Eenadu Ramoji Rao Fake News On Polavaram Project Works - Sakshi
Sakshi News home page

ఏది నిజం?: ‘వరం’ పోయిందని రామోజీ కడుపు మంట

Published Sat, May 13 2023 6:14 AM | Last Updated on Sat, May 13 2023 11:28 AM

Eenadu Ramoji Rao Fake News On Polavaram Project Works - Sakshi

ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి రూ.2,917.78 కోట్ల విలువైన పనులను 60–సీ కింద తప్పించి నవయుగకు నామినేషన్‌పై కట్టబెడితే పనుల ప్రగతి కుంటుపడుతుందని 2018 ఫిబ్రవరి నుంచి 2019 జనవరి వరకూ పలుమార్లు పీపీఏ హెచ్చరించింది. పీపీఏ సూచనలను తుంగలో తొక్కి చంద్రబాబు పనులు నవయుగకు అప్పగించేశారు. ఇది తప్పుగా అన్పించలేదా రామోజీ? ఎందుకంటే.. నవయుగ మీ కుమారుడి వియ్యంకుడికి చెందినదనేగా! 
 
కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. ఆ అవినీతిని ప్రక్షాళన చేయడం కోసం నవయుగపై వేటు వేసి మిగిలిన రూ.1771.74 కోట్ల విలువైన పనులకు పీపీఏ చేసిన సూచనలకు కట్టుబడే రివర్స్‌ టెండరింగ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించారు. రివర్స్‌ టెండరింగ్‌లో రూ.1,548 కోట్లకే పనులు చేయడానికి మేఘా ముందు కొచ్చింది. రూ.223 కోట్లను ఖజానాకు ఆదా చేయడం ద్వారా పోలవరంలో వియ్యంకుడు, చంద్రబాబులతో కలిసి మీరు చేసిన దోపిడీని సీఎం వైఎస్‌ జగన్‌ బట్టబయలు చేశారనేగా మీ కడుపుమంట రామోజీ? 
 
మీరు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం నిజం రామోజీ.. పాలకులకు దీర్ఘదృష్టి,సరైన వ్యూహం, అంకితభావం లేకపోతే ప్రధాన ప్రాజెక్టును సుడిగుండంలోకి ఎలా నెట్టేయవచ్చో 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు చంద్రబాబు నిరూపించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అవగాహనైనా ఉండాలి లేదా ఇంజినీరింగ్‌ నిపుణులు చెబితే వినాలి. ఆ రెండూ లేకుంటే ఎలాంటి సంక్షోభాలు తలెత్తుతాయో చెప్పడానికి పోలవరంలో చంద్రబాబు పాల్పడిన పాపాలే నిదర్శనం.  
 
అస్మదీయుడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో చేసిన తప్పులను తస్మదీయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరిదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా శరవేగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారనే కడుపుమంటతో.. కాంట్రాక్టర్‌గా వియ్యంకుడికి చెందిన నవయుగపై వేటు వేశారనే అక్కసుతో.. తమ డీపీటీకి అడ్డుకట్ట పడిందనే నెపంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ‘ఈనాడు’లో పదే పదే అవాస్తవాలను అచ్చేస్తూ రామోజీరావు దుష్ఫ్రచారం చేస్తున్నారు. దానికి మరో తార్కాణం ‘పోలవరం.. జగమంత వైఫల్యం’ శీర్షికతో శుక్రవారం ప్రచురించిన కథనంలో రామోజీరావు కడుపుమంట తప్ప.. వీసమెత్తు నిజం లేదు. 

సాంకేతిక అర్హతలు మార్చేశారని కలగన్నారా? 
టీడీపీ సర్కార్‌ హయాంలో ఇంజినీరింగ్‌ పనుల్లో జరిగిన అవినీతిపై నిపుణుల కమిటీతో విచారణ చేయించి.. ఆ కమిటీ సిఫార్సు మేరకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి, ప్రజాధనాన్ని ఆదా చేస్తామని ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీ అమల్లో భాగంగానే పోలవరం పనుల్లో చంద్రబాబు నామినేషన్‌పై నవయుగకు కట్టబెట్టిన పనులపై నిపుణుల కమిటీ విచారణ చేసింది.

నవయుగ చేయగా మిగిలిన రూ.1,771.74 కోట్ల విలువైన పనులను రద్దు చేసి.. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దాంతో రూ.1,771.74 కోట్ల విలువైన పనులను రద్దు చేసి.. దాన్నే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. 2012లో పోలవరం హెడ్‌ వర్క్స్‌కు జారీ చేసిన టెండర్‌ షెడ్యూళ్లలో నిబంధనలను యథాతథంగా పెట్టి.. టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

రివర్స్‌ టెండరింగ్‌లో 12.6 శాతం తక్కువ ధరకు అంటే రూ.1,548 కోట్లకే పనులు చేయడానికి ముందుకొచ్చింది. అంటే.. ఖజానాకు రూ.223.74 కోట్లు ఆదా అయ్యింది. తద్వారా రామోజీ, వియ్యంకుడితో కలిసి చంద్రబాబు డీపీటీ విధానంలో పోలవరంలో ప్రజాధనాన్ని దోచేశారన్నది సీఎం వైఎస్‌ జగన్‌ నిరూపించారు. వియ్యంకుడిని కాంట్రాక్టర్‌గా తప్పించారనే కక్షతో.. డీపీటీకి అడ్డుకట్ట పడిందే అక్కసుతో.. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నారనే కడపుమంటతో పోలవరంపై అవాస్తవాలను వల్లె వేస్తూ ప్రభుత్వంపై రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారు.

గత పదేళ్లలో ఒక్కటైనా 35 మీటర్ల ఎత్తుతో రాతిమట్టికట్ట, స్పిల్‌ వే నిర్మించిన అనుభవం ఉండాలని.. ఆ పనులు చేసిన ప్రధాన కాంట్రాక్టర్‌గా లేదా జాయింట్‌ వెంచర్‌లో భాగస్వామిగా ఉండాలనే నిబంధనను రివర్స్‌ టెండరింగ్‌లో పెట్టారు. ఆ అర్హత ఉంది కాబట్టే.. ఆర్థిక బిడ్‌కు మేఘా అర్హత సాధించింది. కానీ.. ఆ నిబంధనను తొలగించి.. సాంకేతిక అర్హతలను మార్చేసి మేఘాకు పనులు కట్టబెట్టినట్లు కలగన్నావా రామోజీ? 

సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకే..
పోలవరం ప్రాజెక్టు డిజైన్లను డీడీఆర్పీ(డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) సమీక్షించి.. ప్రతిపాదించిన వాటిని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) ఆమోదిస్తూ వస్తోంది. స్పిల్‌ ఛానల్‌ చివర్లో 1354 మీటర్ల పొడవున కటాఫ్‌ డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించాలని.. ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–3లో రాతిమిట్టకట్ట స్థానంలో 150.5 మీటర్ల పొడవుతో కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మించాలని.. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ కుడి వైపున కొండవాలు రక్షణ పనులు చేపట్టాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది.

ఆ పనులకు అయ్యే వ్యయం రూ.683 కోట్లు అవుతుందని అంచనా వేసింది. రూ.683 కోట్లతో చేపట్టిన పనులను నామినేషన్‌పై మేఘాకు ఇవ్వడానికి అధికారులు ప్రయత్నించారని కలగన్నావా రామోజీ? చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో భ్రష్టు పట్టించిన టెండర్ల వ్యవస్థను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రక్షాళన చేస్తూ రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో 67 మార్గదర్శకాల మేరకు రూ.683 కోట్ల పనులకు జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతో అధికారులు టెండర్లు నిర్వహించారు. ఇందులో తప్పేముంది రామోజీ? 

విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయాన్ని భరించి.. అన్ని అనుమతులు తెచ్చి తామే పూర్తి చేస్తామని కేంద్రం విభజన చట్టం సాక్షిగా హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసి.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని నాటి టీడీపీ సర్కార్‌ను కోరుతూ వచ్చింది.

ఒప్పందం చేసుకోకుండా కాలయాపన చేస్తూ.. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని నాటి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ ద్వారా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవడంతో.. 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది.

ఈ క్రమంలోనే బడ్జెట్‌ ద్వారా కాకుండా నాబార్డు రుణాలతో పోలవరానికి నిధులు ఇస్తామని.. 2018 డిసెంబర్‌లోగా పూర్తి చేయకపోతే ఇచ్చిన నిధులను రుణంగా పరిగణిస్తామని కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరిస్తూ 2016 డిసెంబర్‌ 26న సీఎంగా చంద్రబాబు సంతకం చేశారు. ఆ తర్వాత 2016 డిసెంబర్‌ 30న పోలవరం పనులు ప్రారంభించారు. అంటే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2014 జూన్‌ 8 నుంచి 2016 డిసెంబర్‌ 30 వరకూ 31 నెలలపాటు పోలవరంలో తట్టెడు మట్టి కూడా చంద్రబాబు ఎత్తలేదు. పోలవరం హెడ్‌ వర్క్స్‌ నాటి ప్రధాన కాంట్రాక్టర్‌ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పోలవరం పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి, తేలికగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. 

కమీషన్లు వచ్చే పనులకే చంద్రబాబు ప్రాధాన్యం  
గోదావరిపై ప్రధాన(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ నిర్మించడానికి వీలుగా.. వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను తొలుత పూర్తి చేయాలి. ఈ పనులు పూర్తయ్యేలోగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. కానీ.. చంద్రబాబు మాత్రం కమీషన్ల కోసం తేలికగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే మట్టి తవ్వకం, స్పిల్‌ ఛానల్‌లో కాంక్రీట్‌ను కుప్పలా పోయడం వంటి పనులకే ప్రాధాన్యం ఇచ్చారు.  

► వరద మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండానే, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తి చేశారు. స్పిల్‌ వే పునాది స్థాయిలోనే వదిలేశారు.  

► ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయలేక.. వాటికి ఇరు వైపులా ఖాళీలు వదిలేసి, చేతులెత్తేశారు. 2019 అక్టోబర్‌ 1న గోదావరికి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద (సీడబ్ల్యూసీ గేజ్‌ ప్రకారం) ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల మీదుగా ప్రవహించడం వల్ల దాదాపు 13 మీటర్‌/సెకను వేగంతో వరద ఉద్ధృతి పెరగడంతో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి, స్పిల్‌ వే మీదుగా వరద నీటిని మళ్లించి ఉంటే.. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినే పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు.  

► గోదావరి వరద ఉద్ధృతి వల్ల ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1 నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం +23 మీటర్ల నుంచి –12.00 మీ వరకు అంటే దాదాపు 35  మీటర్ల మందంతో కోతకు గురైంది. గ్యాప్‌–2లో + 8 మీటర్ల నుంచి –12 మీటర్ల వరకు అంటే దాదాపు 20 మీటర్ల మందంతో, దిగువ కాఫర్‌ డ్యాం లో 36.5 మీటర్ల మందంతో గోదావరి గర్భం కోతకు గురైంది. 

► వరద మళ్లింపు మళ్లింపు పనులు అంటే.. అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పూర్తి చేయకపోవడం వల్ల గోదావరి వరద ఉద్ధృతికి స్పిల్‌ ఛానల్‌ లోని కాంక్రీటు బ్లాకులు(దిమ్మెలు) కొట్టుకుపోయాయి. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ప్రభావం వల్ల వరద ఎగదన్నడంతో ముంపు గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టింది. నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

► చంద్రబాబు పాల్పడిన పాపాల వల్లే పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. లేదంటే 2021 నాటికే సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసేవారని అధికారవర్గాలే స్పష్టం చేస్తున్నాయి.  

అవసరం లేకున్నా పట్టిసీమ, పురుషోత్తపట్నం  
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా.. కుడి కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోసేలా రూ.1,300 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల చేపట్టారు. ఈ పనులను 21.99 శాతం అధిక ధరలకు కమీషన్ల కోసం (ఏడాదిలో పూర్తి చేస్తే 16.99 శాతం నజరానా) కాంట్రాక్టర్‌కు అప్పగించారు.  దీనిపై పెట్టే వ్యయాన్ని పోలవరంపై పెడితే.. ఆ ప్రాజెక్టు కొలిక్కి వస్తుందని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ పదే పదే సూచించారు.

ఈ పథకంలో రూ.600 కోట్ల మేర అవినీతి జరిగిందని పోరాటం చేశారు.  తీరా అదే నిజమని కాగ్‌ తేల్చింది.  వరద వల్ల నాలుగేళ్లుగా పట్టిసీమ ఎత్తిపోతల పంప్‌లను కూడా ఆన్‌ చేయలేదు. అంటే.. పట్టిసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కార్‌ చేసిన వ్యయం రూ.1900 కోట్ల వృథా. ఇదే  తరహాలో గోదావరి ఎడమ గట్టుపై పోలవరం ఎడమ కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోతలను చేపట్టారు.

ఆ పథకానికి రూ.1900 కోట్లు  ఖర్చు చేసి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఏలేరు ద్వారా ఏలేరు రిజర్వాయర్‌లోకి భారీగా వరద వస్తుండటంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పంప్‌లను కూడా నాలుగేళ్లుగా ఆన్‌ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఎత్తిపోతల పేరుతో రూ.3,800 కోట్లను చంద్రబాబు వృథా చేసినట్లు స్పష్టమవుతోంది. పోలవరం ప్రాజెక్టులో 35.51 మీటర్ల కంటే దిగువన ఉన్న నీటిని జనవరి నుంచి జూన్‌ మధ్య కుడి కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ పంటలను రక్షించడం, వేసవిలో తాగునీటిని అందించడం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ రూ.776 కోట్లతో ఎత్తిపోతలను చేపట్టారు. ఇది అత్యంత అవసరమని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. 

బాబు నిర్వాకం వల్లే రూ.2,020 కోట్ల భారం  
గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ అప్రోచ్‌ ఛానల్‌ పూర్తి చేయకుండా.. ప్రధాన డ్యామ్‌ పునాదిని టీడీపీ సర్కార్‌ పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను మొదలు పెట్టి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక.. మధ్యలోనే వదిలేసింది. పోలవరం వద్ద 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీగా వదిలిన 800 మీటర్ల ప్రదేశానికి కుంచించుకుపోయి ప్రవహించడం వల్ల వరద ఉద్ధృతి మరింత పెరిగి.. ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–2 నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 0 నుంచి 600 మీటర్ల వరకూ కోతకు గురై భారీ అగాధం ఏర్పడింది.

గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. అగాధాలను ఇసుకతో పూడ్చి.. వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా యథాస్థితికి తెచ్చి.. దెబ్బతిన్న భాగాల్లో పాత డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేసే పనులను రూ.2,020.25 కోట్లతో చేపట్టాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. అంటే.. చంద్రబాబు సృష్టించిన విధ్వంసం వల్లే అదనంగా రూ.2,020.25 కోట్లతో పనులు చేపట్టాల్సి వచ్చిందన్నది స్పష్టమవుతోంది. ఈ పనులకు రూ.1615.75 కోట్ల వ్యయంతో నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో మేఘా, చంద్రబాబుకు సన్నిహితుడైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ పోటీ పోటాగా తలపడ్డాయి. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ముగిసేటప్పటికి రూ.1,599.21 కోట్లకు (1.024 శాతం తక్కువ ధర) కోట్‌ చేసిన మేఘా సంస్థ పనులను దక్కించుకుంది. 

వియ్యంకుడికి నామినేషన్‌పై ఇస్తే ఒప్పా రామోజీ? 
టీడీపీ సర్కార్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి 2018 ఫిబ్రవరి 27న రూ.1244.36 కోట్లు.. 2018 మే 28న రూ.921.87 కోట్లు.. 2019 జనవరి 11న రూ.751.55 కోట్లు వెరసి రూ.2917.78 కోట్లు విలువైన పనులను 60–సీ కింద తొలగించి రామోజీరావు  కుమారుడు కిరణ్‌ వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థకు... సాంకేతిక అర్హతలను పట్టించుకోకుండా.. బ్యారేజ్‌లు, స్పిల్‌ వేలు, రాతి మట్టికట్టలు నిర్మించిన అనుభవం ఉందా లేదా చూసుకోకుండా నోటిమాటపై నామినేషన్‌ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టేశారు.

దేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున నామినేషన్‌పై పనులు కట్టబెట్టిన దాఖలాలు లేవు. దోచుకో.. పంచుకో.. తినుకో(డీపీటీ)లో భాగంగానే మీ వియ్యంకుడికి రూ.2917.78 కోట్ల పనులను చంద్రబాబు అప్పగించారు. ఇదో పెద్ద స్కాం. కానీ.. రామోజీకి మాత్రం అది సక్రమంగా కన్పిస్తుంది. ఎందుకంటే.. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుని డీపీటీ పద్ధతిలో ప్రజాధనాన్ని దోచుకున్నారు కాబట్టి. 

తప్పులు సరిదిద్దుతూ ప్రణాళికాయుతంగా ముందుకు 
► బాబు అక్రమాల నిర్వాకం వల్ల అస్తవ్యస్తంగా మారిన పోలవరాన్ని గాడిలో పెడు­తూ.. ఆనాటి తప్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ.. ప్రణాళికాయుతంగా పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే యాక్షన్‌ ప్లాన్‌ రచించి, అమలు చేస్తున్నారు. కేంద్రం రీయింబర్స్‌ చేయడంలో జాప్యం చేస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ఖజానా నుంచే పోలవరానికి నిధులు ఖర్చు చేస్తున్నారు.  

► కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ... ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. 48 గేట్లతోసహా స్పిల్‌ వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేసి.. 2021 జూన్‌ 11న గోదా­వరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించి చరిత్ర సృష్టించారు. 2021 జూన్‌ నాటికే పోలవరం జలాశయం రూపం సంతరించుకుంది.  

► చంద్రబాబు పాపాల వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీతో 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. 2022 ఏప్రిల్‌లో విధానాన్ని ఖరారు చేయడంతో.. దాని ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 15 నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు.  

► ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని పంపులతో తోడివేస్తూ.. గత మార్చి 4, 5న డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు కోతకు ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చివేస్తూ.. వైబ్రోకాంపాక్షన్‌ చేస్తూ.. జూన్‌ నాటికి యథాస్థితి తెచ్చే­లా పనులను వేగవంతం చేశారు. ఆ తర్వాత డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్ది.. గోదా­వరి వరదల్లోనూ గ్యాప్‌–1, గ్యాప్‌–2లలో ప్రధాన డ్యామ్‌లను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. ప్రధా­న డ్యామ్‌ను పూర్తి చేసి, రైతులకు ముం­దస్తు ఫలాలు అందించే దిశగా చర్యలు చేపట్టారు.   

ముమ్మాటికీ చంద్రబాబు అసమర్థతే
2019 జూన్‌ నాటికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఉంచిన గ్యాప్‌లను సకాలంలో పూడ్చక పోవటంవల్లే ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్దపెద్ద అగాధాలు పడ్డాయని, నదీ గర్భం కోతకు గురైందని, డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందం చెప్పిందనేది రామోజీరావు మాట. అసలు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది 2019 మే 30న కదా? ఆ ఏడాది జూన్‌ 14 నుంచే ఊహించని రీతిలో వరదలతో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. పెద్దపెద్ద గోతులు పడ్డాయి. ఆ వైఫల్యం అధికారంలో ఉండి ఐదేళ్లూ ఆ పని చేయని చంద్రబాబుదా? లేక 15 రోజుల్లో చేయలేకపోయిన వైఎస్‌ జగన్‌దా రామోజీ?  
 
శరవేగంగా దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి  
రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులతో.. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశంలో జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుకను నింపి.. జెట్‌ గ్రౌటింగ్‌.. వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ పూడ్చాలని.. ఆ తర్వాత 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేలా విధానాన్ని 2022 ఏప్రిల్‌లో సీడబ్ల్యూసీ ఖరారు చేసింది.  పెద్దగా లభ్యంగాని 2.50 లక్షల జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లను గుజరాత్, అసోంల నుంచి సేకరించి, ఇసుకను నింపి కోతకు గురైన ప్రదేశంలో వేసి పూడ్చి.. జెట్‌ గ్రౌటింగ్‌ చేస్తూ, వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యథాస్థితికి తెచ్చారు.

ఆ తర్వాత దానిపై 20 మీటర్ల ఎత్తుతో గతేడాది జూలై 9 నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేశారు. కానీ.. అదే రోజున రాత్రి భారీ వరద రావడంతో స్పిల్‌ వే నుంచి దిగువకు విడుదలైన వరద దిగువ కాఫర్‌ డ్యామ్‌ను ముంచెత్తింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 15 నాటికి మేఘా పనులు పూర్తి చేసింది. ఇకపై ఎంత వరద వచ్చి­నా ఇబ్బంది లేకుండా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 44 మీటర్లకు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 30.5 మీటర్లతో కాకుండా 31.5 మీటర్లతో పూర్తి చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement