ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి సీఎంకు వివరిస్తున్న మంత్రి అనిల్, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పూర్తి చేయాల్సిందేనని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. 2021 డిసెంబర్‌లోగా పోలవరం జలాశయం పనులను పూర్తి చేసి.. 2022 ఖరీఫ్ నాటికి కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించాలని స్పష్టం చేశారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ కింద వేగంగా పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం), కాలువల పనులు చేస్తున్నామని అధికారులు వివరించారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ పనులను మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందే కాఫర్ డ్యామ్‌ల పనులు పూర్తి కావాలన్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్)తో సహా మొత్తం ప్రాజెక్టు పనులను 2021 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. తద్వారా 2022 ఖరీఫ్ నాటికి ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ (కాలువల) ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి పోలవరం నుంచి ప్రత్యేకంగా పైపులైన్ ద్వారా గోదావరి జలాలను తరలించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇంకా సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.
రాయలసీమ ఎస్పీవీ లోగోకు ఆమోదం
► రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఏర్పాటు చేసిన ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వివరించారు. ఎస్పీవీ లోగోకు సీఎం ఆమోదం తెలిపారు. వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
► ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
► గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ పనులు మార్చి నాటికి పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని అధికారులు వివరించారు. అవుకు మూడో టన్నెల్ పనులను త్వరగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
► చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో తొలిసారి 10 టీఎంసీల నీటిని నింపడంపై సీఎం హర్షం వ్యక్తం చేస్తూ.. గండికోట రిజర్వాయర్‌లో 20 టీఎంసీల వరకు నీటిని
నిల్వ చేయాలని ఆదేశించారు.
► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం రెండో దశ పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment