Irrigation sector
-
నీటిపారుదలపై శ్వేతపత్రం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశమున్నట్టు సమాచారం. నీటిపారుదలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం కొద్దికాలంగా చెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారమే దీనిని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గత పదేళ్లలో సాగు నీళ్లివ్వడానికి కాకుండా కేవలం కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం కోసమే ప్రాజెక్టులు చేపట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ అంశాలతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతను శ్వేతపత్రంలో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. దీనిపై స్వల్పకాలిక చర్చను పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కులగణన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి ఈ తీర్మానాన్ని గురువారమే సభలో ప్రవేశపెట్టాలని సర్కారు భావించింది. అయితే బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సుదీర్ఘంగా సాగడంతో వీలు కాలేదు. దీంతో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఏకగ్రీవ ఆమోదం: స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరాని ప్రవేశపెట్టిన రూ.2,75,891 కోట్ల బడ్జెట్‌ను, ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా దానిపై బుధ, గురువారాల్లో చర్చ జరిగింది. చర్చకు ఆర్థికమంత్రి సమాధానమిచ్చిన తర్వాత తొలుత వచ్చే నాలుగు నెలల కాలానికి అత్యవసర ఖర్చుల నిమిత్తం ప్రవేశపెట్టిన రూ.78,911.23 కోట్ల ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. అనంతరం 2023–24 సంవత్సరం అనుబంధ పద్దు కింద ప్రవేశపెట్టిన రూ.46,400.9 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. మరోవైపు బడ్జెట్‌కు ఆమోదం తర్వాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. పేద ప్రైవేటు ఉద్యోగుల కోసం ప్రణాళిక: భట్టి ‘ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు అవసరమవుతాయి. అవసరమైతే డిమాండ్‌కు అనుగుణంగా 5 లక్షల ఇళ్లు నిర్మించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దళితులకు బాబాసాహెబ్ అభయహస్తం కింద ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల మేరకు ఆర్థిక స్వావలంభన కల్పించే పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాం. గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో రూ.17,700 కోట్లు పెట్టినా రూపాయి విడుదల చేయలేదు. ఈ బడ్జెట్లో రూ. 1,000 కోట్లు పెట్టాం. అప్పులు తిరిగి చెల్లించడానికే రూ.64 వేల కోట్లకు పైగా కావాలని, అందుకే రూ.68 వేల కోట్ల కొత్త అప్పులను బడ్జెట్లో ప్రతిపాదించాం. త్వరలో బీసీ సబ్‌ప్లాన్ విధివిధానాలు బీసీ సబ్‌ప్లాన్‌కి సంబంధించిన విధివిధానాలు కూడా సిద్ధం చేస్తున్నాం. త్వరలో ప్రకటిస్తాం. కొద్ది రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఆరు గ్యారంటీలకు వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరుపుతాం. అర్హులైన దరఖాస్తుదారులందరికీ ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తాం. ధరణిపై నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కార్యాచరణ ప్రారంభిస్తాం. రీయింబర్స్మెంట్ ఫీజులు 2018 నుంచి పెండింగ్‌లో ఉండడం బాధాకరం. ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా వాటిని చెల్లిస్తాం. ఎస్‌హెచ్‌జీలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం. రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. కేంద్రం, రాష్ట్రాల మధ్య సుహ్రుద్భావ వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది..’ అని ఆర్థికమంత్రి భట్టి తన సమాధానంలో చెప్పారు. ప్రైవేటు రంగంలో పనిచేసే పేద వర్గాలు ఉద్యోగ విరమణ తరువాత నెలనెలా పీఎఫ్ తరహాలో కొంత మొత్తం పొందేలా ప్రణాళిక చేపట్టనున్నట్లు తెలిపారు. రద్దయిన డీడీఆర్సీ సమావేశాలను పునరుద్ధరిస్తామని అన్నారు. కుట్రలు చేసేవారిని వదిలిపెట్టం ‘మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేసే వారెవరినీ వదిలిపెట్టం. కొందరు విద్యుత్ అధికారులు మా ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసేందుకు రైతులను ఇబ్బంది పెట్టారు. మా దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక ఎస్ఈపై బదిలీ వేటు వేశాం. గత ప్రభుత్వంలో పనిచేసిన డిస్కంల డైరెక్టర్లందరినీ తొలగించి నిబంధనల కొత్త వారిని నియమించడానికి నోటిఫికేషన్ జారీ చేశాం..’ అని భట్టి తెలిపారు. పశుగ్రాసాన్ని కోసే యంత్రాలకు ఉచిత విద్యుత్ వాడే రైతులను విద్యుత్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించగా భట్టి బదులిచ్చారు. -
ఆహార పంటల విస్తీర్ణం పెరగాలి
సాక్షి, విశాఖపట్నం: నీటి కొరత పెరిగే కొద్దీ ప్రజల జీవన ప్రమాణాల్లో అనేక మార్పులు వస్తాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ గ్లోబల్ మిషన్ లీడర్ అమల్ తాల్బి తెలిపారు. ముఖ్యంగా ఆహార కొరత వేధిస్తుందని చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్నారు. 2030 నాటికి 670 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగణంగా ఆహార పంటల విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉందన్నారు. 2050 నాటికి ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో 500 మిలియన్లకు పైగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి 80 శాతం వరకూ ఆహారం ఉత్పత్తవుతోందని తెలిపారు. పేదరికాన్ని జయించేందుకు ప్రపంచ బ్యాంక్ అత్యంత కీలక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. విశాఖపట్నంలో 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 74వ అంతర్జాతీయ సమావేశాల్లో అమల్ తాల్బి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నీటి ఎద్దడి పెరుగుతోంది.. గత 50 ఏళ్లలో వర్షపాతం గణనీయంగా 233 శాతం పెరిగింది. అయితే.. భూమికి చేరుతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాం. ఈ కారణంగానే నీటి ఎద్దడి పెరుగుతోంది. వాతావరణంలో తలెత్తుతున్న 10 మార్పుల్లో 8 నీటికి సంబంధించినవే ఉంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. సుస్థిర లక్ష్యాలు నిర్దేశించుకున్నాం.. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్ మిషన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా నీటి ఉత్పాదకత– సంరక్షణ, ఆహార ఉత్పత్తిని పెంపొందించడం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంక్ సుస్థిర లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. ఫార్మర్ లెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ పేరుతో నీటిపారుదల రంగంలో స్థితిస్థాపకత, సాగునీటి నిర్వహణలో ఖచ్చితత్వం, నీటివనరుల అభివృద్ధి, మురుగు నీటి నిర్వహణ, వ్యవసాయంలో అత్యాధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర అంశాలపై ఈ మిషన్ పనిచేస్తోంది. తొలి విడతలో ఆఫ్రికా దేశాల్లో 450 మిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మిషన్‌లో భాగంగా 77 మిలియన్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. అక్కడ విధానాల్లో అనేక మార్పుల్ని తీసుకొచ్చాం. భవిష్యత్తులో మిగిలిన దేశాల్లోనూ ప్రపంచ బ్యాంక్ మిషన్‌ని అమలు చేస్తాం. తద్వారా నీటి ఎద్దడి, ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం. -
నీటి పొదుపుతోనే భవితకు భరోసా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెరుగుతున్న నీటి అవసరాల నేపథ్యంలో భూగర్భ జల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్ తరాలకు అందించగలమన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయడం ద్వారా తిరిగి సాగునీటికి, పరిశ్రమలకు అందించేలా రీ సైక్లింగ్ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. చెరువులు, కుంటలను సంరక్షిస్తూ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో డ్యామ్‌ల పరిరక్షణకు ప్రధాని మోదీ సూచనల మేరకు ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గురువారం విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ (ఐసీఐడీ) సదస్సును సీఎం జగన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. అతి సుందరమైన విశాఖ నగరం దీనికి వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. ఐసీఐడీ కాంగ్రెస్‌కు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ ఏమన్నారంటే.. 140 బిలియన్ డాలర్ల వ్యయం వ్యవసాయ రంగంలో నీటి కొరతను అధిగమించేందుకు బహుళ విధానాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సాగునీటి రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. అయితే సరైన ప్రణాళిక లేకుంటే వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతినడంతో పాటు కరువు పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో సాగునీటికి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలను 2019లో ప్రధాని మోదీ జలశక్తి శాఖ ఆదీనంలోకి తెచ్చారు. 2024 నాటికి సాగునీరు, పారిశుధ్య రంగాలపై 140 బిలియన్ డాలర్లను వెచ్చించాలని నిర్ణయించాం. దేశంలో సాగు విస్తీర్ణం గత 75 ఏళ్లలో మూడింతలు పెరిగి 140 మిలియన్ హెక్టార్లకు చేరింది. దిగుమతి చేసుకునే దశ నుంచి ఈ రోజు తిండిగింజల్లో మిగులు దేశంగా మారడంలో సాగునీటి రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 54 ప్రాజెక్టులు.. నీటి వనరులను అవసరాల మేరకు వినియోగించుకునేందుకు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దేశంలో 1971లో 111 బిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉండగా నేడు 250 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది. 2023 మార్చిలో ప్రధాని మోదీ 54 ప్రాజెక్టులను ప్రారంభించి అదనంగా 25 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించడం ద్వారా రెండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. గత రెండు దశాబ్దాల్లో పట్టణీకరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో దేశంలో తలసరి నీటి లభ్యత 20 శాతం తగ్గింది. 