సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూపిస్తున్న చొరవ.. చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోంది. గత టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాలను.. కమీషన్ల వేటలో నాటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంలో అవలంబించిన అస్తవ్యస్త విధానాలను ఒక్కోటి సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధపట్ల సాగునీటి రంగ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఆమోదించి దాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి శుక్రవారం రాత్రి పంపారు. ఈ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు ఆమె పంపనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాక దానిని కేంద్ర కేబినెట్‌కు నివేదిస్తారు. అంతకుముందు.. తాజా ధరలను పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి నిధులిచ్చి సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో.. సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖాయం. దీంతో పోలవరానికి నిధుల సమస్య తీరడంతోపాటు ప్రాజెక్టు సత్వర పూర్తికి మార్గం సుగమం అవుతుంది. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేస్తూ పోలవరాన్ని పూర్తిచేయడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి ఇది మరో నిదర్శనమని అధికార వర్గాలు కొనియాడుతున్నాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు తొలిదశ పనులు పూర్తయ్యాక రెండో దశ పనుల సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి పంపుతుంది.
రూ.15,505.81 కోట్ల పనులు మిగులు..
పోలవరం ప్రాజెక్టు తొలిదశలో ఇప్పటికే పూర్తయిన పనులకు చేసిన వ్యయం.. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనుల్లో మిగిలిన పనుల వ్యయం.. చంద్రబాబు నిర్వాకంవల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం వంటి అదనంగా చేపట్టాల్సిన పనులు.. లైడార్ సర్వేలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయాలను పరిగణలోకి తీసుకుని సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. దీని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.38 కోట్లు. ఇందులో రూ.16,119.57 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.15,505.81 కోట్ల పనులు మిగిలాయి. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే నిధుల సమస్య పరిష్కారమవుతుంది.
‘రెండో దశ’ సవరించిన అంచనా వ్యయానికీ ఓకే..
పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్టు (119.4 టీఎంసీలు) కాగా.. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పూర్తయ్యాక మొదటి ఏడాది నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు నీటిని నిల్వచేస్తారు. ఆ మరుసటి ఏడాది 2/3వ వంతు.. ఆ తరువాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. నీటి నిల్వచేసే సమయంలో ఏవైనా లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది.
వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో నీటినిల్వ చేస్తారు. ఆ తరువాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక రెండో దశలో 45.72 మీటర్ల వరకూ అంటే.. పూర్తిస్థాయిలో నీటి నిల్వకు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, మిగిలిన పనులకు సంబంధించి సవరించిన వ్యయ ప్రతిపాదనను తొలిదశ పనులు పూర్తయ్యే దశలో పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.
పోలవరానికి చంద్రబాబు చేసిన ద్రోహం ఇదీ..
► నిజానికి.. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ 2014, జూన్ 8 నుంచి కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది.
► పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూనే 2016, సెప్టెంబరు 7న అర్థరాత్రి నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో.. 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని మెలికపెట్టారు. దీనికీ చంద్రబాబు అప్పట్లో తలఊపారు.
► ఆ తర్వాత.. 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1,981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు సరేనన్నారు.
► అనంతరం.. 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది.
► ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టంచేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి నోరుమెదపలేదు.
► అలాగే, 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ రాసినా చంద్రబాబు స్పందించలేదు.
► ఇక 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసిన మెమొరాండం ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి నిధులు (రూ.20,398.61 కోట్లు) ఇవ్వాలంటూ 2018, జనవరి 12న చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. నిజానికి.. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది మొత్తం ప్రాజెక్టును రూ.20,398.61 కోట్లకే పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే.
► నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నాక.. తొలుత అప్పటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. ఆ తర్వాత రామోజీరావు సమీప బంధువుకు చెందిన నవయుగ, యనమల వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌లకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టారు. మొత్తం మీద.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి, కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకున్న చంద్రబాబు పోలవరాన్ని అస్తవ్యస్తం చేశారు.
సీఎం జగన్ కృషి ఫలితమిది..
పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న సమయంలో 2013–14 ధరల ప్రకారం పనులు చేస్తామని 2016, సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లే. కానీ.. భూసేకరణ, పునరావాసం కల్పనకే రూ.33,168.23 కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో.. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యం. ఇదే అంశాన్ని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ పలుమార్లు వివరించారు. తాజా ధరల మేరకు నిధులు సకాలంలో ఇచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఫలితంగానే పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది.
– శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ.
Comments
Please login to add a commentAdd a comment