ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఏదో శాపం ఉన్నట్లుంది. దేశంలో ఇంతలా జాప్యం జరిగిన ప్రాజెక్టు ఇంకోటి ఉండదేమో. ఇన్నేళ్ల తరువాతైనా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ముహూర్తం దగ్గరపడిందని అనుకుంటూ ఉండగానే పిడుగులాంటి వార్త ఇంకోటి వచ్చిపడింది. ప్రాజెక్టు ఎత్తును నాలుగున్నర మీటర్ల మేర తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్న ఈ వార్త ఆందోళన కలిగించేదే. తొలిదశలో నీటిని నిలబెట్టడానికి నిర్దేశించిన ఎత్తునే పూర్తి స్థాయి మట్టంగా కేంద్రం నిర్ణయిస్తే, ఈ ప్రాజెక్టు నుంచి ఆశించిన ఫలితం ఉండదన్న భయం ఏర్పడుతోంది.
అలాగే.. డీపీఆర్‌లోని తప్పుల కారణంగా కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ముందుగా ఈ రెండు కాల్వల ద్వారా 17500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ప్రవహించాలని అనుకున్నారు. కానీ 2017లో డీపీఆర్ తయారీ సమయంలో జరిగిన తప్పుల కారణంగా కుడి కాల్వలో 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వలో ఎనిమిది వేల క్యూసెక్కుల వరకు పారేందుకు అయ్యే నిర్మాణ ఖర్చును మాత్రమే కేంద్రం ఇస్తానందట. దీంతో ఇప్పుడు కాలువల సామర్థ్యం తగ్గించుకోవడం లేదంటే.. రూ.4500 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కాల్వలను ముందనుకున్న ఆలోచనల ప్రకారం కట్టుకోవాల్సి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఇప్పటిది కాదు. వందేళ్ల క్రితమే బ్రిటిష్ పాలనలోనే ఆరంభమైంది. పలుమార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఎన్.టి.రామారావు, టంగుటూరి, అంజయ్య వంటివారు ఈ ప్రాజక్టు పురోగతికి ప్రయత్నించారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇది వేగంగా ముందుకెళ్లిందనేది వాస్తవం. నిర్వివాదాంశం. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధన, ముంపు ప్రాంతాల్లో భూ సేకరణ, కుడి, ఎడమ కాల్వల నిర్మాణాల్లో ఆయన చూపిన చొరవ మర్చిపోలేనిది. అప్పట్లో ప్రాజెక్టు పూర్తయితే భూ సేకరణ కష్టమవుతుందన్న అంచనాతో ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలలో భూ సేకరణ చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం దీన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం వారితో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించారు.
ప్రాజెక్టు లేకుండా కాల్వలు ఏమిటని ఎద్దేవ చేసేవారు. అయినా వైఎస్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాదాపు అన్ని అనుమతులు వచ్చి, ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే టైమ్‌కు ఆయన మరణించడం ఆంధ్రప్రజల దురదృష్టం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడానికే ఐదేళ్లు తీసుకున్నాయి. అంతలో రాష్ట్ర విభజన సమస్య ముందుకు వచ్చింది. ఆ టైమ్ లో ఆంధ్ర ప్రజలలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.
అంటే దాని అర్థం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు, భూ సేకరణ చేసి, నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ వసతులు సమకూర్చి పూర్తి చేయడం అన్నమాట. కానీ 2014లో విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో మరింత గందరగోళం ఏర్పడింది. అంతకు ముందు ఎంపికైన కాంట్రాక్టర్‌ను మార్చడం, తమకు కావల్సిన వారితో పనులు చేయించడం, అవి కాస్తా అవినీతి అభియోగాలకు గురి కావడం తదితర పరిణామాలు సంభవించాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీనే ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ మాదిరి మారిపోయిందని వ్యాఖ్యానించడం ఇక్కడ మనం గుర్తుకు చేసుకోవాలి.
నిజానికి చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సకాలంలో పూర్తి కావని, ఎన్నికల సమయానికి ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే ఆయన మైనర్ ఇరిగేషన్, ఇంకుడు గుంతలు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే భారీ ప్రాజెక్టులు చేపట్టకపోతే ప్రజలలో అప్రతిష్టపాలు అవుతామని భావించి, వారిని నమ్మించడానికి ఎన్నికలకు కొద్దికాలం ముందు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేవారు.ఆ తర్వాత వాటిని వదలి వేశారు.1999 ఎన్నికలకు ముందు ఇలా ఆయన శంకుస్థాపన చేసి, అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టిన ప్రాజెక్టుల శిలాఫలకాల వద్ద అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూలు పెట్టి వచ్చిన ఘట్టాలు కూడా జరిగాయి. 2014 లో మరోసారి సీఎం.
అయిన తర్వాత సోమవారం పోలవారం అంటూ కథ నడిపారు. ఈ ప్రాజెక్టు తన కల అని ప్రచారం చేసుకునే వారు. జయము, జయము చంద్రన్న అంటూ పాటలు పాడించడం, వేలాది మందిని ప్రాజెక్టు సందర్శనకు తీసుకు వచ్చామని చెబుతూ కోట్ల రూపాయల బిల్లులను మాత్రం చెల్లించడం ప్రత్యేకతగా తీసుకోవాలి. స్పిల్ వే పూర్తి కాకుండా, ఒక గేట్ మాత్రం అమర్చి, అప్పర్, లోయర్ కాఫర్ డామ్ ల నిర్మాణం కంప్లీట్ చేయకుండా, డయాఫ్రం వాల్ నిర్మించి కొత్త సమస్యలు తీసుకొచ్చారు. కీలకమైన డామ్ ,రిజర్వాయిర్ మాత్రం పూర్తి కాలేదు.
అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో సుమారు రూ.800 కోట్ల మేర ఆదా చేసి పనులు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. స్పిల్ వేని పూర్తి చేసి, 48 గేట్లను అమర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అంతలో భారీ ఎత్తున వరదలు రావడంతో చంద్రబాబు టైమ్‌లో కాపర్ డామ్ కోసం వదలిపెట్టిన గ్యాప్‌ల గుండా నీరు ప్రవహించి, డయాఫ్రం వాల్ ను దెబ్బ తీసింది. దానిపై కేంద్ర సంస్థలు కొత్త వాల్ కట్టాలా? లేక పాతదాన్ని పునరుద్దరించాలా అన్న దానిపై తేల్చడానికి ఏళ్ల సమయం పట్టింది. కాఫర్ డామ్ పూర్తిగా కడితే, వెనుక ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతాయి. వారికి పరిహారం చెల్లించలేదు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం గాప్ లను వదలి పెద్ద తప్పు చేసిందని నిపుణులు తేల్చారు. కానీ ఈ మొత్తం నెపాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రయత్నించాయి.
జగన్ టైమ్ లో తొలిదశలో 41.15 మీటర్ల వద్ద నీరు నిలిపి ప్రాజెక్టును ఒక దశకు తీసుకు రావాలని తలపెడితే, చంద్రబాబు, ఎల్లో మీడియా నానా రచ్చ చేశాయి. ఏపీకి జగన్ అన్యాయం చేస్తున్నారని దుష్ప్రచారం చేశారు. నిర్వాసితులను వేరే ప్రదేశాలకు తరలించడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం వంటివి చేశాక 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వచేసే విధంగా రిజర్వాయిర్ పనులు సంకల్పించారు. అదే టైమ్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కూడా వేగంగా సాగాయి. కరోనా రెండేళ్ల కాలంలో కూడా పోలవరం పనులు జరిగేలా కృషి చేశారు. అయినా డయాఫ్రం వాల్ కారణంగా జాప్యం అయింది. ఈ లోగా మళ్లీ ప్రభుత్వం మారింది. అదే టైమ్ లో ఒడిషా, చత్తీస్‌గడ్ లలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఎటూ బిజెపినే అధికారంలో ఉంది. ఆ కూటమిలో టీడీపీ, జనసేన కూడా భాగస్వాములు అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిర్మాణం జరిగితే ఒడిషా, చత్తీస్ గడ్, తెలంగాణలలోని కొన్ని భూ భాగాలు ముంపునకు గురి అవుతాయి. అక్కడ వారికి కూడా పరిహారం ఇవ్వడానికి గతంలోనే అంగీకారం కుదిరింది. చత్తీస్ గడ్ ప్రాంతంలో ముంపు బారిన పడకుండా గోడలు నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.అయినా పూర్తి మట్టం ఒప్పుకుంటే రాజకీయంగా ఆ రాష్ట్రాలలో విపక్షాలు విమర్శలు చేస్తాయని, ఏపీకి సహకరిస్తే రాజకీయంగా తమకు నష్టమని భావించాయి. తెలంగాణలో కూడా దీనిపై కొంత రాజకీయం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కూటమిలోని టీడీపీ, జనసేనలను లోబరుచుకుని 41.15 మీటర్లకే ప్రాజెక్టును పరిమితం చేయడానికి ఒప్పించాయని భావిస్తున్నారు. అందువల్లే కేంద్ర క్యాబినెట్ ఎత్తు తగ్గించడంపై ఆగస్టు 28 నే తీర్మానం చేసినా, అందులో టీడీపీ క్యాబినెట్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సభ్యుడుగా ఉన్నా, ఆయన నోరు మెదపలేదట. దీనిని టీడీపీ,బీజేపీలు అత్యంత రహస్యంగా ఉంచాయి. ఎలాగైతేనేం అక్టోబర్ ఆఖరు నాటికి ఈ విషయం బయటకు వచ్చింది. దానిపై సమాధానం ఇవ్వడానికి మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు నమిలారు. మామూలుగా అయితే సుదీర్ఘంగా ఉపన్యాసాలు, మీడియా సమావేశాలు పెట్టే చంద్రబాబు ఈ అంశం జోలికి వెళ్లినట్లు లేరు.
దీనిని బట్టే ఎంత గుట్టుగా ఈ వ్యహారాన్ని సాగించాలని అనుకున్నది అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఎత్తు తగ్గించడం వల్ల వరద వస్తేనే ఈ ప్రాజెక్టు నీటిని విశాఖ వరకు తీసుకు వెళ్లడం కష్టసాధ్యం అవుతుందని చెబుతున్నారు. 195 టీఎంసీల బదులు 115 టీఎంసీల నీటి నిల్వకే అవకాశం ఉంటుంది. కేవలం ఒక రిజర్వాయిర్ గానే ఇది మిగిలిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందించే సీఎం కాని, మంత్రులు కాని, దీనిపై నోరు మెదపడం లేదు.
ఓవరాల్ గా చూస్తే ఏపీకి సుమారు పాతిక వేల కోట్ల మేర కేంద్రం ఎగవేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు సందేహాలు వస్తున్నాయి. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అంతటికి మేలు జరగాలన్న లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చు. ఇదంతా చూస్తే బీజేపీకి పొరుగు రాష్ట్రాలలో ఇబ్బంది లేకుండా చూడడానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు ఆస్తారం ఇస్తున్నారనిపిస్తుంది.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment