తొలి దశలో 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తికి వైఎస్ జగన్ హయాంలో పీఐబీ అంగీకారం
ఈ మేరకు నిధుల ప్రతిపాదనను మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు పంపిన జల్ శక్తి శాఖ
అప్పటికే ఎన్‌డీఏలో చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఆ నిధులిస్తే వైఎస్సార్‌సీపీకి ప్రయోజనమంటూ మోకాలడ్డిన బాబు
దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేసిన కేంద్ర కేబినెట్
తాజాగా ఏకంగా పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసిన కేంద్రం
మిగిలిన పనుల పూర్తికయ్యే వ్యయం రూ.12,157.53 కోట్లకే అంగీకారం
ఎత్తు తగ్గింపుతో రాష్ట్ర ప్రయోజనాలకు గండి
2016లో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం నుంచి తీసుకున్న చంద్రబాబు
ప్రాజెక్టు నిర్మాణ మాన్యువల్‌ను తుంగలో తొక్కి విధ్వంసం
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక గాడిలోకి ప్రాజెక్టు నిర్మాణం
తాజా ధరల మేరకు పూర్తిస్థాయిలో నిధులిచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించిన జగన్.. మళ్లీ బాబు రంగ ప్రవేశంతో ప్రాజెక్టుకు మరోసారి గ్రహణం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును ‘చంద్ర’గ్రహణం వీడటంలేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి దానిని ఛిద్రం చేస్తూనే ఉన్నారు. మధ్యలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టును గాడిలో పెట్టి, పూర్తిస్థాయిలో నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించినప్పటికీ, ఈ ఏడాది ఎన్డీఏలో చేరిన చంద్రబాబు దానికీ మోకాలడ్డారు. పూర్తిస్థాయిలో 45.72 మీటర్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే వైఎస్సార్‌సీపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందంటూ కేంద్రంతో 41.15 మీటర్లకే ప్రాజెక్తును పరిమితం చేయించి, రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టేశారు.
జల శక్తి శాఖ ప్రతిపాదనలను అడ్డుకొని
పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేలా అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ బోర్డు (పీఐబీ) ఈ ఏడాది ఫిబ్రవరి 27న మెమొరాండంను ఆమోదించింది. దాని ఆధారంగా నిధులు మంజూరు చేసేందుకు 2017 మార్చి 15న ఆమోదించిన తీర్మానాన్ని సవరించాలంటూ కేంద్ర కేబినెట్‌కు మార్చి 6న కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్‌డీఏలో చేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులిస్తే ఎన్నికల్లో రాజకీయంగా వైఎస్సార్‌సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు.
దాంతో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పటిదాకా చేసిన ఖర్చు పోను మిగిలిన రూ.12,157.53 కోట్లు ఇస్తామని చెప్పింది. దీనిని కేంద్ర మంత్రివర్గంలోని టీడీపీ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు వ్యతిరేకించలేదు. అంటే.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గింపునకు అంగీకరించినట్లు స్పష్టమవుతోంది.
41.15 మీటర్ల ఎత్తుతో నిష్ఫలమే
పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు (150 అడుగులు). గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఈ స్థాయిలో కేవలం 115.44 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. 41.15 మీటర్లకంటే ఎగువన నీటి నిల్వ ఉన్నప్పుడే కుడి, ఎడమ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఇప్పుడు ప్రాజెక్టును 41.15 మీటర్లకే తగ్గించడం వల్ల కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడం సాధ్యం కాదు.
ప్రాజెక్టు ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆయకట్టు 8 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం. 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తీ ప్రశ్నార్థకమవుతుంది. మహానగరంగా మారుతున్న విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడమూ కష్టమే. అంటే.. ప్రాజెక్టు లక్ష్యాలకే గండి కొట్టేశారని నిపుణులు చెబుతున్నారు.
జాతీయ ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చేసిన వైనం
2005లో అన్ని అనుమతులు సాధించి అప్పటి సీఎం వైఎస్సార్ పోలవరం నిర్మాణాన్ని చేపట్టారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తీవ్ర స్థాయిలో పోరాడారు. జాతీయ హోదా ప్రతిపాదన తుది దశలో ఉండగా ఆయన హఠాన్మరణం చెందారు. చివరకు విభజన చట్టం ద్వారా పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. వంద శాతం వ్యయంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం బాధ్యతలను 2016 సెపె్టంబరు 7న దక్కించుకుంది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంగీకరించారు. కానీ, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33,168.24 కోట్లు అవసరం. అలాంటిది రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేస్తానని అంగీకరించడం ద్వారా ప్రాజెక్టును ఆరి్థక సంక్షోభంలోకి నెట్టేశారు.
‘చంద్ర’గ్రహణం నుంచి విముక్తి చేసిన వైఎస్ జగన్
చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ మ్యాన్యువల్‌ను తుంగలో తొక్కారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాంలను కట్టకుండానే ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ కట్టేశారు. 2019 ఫిబ్రవరి నాటికి కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీలు వదిలేసి చేతులెత్తేశారు. దీంతో 2018, 2019లో వచి్చన గోదావరి వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు తప్పిదాలను సరిదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని చేపట్టారు.
కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్, దిగువ కాఫర్ డ్యాంను పూర్తి చేశారు. విద్యుత్ కేంద్రం పనులను కొలిక్కి తెచ్చారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం పనులను దాదాపుగా పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేలి్చతే.. శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమైన ప్రతిసారీ తాజా ధరల మేరకు ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరారు.
ఇందుకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తొలి దశలో 41.15 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేసి, ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకు వైఎస్ జగన్ అంగీకరించారు. దీంతో తొలి దశ పనులు పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆరి్థక శాఖ మంత్రి నోట్ జారీ చేశారు. ఇలా పోలవరానికి పట్టిన ‘చంద్ర’గ్రహణాన్ని వైఎస్ జగన్ విడిపించారు. కానీ, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రంగప్రవేశంతో ప్రాజెక్టుకు మరోసారి గ్రహణం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment