగర్భజలమట్టం 5.65 మీటర్లకు పెరిగింది. దేశంలో భూగర్భజలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ♦ నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం కోసం పైప్డ్ ఇరిగేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ♦ 33.34 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లందిస్తున్నాం. దీనివల్ల 11.90 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 201.3 టీఎంసీలు ఆదా అవుతున్నాయి. ♦ చిన్ననీటివనరులను మరమ్మతు చేయడం, ఆధునీకరించడం ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని 84.5 టీఎంసీలకు పెంచి.. 6.9 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నాం. -
విశాఖలో ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల ప్రారంభం (ఫొటోలు)
-
ఏపీకి అవకాశం.. అదృష్టంగా భావిస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: అసామాన్యులకు సత్కారం -
Andhra Pradesh: వేగంగా ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షిస్తూ గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ఫలాలను అందించాలన్నారు. పోలవరంతోపాటు ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వెలిగొండ, వంశధార ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారు. సీమ ప్రాజెక్టులను వరదనీటితో నింపేలా.. గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉన్న ప్రాంతం)లో పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ పద్ధతిలో పనులు పూర్తి చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. నాన్ ఫాల్ట్ జోన్లో మరో 149 మీటర్ల లైనింగ్ పనులు మాత్రమే మిగిలాయని, వాటిని జూలై లోగా పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత డిజైన్ మేరకు పూర్తి సామర్థ్యం ప్రకారం గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 – 40 రోజుల్లోనే నీటిని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ► వెలిగొండలో మొదటి టన్నెల్, హెడ్ రెగ్యులేటర్ ఇప్పటికే పూర్తైనట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్లో 18,787 మీటర్లకుగానూ ఇప్పటికే 17,461 మీటర్ల పనులు పూర్తయ్యాయి. మరో 1,326 మీటర్ల పనులు మాత్రమే మిగిలినట్లు అధికారులు తెలిపారు. రెండో టన్నెల్ అక్టోబర్‌కు పూర్తవుతుందన్నారు. రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14 శాతం పూర్తైనట్లు చెప్పారు. ఆగస్టు నాటికి రెండో టన్నెల్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌లో గొట్టిపడియ, కాకర్ల డ్యామ్, తీగలేరు అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ఈస్ట్రన్ మెయిన్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌లోకి నీటిని తరలించేందుకు వీలుగా మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టు పనులను డిస్ట్రిబ్యూటరీలతో సహా ఈ ఏడాదే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి స్టేజ్–2లో అంతర్భాగమైన హీరమండలం రిజర్వాయర్‌ను నింపే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► తోటపల్లి బ్యారేజీలో మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగరం, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ తదితర ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్షించారు. ఆ ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. శరవేగంగా పోలవరం.. ► పోలవరం పనుల ప్రగతిపై సీఎం జగన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురై ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాథాలను ఇప్పటికే ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్‌తో యథాస్థితికి తెచ్చే పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ► ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో అగాథాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులు చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయ్యాక గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ పోలవరం జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ► గైడ్ బండ్లో జారిన ప్రాంతాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారులు ఈనెల 15, 16వతేదీల్లో పరిశీలించిన అంశాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. నేల స్వభావంలో మార్పుల వల్లే గైడ్ బండ్లో కొంత ప్రాంతం జారి ఉండవచ్చని నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. గైడ్ బండ్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్, సిమెంట్ స్లర్రీతో నింపి గాబియన్లు వేయడం ద్వారా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని కమిటీ సూచించిందన్నారు. ఆ మేరకు పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గైడ్ బండ్‌ను పూర్తిగా విశ్లేషించాక శాశ్వత మరమ్మతులపై కమిటీ సూచనలు చేయనుంది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు గైడ్ బండ్‌ను పటిష్టం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ► పోలవరం తొలిదశ పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకోగా కేబినెట్ నోట్ తయారీపై వివిధ శాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. ► పోలవరం పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తుండటం వల్ల ఖజానాపై భారం పడుతోందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ముందుగా నిధులు విడుదల చేసిన తరహాలోనే పోలవరానికి కూడా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ► పోలవరంలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో 20,946 నిర్వాసిత కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 8,288 కుటుంబాలకు కూడా పునరావాసం కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. సకాలంలో ఆయకట్టుకు నీటి విడుదల ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా క్యాలెండర్ ప్రకారం నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు సమీక్షలో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశామన్నారు. మిగతా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టుకు పుష్కలంగా నీటిని అందించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అంబటి, అధికారులకు సీఎం అభినందనలు నాలుగో జాతీయ జల అవార్డుల్లో (నేషనల్ వాటర్ అవార్డ్స్–2022) ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులను దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. జలæ వనరుల సంరక్షణ, నీటి నిర్వహణకుగాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ చేతుల మీదుగా అందుకున్న అవార్డును జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సీఎం జగన్‌కు చూపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు. -
Fact Check: ‘గేటు’పై ఈనాడు అడ్డగోలు అబద్ధాలు
సాక్షి, అమరావతి: వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేటు బిగింపు పనులు, మరమ్మతులు తుదిదశకు చేరుకున్నాయని పసిగట్టిన ‘ఈనాడు’ ఆదరాబాదరగా ఓ అడ్డగోలు కథనాన్ని అచ్చేసి చంకలు గుద్దుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక వంటకాన్ని సిద్ధం చేయాలనే ఆదుర్దాతో ‘పులిచింతల గేటు ఏర్పాటు ఎప్పటికి?’ అంటూ బురద చల్లేందుకు ప్రయత్నించింది. మరో 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా 30 శాతం పనులే జరిగాయంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది. గేట్ల బిగింపు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. కాలినడక వంతెన పనులు 70 శాతం పూర్తి కాగా 23 పియర్ల కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ కూడా పూర్తైంది. ఈనాడు ఆరోపణ: వరదలకు కొట్టుకుపోయిన 16వ గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు, మరమ్మతుల పనులకు పరిపాలన ఆమోదం కోసం 9 నెలల సమయం పట్టింది. వాస్తవం: ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పరిస్థితిపై సాంకేతికంగా మదింపు చేసి మిగిలిన 23 గేట్ల పనితీరును నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ చేయాలని సూచించింది. కమిటీ సూచనల మేరకు జల వనరుల శాఖ రూపొందించిన అంచనాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. నిపుణుల కమిటీతో సమగ్ర అధ్యయనం జరిపించింది. పనులను రెండు భాగాలుగా విభజించి బెకెమ్ సంస్థకు అప్పగించారు. కాలినడక వంతెన పనులను స్వప్న కన్స్ట్రక్షన్స్కు కేటాయించారు. ఆరోపణ: నిధులు ఇవ్వక పోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. వాస్తవం: గేట్లకు సంబంధించి రూ.1.59 కోట్లు, కాలినడక వంతెన పనులకు సంబంధించి రూ.1.29 కోట్ల బిల్లులను ప్రభుత్వం త్వరలో చెల్లించనుంది. ఆరోపణ: గేటు తయారీ, బిగింపులో ఆలస్యం జరుగుతోంది. వాస్తవం: గేటు తయారీలో అతి ప్రధానమైన ట్రూనియన్ బుష్ బేరింగ్లను జపాన్ నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. గేటును పియర్స్‌కు బిగించడానికి అవసరమైన కాంక్రీట్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. క్యూరింగ్‌కు 15 రోజులు పడుతుంది. గేటు తయారీ పూర్తయింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ పూర్తయింది. 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా ‘ఈనాడు’ 30 శాతం పనులే పూర్తయినట్లు అవాస్తవాలు అచ్చేసింది. కాలినడక వంతెన పనుల్లో కూడా 70 శాతం (16వ గేటు వరకూ) పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి గేటుకు స్టాప్‌లాగ్ గేటు అమర్చి రబ్బర్ సీళ్లను అమర్చే పనులు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా వాటిని పూర్తి చేసి ఈ సీజన్లో పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
వడివడిగా ‘వెలిగొండ’.. సాకారమవుతున్న ఆ మూడు జిల్లాల దశాబ్దాల కల
ఆలమూరు రామగోపాలరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు నీటిని తరలించడానికి వీలుగా 18.8 కి.మీల పొడవున మొదటి సొరంగం, హెడ్ రెగ్యులేటర్ పనులను 2021 నాటికే ప్రభుత్వం పూర్తిచేసింది. కన్వేయర్ బెల్ట్ తెగిపోతుండటం, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)లో సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో.. ఓ వైపు టీబీఎంతో సొరంగం తవ్వుతూనే మరోవైపు మనుషులతో తవ్వకం పనులు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది దిశానిర్దేశం చేశారు. దీంతో 2022–23లో 5.52 కి.మీల పొడవున సొరంగం తవ్వి.. ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు సృష్టించారు. మరోవైపు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నల్లమలసాగర్ పూర్తయింది. దీని నుంచి తీగలేరు కెనాల్‌ను అనుసంధానిస్తూ 550 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవల ప్రభుత్వం పూర్తిచేసింది. అలాగే, తీగలేరు కెనాల్‌కు నల్లమలసాగర్ నుంచి నీటిని విడుదల చేయడానికి వీలుగా హెడ్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేసింది. తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్‌తో అనుసంధానం చేస్తూ 150 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవలే పూర్తిచేసిన ప్రభుత్వం.. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకూ శ్రీకారం చుట్టింది. యుద్ధప్రాతిపదికన తొలిదశ పనులను పూర్తిచేసి.. ఈ ఏడాది నల్లమలసాగర్‌కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులేస్తున్నారు. వెలి‘గొండంత’ చిత్తశుద్ధి.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,37,300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. అక్కడి 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చవచ్చు. అందుకే ఈ ప్రాజెక్టును ఆ మూడు జిల్లాల ప్రజల వరదాయినిగా అభివర్ణిస్తారు. – నిజానికి.. 1996లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినా పనులు చేపట్టలేదు. – పైగా.. 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సభ కోసమే. – 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. – శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు రోజుకు 3,001 క్యూసెక్కులు తరలించేందుకు ఒక సొరంగం తవ్వేలా 1994లో డీపీఆర్‌ను మహానేత వైఎస్ సమూలంగా మార్చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజులు తగ్గిన నేపథ్యంలో.. రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా రెండు సొరంగాలు తవ్వేందుకు డీపీఆర్‌ను తయారుచేయించారు. – ఇలా శ్రీశైలానికి వరద వచ్చే 43 రోజుల్లోనే వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్‌ను నింపాలన్నది మహానేత వైఎస్ ఆలోచన. – ఇక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా 23 కిమీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేందుకు ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. అలాగే, తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. చంద్రబాబు వెలి‘గొండంత’ దోపిడీ విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును దోపిడికి అడ్డాగా మార్చుకున్నారు. అప్పటి నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎంల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు దండుకున్నారు. మళ్లీ 2018, 2019 నాటికి పూర్తిచేస్తామన్న చంద్రబాబు.. కమీషన్లు వసూలుచేసుకుని, ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. సీఎం జగన్ హయాంలో వడివడిగా.. మహానేత వైఎస్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ ఆది నుంచి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబర్‌లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తిచేయించారు. – రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. కానీ, సీఎం జగన్ వీటిని రద్దుచేసి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన మేఘా సంస్థకు పనులు అప్పగించారు. – రెండో సొరంగంలో టీబీఎంకు కాలంచెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దీంతో.. మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ చెప్పడంతో అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్విస్తున్నారు. – ఇక 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున సొరంగం తవ్వారు. ఇది వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో రికార్డని ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఏఈ అనుదీప్ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం రోజుకు 12 మీటర్ల మేర పనులు చేస్తున్నామని.. ఆగస్టు నాటికి రెండో సొరంగంలో మిగిలిన 1.889 కిమీల పనులను పూర్తిచేస్తామన్నారు. – మరోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్‌కు తరలించేందుకు 23 కిమీల పొడవున తవ్విన ఫీడర్ ఛానల్‌ను పటిష్టం చేసే పనులను చేపట్టామని.. ఆగస్టు నాటికి వాటిని పూర్తిచేస్తామని ఆ పనులను పర్యవేక్షిస్తున్న డీఈ ఆవుల లక్ష్మి చెప్పారు. – అలాగే, నల్లమలసాగర్ నుంచి తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువకు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని ఈఈ రమణ తెలిపారు. పునరావాసం పనులు వేగవంతం నల్లమలసాగర్‌లో 11 గ్రామాలు ముంపుకు గురవుతాయి. వీటిల్లోని 7,318 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటికే 96 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగతా 7,222 నిర్వాసిత కుటుంబాలకు రూ.868.27 కోట్లతో పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేశారు. అలాగే, వెలిగొండ ప్రాజెక్టు కోసం 24,158.56 ఎకరాల భూమి అవసరం. ఇందులో ఇప్పటికే 20,760.47 ఎకరాల భూమిని సేకరించారు. మిగిలిన భూమిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.679.79 కోట్లను వ్యయంచేసి.. పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులు పెట్టిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజినీరింగ్ అద్భుతం.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ప్రకాశం జిల్లాలో పశ్చిమాన నల్లమల పర్వతశ్రేణుల్లో కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ కాంక్రీట్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటోంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ తవ్వుతున్న రెండు సొరంగాలు ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు. ఈ ఏడాదే తొలిదశ పూర్తి ఈ ప్రాజెక్టు తొలిదశను ఈ ఏడాదే పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశాం. ఇప్పటికే తొలి సొరంగం పూర్తయింది. ఫీడర్ ఛానల్ సిద్ధంగా ఉంది. నల్లమలసాగర్ పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది పది టీఎంసీలను నల్లమలసాగర్‌లో నిల్వచేస్తాం. ఆ తర్వాత 30 టీఎంసీలు.. చివరగా 53.85 టీఎంసీలను నిల్వచేస్తాం. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ మహానేత ముందుచూపునకు నిదర్శనం శ్రీశైలంలో 840 అడుగుల నీటి మట్టం నుంచే సొరంగాల ద్వారా వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు నీటిని తరలించవచ్చు. 879 అడుగుల స్థాయిలో శ్రీశైలంలో నీరునిల్వ ఉంటే.. పూర్తి సామర్థ్యం మేరకు రోజుకు 11,583 క్యూసెక్కులను నల్లమలసాగర్‌కు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే 40–43 రోజుల్లోనే నల్లమలసాగర్‌ను నింపేలా ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపునకు తార్కాణం. – మురళీనాథ్‌రెడ్డి, సీఈ, ప్రకాశం జిల్లా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధివల్లే.. ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధివల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతోంది. టీబీఎంలకు కాలం చెల్లడం, కన్వేయర్ బెల్ట్‌లు పనిచేయకపోవడంవల్ల సొరంగాల తవ్వకం 2014 నుంచి ముందుకు కదల్లేదు. మనుషుల ద్వారా సొరంగాలను తవ్వాలని సీఎం జగన్ నిర్ణయంవల్లే ఇప్పుడు ఆ పనులు పూర్తవుతున్నాయి. 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున తవ్వాం. ప్రాజెక్టు చరిత్రలో ఇదో రికార్డు. – అబూ తలీమ్, ఎస్ఈ -
నీటి లెక్కలు తేల్చకుండా వాడుకోవద్దని ఎలా అంటారు?
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని వాడుకోవద్దంటూ కృష్ణా బోర్డు ఆదేశించడంపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోటా నీటిని తాగు నీటి అవసరాల కోసం వాడుకుంటున్నామని, దాన్ని ఆపేయాలని ఆదేశించడమేమిటని మండిపడుతున్నారు. సాగర్ ఎడమ కాలువలో రాష్ట్ర కోటా కింద మిగిలిన 13 టీఎంసీలను విడుదల చేసేలా తెలంగాణ అధికారులను ఎందుకు ఆదేశించలేదని బోర్డును నిలదీస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు తేల్చాకే ఇతర అంశాలపై చర్చిద్దామని స్పష్టం చేస్తున్నారు. లెక్కలు తేల్చకుండా నీటిని వాడుకోవద్దని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సాగర్ కుడి కాలువ ద్వారా రోజూ 9 వేల క్యూసెక్కులను ఏపీ వాడుకుంటోందంటూ తెలంగాణ ఈఎన్సీ రాసిన లేఖకు స్పందించిన కృష్ణా బోర్డు.. ఆ నీటి వాడుకాన్ని ఆపేయాలని శుక్రవారం ఏపీ ఈఎన్సీకి లేఖ రాసింది. బోర్డు ఆదేశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు మండిపడుతున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో వరద రోజుల్లో వాడుకున్నదిపోనూ మిగతా రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కోటా కంటే 73.56 టీఎంసీలు ఎక్కువ వినియోగించుకుందని, ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని అధికారులు తెలిపారు. నీటి లెక్కలు తేల్చి.. మా కోటా నీటిని రబీలో సాగు, వేసవిలో తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని మార్చి 13న కృష్ణా బోర్డుకు లేఖ రాశామని ఏపీ ఈఎన్సీ గుర్తు చేస్తున్నారు. కోటా కంటే అధికంగా వాడుకున్న తెలంగాణను కట్టడి చేసి, సాగర్ ఎడమ కాలువ కోటా కింద ఏపీకి ఇంకా రావాల్సిన 13 టీఎంసీలను విడుదల చేసేలా ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం లేఖ రాస్తామని అధికారులు చెప్పారు. నీటి లెక్కలు తేల్చేందుకు తక్షణమే సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. కోటా మేరకే తాగు అవసరాలకు సాగర్ కుడి కాలువ నుంచి నీటిని వాడుకుంటున్నామని, ఆపే ప్రశ్నే లేదని స్పష్టం చేస్తున్నారు. -
నీటిలెక్కలు తేల్చడానికి రెడీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను కోటా కంటే అధికంగా వాడుకున్నారంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో.. నీటిలెక్కలు తేల్చేందుకు కృష్ణాబోర్డు సిద్ధమైంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిలెక్కలు తేల్చి.. కోటాలో మిగిలిన నీటిని లభ్యత ఆధారంగా కేటాయించేందుకు బోర్డు చైర్మన్ శివ్‌నంద్‌కుమార్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి అనువైన రోజును ఎంపిక చేయాలని రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులను కృష్ణాబోర్డు కోరింది. 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు దిగువ కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉందని.. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం) టీఎంసీలు, తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.72 టీఎంసీలను వాడుకున్నాయని తెలిపారు. అందులో ఏపీ 442.52 (52.2 శాతం) టీఎంసీలు, తెలంగాణ 404.20 (47.8 శాతం) టీఎంసీలు వాడుకున్నాయని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని, తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే అధికంగా 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుందని కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటా కంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 38.72 టీఎంసీలు వాడుకుందని, ఇకపై నీటిని వాడుకోకుండా కట్టడిచేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నీటిలెక్కలు తేల్చి వివాదానికి తెరదించడానికి కృష్ణాబోర్డు సిద్ధమైంది. -
ఆఖరి ఆయకట్టు అంతేనా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు ఎండిపోతోంది. జలవనరుల శాఖ అధికారుల ప్రణాళికా లోపంతో ఆఖరి ఆయకట్టుకు నీరు చేరక సత్తుపల్లి, వైరా, మధిర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. ఇంకో నెలన్నరలో పంటలు చేతికి రావాల్సి ఉన్న వేళ ఈ పరిస్థితితో రైతుల్లో ఆందోళన నెలకొంది. సాగర్ జలాలు వస్తాయని.. ఖమ్మం జిల్లాలో 2,54,270 ఎకరాల సాగర్ ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో యాసంగిలో 2,23,545 ఎకరాల సాగుకు 33.61 టీఎంసీల నీరు అవసరమని అధికారులు లెక్కలు వేశారు. గత ఏడాది డిసెంబర్ 15నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 14 వరకు మొత్తం 29.067 టీఎంసీల నీటిని వారబంధీ విధానంలో విడుదలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక ఐడీసీ స్కీమ్స్ కింద 1.880 టీఎంసీలు, భక్తరామదాసు, వైరా ప్రాజెక్టు నుంచి 2.663 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని భావించారు. కానీ ఇటీవల పాలేరుకు ఇన్‌ఫ్లో భారీగా తగ్గడంతో చివరి ఆయకట్టు భూములకు సరిగ్గా నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బోనకల్ బ్రాంచి కెనాల్, సిరిపురం మేజర్ కాల్వ పరిధిలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కోసం ఎదురుచూపులు.. పాలేరు జలాశయంలో నీరు లేకపోవడంతో దిగువకు నీటి విడుదల సాఫీగా సాగడం లేదు. తల్లాడ మండలం సిరిపురం మేజర్ కాల్వ పరిధి తల్లాడ, రేజర్ల, కొత్త వెంకటగిరి గ్రామాల ఆయకట్టుకు సాగర్ జలాలు అందక రైతులు ఈనెల 11న ఆందోళనకు దిగారు. అలాగే, బోనకల్ బ్రాంచి కెనాల్ పరిధిలోని 500 ఎకరాల మేర పంట దెబ్బతిన్నది. ఏప్రిల్ వరకు నీరందిస్తామని ఫిబ్రవరిలోనే చేతులెత్తేశారు.. తల్లాడ మండలం గాంధీనగర్ తండాకు చెందిన భూక్యా లక్ష్మి యాసంగిలో రెండున్నర ఎకరాలు రూ.50వేలకు కౌలుకు తీసుకుంది. తెలగవరం సబ్ మైనర్, సిరిపురం ఎన్నెస్పీ మేజర్ కాల్వ కింద రేజర్లలో 75 రోజుల క్రితం వరి నాట్లు వేయగా, నెల రోజులుగా నీరు రావడం లేదు. దీంతో వరి మొత్తం ఎండిపోగా.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్ష్మి, ఆమె భర్త తమను ఆదుకునే వారెవరని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ వరకు నీరందిస్తామన్న అధికారులు ఫిబ్రవరిలోనే ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పరిహారం అందించాల్సిందే... బోనకల్ మండలం ఆళ్లపాడుకు చెందిన రైతు బొమ్మగాని సాంబయ్య ఐదెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. ఆయన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి రూ.2 లక్షల మేర పెట్టుబడి పెట్టాడు. కంకి దశలో ఉండగా సాగర్ జలాలు అందక పంట ఎండిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఆళ్లపాడు మైనర్‌కు నీరు విడుదల చేయలేదని.. ఎండిపోయిన మొక్కజొన్న పంట సర్వే చేయించి పరిహారం అందించాలని సాంబయ్య కోరుతున్నాడు. ప్రణాళికా లోపం.. ఏప్రిల్ వరకు నీటి సరఫరా ఉంటుందని అధికారులు ప్రకటించడంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారుల ప్రణాళికా లోపంతో ఫిబ్రవరిలోనే నీటి కటకట ఏర్పడింది. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే చివరి ఆయకట్టుకు కూడా కొంత మేర నీరు అందేది. ప్రస్తుతం పాలేరుకు ఇన్‌ఫ్లో తగ్గగా.. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జలవనరుల సలహా మండలి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఆ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో 5వేల క్యూసెక్కులను పాలేరు రిజర్వాయర్‌కు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా పూర్తిగా నెరవేరలేదు. ఒకటి, రెండు రోజులకే ఇన్‌ఫ్లో తగ్గడంతో పాలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం మళ్లీ 16 అడుగులకు చేరింది. -
జల పర్యాటకం, రవాణాకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు జలరవాణా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం బోటింగ్ టూరిజాన్ని మెరుగుపరుస్తూనే కొత్త జలవనరుల అన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నీటివనరులు, బీచ్‌లను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తిస్తుంది. కొత్త నదీమార్గాల అన్వేషణ రాజమహేంద్రవరం, విజయవాడ, నాగార్జునసాగర్, శ్రీశైలంలో పర్యాటకశాఖ ఎక్కువగా బోటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోను అంతర్గత బోట్ల సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ బోటింగ్ రక్షణకు పెద్దపీట వేయనుంది. మరోవైపు చిన్నచిన్న బోట్ల దగ్గర నుంచి హౌస్ బోట్లు, క్రూయిజ్లను సైతం నడిపేలా, తీర్థస్థలాలు, వారసత్వ ప్రదేశాలను కలుపుతూ ఉండే నదీమార్గాలను అన్వేషిస్తోంది. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఏపీలో బీచ్‌లను ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనుంది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇలా.. ఈ కమిటీకి ఏపీటీడీసీ ఎండీ చైర్మన్‌గా, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ఈడీ కో–చైర్మన్‌గా, ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏపీ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈవో, ఏపీటీడీసీ ఈడీ (ప్రాజెక్ట్స్), జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్, ఏపీటీడీసీ వాటర్ ఫ్లీట్ జీఎంలతో పాటు ఏపీటీడీసీ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ నుంచి ఒక్కో నామినేటెడ్ వ్యక్తి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాలతో పాటు బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి జల పర్యాటకం, రవాణా సౌకర్యాలను పరిశీలిస్తుంది. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుంది. గోదావరి, కృష్ణాలోను.. జలమార్గం చౌకైన రవాణా కావడంతో కేంద్రప్రభుత్వం జలమార్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది. దేశంలో 50.1 శాతం రోడ్డు, 36 శాతం రైల్వే, 6 శాతం సముద్ర, 7.5 శాతం పైప్‌లైన్ రవాణా వ్యవస్థలున్నాయి. జలమార్గ రవాణా 0.4 శాతం మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 680 మైళ్ల పొడవైన జలమార్గం జాతీయ రహదారులను కలుపుతోంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మీదుగా ప్రయాణిస్తోంది. కోరమాండల్ తీరం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హామ్ కాలువలున్నాయి. ఏపీలో కృష్ణా, గోదావరి నదులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ క్రమంలో జల పర్యాటకం, రవాణా ప్రోత్సాహకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరి గ్రాండ్ ఆనకట్టకు గోదావరి జలాలను తరలించేలా గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 70వ సమావేశం మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిలల్లోకి, అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా రూపొందించిన గోదావరి – కావేరి అనుసంధానం డీపీఆర్‌పై చర్చించారు. ఇందులో 40 టీఎంసీల చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు కేటాయించి, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. తమ కోటాలో నీటిని మళ్లించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ చెప్పింద. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఇతర బేసిన్లకు మళ్లించే గోదావరి జలాలకుగాను తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. తమకు ఏ ప్రాతిపదికన 9.8 టీఎంసీలు కేటాయించారని కర్ణాటక ప్రశ్నించింది. తమకు అంతకంటే ఎక్కువ కేటాయించాలని డిమాండ్ చేసింది. కావేరికి గోదావరి జలాలు తరలిస్తున్నందున, కావేరి జలాల్లో 92 టీఎంసీలు తమకు ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నీటి లభ్యతను తేల్చాలని ఏపీ డిమాండ్ చేసింది. నీటి లభ్యతను తేల్చాకే గోదావరి జలాలను కావేరికి తరలించాలని, అప్పుడే వర్షాభావ ప్రాంతాలకు సాగు, తాగు నీరు లభిస్తుందని పేర్కొంది. గత నెల 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక రూపకల్పనలో తాము వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. తెలంగాణ కూడా ఇదే రీతిలో స్పందించింది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్పష్టం చేశారు. -
ప్రాధాన్యత ప్రాజెక్టుగా మహేంద్రతనయ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో సాగు, తాగు నీటి సదుపాయాలను మెరుగుపర్చడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనుకబడిన నందిగం, పలాస, టెక్కలి, మెళియపుట్టి మండలాల్లో 24,600 ఎకరాలకు సాగు నీరు, 108 గ్రామాలకు తాగు నీరు అందించే మహేంద్ర తనయ ప్రాజెక్టును జలవనరుల శాఖ అధికారులు ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును చేపట్టారు. దీనిని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టు నత్తనడకన సాగింది. ఇప్పుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృషిపెట్టింది. దివాలా తీసిన పాత కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిపోయిన పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించడానికి టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. జ్యుడిషియల్ ప్రివ్యూ అనంతరం రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. రోజుకు 1200 క్యూసెక్కులు మళ్లించి.. ఒడిశాలోని తుపరసింగి వద్ద పుట్టిన మహేంద్రతనయ గొట్టా బ్యారేజ్‌కు 4 కిలోమీటర్ల ఎగువన వంశధారలో కలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టి మండలం చాపర వద్ద మహేంద్రతనయపై రెగ్యులేటర్ నిర్మించి, అక్కడి నుంచి రోజుకు 1200 క్యూసెక్కులు తరలించేలా 13.52 కిలోమీటర్ల వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా నీటిని తరలించి రేగులపాడు వద్ద 1.76 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు. రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువ (11.20 కిలోమీటర్లు) ద్వారా 12,500 ఎకరాలకు, కుడి కాలువ (10.20 కిలోమీటర్లు) ద్వారా 12,100 ఎకరాలు.. మొత్తం 24,600 ఎకరాలకు సాగు నీటితోపాటు 108 గ్రామాలకు తాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.852.45 కోట్లు. వరద కాలువలో ఇప్పటికే 7.27 కిలోమీటర్ల పని పూర్తయింది. మరో 6.3 కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉంది. కాలువపై 26 కాంక్రీట్ నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. రిజర్వాయర్ పనుల్లో భాగంగా 2.485 కిలోమీటర్ల పొడవున 55.6 మీటర్ల ఎత్తుతో మట్టికట్ట నిర్మించాలి. రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే ఏడు గ్రామాల్లోని 1,059 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటికే 659 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఆయకట్టుకు నీళ్లందించేలా 51.5 కిమీల పిల్ల కాలువల కోసం 373.75 ఎకరాల భూమిని సేకరించాలి. ఈ భూమి సేకరణ, నిర్వాసితులకు పునరావాసంపై అధికారులు దృష్టి సారించారు. మిగిలిపోయిన పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించి.. శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. -
‘అన్నమయ్య’ పునర్నిర్మాణం.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలతో గతేడాది నవంబర్ 19న తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.787 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పునర్నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈమేరకు పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. చెయ్యేరుకు వందేళ్లలో ఒకసారి గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, 200 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో గతేడాది అన్నమయ్య ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ నేపథ్యంలో చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వే నిర్మించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. నాడు.. అదనపు స్పిల్‌వే నిర్మించకపోవడంతోనే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించగా 2001కి పూర్తి చేశారు. 206.65 మీటర్ల ఎత్తుతో 94 మీటర్ల పొడవున స్పిల్‌వే, అనుబంధంగా 336 మీటర్ల పొడవున మట్టికట్టను నిర్మించారు. స్పిల్‌వేకు 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో ఐదు గేట్లు అమర్చారు. ఈ ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 2012లో జల వనరుల శాఖ 3–డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గరిష్టంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయవచ్చని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్‌వే నిర్మించాలని ఇచ్చిన నివేదికను టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. గతేడాది నవంబర్ 16, 17, 18, 19వతేదీల్లో శేషాచలం– నల్లమల అడవులు, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8 గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. ఆ రోజు రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తేసి 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19న అర్థరాత్రి 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కులు రావటంతో మట్టం గరిష్ట స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దీంతో 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. 440 మీటర్ల పొడవు.. 4 లక్షల క్యూసెక్కులు దాటినా చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువగా వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా దృఢంగా అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో మట్టికట్ట కాకుండా 440 మీటర్ల పొడవున కాంక్రీట్ కట్టడం (స్పిల్‌వే)తో ప్రాజెక్టును నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించింది. నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా దిగువకు విడుదల చేసేలా గేట్లను సులభంగా నిర్వహించేందుకు హైడ్రాలిక్ సిలిండర్ హాయిస్ట్ విధానంలో పనులు చేపట్టాలని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.787 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
రివర్స్ టెండరింగ్‌తో రూ.44.15 కోట్లు ఆదా
బి.కొత్తకోట: జలవనరుల శాఖలో రివర్స్ టెండరింగ్‌తో కోట్లు ఆదా అవుతున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో సాగే ఏవీఆర్ హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల ప్రారంభంలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 20న ప్రాజెక్టు మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించగా సోమవారం కంపెనీలు దాఖలుచేసిన ప్రైస్‌బిడ్‌ను తెరిచారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ రివర్స్ టెండరింగ్‌లో లెస్‌కు టెండర్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె నుంచి హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)పై కిలోమీటరు 79.600 నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో కిలోమీటరు 220.350 వరకు కాలువను విస్తరించే పనులకు ప్రభుత్వం రూ.1,219,93,02,150 అంచనాతో టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులు దక్కించుకునేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెండర్లు దాఖలు చేశాయి. తొలుత టెండర్లను దాఖలు చేసిన కంపెనీల సాంకేతిక అర్హత, అనుభవం, సామర్థ్యంపై డాక్యుమెంట్లను ఈనెల 20న పరిశీలించగా రెండింటీకి అర్హత ఉన్నట్లు నిర్ధారౖణెంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ప్రైస్‌బిడ్‌ను తెరిచారు. ఇందులో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అంచనాకంటే 3.42 శాతం అదనంతో రూ.1,261,65,18,283.53కు టెండర్ దాఖలు చేసింది. అనంతరం దీనిపై ఎస్ఈ రాజగోపాల్ రివర్స్ టెండరింగ్ ప్రారంభించి సా.5.30 గంటలకు ముగించారు. ఇందులో రెండు కంపెనీలు పోటీపడినా చివరికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వ అంచనా విలువకంటే 0.1997 శాతం తక్కువకు అంటే..రూ.1,217,49,40,146.53తో టెండర్ దాఖలుచేసి ఎల్–1గా నిలిచింది. ఈ రివర్స్ టెండర్ నిర్వహణవల్ల ప్రభుత్వానికి రూ.44,15,78,137 ఆదా అయ్యింది. ఇక ఎల్–1గా నిలిచిన కంపెనీకి పనుల అప్పగింత కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. -
హిరమండలం ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఫేజ్–2, స్టేజ్–2 ఆయకట్టు రైతులకు ముందస్తు ఫలాలను అందించడం.. ఫేజ్–1 స్టేజ్–2 ఆయకట్టు, నారాయణపురం ఆనకట్ట ఆయకట్టును స్థిరీకరించడం, ఉద్దానం ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా హిరమండలం ఎత్తిపోతలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి రూ.176.35 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ బుధవారం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వంశధార నదిలో గొట్టా బ్యారేజ్ వద్ద నీటి లభ్యతపై 2007 ఆగస్టులో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మళ్లీ అధ్యయనం చేసింది. ఇందులో గొట్టా బ్యారేజ్ వద్ద 105 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. ఇందులో రాష్ట్ర వాటా 52.5 టీఎంసీలు. వంశధార స్టేజ్–1, స్టేజ్–2ల ద్వారా 34.611 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వాటాలో ఇంకా 17.439 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ నీటిని వాడుకోవడానికి వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను జలయజ్ఞంలో భాగంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై ఒడిశా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. నేరడి బ్యారేజ్ స్థానంలో కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్‌ను నిర్మించి.. వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్ (19.5 టీఎంసీల సామర్థ్యం)కు మళ్లించి.. వంశధార పాత ఆయకట్టు 2,10,510 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించే పనులను చేపట్టారు. సైడ్ వియర్ వల్ల ఎనిమిది టీఎంసీలను మాత్రమే హిరమండలం రిజర్వాయర్‌కు తరలించవచ్చు. గొట్టా బ్యారేజ్ నుంచి కుడికాలువ మీదుగా.. నేరడి బ్యారేజ్‌కు వంశధార ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ.. ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దాన్ని కేంద్రం నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా సర్కార్‌ను ఒప్పించడం కోసం భువనేశ్వర్ వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో దౌత్యం జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రాజెక్టు ముందస్తు ఫలాలను అందించడం కోసం గొట్టా బ్యారేజ్ నుంచి రోజుకు 1,400 క్యూసెక్కుల చొప్పున వందరోజుల్లో 10 నుంచి 14 టీఎంసీలను తరలించేలా ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాలని మే 10న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గొట్టా బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతం నుంచి 1,400 క్యూసెక్కులను 650 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి.. వంశధార కుడికాలువలో 2.4 కిలోమీటర్ల వద్దకు ఎత్తిపోస్తారు. ఈ నీటిని హిరమండలం రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా 2.5 కిలోమీటర్ల పొడవున కుడికాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,265 క్యూసెక్కులకు పెంచుతారు. వందరోజుల్లో 10 నుంచి 12 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. తద్వారా వంశధారలో వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని వంశధార స్టేజ్–1, స్టేజ్–2ల కింద 2,55,510 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా నారాయణపురం ఆనకట్ట కింద ఉన్న 37 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానానికి తాగునీటి కోసం 0.712 టీఎంసీలను సరఫరా చేస్తారు. -
నెల్లూరుకు నగిషీ.. వందేళ్ల కల సాకారం
(నెల్లూరు బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల స్వప్నం నెల్లూరు బ్యారేజ్ సాకారమవుతోంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన నెల్లూరు బ్యారేజ్ పనులను ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈ బ్యారేజ్‌ను ఈనెల 6వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు. బ్యారేజ్ ద్వారా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లోని 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందనుంది. బ్యారేజ్‌ను పూర్తి చేసి నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. వరద నియంత్రణ ద్వారా ముంపు ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ 2 వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడంతో నెల్లూరు–కోవూరు మధ్య రవాణా ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమయ్యాయి. దీంతోపాటు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని కూడా సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆంగ్లేయుల కాలంలో... 1854–55లో ఆంగ్లేయుల హయాంలో నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదికి అడ్డంగా 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్ట నిర్మించి అరకొరగా మాత్రమే ఆయకట్టుకు నీళ్లందించారు. 1862లో భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్ట నిర్మించారు. పూడిక పేరుకుపోవడం, శిథిలం కావడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్‌గా మారింది. నెల్లూరు తాగునీటికి తల్లడిల్లింది. ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా రాకపోకలు స్తంభించిపోయేవి. ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరును ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించాలని 1904 నాటి నుంచి నెల్లూరు ప్రజలు కోరుతున్నా 2004 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయ/æ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో 2008 ఏప్రిల్ 24న చేపట్టారు. ఆయన హయాంలో బ్యారేజ్ పనులు పరుగులెత్తాయి. రూ.86.62 కోట్లను ఖర్చు చేశారు. మహానేత హఠాన్మరణం నెల్లూరు బ్యారేజ్‌కు శాపంగా మారింది. నాడు కాలయాపన.. కమీషన్లకే ప్రాధాన్యం రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ నెల్లూరు బ్యారేజ్ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బ్రిటీష్ సర్కార్ నిర్మించిన పాత ఆనకట్టకు పది మీటర్ల ఎగువన 10.9 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా 640 మీటర్ల వెడల్పుతో నెల్లూరు బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. పాత ఆనకట్ట వల్ల వరద ప్రవాహం వెనక్కి ఎగదన్నడం బ్యారేజ్ నిర్మాణానికి సమస్యగా మారింది. పాత ఆనకట్టను పూర్తిగా తొలగించి బ్యారేజ్ నిర్మిస్తున్న ప్రాంతానికి 20 మీటర్ల ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. 2016 వరకూ టీడీపీ సర్కార్ దీన్ని పరిశీలించకుండా జాప్యం చేసింది. ఆ తరువాత డిజైన్లలో మార్పులు చేసి అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించింది. కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు రాబట్టుకునే పనులకే ప్రాధాన్యం ఇచ్చింది. 2016 నుంచి 2019 మే 29 వరకూ రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా బ్యారేజ్‌లో 57 ఫియర్లను (కాంక్రీట్ దిమ్మెలు) పునాది కంటే ఒక మీటర్ ఎత్తు వరకు మాత్రమే చేయగలిగింది. నేడు ప్రతికూల పరిస్థితుల్లోనూ పూర్తి.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2020 మార్చి నుంచి 2021 చివరిదాకా కరోనా మహమ్మారి మూడు దఫాలు విజృంభించింది. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో వరుసగా భారీ వరదలు వచ్చాయి. నెల్లూరు బ్యారేజ్ నుంచి 2019–20లో 45.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయంటే ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందో అంచనా వేయవచ్చు. వరద ఉద్ధృతికి బ్యారేజ్‌కు ఎగువన ఆయకట్టుకు నీళ్లందించడం కోసం తాత్కాలికంగా నిర్మించిన కాఫర్ డ్యామ్ (మట్టికట్ట) దెబ్బతిన్నది. వరదలు తగ్గాక మళ్లీ మట్టికట్టను సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ పనులు చేయడం సవాల్‌గా మారింది. ఈ తీవ్ర ప్రతికూలతల్లోనూ బ్యారేజ్‌లో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 57 పియర్ల మధ్య పది మీటర్ల ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు, కోతకు గురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి పది మీటర్ల ఎత్తు, 4.3 మీటర్ల వెడల్పుతో 8 గేట్లు (స్కవర్ స్లూయిజ్ గేట్లు) వెరసి 51 గేట్లను ఏర్పాటు చేసింది. గేట్లను ఎత్తడం, దించడానికి వీలుగా ఎలక్ట్రిక్ విధానంలో హాయిస్ట్‌ను ఏర్పాటు చేసింది. బ్యారేజ్‌కు 22 మీటర్ల ఎత్తులో 1.2 మీటర్ల మందం, 7.5 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను పూర్తి చేశారు. బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా కుడి, ఎడమ కరకట్టలను పటిష్టం చేసేందుకు రూ.77.37 కోట్లను ఖర్చు చేశారు. నూతన అధ్యాయం.. నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ బ్యారేజీని పూర్తి చేశారు. ఈనెల 6న నెల్లూరు బ్యారేజ్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేసి చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించనున్నారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీటితోపాటు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. నెల్లూరు–కోవూరు మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి పెరగనున్న భూగర్భ జలమట్టం.. నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా, వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులు కొనసాగాయి. సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు మార్గదర్శకాల మేరకు సవాల్‌గా తీసుకుని పెన్నా బ్యారేజ్‌ను పూర్తి చేశాం. ఆయకట్టుకు సమృద్ధిగా నీటి సరఫరాతోపాటు బ్యారేజ్‌లో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సాగు, తాగునీటి సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారాన్ని చూపారు. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ. వరద ఉద్ధృతిలోనూ.. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా భారీ వరదలు వచ్చాయి. మట్టికట్ట కొట్టుకుపోవడంతో దాన్ని సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ పనులు పూర్తి చేయడం సవాల్‌గా మారింది. వరద ఉద్ధృతిని అధిగమించి సీఎం జగన్ నిర్దేశించిన గడువులోగా బ్యారేజ్‌ను పూర్తి చేశాం. ఈ బ్యారేజ్ పూర్తవ్వడంతో నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కల నెరవేరుతోంది. – హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ -
దశాబ్దాల కల ‘సంగం’ సాకారం
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా నెల్లూరుకు ముంపు ముప్పు తప్పింది. చెప్పిన మాట మేరకు యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. దీనికి తోడు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి కూడా రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం. (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ పనులను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈనెల 6న బ్యారేజ్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించవచ్చు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం ఖాయం. తద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్ జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. శిథిలమైనా పట్టించుకోని దుస్థితి నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. దానిపై 0.3 మీటర్ల మేర ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వ చేసినా.. ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. సంగం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ నిర్మించి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ డిమాండ్‌ను 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ స్వప్నం సాకారం దిశగా అడుగులు.. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008 మే 21న పనులు చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. ఈ పనులకు అప్పట్లో రూ.30.85 కోట్లు వ్యయం చేశారు. అయితే మహానేత వైఎస్ హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే టీడీపీ హయాంలో పెద్దపీట సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ.. అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో డిజైన్లలో మార్పులు చేయాలని 2013లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2013 నవంబర్ 23న నిపుణుల కమిటీని నియమించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం) నిర్మించాలని 2014లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆమోదించడంలో రెండేళ్ల పాటు జాప్యం చేసిన టీడీపీ సర్కార్.. ఎట్టకేలకు 2016 జనవరి 21న బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్‌ను 2017కు పూర్తి చేస్తామని ఒకసారి.. 2018కి పూర్తి చేస్తామని మరోసారి.. 2019కి పూర్తి చేస్తామని ఇంకోసారి ముహూర్తాలను మారుస్తూ వచ్చింది. టీడీపీ సర్కార్ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యారేజ్‌లో 85 పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల చొప్పున అరకొరగా పూర్తి చేసింది. చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు(ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.86.10 కోట్లను ఖర్చు చేసినా బ్యారేజ్ పనులను ఒక కొలిక్కి తేలేకపోయింది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ దిగువ వైపు నుంచి... అటు కరోనా, ఇటు వరద.. అయినా పూర్తి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి, శరవేగంగా పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నా నది ఉప్పొంగి ప్రవహించింది. 2019–20 లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల నీరు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉధృతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్ పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. బ్యారేజ్ 85 పియర్లను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఈ పియర్స్ మధ్య 12 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు (స్కవర్ స్లూయిజ్) బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి విద్యుత్‌తో పనిచేసే హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిలోమీటర్లు, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిలోమీటర్ల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తి చేశారు. ఈ పనులను రూ.131.12 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి.. నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు సైతం రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008–09లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పదేళ్ల తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎంగా పూర్తి చేశారు. నెల్లూరు నగరానికి సమీపాన ఇప్పటికే ఉండే పాత ఆనకట్టకు వంద మీటర్ల ఎగువున ఇంకొక కొత్త బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును కూడా ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. 13 ఏళ్ల క్రితం మొదట్లో రూ.147.20 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో 2014కు ముందే రూ.86.62 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.274.83 కోట్లకు పెరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనతో కాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం కమీషన్లకు అవకాశం ఉన్న పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. అయితే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. కేవలం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ప్రధాన కాంక్రీట్, ఇతర మట్టి పనులన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాల్లో సాగు నీటి పారుదల అవకాశాలు మెరుగు పడతాయి. నెల్లూరు– కోవూరుల మధ్య రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆనకట్టకు ఎగువన ఇన్ఫిల్ట్రేషన్ బావులు నిండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి నెల్లూరు çనగరం.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఇదో మహోజ్వల ఘట్టం సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని మహానేత వైఎస్సార్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి ఈ నెల 6న జాతికి అంకితం చేయనుండటం మహోజ్వల ఘట్టం. కరోనా తీవ్రత, పెన్నా వరద ఉధృతిని తట్టుకుని.. బ్యారేజ్‌ను పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ బ్యారేజ్‌కు ఆయన పేరు పెట్టాం. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టుకు నీళ్లందించి సస్యశ్యామలం చేస్తాం. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి రికార్డు సమయంలో పూర్తి సీఎం ఆదేశాల మేరకు బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ఇది దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. బ్రిడ్జితో సంగం–పొదలకూరు మధ్య రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ నాణ్యతకు ప్రాధాన్యత సంగం బ్యారేజ్ పనులను అత్యంత నాణ్యతతో శరవేగంగా పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టుగా సంగం బ్యారేజ్‌ను ప్రకటించి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు గడువులోగా పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. – హరినారాయణ రెడ్డి, సీఈ, తెలుగుగంగ -
1న పోలవరంపై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు సెప్టెంబర్ ఒకటో తేదీన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఇందులో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరానికి నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇస్తుంది. తర్వాత దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం జల్ శక్తి శాఖ పంపుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహాయ, సహకారాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు గురువారం ఢిల్లీలో రాష్ట్ర అధికారుల బృందంతో కేంద్ర అధికారుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో 2017–18 ధరల ప్రకారం.. కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించిన మేరకు రూ.55,656.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.2,863 కోట్లను రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం కోసం రూ.10 వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని కోరారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో చెల్లించాలన్నారు. రాష్ట్ర అధికారులు చేసిన ఈ ప్రతిపాదనపై జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీకి కేంద్ర కమిటీ సూచించింది. దీంతో కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు వచ్చే నెల ఒకటిన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సీడబ్ల్యూసీ అధికారులు వర్చువల్‌గా భేటీ కానున్నారు. -
ఈ నెలలో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం
రాపూరు: నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం వద్ద ఆదివారం ఆయన జిల్లా ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న, జరగాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు, సంగం బ్యారేజీలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, వీటిని ఆయన కుమారుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పారు. తెలుగుగంగ కాలువ ద్వారా నీరందని చెరువులకు ఎత్తిపోతల పద్ధతిలో నీరిస్తామని తెలిపారు. కండలేరు, సోమశిల కాలువల పనులు పునఃప్రారంభిస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నీటిపారుదల రంగంలో సమస్యల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. వైఎస్ రాజÔశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటిపారుదలశాఖలో జరిగిన అభివృద్ధి ఆ తరువాత ఆగిపోయిందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాత మళ్లీ కదలిక వచ్చిందని తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాల కాలువల పనులను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ సోమశిల–స్వర్ణముఖి (ఎస్ఎస్) లింకు కాలువ పనులను ప్రారంభించాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ కాలువ పనుల్ని అటవీ అనుమతులు లేవని గత ప్రభుత్వం నిలిపేసిందని చెప్పారు. కండలేరు డ్యాం నుంచి లి‹ఫ్ట్ ద్వారా వెలుగోను, రాపూరు చెరువుల మీదుగా ఆలూరుపాడుకు కాలువ తవ్వేందుకు, పోకూరుపల్లి రైతులకు లిఫ్ట్ ఇరిగేషçన్ ద్వారా నీరందించేందుకు రూ.528 కోట్లతో ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఈ పనుల్ని ప్రారంభించేందుకు, మద్దెలమడుగులో 18 అడుగుల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డిని తీసుకురావాలని కోరారు. అంతకుముందు మంత్రులు కండలేరు హెడ్‌రెగ్యులేటర్‌ను, ఫొటో ఎగ్జిబిçషన్ను పరిశీలించారు. ఈ సమావేశంలో జేసీ కూర్మనాథ్, నీటిపారుదలశాఖ సీఈ హరినారాయణరెడ్డి, సోమశిల ఎస్ఈ రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్, జిల్లా పరిçషత్ ఉపాధ్యక్షురాలు ప్రసన్న, రాపూరు ఎంపీపీ చెన్నుబాలకృష్ణారెడ్డి, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
దూరదృష్టితో గట్టెక్కించారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పది రోజులపాటు మహోగ్రంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎగువన భద్రాచలం వద్ద 71 అడుగులు, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 21 అడుగులతో క్షణక్షణం వణికించింది. మూడు రోజుల పాటు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికతో ప్రమాద ఘంటికలు మోగించింది. అయితే ఈ స్థాయిలో వరద వచ్చినా గోదావరి తీరాన ఉన్న నాలుగు జిల్లాల్లో ఎక్కడా గండ్లు పడ్డ దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపే దీనికి కారణమని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో దూరదృష్టితో రూ.600 కోట్లతో 535 కిలోమీటర్లు మేర గోదావరి గట్లను ఆధునికీకరించడం, ఎత్తు పెంచడం వల్లే వరద ఉగ్రరూపం దాల్చినా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగినట్లు పేర్కొంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు... వైఎస్సార్ సీఎంగా ఉండగా 2006 ఆగస్టు 7న గోదావరికి వరదలు వచ్చాయి. నాడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22.80 అడుగుల నీటిమట్టంతో 28,50,664 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. నాటి వరదల ఉధృతికి వశిష్ట ఎడమ గట్టుకు పి.గన్నవరం మండలం మొండెపులంక, గౌతమి కుడిగట్టుకు అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద భారీగా గండ్లు పడ్డాయి. ఏటిగట్లకు పడ్డ గండ్లతో పలు మండలాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్సార్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక బృందాన్ని గోదావరి జిల్లాలకు పంపి వాస్తవ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయించారు. ఎటు చూసినా 8 మీటర్ల ఎత్తుతో.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 535 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్ల పటిష్టం కోసం వైఎస్సార్ రూ.548 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తయ్యేసరికి అంచనాలు రూ.600 కోట్లు దాటిపోయాయి. 1986 నాటి వరదల సమయంలో ఏటిగట్లు ఆరు మీటర్ల ఎత్తు ఉండగా మరో రెండు అడుగులు పెంచి ఆధునీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్లకు పెంచి విస్తరించారు. ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరీవాహకం వెంట గ్రోయిన్స్ కూడా నిర్మించారు. పటిష్టమైన చర్యల ద్వారా 1986 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించారు. తద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడిగా నిలిచారు. ముందుచూపు ఫలితమే.. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 20.10 అడుగులతో రికార్డు స్థాయిలో 35,06,380 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అత్యధికంగా నమోదైన 1986 వరదలనే ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లు పటిష్టం చేయాలని వైఎస్సార్ నిర్ణయించారు. దూరదృష్టితో ఎత్తు పెంపు, వెడల్పు, పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో తాజా వరదల్లో ఏటిగట్లకు ఎక్కడా చిన్న గండి కూడా పడలేదు. ఆనాడు ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలే గోదావరి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచాయి. గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు వైఎస్సార్ హయాంలో చేపట్టిన రక్షణ చర్యల్లో కొన్ని ప్యాకేజీలను ఆయన హఠాన్మరణం తరువాత చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది. వశిష్ట కుడి గట్టు నరసాపురం, వశిష్ట ఎడమగట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు నిలిచిపోయాయి. అప్పట్లో పనులు నిలిచిపోయిన ప్రాంతాల్లోనే తాజాగా అధికార యంత్రాంగం, స్థానికులు నిద్రాహారాలు మాని గట్లకు కాపలా కాయాల్సి వచ్చింది. రాజోలు పరిధిలోని తాటిపాక మఠం నుంచి అంతర్వేది, రాజోలు నుంచి అంతర్వేది వరకు మానేపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి భయపెట్టింది. సఖినేటిపల్లి లంక, టేకిశెట్టిపాలెం, దిండి, రామరాజులంక, ఎల్ గన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో వరద భీతిగొల్పింది. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఈ పనులను తరువాత ప్రభుత్వాలు పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు. ఆ నిర్ణయమే కాపాడింది.. ఈరోజు గోదావరి జిల్లాలు సురక్షితంగా బయటపడ్డాయంటే ఆ రోజు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆయన దూరదృష్టితో కరకట్ట పటిష్టం చేయకుంటే ఈ వరదలకు ఏం జరిగేదో ఊహించలేం. ఎప్పుడూ లేనిది జూలైలో ఇంత ఉధృతంగా రావడం ప్రమాదకరమే. 2006లో వైఎస్సార్ సీఎంగా ఉండగా ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఈఈగా ఏటిగట్ల అంచనాలు రూపొందించే ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్ఈ, జలవనరులశాఖ, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి -
వరుసగా.. వడివడిగా
సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతన్నలకు ప్రయోజనం చేకూర్చాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, రాయలసీమలోని జోలదరాశి, రాజోలి జలాశయాలు, కుందూ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ డైవర్షన్ స్కీం కుడి కాలువ, మడకశిర బైపాస్ కెనాల్, భైరవానితిప్ప– కుందుర్పి ఎత్తిపోతలతోపాటు వరికపుడిశెల ఎత్తిపోతల, చింతలపూడి ఎత్తిపోతల, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకంతో సహా 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించారు. వచ్చే నెల నెల్లూరు, సంగం బ్యారేజీలు ఆగస్టు మూడో వారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీపై నెలకొల్పనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహం కోసం నిరీక్షిస్తున్నామని, త్వరలోనే రానుందని చెప్పారు. దసరాకి అవుకు రెండో టన్నెల్.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను దసరా నాటికి సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలకు వరదాయిని లాంటి వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. వెలిగొండ టన్నెల్–2లో ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జూలైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల మేర పనులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు సిద్ధం చేయాలని సీఎం జగన్ గడువు విధించారు. వంశధార పనులు ముమ్మరం.. వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, అక్టోబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలోనే గొట్టా బ్యారేజీ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు నీటిని తరలించే ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఎత్తిపోతలకు రూ.189 కోట్లు వ్యయం కానుంది. పశ్చిమ కర్నూలుపై ప్రత్యేక దృష్టి దశాబ్దాలుగా బాగా వెనకబాటుకు గురైన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సమావేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు. నీటి వసతి, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసల నివారణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు నిర్దేశించారు. భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలన్నారు. ఆ ప్రాంతంలో సాగు, తాగునీటి పథకాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని ఆదేశించారు. సాగునీరు అందించడం వల్ల ఉపాధి కల్పించి వలసలను నివారించవచ్చన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు తదితరాలను నెలకొల్పి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అక్కడప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థ్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ప్రాజెక్టుల సీఈలు తదితరులు పాల్గొన్నారు. పోలవరంపై సమగ్ర సమీక్ష.. ► పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, గోదావరికి ముందస్తు వరదలతో తలెత్తిన పరిణామాలపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గతంలో వరద ఉధృతికి కోతకు గురై గ్యాప్–1, గ్యాప్–2ల్లో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులపై విస్తృతంగా చర్చించారు. ఇందుకు సమగ్ర విధానాన్ని నిర్ధారించేందుకు తొమ్మిది రకాల పరీక్షలు, ఫలితాల నివేదికలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తి కాగా మరికొన్ని నిర్వహించాల్సి ఉందని వివరించారు. ► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సూచించిన విధానం ప్రకారం దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటంతోపాటు 30.5 మీటర్ల ఎత్తున నిర్మించే పనులను షెడ్యూల్ ప్రకారమే చేపట్టామని.. కానీ గోదావరికి ముందస్తు వరదల వల్ల దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన ప్రాంతం మీదుగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి వరద జలాలు చేరాయని సమావేశంలో అధికారులు తెలిపారు. ► ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి వరద జలాలు చేరడం వల్ల అగాధాలు పూడ్చేందుకు చేపట్టాల్సిన పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. ముందస్తు వరదల వల్ల దిగువ కాఫర్ డ్యామ్ పనులకు అంతరాయం కలిగిందని చెప్పారు. ► గోదావరిలో వరద కనీసం 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగానీ దిగువ కాఫర్ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టగానే పోలవరం పనులను ముమ్మరంగా చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం సూచించారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లను రీయింబర్స్ చేయాల్సి ఉందని సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చు చేసిందన్నారు. ఆ నిధులను రీయింబర్స్ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలవరం పనులను వేగవంతం చేసేందుకు అడ్హాక్ (ముందస్తు)గా రూ.6 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంపొనెంట్ (విభాగాలు) వారీగా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా అడ్‌హాక్‌గా నిధులు తెప్పించుకుంటే కీలక పనులను త్వరితగతిన పూర్తి చేయవచ్చన్నారు. వరద తగ్గగానే శరవేగంతో పనులు చేసేందుకు ఆ నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ మేరకు అడ్‌హాక్‌గా నిధులు సమకూర్చేలా కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులకు నిర్దేశించారు. పోలవరం కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీలు, హెడ్ రెగ్యులేటర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. -
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేలుస్తాం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను రెండురోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షించిన నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) బృందం.. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమేనని తెలిపింది. ఇందుకు మూడు పద్ధతులను ప్రతిపాదించింది. వాటిపై 15 రోజుల్లోగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ)లకు నివేదిక ఇస్తామని ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎల్.కపిల్ తెలిపారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ఎంపికచేసిన పద్ధతి ప్రకారం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించి నివేదిక ఇస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం రెండునెలలు పడుతుందని చెప్పారు. తీస్తా జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో ఇదేరీతిలో డయాఫ్రమ్ వాల్ కోతకు గురవడంతో దానికి మరమ్మతులు చేసి, పూర్వస్థితికి తెచ్చామని పేర్కొన్నారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల మేరకు పోలవరం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చాలని ఎన్హెచ్పీసీకి రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. దీంతో ఎన్‌హెచ్‌పీసీ ఈడీ ఎస్.ఎల్.కపిల్ నేతృత్వంలో నిపుణులు విపుల్సాగర్, ఎ.కె.భారతిలతో కూడిన బృందం మంగళవారం పోలవరం చేరుకుని డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించింది. బుధవారం కూడా మరోసారి డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. సామర్థ్యం తేల్చేందుకు సమగ్రంగా పరీక్షలు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున 1.5 మీటర్ల వెడల్పు, గరిష్టంగా 90 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశాల ద్వా రా అధిక ఉద్ధృతితో వరద ప్రవహించి 400 నుంచి 1,100 మీటర్ల వరకు మినహా కుడి, ఎడమ వైపున డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతంతోపాటు కోతకు గురికాని ప్రాంతంలోను డయాఫ్రమ్ వాల్‌ను ఎన్‌హెచ్‌పీసీ బృందం పరి శీలించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చడానికి మూడురకాల పద్ధతులను ప్రతిపాదించింది. ఎన్‌హెచ్‌పీసీ బృందం ప్రతిపాదించిన మూడు పద్ధతులు ► మొదటి పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి మీటర్‌కు డయాఫ్రమ్ వాల్ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఒకటిన్నర అడుగుల లోతు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ► రెండో పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి 40 మీటర్లకు ఒకచోట డయాఫ్రమ్ వాల్ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఆరుమీటర్ల వరకు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఇందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మించిన బావర్–ఎల్అండ్టీ సంస్థ అనుమతి తీసుకోవాలి. ► మూడో పద్ధతి: డయాఫ్రమ్ వాల్‌కు ఒక మీటర్ ఎగువన, ఒక మీటర్ దిగువన ప్రతి 40 మీటర్లకు ఒకచోట జిగ్‌జాగ్ విధానంలో 90 మీటర్ల లోతు వరకు బోర్లు తవ్వి, వాటిలోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఎన్‌హెచ్‌పీసీ నివేదికే కీలకం ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలపై ఎన్హెచ్పీసీకి మినహా ఏ సంస్థకు అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై పరీక్షలు చేసి ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చే నివేదికే కీలకం. ఆ నివేదిక ఆధారంగానే డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే కోతకు గురైన ప్రాంతంలో మాత్రమే కొత్తగా నిర్మించి, ఇప్పుడున్న దానికి అనుసంధానం చేయాలా? అన్నది తేల్చనుంది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టనుంది. ఎన్‌హెచ్‌పీసీ బృందం వెంట పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్, ఐఐటీ నిపుణుడు సందీప్ తదితరులున్నారు. -
విపత్తులు, వరద కష్టాలపై ముందస్తు జాగ్రత్తలు
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తే విపత్తులు, వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. శాఖాపరంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సాగునీటి ప్రాజెక్టుల ఇన్చార్జిలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జూలై నుంచి వర్షాలు ప్రభావం చూపనున్న నేపథ్యంలో గతంలో జరిగిన నష్టాలు, వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అ«ధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంజనీర్ ఇన్ చీఫ్ జి.అనిల్‌కుమార్.. చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, ఎస్సారెస్పీ, దేవాదుల, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్, ఇందిరమ్మ వరద కాల్వ సహా 11 ప్రాజెక్టుల నిర్వాహకులకు వివిధ జాగ్రత్తలపై సోమవారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వరదల సందర్భంగా విపత్తు సంసిద్ధత, ఏదైనా ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయా కార్యాలయాల్లో సిబ్బంది 24 గంటలు పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌లతో పర్యవేక్షణ: ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదు ర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెంట్రల్ ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఈ నెల 16 నుంచి డిసెంబర్ 15 వరకు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలో సెలవు లేకుండా విధులు నిర్వహించాల్సి ఉన్నందున సిబ్బందికి కేటాయించిన విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించనున్నారు. వరదలు ఉధృతంగా ఉంటే క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించేందుకు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ప్రమాదకరంగా ఉన్న పాయింట్లు, రెగ్యులేటర్ గేట్లు, ప్రధాన, మధ్యస్థ ప్రాజెక్ట్‌ల కోసం వరద గేట్లు గుర్తించాలని ఆదేశాలు అందాయి. అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల వివరాలు అందుబాటులో ఉండాలని, వాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని అధికారులకు సూచించారు. కంట్రోల్ రూమ్‌లు సమర్థవంతంగా పని చేసేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించారు. -
ముందుగానే నీటి విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుకు ఖరీఫ్ పంటల సాగుకు ముందుగా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభమయ్యే రోజే గోదావరి డెల్టాకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల ఖరీఫ్ సాగును రైతులు ముందుగా చేపడతారు. సకాలంలో పంటల సాగు ద్వారా మంచి దిగుబడులు చేతికి అందనున్నాయి. నవంబర్‌లో తుపాన్ల ప్రభావం ప్రారంభమయ్యేలోగా పంట నూర్పిళ్లు పూర్తవుతాయి. తద్వారా ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరోవైపు ఖరీఫ్ నూర్పిళ్లు పూర్తి కాగానే సకాలంలో రబీ పంటల సాగు చేపట్టవచ్చు. నీటి లభ్యతను బట్టి మూడో పంట కూడా సాగు చేసుకునే వెసులుబాటను రైతులకు కల్పించాలన్నది సీఎం జగన్ సంకల్పం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముందుచూపుతో నీటి నిల్వ.. ఖరీఫ్ పంటకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో పులిచింతల, గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని నిల్వ చేసేలా జలవనరులశాఖను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మే 12న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జలాశయాల్లో నీటి నిల్వలు, లభ్యతను సమీక్షించిన సీఎం జగన్ ఆయకట్టుకు ముందుగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో ఐఏబీ (నీటి పారుదల సలహా మండలి) సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. ముందుగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచామని, సకాలంలో పంటల సాగు చేపట్టాలని రైతులను చైతన్యం చేసింది. వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండటంతో వరుసగా 2019, 2020, 2021లో ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదీ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నీటి లభ్యత బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదీ కోటి ఎకరాలకు నీళ్లందుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు చానల్‌కు ► పోలవరంలో నిల్వ చేసిన నీటిని రివర్ స్లూయిజ్‌ల ద్వారా విడుదల చేసి గోదావరి డెల్టాకు బుధవారం నుంచే సరఫరా చేయనున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులో 33.14 టీఎంసీలు నిల్వ ఉండగా ఈ నెల 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్‌కు విడుదల చేయనున్నారు. గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వెలిగల్లు ప్రాజెక్టుల ఆయకట్టుకూ ఈ నెల 10 నుంచే నీరు విడుదల కానుంది. ► పెన్నా బేసిన్‌లోని సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు జూన్ 10 నుంచే నీటిని సరఫరా చేస్తారు. ► గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటితో ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈనెల 30 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు జూలై 15 నుంచి నీటిని సరఫరా చేస్తారు. ► గొట్టా బ్యారేజీలో నీటి లభ్యత ఆధారంగా ఈ నెలలోనే వంశధార ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ► తుంగభద్ర డ్యామ్, సుంకేశుల బ్యారేజీపై ఆధారపడ్డ హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్ ఆయకట్టుకు లభ్యత ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు.