పోలవరంపై శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తన చారిత్రక తప్పిదాలతో జరిగిన విధ్వంసాన్ని వైఎస్ జగన్‌పై నెట్టే యత్నం
వ్యక్తిగత దూషణలతో ఉక్రోషం
బాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్‌వేను 48 గేట్లతో సహా రికార్డు సమయంలో పూర్తి చేసిన వైఎస్ జగన్
కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి
2021 జూన్ 11న స్పిల్‌వే మీదుగా గోదావరి ప్రవాహం 6.1 కి.మీ. పొడవున మళ్లింపు
కుడి, ఎడమ కాలువతోపాటు కనెక్టివిటీస్, జలవిద్యుత్కేంద్రం పనులు కొలిక్కి
బాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకుంటే 2022 నాటికే ప్రాజెక్టు పూర్తి
1941 నుంచే జీవనాడి సాకారం కోసం ప్రతిపాదనలు
తొమ్మిదేళ్లు సీఎంగా ఉండీ కనీసం ఆ ఆలోచన కూడా చేయని చంద్రబాబు
2005లో చిరకాల స్వపాన్ని సాకారం చేస్తూ పోలవరాన్ని చేపట్టిన వైఎస్సార్
ఇప్పటికి 49.79% పూర్తి.. ఐదేళ్లలో 24.94% పనులు చేసిన జగన్ సర్కార్
సాక్షి, అమరావతి: పోలవరం పనులను ఈనెల 17న క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమయంలో వ్యవహరించిన రీతిలోనే శ్వేతపత్రం పేరుతో శుక్రవారం సీఎం చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు! నిజాలను నిస్సిగ్గుగా గోదాట్లో కలిపేశారు! 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 మధ్య గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల దాహంతో చేసిన చారిత్రక తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నెడుతూ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు వల్లించారు. వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగి తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు.
ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్నది మాత్రం చెప్పలేకపోయారు. చంద్రబాబు సర్కార్ 2014–19 మధ్య చేసిన చారిత్రక తప్పిదాలను 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టగానే సరిదిద్దుతూ కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను వైఎస్ జగన్ పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి కాలువతోపాటు ఎడమ కాలువలో అత్యంత కీలకమైన వరాహ నదిపై అక్విడెక్టు లాంటి కీలక నిర్మాణాలతోపాటు కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీస్‌ను పూర్తి చేశారు.
960 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం పనులను కొలిక్కితెచ్చారు. చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదాలకు పాల్పడకపోయి ఉంటే 2022 జూన్ నాటికే జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. పోలవరం పనుల్లో జాప్యం వల్ల జరుగుతున్న నష్టానికి చంద్రబాబుదే పూర్తి బాధ్యతని స్పష్టం చేస్తున్నాయి. పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలే నాడు టీడీపీ సర్కార్ అవినీతికి నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.
బాబు చేస్తే ఒప్పు.. జగన్ చేస్తే తప్పా?
పోలవరం హెడ్ వర్క్స్ పనుల నుంచి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌ని 2018లో తప్పించి రూ.2,917 కోట్ల విలువైన వాటిని నామినేషన్ పద్ధతిలో నవయుగకు నాడు చంద్రబాబు అప్పగించడాన్ని పీపీఏ తప్పుబట్టింది. దేశ చరిత్రలో నామినేషన్ పద్ధతిలో ఇంత పెద్ద ఎత్తున పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. కాంట్రాక్టర్‌ను మార్చితే పనుల్లో ఏదైనా సమస్య తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్‌సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
వైఎస్ జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనులను 2019 ఆగస్టులో రద్దు చేసి, వాటికి జలవిద్యుత్కేంద్రం పనులను జత చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీని ద్వారా ఖజానాకు రూ.784 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్‌తో తన అక్రమాలు బయటపడటాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లే పోలవరం పనుల్లో విధ్వంసం చోటుచేసుకుందని తాజాగా సూత్రీకరించడం గమనార్హం. రివర్స్ టెండరింగ్‌లో పనులు దక్కించుకున్న మేఘా సంస్థ గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్‌లో పనులు ప్రారంభించింది.
2020 మార్చి నుంచి 2021 ఆఖరు వరకూ కరోనా విజృంభించినా పనులను కొనసాగించింది. చంద్రబాబు సర్కార్ పునాది స్థాయిలోనే వదిలేసిన స్పిల్‌వేను 48 గేట్లతో సహా రికార్డు సమయంలో పూర్తి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. వాస్తవాలు ఇలా ఉండగా 2021 వరకూ కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పనులు ఆగిపోయినట్లు సీఎం చంద్రబాబు చెప్పడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
పోలవరం వైఎస్సార్ స్వప్నం..
పోలవరం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు కాగా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాలతోపాటు 28.5 లక్షల మంది దాహార్తిని తీర్చవచ్చు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. అందుకే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తారు.
1941లోనే ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించినా 2005 వరకూ ఏ ఒక్క సీఎం కూడా కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేకపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ 2005లో పోలవరం పనులను ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువలలో అధిక భాగం పనులు చేయించారు. జలాశయం పనులకు అవసరమైన భూమిలో అధిక భాగం సేకరించారు.
జలాశయం పనులను కొలిక్కి తెచ్చే క్రమంలోనే మహానేత అమరుడయ్యారు. వైఎస్సార్‌కు ముందు 1995 నుంచి 2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ పోలవరం పనులు చేపట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు పోలవరాన్ని తన కలగా చంద్రబాబు అభివర్ణించడం గమనార్హం.
చారిత్రక తప్పిదం వల్లే విధ్వంసం
» విభజన నేపథ్యంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం వ్యయాన్ని తామే భరించి పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు పనులు చేపట్టేందుకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. 2014 జూన్ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు.
ఈ క్రమంలో ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే 2013–14 ధరల మేరకు ఇస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు అంగీకరించారు. ఆ మరుసటి రోజే అంటే 2016 సెప్టెంబరు 8న హెడ్‌వర్క్స్ (జలాశయం) పనుల అంచనా వ్యయాన్ని రూ.1,481 కోట్లు పెంచేశారు.
» ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కిన చంద్రబాబు కమీషన్ల దాహంతో ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను పూర్తి చేయకుండానే.. 2017 నవంబర్‌లో ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు.
» స్పిల్‌వే పునాది స్థాయిలో ఉండగానే.. 2018 నవంబర్‌లో 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని పీపీఏ, సీడబ్ల్యూసీకి హామీ ఇచ్చి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను చంద్రబాబు ప్రారంభించారు. వాటిని ప్రధాన ప్రాజెక్టుగా భ్రమింపజేసి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ఆయన ఎత్తుగడ. కానీ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చివరకు చేతులెత్తేశారు.
» 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. ఆ ఏడాది వచ్చిన భారీ వరద ప్రవాహం ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై సగటున 26 నుంచి 36.5 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ కోతకు గురై నాలుగు చోట్ల 485 మీటర్ల మేర దెబ్బతింది.
» ఎగువ కాఫర్ డ్యామ్ ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్లే గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించి ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ఇది పూర్తిగా మానవ తప్పిదం వల్లే జరిగిందని ఐఐటీ–హైదరాబాద్, ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు స్పష్టంగా తేల్చిచెప్పారు. తద్వారా చంద్రబాబు నిర్వాకాలను నిర్థారించారు.
2019 మే 30న వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగా అదే ఏడాది జూన్ రెండో వారంలో వరద ప్రారంభమైంది. అలాంటప్పుడు 12 రోజుల్లో కాఫర్ డ్యామ్‌ల ఖాళీలను పూర్తి చేసి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం అసాధ్యం. దీన్నిబట్టి నాడు చంద్రబాబు సర్కార్ తప్పిదం వల్లే ఈ విధ్వంసం చోటుచేసుకుందని ఐఐటీ–హైదరాబాద్, ఎన్‌హెచ్‌పీసీలు తేల్చిచెప్పినట్లు స్పష్టమవుతోంది. తాను చేసిన ఈ చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్‌పై నెట్టేందుకు చంద్రబాబు పదేపదే యత్నిస్తుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు.
14 ఏళ్లలో... 24.85% ఐదేళ్లలోనే... 24.94%
పోలవరం పనులను 2014–19 మధ్య తాను 72 శాతం చేస్తే.. 2019–24 మధ్య వైఎస్ జగన్ అరకొరగా చేశారంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ.. పోలవరం పనులు ఇప్పటికి పూర్తయింది 49.79 శాతమే. ఇందులో 2005 నుంచి 2019 మధ్య జరిగిన పనులు 24.85 శాతం కాగా మిగతా 24.94 శాతం పనులు 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తి కావడం గమనార్హం. 2005–14 మధ్య దివంగత వైఎస్సార్ హయాంలో రూ.4,730.71 కోట్ల విలువైన పనులు జరిగాయి.
2014–19 మధ్య చంద్రబాబు రూ.10,649.39 కోట్లు వ్యయం చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.8,629 కోట్లు వ్యయం చేశారు. వాస్తవం ఇలా ఉంటే.. 2014–19 మధ్య తాను రూ.11,762.47 కోట్లు వ్యయం చేశానని.. 2019–24 మధ్య కేవలం రూ.4,167 కోట్లను మాత్రమే జగన్ సర్కార్ ఖర్చు చేశారని చంద్రబాబు చెప్పడం విస్మయం కలిగిస్తోంది.
ఇక పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించిన రూ.3,385.58 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. అంటే.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాలోకి చేరింది. కానీ.. దాన్ని వైఎస్ జగన్ సర్కార్ దారి మళ్లించినట్లుగా చంద్రబాబు చిత్రీకరించడాన్ని ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు.
కొసమెరుపు
‘గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను కట్టాలి. కట్టాక ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ వేయాలి’ అని అన్యాపదేశంగా తాజాగా సీఎం చంద్రబాబు అంగీకరించడం కొసమెరుపు. కాఫర్ డ్యామ్‌ల జీవితకాలం మూడు నాలుగేళ్లకు మించి ఉండదని అధికారులకు చెబుతున్న సమయంలో అన్యాపదేశంగా తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని అంగీకరించారు.
45.72 మీటర్లకు ఒక్క ఇంచ్ కూడా తగ్గదు
పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారంటూ 2021 నుంచి పాడుతున్న పాటనే చంద్రబాబు తాజాగా మరోసారి పాడారు. అయితే ప్రాజెక్టు స్పిల్‌వేను ఇప్పటికే నిర్మించామని.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తయ్యాక టేపు తీసుకుని వెళ్లి కొలుచుకోవాలని.. 45.72 మీటర్ల కంటే ఒక్క ఇంచ్ కూడా తగ్గదని 2021 నుంచి 2024 దాకా వైఎస్ జగన్ చెబుతూనే ఉన్నారు. అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా ఇదే అంశాన్ని లోక్‌సభ, రాజ్యసభలో రాతపూర్వకంగా తేల్చి చెప్పారు.
ఏదైనా ప్రాజెక్టు పూర్తయ్యాక డ్యామ్ భద్రత దృష్ట్యా ఒకేసారి గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయరు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పూర్తయిన మొదటి ఏడాది నీటి నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 2/3వ వంతు.. డ్యామ్ భద్రతను పరిశీలిస్తూ, నిర్వాసితులకు పునరావాసం కల్పించి మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఈ మార్గదర్శకాల మేరకే పోలవరంలో తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తులతో నీటిని నిల్వ చేస్తారు. దాన్నే ప్రాజెక్టు ఎత్తుగా చంద్రబాబు చిత్రీకరించటాన్ని అధికారవర్గాలే తప్పుబడుతున్నాయి.
సవాళ్లను అధిగమిస్తూ వడివడిగా..
» చంద్రబాబు చారిత్రక తప్పిదాల వల్ల పోలవరంలో చోటుచేసుకున్న విధ్వంసాన్ని చక్కదిద్దుతూ పనులను వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా పరుగులెత్తించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను ప్రారంభించడానికి ముందు అంటే 2018 నవంబర్‌కు ముందు.. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరిలో ఇసుక సాంద్రతను ట్రాన్స్‌ట్రాయ్ తప్పుగా లెక్కించింది. ఆ తప్పుడు లెక్క ప్రకారమే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు పునాదిగా 20 మీటర్ల లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేసింది.
కానీ.. గోదావరి ఇసుక సాంద్రతను పరిగణలోకి తీసుకుంటే 30 నుంచి 35 మీటర్ల లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయాలి. కానీ 20 మీటర్ల లోతులోనే స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ వేయడం వల్ల ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలు అధికంగా ఉన్నాయి. ఆ లీకేజీలను అధిగమిస్తూ ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన భారీ అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యధాస్థితికి తెచ్చారు.
» దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్ స్థానంలో సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేయాలా? అనే విషయంపై తేల్చి చెబితే 18 నెలలల్లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని వారు సూచించిన డిజైన్‌ల మేరకు పనులు చేపడదామని పీపీఏ, సీడబ్ల్యూసీ పేర్కొన్నాయి. ఆ మేరకు ఫిబ్రవరిలో అంతర్జాతీయ నిపుణులను ఖరారు చేశాయి.
» 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,396 కోట్లుగా ఉంది. అయితే 2017–18 ధరల ప్రకారం నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో పాత ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని నాడు వైఎస్ జగన్ పలుదఫాలు కోరారు. దీనిపై ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో తొలిదశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని సూచిస్తూ మార్చి 6న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదరడంతో నిధులు ఇచ్చే ఫైలుపై ఆమోదముద్ర వేస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు తెరచాటున బీజేపీ పెద్దలతో మంత్రాంగం నడిపారు. దీంతో ఆ ఫైలును కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. లేదంటే మార్చి ఆఖరులోనే రూ.12,157.53 కోట్లు పోలవరానికి విడుదలయ్యేవి.
Comments
Please login to add a commentAdd a comment