2050 నాటికి మరో 20 శాతం తగ్గనుందని అంచనాలున్నాయి. నీటి వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు 2022లో బ్యూరో ఆఫ్ వాటర్ ఎఫిషియన్సీని నియమించాం. 48,500 కి.మీ. మేర మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేశాం. తద్వారా 28,000 హెక్టార్ల భూ సేకరణను తగ్గించాం. నీటి శుద్ధిపై దృష్టి నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంలో భాగంగా మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నీటిని సాగునీటికి, పరిశ్రమలకు ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా వాటర్ రీ–సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. అమెరికా, చైనా కలిపి వినియోగిస్తున్న భూగర్భ నీటి వనరుల కంటే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ప్రపంచంలోనే భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో మనం ముందు వరుసలో ఉన్నాం. భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా మొత్తం 2.4 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని గుర్తించాం. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచేందుకు మ్యాపింగ్ పూర్తి చేశాం. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 2019లో జలశక్తి అభియాన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. పూడిక తొలగించి వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు 10 వేల మిలియన్ పనులను పూర్తి చేశాం. నదుల అనుసంధానం.. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాలు కురిసే సమయంలో సాధ్యమైనంత నీటిని ఒడిసి పట్టుకునేందుకు నదుల అనుసంధానాన్ని ప్రారంభించాం. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ ఉన్న చోట్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. సాగునీటి రంగం రాష్ట్ర పరిధిలోది కావడం వల్ల వాటి సహకారం ఎంతో అవసరం. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయు) చేసుకున్నాయి. కెన్, బెత్వా నదుల అనుసంధానంతో మిలియన్ హెక్టార్లకు సాగునీటితోపాటు వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని 6.2 మిలియన్ జనాభాకు తాగునీరు లభించనుంది. డ్యామ్‌ల రక్షణకు ప్రత్యేక చర్యలు దేశంలో జలాశయాల నిర్మాణం ఎప్పటి నుంచో ఉంది. కావేరి నదిపై చోళుల కాలంలో 2 వేల ఏళ్ల క్రితం నిరి్మంచిన కళ్లాని డ్యామ్ ఇప్పటికీ ఉంది. దేశంలో మొత్తం 6,000 భారీ డ్యామ్‌లున్నాయి. 2020లో డ్యాం సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రపంచబ్యాంకు సహకారంతో 1.2 బిలియన్ డాలర్లతో దేశవ్యాప్తంగా 736 డ్యాంల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లో 223 డ్యామ్‌ల హైడ్రలాజికల్, స్ట్రక్చరల్, ఆపరేషనల్ రక్షణ చర్యలను పరిశీలించాం. డ్యామ్‌ల రక్షణతో పాటు నీటి వనరుల వినియోగంపై ఐసీఐడీ చర్చించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సూచనలు చేస్తుందని భావిస్తున్నా. నదీ జలాలతో ‘జల్ భరో’ విశాఖ ఐసీఐడీ సదస్సు సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ నదుల నుంచి సేకరించిన జలాలను మట్టి కుండల్లో నింపి ‘జల్ భరో’ పేరుతో ఒకే చోట చేర్చారు. కేంద్ర మంత్రి షెకావత్, ముఖ్యమంత్రి జగన్, మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, విడదల రజని మట్టి కుండల్లో ఉన్న నీటిని తరలించి ఒక చోట చేర్చారు. 25 ఐసీఐడీ అంతర్జాతీయ కాంగ్రెస్ యాబ్‌స్ట్రాక్ట్ వాల్యూమ్‌తో పాటు హిస్టారికల్ వాటర్ సస్టైనబులిటీ, వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ వాల్యూమ్‌ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సదస్సులో తొలి రోజు సంప్రదాయేతర నీటి వనరులు, రైతు సాధికారత, సుస్థిర లక్ష్యాలు, వ్యవసాయ రంగంలో నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. 56 దేశాలు... 147 పరిశోధన పత్రాలు 1950లో ఏర్పడిన ఐసీఐడీ పరిశోధనలను మనం వినియోగించుకుంటున్నాం. 74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది. 2025 నాటికి పెరగనున్న 9.8 బిలియన్ జనాభాకు అనుగుణంగా నీటి వనరులను వాడుకోవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంపై సదస్సులో చర్చించాలి. నీటి వినియోగంపై 56 దేశాలకు చెందిన ప్రతినిధులు 147 పరిశోధన పత్రాలను సమర్పిస్తారు. సమస్యను పరిష్కరించేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నాం. ఈ సదస్సుకు సుందర నగరం విశాఖ కేంద్రం కావడం ఎంతో సంతోషంగా ఉంది. –ప్రొఫెసర్ డాక్టర్ రగబ్, ఐసీఐడీ ప్రెసిడెంట్ పర్యావరణ సమతుల్యతపై దృష్టి నీటి వనరులను పొదుపుగా వాడుకునేందుకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిండి గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. –కుశ్వందర్ వోహ్రా, ఐసీఐడీ వైస్ ప్రెసిడెంట్ -
నీటి బొట్టూ ఒడిసి పట్టి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టి సాగు అవసరాలను తీరుస్తూ వ్యవసాయ దిగుబడులను పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. నీటి కొరతను అధిగమించేందుకు ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీటిని మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాదిలో తక్కువ కాలం మాత్రమే కురిసే వాన నీటిని ఒడిసి పట్టి ఆయకట్టుకు అందించడం ద్వారా కరువును సమర్థంగా నివారించవచ్చన్నారు. గురువారం విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ¯ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) సదస్సును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి సీఎం జగన్ ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 90 దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. సుస్థిర వ్యవసాయం, నీటి నిర్వహణకు గట్టి కృషి చేస్తున్న ఐసీఐడీ సదస్సును రాష్ట్రంలో నిర్వహించడం గర్వంగా ఉందని, ప్రశాంతమైన విశాఖ నగరం అతిథులకు చక్కటి అనుభూతి అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. నీటి నిర్వహణలో సరికొత్త మార్గాలపై సదస్సులో చర్చించడం ద్వారా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సుస్థిర సాగు కోసం ప్రతిష్టాత్మక 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) సదస్సును ఈనెల 4 వరకు, 74వ అంతర్జాతీయ కార్యనిర్వాహక కమిటీ (ఐఈసీ) సమావేశాన్ని 5వ తేదీ నుంచి 8 వరకు మొత్తంగా ఎనిమిది రోజులపాటు అందమైన విశాఖ నగరంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణపై మా ప్రతిపాదనను అంగీకరించినందుకు ఇండియన్ నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐఎన్సీఐడీ), కేంద్ర ప్రభుత్వానికి, ఐసీఐడీకి చెందిన ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కృతజ్ఞతలు. నీటి నిర్వహణ ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఈ ఫోరం నీటి పారుదల, డ్రైనేజ్, వరద నిర్వహణలో అందిస్తున్న సహకారం ప్రశంసనీయం. ‘మోర్ క్రాప్ పర్ డ్రాప్’ వ్యవసాయం, నీటి పారుదల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ శతాబ్దాలుగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో ప్రధాన, మధ్య తరహా, చిన్న నదులు 40 వరకు ఉన్నాయి. కరువు పీడిత, మెట్ట ప్రాంతాలలో నీటి పారుదల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రధానమంత్రి సూచించిన విధంగా ‘మోర్ క్రాప్ పర్ డ్రాప్’ అనే విధానాన్ని అనుసరిస్తున్నాం. తద్వారా ప్రతీ నీటి బొట్టుకు వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దిగువ రాష్ట్రం కావడంతో రాష్ట్రానికి సువిశాల తీర ప్రాంతం ఉన్నా రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పశ్చిమ ప్రాంతాలు తక్కువ వర్షపాతం కారణంగా తరచుగా కరువు బారిన పడుతున్నాయి. ఆ ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను ఇది దెబ్బతీస్తోంది. ఆంధ్రప్రదేశ్ దిగువ నదీ తీర రాష్ట్రం కావడంతో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన అంతర్రాష్ట్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు నీటి కొరత సమస్య ఎదురవుతోంది. అధిక వర్షాలు, వరదల వల్ల ఈ నదుల పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాం. సమర్థ నీటి పారుదల నిర్వహణ మాత్రమే దీనికి మంచి పరిష్కారం చూపుతుంది. అనుసంధానమే పరిష్కారం నీటి కొరత గురించి ప్రస్తావించినప్పుడు మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ గుర్తుకొస్తాయి. నీటిని ఎలా వినియోగించుకోవాలనేందుకు ఈ తరహా ఆలోచనలు అవసరమే. అయితే నా ఉద్దేశం ప్రకారం వర్షా కాలంలో నీటి బదలాయింపు అంశంపై మరింత విస్తృతంగా చర్చ జరగాలి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు వర్షా కాలం. ఈ సీజన్లో వర్షాలు కురిసి నదులు వరదతో ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాలు కురిసే కాలం తక్కువగా ఉన్నా వర్షపాతం అధికంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో నీటిని ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించడం సవాల్‌తో కూడుకున్నది. అయినప్పటికీ దీని ద్వారా మాత్రమే వ్యవసాయ రంగంలో నీటి కొరత సమస్యను అధిగమించవచ్చన్నది నా గట్టి నమ్మకం. నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ఒక బేసిన్ నుంచి మరొక బేసిన్‌కు నీటిని తరలించగలిగితే ఆయా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవచ్చు. కాలువల ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతో ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీటిని తరలించగలుగుతాం. దీనిపై ఈ సమావేశంలో చర్చ జరగాలని కోరుకుంటున్నా. ఆమోదయోగ్య మార్గాలపై దృష్టి నీటి నిర్వహణకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చిస్తారని భావిస్తున్నా. అయితే సాంకేతికంగా సాధ్యం కావడంతో పాటు ఆర్థికంగా లాభదాయకమైన పరిష్కారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ పరిష్కారాలు సామాజికంగా ఆమోదయోగ్యంగా, పర్యావరణ అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నా. నీటి పారుదల, వరద నిర్వహణ రంగాలపై ఈ సదస్సులో జరిగే చర్చలు, ఆలోచనలు, సిఫారసులు భవిష్యత్తుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని గాఢంగా విశ్వసిస్తున్నా. ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక అవార్డు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డెల్టా రైతాంగానికి సాగునీటిని అందిస్తున్న ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణాల అవార్డుల కోసం అందిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఎంపిక చేశారు. వీటిలో మన దేశం నుంచి నాలుగు నిర్మాణాలకు ఈ అవార్డు దక్కింది. అందులో ప్రకాశం బ్యారేజీకి చోటు దక్కింది. విశాఖలో ఐసీఐడీ సదస్సు సందర్భంగా అవార్డును జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డిలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం జగన్ కలసి అందించారు. తమిళనాడులోని శ్రీవైకుంఠం ఆనకట్ట, ఒడిశాలోని బలిదా ఇరిగేషన్ జయమంగళ ఆనకట్టలకు కూడా ఈ అవార్డులు లభించాయి. -
అంచనా ఓకే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిస్తున్న చొరవ.. చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోంది. గత టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాలను.. కమీషన్ల వేటలో నాటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంలో అవలంబించిన అస్తవ్యస్త విధానాలను ఒక్కోటి సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధపట్ల సాగునీటి రంగ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఆమోదించి దాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి శుక్రవారం రాత్రి పంపారు. ఈ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు ఆమె పంపనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాక దానిని కేంద్ర కేబినెట్‌కు నివేదిస్తారు. అంతకుముందు.. తాజా ధరలను పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి నిధులిచ్చి సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో.. సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖాయం. దీంతో పోలవరానికి నిధుల సమస్య తీరడంతోపాటు ప్రాజెక్టు సత్వర పూర్తికి మార్గం సుగమం అవుతుంది. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేస్తూ పోలవరాన్ని పూర్తిచేయడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి ఇది మరో నిదర్శనమని అధికార వర్గాలు కొనియాడుతున్నాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు తొలిదశ పనులు పూర్తయ్యాక రెండో దశ పనుల సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి పంపుతుంది. రూ.15,505.81 కోట్ల పనులు మిగులు.. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో ఇప్పటికే పూర్తయిన పనులకు చేసిన వ్యయం.. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనుల్లో మిగిలిన పనుల వ్యయం.. చంద్రబాబు నిర్వాకంవల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం వంటి అదనంగా చేపట్టాల్సిన పనులు.. లైడార్ సర్వేలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయాలను పరిగణలోకి తీసుకుని సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. దీని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.38 కోట్లు. ఇందులో రూ.16,119.57 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.15,505.81 కోట్ల పనులు మిగిలాయి. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే నిధుల సమస్య పరిష్కారమవుతుంది. ‘రెండో దశ’ సవరించిన అంచనా వ్యయానికీ ఓకే.. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్టు (119.4 టీఎంసీలు) కాగా.. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పూర్తయ్యాక మొదటి ఏడాది నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు నీటిని నిల్వచేస్తారు. ఆ మరుసటి ఏడాది 2/3వ వంతు.. ఆ తరువాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. నీటి నిల్వచేసే సమయంలో ఏవైనా లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో నీటినిల్వ చేస్తారు. ఆ తరువాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక రెండో దశలో 45.72 మీటర్ల వరకూ అంటే.. పూర్తిస్థాయిలో నీటి నిల్వకు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, మిగిలిన పనులకు సంబంధించి సవరించిన వ్యయ ప్రతిపాదనను తొలిదశ పనులు పూర్తయ్యే దశలో పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. పోలవరానికి చంద్రబాబు చేసిన ద్రోహం ఇదీ.. ► నిజానికి.. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ 2014, జూన్ 8 నుంచి కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ► పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూనే 2016, సెప్టెంబరు 7న అర్థరాత్రి నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో.. 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని మెలికపెట్టారు. దీనికీ చంద్రబాబు అప్పట్లో తలఊపారు. ► ఆ తర్వాత.. 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1,981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు సరేనన్నారు. ► అనంతరం.. 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ► ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టంచేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి నోరుమెదపలేదు. ► అలాగే, 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ రాసినా చంద్రబాబు స్పందించలేదు. ► ఇక 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసిన మెమొరాండం ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి నిధులు (రూ.20,398.61 కోట్లు) ఇవ్వాలంటూ 2018, జనవరి 12న చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. నిజానికి.. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది మొత్తం ప్రాజెక్టును రూ.20,398.61 కోట్లకే పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. ► నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నాక.. తొలుత అప్పటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. ఆ తర్వాత రామోజీరావు సమీప బంధువుకు చెందిన నవయుగ, యనమల వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌లకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టారు. మొత్తం మీద.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి, కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకున్న చంద్రబాబు పోలవరాన్ని అస్తవ్యస్తం చేశారు. సీఎం జగన్ కృషి ఫలితమిది.. పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న సమయంలో 2013–14 ధరల ప్రకారం పనులు చేస్తామని 2016, సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లే. కానీ.. భూసేకరణ, పునరావాసం కల్పనకే రూ.33,168.23 కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో.. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యం. ఇదే అంశాన్ని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ పలుమార్లు వివరించారు. తాజా ధరల మేరకు నిధులు సకాలంలో ఇచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఫలితంగానే పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ. -
నీటిపారుదల రంగంలో 19 లక్షల కోట్ల పెట్టుబడి
రాయదుర్గం: కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంలో రూ. 19 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతోందని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. హైదరాబాద్ నాలెడ్జిసిటీలోని టీ హబ్‌లో జిటో ఇంక్యుబేసన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (జేఐఐఎఫ్) రెండు రోజులుగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సమ్మేళనం, వ్యవ స్థాపక దినోత్సవాల్లో ఆదివారం ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట పునరుద్ధరణ కార్యక్రమా న్ని, భూగర్భజల స్థాయిని పునరుద్ధరించడానికి కార్యాచ రణ, నదుల అనుసంధానం చేప ట్టామని తెలిపారు. పారిశ్రామిక రంగాల కంటే వ్యవసాయం రంగమే ఎక్కువ నీటిని వినియోగి స్తోందన్నారు. వ్యవసాయ రంగంలో తలసరి నీటి వినియోగం ఏడాదికి 4,913 నుంచి 5,800 కిలోలీటర్ల వరకు ఉంటుందని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువన్నారు. వ్యవసాయరంగంలో నీటిసంరక్షణకు స్టార్టప్‌ల అవసరం వ్యవసాయరంగంలో నీటి సంరక్షణపై ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపడం లేదని, ఇక్కడే ప్రైవేట్ రంగ సహాయం, స్టార్టప్‌ల అవసరం ఏర్పడుతోందని కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యానించారు. మురుగునీటిని తిరిగి ఉపయోగించుకునే వ్యాపార నమూనాలను అభివృద్ధి చేసేందుకు స్టార్టప్‌ల కోసం మంత్రిత్వశాఖ కూడా ఎదురుచూస్తోందన్నారు. దేశంలో దాదాపు 2వేల ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన నీటి పరీక్ష ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక పరీక్ష సౌకర్యం ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. కాఠిన్యం, పీహెచ్, కాపర్, ఐరన్, ఫాస్పేట్, క్లోరిన్, ఆమ్మోనియా, క్రోమియం వంటి 12 పారామీటర్లపై(ప్రామాణికాలపై) నీటి నాణ్యత పరీక్షలు జరుగుతాయన్నారు. టెస్టింగ్ కిట్ల అభివృద్ధిలోనూ స్టార్టప్‌ల సాయం టెస్టింగ్ కిట్లను అభివృద్ధి చేయడంలో స్టార్టప్‌లు తమకు ఎంతో సహాయ పడ్డాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇందులో 19 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని, 1.5 కోట్ల నమూనాలను సేకరించి పరీక్షించడం జరిగిందన్నారు. సెన్సార్ ఆధారిత తాగునీటి పరీక్ష కోసం పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్‌ల కోసం తాము హ్యకథాన్ కూడా నిర్వహించామన్నారు. ఇందులో 250 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా అందులో 20 స్టార్టప్‌లను షార్ట్ లిస్ట్ చేశామని కేంద్రమంత్రి షెకావత్ వెల్లడించారు. ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని, జేఐఐఎఫ్ వంటి సంస్థల నుంచి సహాయం కావాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఐఐఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని తడిపిన తపన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పచ్చబడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిరకాల కల సాకారమయ్యే క్రమంలో రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను దాటింది. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన సత్ఫలితాలిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతరీతిలో సాగునీటి వసతి కల్పనకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. రీడిజైనింగ్, రీ–ఇంజనీరింగ్ చేపట్టడంతో ప్రాజెక్టులన్నీ కొత్తరూపు సంతరించుకున్నాయి. దీంతో సాగునీటి విస్తీర్ణం పెరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల ప్రాజెక్టుల పూర్తితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. డిండి, గట్టు ఎత్తిపోతల, చనాఖా–కొరాటా ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరామ్‌సాగర్ వంటి ప్రాజెక్టుల కాల్వలను ఆధునీకరించింది. సాగునీటి రంగాభివృద్ధికి 8 ఏళ్లలో ఏకంగా రూ.1.52 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ ఆవిర్భవించి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రగతినివేదికలో ఈ విషయాలను పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం ముందు తీరం నుంచి ఐదు దశలలో నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయాలన్న లక్ష్యంతో రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 70 శాతం పనులు పూర్తయ్యాయి. 6 జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో గల 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు గోదావరి నీటిని తరలించి భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తులోకి లిఫ్టు చేసి రాష్ట్రంలో బీడువారిన భూములకు అందించడానికి ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మించింది. కాళేశ్వరంలో భాగంగా గోదావరిపై మూడు బ్యారేజీలు, 20 భారీ లిఫ్టులు, 21 పంప్‌హౌస్‌లు, 18 రిజర్వాయర్లు, 1,832 కి.మీ. పొడవున సొరంగాలు, పైప్లైన్లు, కాల్వలతో కూడిన నెటవర్క్‌ను కేవలం 36 నెలల రికార్డు సమయంలో నిర్మించింది. ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగునీరందిస్తుంది. కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరంగా 100 టీఎంసీల జలాలను నిల్వ చేయవచ్చు. -
అప్పుతోనే ‘సాగు’తుంది!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన నిధుల కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కోత పడింది. గతంలో ప్రవేశపెట్టిన మూడు పూర్తిస్థాయి బడ్జెట్లలో రూ.25 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం ఈసారి రూ.8,476.17 కోట్లకే పరిమితం చేసింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.3 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.3 కోట్లు కేటాయించింది. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు రుణాల ద్వారా సేకరించిన నిధులనే ఖర్చు చేయనుండగా, సీతారామ, వరద కాల్వ, దేవాదుల ప్రాజెక్టుల తెలంగాణ వాటర్ డెవలప్మెంట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకునే రుణాలతో నెట్టుకు రానున్నారు. మొత్తంగా రూ.12,400 కోట్ల రుణాలతో ప్రాజెక్టుల పనులను వేగిరం చేసే అవకాశం ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా మూడేళ్ల పాటు రూ.25 వేల కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించింది. ఈ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్లో 6 నెలలకే రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం సాగునీటికి కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్లో అధికంగా సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.1,324.02 కోట్లు కేటాయించగా, కాళేశ్వరం రూ.1,080.18 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.500 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి కేంద్ర పథకాల నుంచి నిధులు వచ్చే అవకాశాల నేపథ్యంలో దీనికి రూ.545 కోట్లు కేటాయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా, రూ.78 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు చేశారు. ఇందులో కల్వకుర్తికి రూ.4 కోట్లు, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌కు చెరో రూ.25 కోట్ల మేర కేటాయింపులతో సరిపెట్టారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తవడం, తూముల నిర్మాణంతో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం మాత్రమే చేపడుతుండటంతో మైనర్ ఇరిగేషన్ బడ్జెట్‌కు కోత పడింది. గతంలో ప్రతిసారి రూ.2 వేల కోట్లకు పైగా కేటాయిస్తూ వస్తుండగా, ఈసారి రూ.643 కోట్లకు పరిమితం చేశారు. రుణాలతోనే గట్టెక్కేది.. 2018–19 వార్షిక బడ్జెట్లో సాగునీటికి రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేయగా, దీన్ని ప్రస్తుతం రూ.19,985 కోట్లకు సవరించారు. ఇది కాళేశ్వరం రుణాల ద్వారా మరో రూ.15 వేల కోట్లు, దేవాదుల, సీతారామలకు సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా మరో రూ.3 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. రుణాలతో కలిపి ఖర్చు చేసిన మొత్తాలను చూస్తే ఈ ఏడాది రూ.35 వేల కోట్లకు పైగా ఖర్చు జరిగింది. అయితే రాష్ట్ర బడ్జెట్లో నుంచి కేటాయింపులు చేసిన పాలమూరు–రంగారెడ్డికి రూ.3 వేల కోట్లు కేటాయించగా, దాన్ని రూ.2,179 కోట్లకు సవరించారు. తుపాకులగూడేనికి రూ.700 కోట్లు కేటాయించగా, దాన్ని రూ.518 కోట్లకు సవరించారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ను పూర్తిగా కుదించారు. రూ.8,476 కోట్లకు కుదించడంతో పూర్తిగా రుణాల ద్వారానే భారీ ప్రాజెక్టులకు నిధుల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం మొదటి దశ పనుల పూర్తికి కార్పొరేషన్ ద్వారా రూ.45 వేల కోట్ల రుణాలు సేకరించగా, ఇందులో ఇప్పటికే రూ.38 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. మిగతా రుణాలను ఖర్చు చేసి మల్లన్నసాగర్, గంధమల, బస్వాపూర్ పనులను పూర్తి చేయనున్నారు. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని భావిస్తున్నారు. వీటన్నింటినీ కలిపి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకునే నిర్ణయం జరగ్గా, ఇప్పటికే రుణాల ద్వారా సేకరించిన మొత్తంలో రూ.6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. మిగతా రుణాలను వినియోగించుకుంటూ మొత్తం పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వీటితో పాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ.10 వేల కోట్లు రుణం తీసుకుంటున్నారు. దీంట్లోంచే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా అన్ని ప్రధాన ప్రాజెక్టులకు కలిపి రుణాల ద్వారానే రూ.12,400 కోట్లకు పైగా ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘మెగా’ పవర్ ఘనత మనదే!
సాక్షి, హైదరాబాద్: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సాగునీటి రంగంలో అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా ఉపయోగంలోకి తెచ్చిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థలకు దక్కడం ఆనందదాయకమని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. 124.4 మెగావాట్ల కాళేశ్వరం ప్రాజెక్టు (మేడారం–ప్యాకేజీ– 6) మొదటి పంపు వెట్‌రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, అందులో రాష్ట్ర విద్యుత్ సంస్థల శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడవడానికి కావాల్సిన విద్యుత్ సౌకర్యం అందించడానికి రెండేళ్లకు పైగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పని చేసిన విద్యుత్ సిబ్బందిని ప్రభాకర్‌రావు అభినందించారు. కాళేశ్వరంతో పాటు తెలంగాణలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన విద్యుత్తును ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించడానికి పునరంకితమవుతామని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించిన విద్యుత్ సంస్థలు.. ఎత్తిపోతల పథకాలకు రికార్డు స్థాయి ఏర్పాట్లు చేయడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిలో విద్యుత్ సంస్థలు గణనీయమైన పాత్రను పోషించడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు. విద్యుత్‌శాఖ రికార్డుస్థాయి ఏర్పాట్లు... భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలం గాణ విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ప్రాజెక్టును విజయవంతం గా నిర్వహించడంలో విద్యుత్ శాఖకున్న ప్రాధా న్యాన్ని మొదట్లోనే గుర్తించిన కేసీఆర్.. దీనికి అనుగుణంగా విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్ శాఖ చరిత్రలోనే మొదటి సారిగా ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక డైరెక్టర్ (సూర్య ప్రకాశ్)ను నియమించారు. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వ హించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు. బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసు కుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు. రూ.2,890 కోట్ల వ్యయంతో 5వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేశారు. మొత్తం 15 పంపుహౌజుల వద్ద 15 డెడికేటెడ్ సబ్స్టేషన్లు నిర్మించారు. వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించా రు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపు లు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉంది. కానీ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పం పులు (ప్యాకేజీ 8 – రామగుడు) ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఇంత భారీ సామర్థ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు. సముద్రమట్టానికి 550 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నీటిని మళ్లించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు ఇరుసుగా పనిచేస్తున్నాయి. -
తెలంగాణ వస్తే అభివృద్ధి సాధ్యమనుకున్నాం
హైదరాబాద్: తెలంగాణ వస్తే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని భావించామని.. కానీ ఆశలు అడియాసలు అయ్యాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక మూడవ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ‘తెలంగాణ అభివృద్ధి–సామాజిక, ఆర్థిక సవాళ్లు, సానుకూలతలు’ అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ.. నీటిపారుదల రంగంలో కాంట్రాక్టర్ల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణకు హైదరాబాద్ నుంచి అద్వితీయమైన ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.లక్షా 70 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రజారంజకమైన పథకాలకు ఖర్చు పెడితే కొంత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. భూపంపిణీ చేయనిదే అట్టడుగువర్గాల జీవితాల్లో మార్పు రాదన్నారు. కేరళ మాదిరిగా బడ్జెట్లో 37 శాతాన్ని విద్యారంగానికి కేటాయిస్తే మానవ వనరులు సృష్టించబడతాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక విలువలు నిర్దాక్షిణ్యంగా అణచివేయబడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో నిధులతోపాటు చైతన్యవంతమైన ప్రజలు అందుబాటులో ఉన్నారని, కానీ ఈ రెండింటినీ ఉపయోగించి అభివృద్ధి చేయకపోగా ప్రజల పాత్రను నిరాకరిస్తున్నారని విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. కానీ ఈ రెండింటినీ లొంగదీసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మీడియా సంస్థల అధిపతులు, ఇతర పారిశ్రామిక యాజమాన్యాల మీద ఐటీ దాడులు జరగాల్సినప్పుడు జరగకుండా అవసరానికి ఉపయోగపడనప్పుడు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ కూడా పౌర హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక వెబ్‌సైట్‌ను కె.రామచంద్రమూర్తి ప్రారంభించారు. జేవీవీ రాష్ట్ర నాయకుడు డా.అందె సత్యం అ«ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ, టి.శ్రీనాథ్, డా.రమాదేవి, రాజామాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
ఎడారి చెలక మాగాణిగా మారింది
సాక్షి, హైదరాబాద్: ‘తలాపున పారుతుంది గోదారి..మన చేను, మన చెలక ఎడారి’అంటూ గతంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందు పాడుకునే వాళ్ళమని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి ‘మన చేను, మన చెలక మాగాణి’అని పాడుకోవాల్సిన రోజులు వచ్చాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందు చూపుతో సాగునీటి రంగం అభివృద్ధికి మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు అనేక సమస్యల కారణంగా గాలికి వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిర్థేశిత ఆయకట్టుకు త్వరితగతిన నీరందించడం, రాష్ట్ర అవసరాలమేరకు ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేయడం, గత ప్రభుత్వాలు అటకెక్కించిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం.. లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు ఆయన వివరించారు. ఆదివారం హరీశ్‌రావు హైదరాబాద్‌లోని జలసౌధలో సాగునీటి శాఖ క్వాలిటీ కంట్రోల్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాగునీటి రంగంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కోరారు. తనిఖీలు తప్పనిసరి.. సాగునీటి రంగంలో లక్ష్యాలు చేరుకోవడానికి, పనులు పర్యవేక్షించే ఫీల్డ్ ఇంజనీర్లతో పాటు, పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల పాత్ర, ప్రాజెక్టుల డిజైన్లను రూపొందించే డిజైన్ ఇంజనీర్ల పాత్ర కీలకమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రాజెక్టులు పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలని అన్నారు. వెయ్యి సంవత్సరాల కిందట కాకతీయ రాజులు నిర్మించిన చెరువులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కాకతీయుల కాలంనాటి కట్టడాల్లో ఎక్కడా నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించారని చెప్పారు. మనం కూడా కాకతీయుల వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు నిర్మాణం అవుతున్న భారీ ప్రాజెక్టు నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. ప్రాజెక్టుల్లో వాడే ఇసుక, స్టీల్, సిమెంట్ నాణ్యతకు క్వాలిటీ కంట్రోల్ విభాగానిదే బాధ్యత అన్నారు. డిజైన్ ప్రకారం కొలతలు, స్లోప్స్, లెవెల్స్ సరిగా ఉన్నాయా లేదా అని చూసే బాధ్యత డిజైన్ల విభాగంపైనే ఉందన్నారు. ప్రతి రోజూ క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిర్మాణాలవద్దకు వెళ్లి తనిఖీ చేయాలని కోరారు. భారీ కాంక్రీట్ పనులు జరుగుతున్న సైటుకు ఎక్కువ సార్లు వెళ్ళాలని సూచించారు. వివిధ సందర్భాల్లో పత్రికల్లో గానీ, ఇతరత్రా కానీ వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భేటీలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్రావు, సీఈలు సునీల్, హరిరాం, ఖగేందర్‌రావు, సురేశ్ కుమార్, శ్యాం సుందర్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం పనితీరును పర్యవేక్షించే బాధ్యతను ఈఎన్సీ నాగేందర్‌రావుకు అప్పగించారు. -
అపర భగీరథుడు
► జలయజ్ఞం... అన్నదాత కష్టాలకు పరిష్కారం.. కరువు రక్కసిపై ప్రయోగించిన వజ్రాయుధం తన తాత ముత్తాతలకు సద్గతులు కల్పించాలన్న లక్ష్యంతో నాడు భగీరథుడు దివి నుంచి భువికి గంగను రప్పించడానికి తపస్సు చేశాడన్నది పురాణగాథ! తెలుగు నేల నుంచి కరవు రక్కసిని శాశ్వతంగా తరిమికొట్టి.. అన్నపూర్ణ నామాన్ని సార్థకం చేసేందుకు, అన్నదాతల కష్టాలను సమూలంగా తొలగించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో అలాంటి భగీరథ ప్రయత్నమే చేశారు. బడ్జెట్లో సింహభాగం నిధులు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించి.. ఆ నిధులు సద్వినియోగమయ్యేలా పనులను ఉరకలెత్తించి బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి అలుపెరగని పోరాటం చేశారు. రూ.54 వేల కోట్లు ఖర్చు చేసి 18.48 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లందించారు. సింహభాగం ప్రాజెక్టులను ఓ కొలిక్కి తెచ్చారు. తెలుగు నేలను అన్నపూర్ణగా పరిఢవిల్లేలా చేసే క్రమంలో దురదృష్టవశాత్తూ దూరమయ్యారు. జలయజ్ఞంపైనా, మహానేత పైనా విషం కక్కినవారే నేడు ఆ ఫలాలను తమ విజయాలుగా ప్రకటించుకుంటుండడం విశేషం. సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు మండుటెండలో జరిపిన ప్రజాప్రస్థాన పాదయాత్రలో ప్రజల కష్టాలను, కడగండ్లను దగ్గర నుంచి చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారపగ్గాలు చేపట్టగానే వాటి పరిష్కారం కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టారు. అందులో ప్రధానమైనది జలయజ్ఞం. అది ఒక భగీరథ యత్నం. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 ప్రాజెక్టులను వైఎస్ చేపట్టారు. 97.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు మరో 23.53 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. సింహభాగం నిధులు సాగునీటికే.. అంతకుముందు రాష్ర్టంలో అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి సాగునీటి రంగానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. వైఎస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్లో సింహభాగం నిధులను ప్రాజెక్టులకు కేటాయించారు. ఆ నిధులను సద్వినియోగ మయ్యేలా ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించారు. ఆయన హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి.. 17 ప్రాజెక్టులను పూర్తి చేసి.. మరో 23 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేశారు. 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగం చరిత్రలో ఇదో చెరిగిపోని రికార్డు. అధిక శాతం ప్రాజెక్టు పనులను ఓ కొలిక్కి తెచ్చిన వైఎస్.. జలయజ్ఞం ఫలాలను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తెస్తూ దురదృష్టవశాత్తు ప్రజలకు దూరమయ్యారు. పునాదిరాళ్లే బాబు ఘనత.. వైఎస్‌కు ముందు 1995 నుంచి 2004 వరకూ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం సాగునీటి ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేయడం.. అవసరం తీరాక వాటిని అటకెక్కించడం ఆయనకు రివాజు.. అందుకు అనేక ఉదాహరణలు... రాయలసీమను సస్యశ్యామలం చేసే హంద్రీ-నీవా సుజల స్రవంతి పనులకు 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఎన్నికలయ్యాక దానిని అటకెక్కించారు. 1999 సాధారణ ఎన్నికలకు ముందు హంద్రీ-నీవా ప్రాజెక్టును కేవలం ఐదు టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి ప్రాజెక్టుగా మార్చి.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కాలువపల్లి వద్ద రెండో సారి పునాదిరాయి వేశారు. జనం నమ్మరనే భావనతో పునాదిరాయి అటు వైపు.. ఇటు వైపు మూడు మీటర్ల మేర కాలువ తవ్వారు. ఎన్నికలు ముగియగానే యథాప్రకారం ఆ ప్రాజెక్టును అటకెక్కించారు. వైఎస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే రూ.6,850 కోట్ల వ్యయంతో 4.05 లక్షల ఎకరాలకు సాగునీళ్లు.. 33 లక్షల మందికి తాగునీళ్లు అందించేలా హంద్రీ-నీవాను చేపట్టి.. తొలి దశను పూర్తి చేశారు. రెండో దశలో కూడా 50 శాతం పనులను పూర్తి చేశారు. ఎకరానికి నీళ్లందించేందుకు రూ.16,750ను వృథాగా ఖర్చు చేస్తున్నారంటూ హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని వ్యతిరేకించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆ పథకాన్ని తన ఘనతగా చెప్పుకుంటూండటం గమనార్హం. తోటపల్లిలో మీ పాత్ర ఎంత బాబూ? విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1.84 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి కోసం 42 చెరువులను నింపాలన్న లక్ష్యంతో తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో చేపట్టారు. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించిన ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ. 3 కోట్లే. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తోటపల్లి ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 399 కోట్లు వ్యయం చేశారు. తర్వాత రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశాయి. 2014 మార్చి 31 వరకు రూ. 609.61 కోట్లు ఖర్చు పెట్టి 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 12 కోట్లు ఖర్చు పెట్టి.. సెప్టెంబరు 10, 2015న జాతికి అంకితం చేసి, అది తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ పోల‘వరం’.. చంద్రబాబు అపహాస్యం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల. ఉప్పు సంద్రం పాలవుతోన్న వందల టీఎంసీల గోదావరి జలాలను ఒడిసి పట్టి.. ఆంధ్రప్రదేశ్‌ను సుభిక్షం చేసేందుకు వైఎస్ పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం.. 301 టీఎంసీలు మళ్లించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 30 లక్షల మందికి తాగునీరు.. 960 మెగావాట్ల జల విద్యుత్, విశాఖకు పారిశ్రామిక అవసరాలు తీర్చే బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఇది. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించి.. పనులు మొదలు పెట్టిన వైఎస్‌కు అప్పటి విపక్షాలు, సరిహద్దు రాష్ట్రాలతో కలిసి అడుగుడుగునా అడ్డుతగిలాయి. కానీ.. వాటిని లెక్క చేయకుండా వైఎస్ ముందుకే సాగిపోయారు.. పోలవరం హెడ్ వర్క్స్‌కు అడ్డుతగలడంతో 174 కిమీల మేర కుడి కాలువ.. 181.50 కిమీల ఎడమ కాలువ తవ్వకం పనులు చేపట్టారు. హెడ్ వర్క్స్ చేపట్టకుండా కాలువలు తవ్వడం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌లోనే చేస్తున్నారంటూ అప్పటి విపక్ష నేత చంద్రబాబు ఎకసెక్కాలు ఆడారు. తన వర్గీయులతో కాలువల తవ్వకానికి భూమి ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేయించారు. ఫలితంగా వైఎస్ తన హయాంలో కుడి కాలువ 145 కిమీలు.. ఎడమ కాలువ 136 కిమీల మేర తవ్వగలిగారు. అప్పుడు ఎగతాళి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పోలవరం హెడ్‌వర్క్స్ పనులు నీరుగార్చి.. కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టారు. పట్టిసీమ ద్వారా తోడిన గోదావరి జలాలను వైఎస్ తవ్వించిన కుడి కాలువ గుండానే తరలిస్తున్నారు. వైఎస్ హయాంలో మిగిలిపోయిన 29 కిమీల కాలువను 20 మీటర్ల వెడల్పుతో తూతూమంత్రంగా తవ్వి.. దీని ద్వారా చెంబుడు గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో కలిపి అదే నదుల అనుసంధానం అంటున్నారు. -
ఆరేళ్లలో.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి టి.హరీశ్‌రావు - వరద జలాలూ ముందు ముందు నికర జలాలే - బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో 125 టీఎంసీల కేటాయించని నీటి వాటాలున్నాయి - వాటిని కలుపుకొంటే పాలమూరు, డిండిలకు కేటాయింపులన్నీ నికర జలాలే - దీనికోసం ట్రిబ్యునల్, కోర్టుల్లో కొట్లాడి అదనపు వాటా సాధిస్తాం - భూసేకరణకు జీవో 123 ఐచ్ఛికం మాత్రమేనని వివరణ - నిర్వాసితులు కోరితే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిస్తామని వెల్లడి నేనొక ఫైటర్‌ను. క్రూసెడర్ను. బంగారు తెలంగాణ కోసం మంచి పునాదులు వేస్తా. ఒక తప్పు జరిగినా నాలుగు తరాలపై భారం పడుతుంది. అందుకే సమష్టిగా సరైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్ని ఆటంకాలు కల్పించినా, అవరోధాలు సృష్టించినా మా ప్రస్థానం ఆగేది కాదు. మమ్మల్నెవరూ ఆపలేరు. ఆపుదామనుకుంటే, ఆపుతామనుకుంటే అది భ్రమే సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలి ప్రాధాన్యం నీళ్లకే ఇస్తున్నామని... రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల జలాల్లో రాష్ట్రానికి ఉన్న నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఆరేళ్లలో కోటి ఎకరాలకు నీరందించి ప్రజల ఆశలు నెరవేరుస్తామని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మారుస్తామని భరోసా ఇచ్చారు. గతంలోని ఈపీసీ విధానాలు రద్దు, అడ్వాన్సుల చెల్లింపులకు చరమగీతం పాడుతూనే... ప్రాజెక్టు పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులు, లక్ష్యాలు, పొరుగు రాష్ట్రాలతో వివాదాలు, భూసేకరణ ఆరోపణలు తదితర అంశాలపై హరీశ్‌రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. ప్రశ్న: సాగునీటి రంగంలో ప్రభుత్వ ప్రాథమ్యాలేమిటి? హరీశ్‌రావు: ప్రతి నియోజవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరందిస్తాం. ఆరేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దీనికోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. ఆరునూరైనా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని ఎలుగెత్తి చాటేలా చేసి చూపిస్తాం. రీఇంజనీరింగ్‌తో కాలయాపన జరుగుతోందనే విమర్శలున్నాయి.. లక్ష్యంలోగా ప్రాజెక్టుల పూర్తి సాధ్యమేనా? దేవాదుల, దుమ్ముగూడెం, కంతనపల్లి, ప్రాణహిత ప్రాజెక్టుల పరిధిలో గత ప్రభుత్వాలు ఎంతో అసమగ్రంగా, అసంపూర్ణంగా ప్రాజెక్టులు చేపట్టాయి. దేవాదులలో 5 లక్షల ఎకరాలకు 5 టీఎంసీల సామర్థ్యం, కల్వకుర్తిలో 3.5 లక్షల ఎకరాలకు 0.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను మాత్రమే డిజైన్ చేశారు. వాటితో తెలంగాణకు ప్రయోజనం శూన్యం. వీటిని సరిదిద్దేందుకే రీడిజైన్ చేపట్టాం. పూర్తి స్పష్టతతో, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమగ్రంగా నివేదికలు రూపొందిస్తున్నాం. అందువల్ల తొలుత కొంత జాప్యం జరిగినా అన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. కాబట్టి అనుకున్న లక్ష్యం మేరకు పూర్తి చేయడం కష్టం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై వ్యతిరేకతను ఏమంటారు? వ్యతిరేకత లేదు. ప్రతిపక్షాలే వ్యతిరేకతను సృష్టిస్తున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్ద రాజీవ్ రహదారికి కుడివైపున జనగామ పరిధిలో భూములు కోల్పోయిన వారికి కేవలం రూ.80 వేల నుంచి రూ.1.30 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చారు. అదే మేం రూ.6 లక్షల వరకు పరిహారాన్ని 15 రోజుల్లోనే చెల్లిస్తున్నాం. భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారమివ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం జీవో 123 వైపే ఎందుకు మొగ్గుతోంది? ఈ విషయంలో చాలా మందికి అపోహలున్నాయి. జీవో 123 ప్రకారం 15 రోజుల గడువులో నిర్వాసితులకు పరిహారమిస్తున్నాం. భూసేకరణ చట్టం కన్నా మెరుగైన పరిహారం చెల్లిస్తున్నాం. రైతుకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరితేనే జీవో 123ని వర్తింపజేస్తున్నాం. జీవో 123 అనేది కేవలం ఐచ్ఛికం(ఆప్షన్) మాత్రమే. ఎవరైనా భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోరితే ఆ విధంగానే చెల్లిస్తాం. అయితే ఈ చట్టం ద్వారా పరిహారం చెల్లింపునకు 6 నుంచి 8 నెలల గడువు తీసుకుంటోంది. పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాలకు నీటి కేటాయింపులు లేవని ఏపీ వాదిస్తోంది కదా? కృష్ణా జలాల్లో తెలంగాణకున్న హక్కు మేరకే ప్రాజెక్టులు చేపట్టాం. ఒక్క చుక్క అదనంగా కోరుకోవడం లేదు. మొత్తం 811 టీఎంసీల నికర జలాల్లో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు మరో 77 టీఎంసీల మిగులు జలాల కేటాయింపులున్నాయి. కానీ మొత్తంగా 200 టీఎంసీలకు మించి రాష్ట్రం వాడటం లేదు. అంతేకాదు రాష్ట్రానికి ఉన్న కేటాయింపులను తన పరిధిలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉంది. అందువల్లే పాలమూరు-రంగారెడ్డి, డిండిలకు నీటిని వాడుకుంటాం. అంతేగాకుండా బచావత్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే పైరాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఆ 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయి. ఇక పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నీటిని కృష్ణాకు తరలిస్తే అంతే పరిమాణంలో పైరాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డు పేర్కొంది. 80 టీఎంసీల సామర్థ్యంతో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారు. ఈ లెక్కన ఇదే స్థాయిలో 80 టీఎంసీల నీరు తెలంగాణకు దక్కాలి. అంటే మొత్తంగా 125 టీఎంసీలు రావాల్సి ఉంది. ఈ లెక్కన ప్రస్తుతం వరద జలాలుగా పేర్కొంటున్నవి రేపు నికర జలాలు అవుతాయి. అదే నీటిని పాలమూరు, డిండిలకు వాడతాం. అవి కొత్త ప్రాజెక్టులేననే ఏపీ వాదనపై? కృష్ణాలో 70 టీఎంసీలు వాడుకునేలా పాలమూ రు ప్రాజెక్టుపై డీపీఆర్ తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారు. కృష్ణాలోనే 30 టీఎంసీల నీటిని వాడుకునేలా డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. ఆ జీవోలు ఇచ్చినప్పుడు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ ఉన్నారు. అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఆరోజు సరైనవి ఇప్పుడు అక్రమ ప్రాజెక్టులుగా ఎందుకు కనిపిస్తున్నాయి? నిజానికి ఏపీ చేపట్టిన పట్టిసీమ పూర్తిగా కొత్త ప్రాజెక్టు. దానికి ఎలాంటి అనుమతులూ లేవు. ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై మీ స్పందన? ప్రాజెక్టులకు ఈ రెండేళ్లలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోరినా స్పందన లేదు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద మాత్రం 11 రాష్ట్ర ప్రాజెక్టులను చేర్చారు. వాటికి ఏమేర సహకారం అందుతుందో చూడాలి. ప్రాణ హిత-చేవెళ్ల డిజైన్ మార్పు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకేనన్న విమర్శలపై మీ స్పందన? గోదావరిలో లభ్యతగా ఉన్న నీటిని సాగు, తాగు ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ మేడిగడ్డ ద్వారా నీటిని మళ్లించాలని నిర్ణయించాం. తమ్మిడిహెట్టి 152 మీటర్ల ఎత్తును మహారాష్ట్ర వ్యతిరేకించింది. అందుకే 148 మీటర్లకు తగ్గాల్సి వచ్చింది. ఈ ఎత్తులో కేవలం 1.8 టీఎంసీల సామర్థ్యంతోనే బ్యారేజీ నిర్మించి, 40 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించగలం. ఆ నీటితో నిర్ణీత 16 లక్షల ఎకరాలకు నీరివ్వలేం. అందుకే ఏడాదిపాటు 400 టీఎంసీల లభ్యత ఉన్న మేడిగడ్డ ద్వారా నీటిని మళ్లించాలని నిర్ణయించాం. దీని ద్వారా నిర్ణీత 20 లక్షల ఎకరాలతో పాటు ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ కింద ఉన్న మరో 20 లక్షల ఆయకట్టు స్థిరీకరణకూ అవకాశముంది. నీటి నిల్వల కోసం 11 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్లను 153 టీఎంసీల సామర్థ్యానికి పెంచాం. ఆయకట్టు, సామర్థ్యాలు పెరిగినప్పుడు ప్రాజెక్టు వ్యయం పెరగదా?, 2007లోనూ ఇప్పుడూ ఒకే ధరలున్నాయా? ప్రాజెక్టుల్లో మార్పులు రాష్ట్ర ప్రయోజనాల కోసమేగానీ.. కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాదు. కాంట్రాక్టర్లకు ప్రాంతం, వ్యక్తులు, ఇష్టాయిష్టాల మీద ఆధారపడి టెండర్లు ఇవ్వరు. దేశంలోని ఎక్కడివారైనా టెండర్లలో పాల్గొంటారు. తక్కువ కోట్ చేసిన వారు కాంట్రాక్టు పొందుతారు. ఇది గుర్తుంచుకోవాలి. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతకు వీలులేదా? రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)కు బచావత్ తీర్పు ప్రకారం 15.9 టీఎంసీల నీటి కేటాయింపు, 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ ఏనాడూ అక్కడ 4 టీఎంసీల నీటి వినియోగం కూడా లేదు. ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేద్దామంటే ఏపీ అడ్డుపడుతోంది. ఇదేం న్యాయం? ఆర్డీఎస్ ఆధునీకరణ కోసం కర్ణాటకను ఒప్పించాం. మేడిగడ్డ, చనాఖా-కొరట బ్యారేజీలపై మహారాష్ట్రను ఒప్పించాం. వారితో సఖ్యత కోరుకున్నాం. ఏపీతోనూ అదే విధమైన సఖ్యత కోరుతున్నా.. వారి నుంచి స్పందన లేకపోతే మేమేం చేయగలం? సాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని ఒత్తిడి తెస్తోంది. అది సరికాదన్నా వినడం లేదు. ‘మిషన్ కాకతీయ’ ఆశించిన లక్ష్యాన్ని చేరుతుందా? చిన్న నీటి వనరులకు గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 262 టీఎంసీల మేర కేటాయింపులున్నా.. వినియోగం 100 టీఎంసీలు దాటడం లేదు. దీంతో చిన్న నీటి వనరుల కింద ఆయకట్టులో సగం కూడా సాగు కావడం లేదు. అందువల్లే రాష్ట్రంలోని 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టాం. మొదటి విడతలో 8వేలు, రెండో విడతలో మరో 7 చెరువులను వర్షాలు సమృద్ధిగా కురిసే నాటికి సిద్ధం చేసి ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అనుకున్న మేర వర్షాలు కురిస్తే నీటికి కొరత ఉండదు. మా లక్ష్యం నెరవేరినట్లే. -
ప్రాణహితమే
♦ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన ♦ ‘ప్రాణహిత’కు రూ.685.30 కోట్లు ♦ సింగూరుకు రూ.27.50 కోట్లు ♦ వడివడిగా ‘నిమ్జ్’ పనులు! ♦ బాగుందన్న అధికార పార్టీ ♦ మండిపడిన ప్రతిపక్ష పార్టీల నేతలు సిద్దిపేట: సాగునీటి రంగానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేసిన నేపథ్యంలో జిల్లాకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. ప్రాణహితకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు తగ్గినా.. దీనికి ఎగువనున్న కాళేశ్వరానికి వేల కోట్లు కేటాయించడం దానికి అనుసంధానమై ఉండే ప్రాణహితకు మేలు చేసేదేనని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే సింగూరుకు రూ.10.5 కోట్ల మేర కేటాయింపులు పెరగడం విశేషం. ప్రధానంగా కొన్ని రంగాలపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం.. మిగతా సంక్షేమ రంగాలకు కోత పెట్టిందని విపక్ష పార్టీలు అంటున్నాయి. వ్యవసాయం, రుణమాఫీ అంశాలపై స్పష్ట లేదని అవి ఆరోపిస్తున్నాయి. జిల్లా అనంతగిరి సమీపంలో ఒక బ్యారేజీ, చంద్లాపూర్వద్ద మరో బ్యారేజీ, సిద్దిపేట మండలం తడ్కపల్లి శివార్లలో భారీగా 52 టీఎంసీల నిల్వ సామర్ధ్యం ఉన్న కొమురవెళ్లి మల్లన్న సాగర్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పాములపర్తి వద్ద మరో 21 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీలు నిర్మించి జిల్లాకు సాగు నీరందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో 10 నుంచి 15, 17-20, 23, 36 ప్యాకేజీల పేరిట పనులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రాజెక్టుల రీ డిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా బ్యారేజీలకు సొరంగ మార్గాలు (టన్నెళ్లు) , కాలువల పనులు జరుగుతుండగా ఇటీవలే చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో భూసేకరణ పూర్తవటంతో అక్కడ నిర్మించతల పెట్టిన రంగనాయక సాగర్ ఎడమ కాలువ పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మిగిలిన బ్యారేజీలకు సంబంధించి భూసేకరణకు ప్రత్యేకంగా 5 రెవెన్యూ అధికారుల బృందాలను ఏర్పాటు చేసి సర్వే పనులను ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.685.3 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. కాని గత బడ్జెట్లో కంటే తక్కువగా కేటాయింపులు చేయడం పట్ల జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింగూరుకురూ.10 కోట్లు అదనపు కేటాయింపు కాగా జిల్లాలోని మరో ప్రాజెక్టు అయిన సింగూరుకు గత బడ్జెట్ కంటే రూ.10.5 కోట్లు అదనం గా కేటాయించారు. గత బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు రూ.17 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.26.5 కోట్లు కేటాయించడం విశేషం. నిమ్జ్‌కు రూ.100 కోట్లు జహీరాబాద్‌లో నెలకొల్పనున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)కు రూ.100 కోట్లు కేటాయించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం విశేషం. ఇది సాకారమైతే స్థానిక యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వడివడిగా సాగుతోంది. అలాగే ఏదైనా ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా ఎస్పీ వద్ద రూ.కోటి ఉంచాలనే సర్కారు నిర్ణయంపై పోలీసుల వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రోత్సాహకాలే ప్రోత్సాహకాలు.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గరిష్టంగా ప్రయోజనం కలగనుందని ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పట్టణాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి నిధుల కేటాయింపుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అలాగే క్రీడలను క్రమం తప్పకుండా నిర్వహించే వివిధ సంఘాలు, అసోసియేషన్లకు ప్రోత్సాహకాలు అందించాలనే నిర్ణయంపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇది క్రీడలకు ప్రోత్సాహమిస్తుందని అంటున్నారు. అలాగే గ్రామాల్లో వైద్య సిబ్బందికి సైతం ప్రోత్సాహకాలు ప్రకటించడం పేదలకు వైద్య సేవలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. పండ్లు, కూరగాయల సాగు ప్రోత్సాహానికి వీలుగా హార్టికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం.. జిల్లా రైతాంగానికి ఊరట కలిగించనుంది. ఇప్పటికే మెదక్ జిల్లా వెజిటబుల్ హబ్‌గా ఆవిర్భవించిన నేపథ్యంలో కూరగాయల రైతులకు ఇది మేలు చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాణ‘హిత’మేనా? ప్రాణహిత - చేవెళ్ల (కాళేశ్వరం) పథకానికి కేటాయించిన నిధులపై పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సింగూరుకు సైతం అన్యాయం జరిగిందని వారంటున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సంకల్పించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల (కాళేశ్వరం) పథకం ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో గతేడాది కంటే తక్కువ నిధులు కేటాయించింది. సోమవారం ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రూ.685.30 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఈ పథకానికి రూ.1515 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో కరీంగనర్ -
అప్పుడు ఇచ్చినంత ఇవ్వలేం
వచ్చే బడ్జెట్లో ఇరిగేషన్ మినహా శాఖలన్నింటికీ కోతలే నీటిపారుదలకు రూ. 17 వేల కోట్లు పెంచాలి ఆమేరకు ఇతర శాఖల్లో సర్దుబాటు తప్పదు అన్ని విభాగాలకు సందేశమిచ్చిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది బడ్జెట్లో నీటిపారుదల రంగం మినహా అన్ని విభాగాలకు భారీగా కోతపడనుంది. ప్రణాళిక పద్దులోనే దాదాపు రూ.17 వేల కోట్ల నిధులకు వాతపడనుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. తాజాగా కార్యదర్శుల స్థాయిలో శాఖల వారీగా జరిగిన సమీక్ష సమావేశాల్లో ఆర్థిక శాఖ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చింది. ‘2015-16 బడ్జెట్లో ఇచ్చినన్ని నిధులు ఈసారి ఇవ్వలేం. అంతకంటే తక్కువే కేటాయిస్తాం. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా నీటిపారుదల శాఖకు ఎక్కువ వాటా ఇవ్వాల్సి ఉంది. అందుకే మీ విభాగాల్లో ప్రతిపాదనలను వీలైనంత కుదించండి. మునుపటి కేటాయింపుల కంటే తక్కువకు అంచనాలు ఇవ్వండి’ అంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని విభాగాలకు సందేశమిచ్చారు. దీంతో రాబోయే బడ్జెట్లో కేటాయింపులపై అన్ని విభాగాల్లోనూ ఆందోళన మొదలైంది. 2015-16లో రూ.1,15,689 కోట్లతో బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం రూ.52,383 కోట్ల ప్రణాళిక వ్యయం, రూ.63,306 కోట్ల ప్రణాళికేతర వ్యయం అంచనా వేసింది. అందులో నీటిపారుదల శాఖకు రూ.8,000 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాది నుంచి రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. దీంతో నీటిపారుదల శాఖకు అదనంగా అవసరమయ్యే రూ.17 కోట్లను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయటం తప్పనిసరని ఆర్థిక శాఖ గుర్తించింది. రెవెన్యూ పెరిగినా... గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 10-15 శాతం పెరిగే అవకాశముంది. కానీ, కచ్చితంగా చెల్లించాల్సిన పద్దులు, వాస్తవ రెవెన్యూ రాబడుల ఆధారంగా నీటిపారుదల శాఖకు ఇచ్చే సింహభాగాన్ని ఇతర శాఖల్లో కత్తెర వేయక తప్పదని ఉన్నతాధికారులు చెప్పారు. రైతుల రుణమాఫీ పథకం మూడో విడతకు రూ.4,250 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, ఉచిత విద్యుత్ రాయితీ, ఆసరా పెన్షన్ల చెల్లింపుల్లో కోత పెట్టే పరిస్థితి లేదు. ఇదే సమయంలో ప్రతిష్టాత్మక సన్న బియ్యం పథకం, కళ్యాణ లక్ష్మి, వాటర్ గ్రిడ్, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాలకు పెద్దపీట వేయాల్సి ఉంటుంది. అందుకే మిగతా శాఖలన్నీ ప్రస్తుత బడ్జెట్‌కు మించి నిధుల అంచనాలు వేసుకోవద్దని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, పెన్షన్లన్నీ అంచనాకు మించి పెరిగిపోయాయి. దీంతో ప్రణాళికేతర వ్యయంలో కోత పెట్టే పరిస్థితి లేదు. గత ఏడాదితో పోలిస్తే అన్ని రంగాల్లో రెవెన్యూ పెరిగింది. నవంబర్ నాటికి రూ.31 వేల కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఆర్థిక శాఖ చెప్పింది. వ్యాట్ సేల్స్‌టాక్స్, ఎక్సైజ్ ఆదాయం 18 శాతం పెరగగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 30 శాతం పెరగడం విశేషం. రవాణా శాఖలో 20 శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే దేశంలోనే అత్యధికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి రేటు కనిపించిందని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కానీ, అంచనాలకు సరిపడే ఆదాయం రాకపోవటంతో ఈ ఏడాది వ్యయం రూ.90 వేల కోట్లకు మించే పరిస్థితి లేదు. -
దేవుడిచ్చిన వరం కేసీఆర్
ఎంపీ కె. కేశవరావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు దేవుడిచ్చిన వరం ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన మైనార్టీ నేత సాజిద్ అలీ.. ఎంపీ కేశవరావు సమక్షంలో శనివారం టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడంలో కేసీఆర్‌కు ఎవరూ సాటిరారని కేశవరావు సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేసీఆర్ చేస్తున్న కృషికి అందరూ అండగా నిలవాలన్నారు. నీటి పారుదల రంగంపై కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన ఏ నేతకూ లేదని, ఆయన నాయకత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు. గ్రామీణ ప్రజల దీన స్థితికి చలించి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆంధ్ర ప్రాంత పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ చేస్తున్న కృషికి అండగా నిలిచేందుకు అందరూ కలిసిరావాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. హైదరాబాద్‌ను డాలస్ తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం అహరహం శ్రమిస్తున్నార న్నారు. -
దాచేస్తే దాగని సత్యం జలయజ్ఞ ఫలం
సాగునీటిరంగంపై వైఎస్ చెరగని ముద్ర 2004 తర్వాత మారిన ప్రాధాన్యతలు సాగునీటి రంగానికి పెద్దపీట కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంతో చేపట్టిన జలయజ్ఞం వైఎస్ హయాంలో కొత్తగా సాగులోకి వచ్చిన 23.49 లక్షల ఎకరాలు సాగునీటి రంగానికి వైఎస్ చేసిన కేటాయింపులు, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టే ఆయన కృషికి రుజువు బాబు హయాంలో చిన్నచూపే... అరకొర కేటాయింపులే అందుకు నిదర్శనం తన హయాంలో పోలవరానికి పాలనా అనుమతీ ఇవ్వలేదు హంద్రీనీవాలో ఎకరాకు రూ.16,750 ఖర్చంటూ వ్యతిరేకించిన బాబు ఇప్పుడేమో.. హంద్రీనీవా ద్వారా అనంతపురానికి నీళ్లిస్తున్న ఘనత తనదేనట! వైఎస్ చేసిన కృషిని కావాలని తక్కువగా చూపే ప్రయత్నం.. జలయజ్ఞం.. అద్భుత సంకల్పం... కోటి ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించి, రైతన్న భవిష్యత్తుకు భరోసాను కల్పించడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న దృఢ నిర్ణయం. భారీగా బడ్జెట్ కేటాయింపులు. అదే వేగంతో నిర్మాణాలు.. ఆయన హయాంలోనే పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పొలాలకు సాగునీరూ అందించారు. కానీ.. చంద్రబాబు తీరు అందుకు భిన్నం.తన తొమ్మిదేళ్లలో సాగునీటికి ప్రాధాన్యమివ్వలేదు. పునాదిరాళ్లు, ప్రచార ఆర్భాటమే ప్రత్యేకత అయ్యింది. ఈ నిజాన్ని గణాంకాలే చెబుతున్నాయి. ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి చరిత్రను చెరిపేయడానికి ప్రయత్నించడం వృథాప్రయాసే. చరిత్రను తిరగరాద్దామనుకున్నా.. అది అందరికీ సాధ్యం కాదు. సాగునీటి రంగంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన కృషిని తక్కువ చేసి చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యం, ఫలితంగా వివిధ ప్రాజెక్టుల కింద సాగైన బీడు భూములు, రైతుల ఇంట కురిసిన సిరులు, భారీగా నిధుల కేటాయింపు ఫలితంగా శరవేగంగా పనులు జరిగి ఆయన మరణంతో నిలిచిపోయిన ప్రాజెక్టులు, మళ్లీ చంద్రబాబు అధికారం చేపట్టాక ప్రాధాన్యం కోల్పోయిన నీటిపారుదల రంగం.. ఇవన్నీ సజీవ సాక్ష్యాలే. శ్వేతపత్రంలో దాయలేని నిజాలు చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నిరంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. సాగునీటి రంగంపై రూపొందించిన శ్వేతపత్రంలో.. చంద్రబాబు ఎంతగా దాయాలనుకున్నా నిజాలు దాచలేకపోయారు. బాబు ప్రభుత్వం వెలువరించిన శ్వేతపత్రంలోనే.. నీటిపారుదల రంగంలో వైఎస్సార్ ముద్ర స్పష్టంగా కనిపించింది. వాస్తవాల ఆధారంగా చంద్రబాబు హయాం(1994-2004)లో సాగునీటి రంగానికిచ్చిన ప్రాధాన్యం, ఆ రంగంపై వెచ్చించిన వ్యయం, అలాగే దివంగత నేత వైఎస్సార్, ఆ తరువాతి ప్రభుత్వాల(2004-2014) హయాంలో సాగునీటి ప్రాజెక్టులకిచ్చిన ప్రాధాన్యం, ఆ రంగంపై వెచ్చించిన వ్యయం వివరాలను శ్వేతపత్రంలో వెలువరించారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన వ్యయం, సాగులోకి వచ్చిన విస్తీర్ణం అత్యధికంగా కనపడుతూ, తన హయాంలో అరకొర వ్యయం, అప్రాధాన్యం కనిపిస్తుండడం.. శ్వేతపత్రం సాక్షిగా నిజం. పోలవరానికి పాలనా అనుమతులూ ఇవ్వని బాబు చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం పరిపాలన అనుమతి మంజూరు చేయడానికి కూడా ఇష్టపడలేదు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టారు. తెలంగాణ రైతుల పొలాలకు గోదావరి జలాలను అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదని ఆ పథకాలను వైఎస్సార్ చేపట్టారు. హంద్రీ-నీవా సుజలస్రవంతికి ద్వారా సాగునీరందించాలంటే ఎకరానికి రూ.16,750 అవుతుందని అంచనా. అయినా వైఎస్.. సీమకు నీరందించడానికి భగీరథ ప్రయత్నం చేశారు. ఎకరానికి అంత ఖర్చా? అంటూ మొన్న అధికారం చేపట్టిన తొలి నెలలో తప్పుబట్టిన చంద్రబాబు.. ఇప్పుడు హంద్రీనీవా ఘనత తనదేనని, అనంతపురం జిల్లాకు నీరివ్వడం తనవల్లే సాధ్యమైందంటూ ఘనంగా ప్రకటించడం.. ఆయన మార్కు రాజకీయానికి పరాకాష్ట. సీమాంధ్రలో.. 2004 తర్వాత వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు 86 వీటిని చేపట్టినప్పటి అంచనా వ్యయం రూ.1,33,730 కోట్లు సవరించిన అంచనాల మేరకు వ్యయం రూ.1,90,598 కోట్లు పనులు ప్రారంభమైన ప్రాజెక్టుల సంఖ్య 85 85 ప్రాజెక్టులద్వారా 97.69 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని లక్ష్యం మరో 23.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యం 2014 వరకు పూర్తయిన ప్రాజెక్టుల సంఖ్య 16 తద్వారా కొత్త ఆయకట్టు 2.33 లక్షల ఎకరాలు-స్థిరీకరణ 1.89 లక్షల ఎకరాలు పాక్షికంగా పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులు 25 తద్వారా కొత్త ఆయకట్టు 17.20 లక్షల ఎకరాలు-స్థిరీకరణ 2.07 లక్షల ఎకరాలు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద 52.05 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందకు తీసుకురావడం, 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా 54 ప్రాజెక్టుల(26 మేజర్, 18 మీడియం, 4 ఫ్లడ్ బ్యాంక్స్, 6 ఆధునీకరణ ప్రాజెక్టులు)ను చేపట్టారు. 54 ప్రాజెక్టులకు రూ.80,559 కోట్ల వ్యయంతో 52.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టులు 13 పాక్షికంగా సాగునీటిని విడుదల చేస్తున్న ప్రాజెక్టులు 14 పూర్తి చేసిన, పాక్షికంగా నీటిని విడుదల చేస్తున్న 27 ప్రాజెక్టులకు చేసిన వ్యయం రూ.19,460 కోట్లు నిర్మాణంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు 40. ఇందులో పాక్షికంగా పూర్తయిన 14 ప్రాజెక్టులున్నాయి. 11 పథకాల నిర్మాణం చివరి దశలో ఉంది. ఇవి పూర్తయితే 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. మరో 35,990 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది. సీమాంధ్రలో సాగునీటి రంగానికి 1994-2004 మధ్య చేసిన వ్యయం రూ. 6,087 కోట్లు. సీమాంధ్రలో సాగునీటి రంగానికి 2004-2014 మధ్య చేసిన వ్యయం రూ.41,434 కోట్లు. తద్వారా 11.878 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పన పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగతా సీమాంధ్రలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి రూ.17,368 కోట్లు అవసరం. -
కబ్జా కోరల్లో చిన్న నీటి వనరులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు, సాగునీటి రంగంలో సమూల మార్పులకు సర్కారు శ్రీకారం చుడుతుంటే.. కబ్జాదారులు జిల్లాలో చెరువులను చెరబడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, పరిసర ప్రాంతాల్లోని చెరువులను కబ్జా చేస్తున్నారు. పట్టణాలు అభివృద్ధి చెందుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. తెల్లారేసరికి భారీ భవంతులు దర్శనమిస్తున్నాయి. చెరువు శిఖం భూములనే కాదు.. రైత్వారీ పట్టాలను చూపి ఏకంగా చెరువు భూముల్లోనే భారీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. కళ్లముందే కట్టడాలు కొనసాగుతుంటే రెవెన్యూ అధికార యంత్రాంగం, నీటి పారుదల శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని బోగస్ పత్రాలు సృష్టించి కబ్జాదారులు తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఈ కబ్జాల వ్యవహారాల్లో అన్ని పార్టీల నేతలతోపాటు, కొందరు అధికారుల ప్రమేయం కూడా ఉండటంతో ఈ కబ్జాల తొలగింపుపై సర్కారు తీసుకున్న నిర్ణయం అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటు సర్కారే కాదు.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా చెరువు భూముల్లోని అక్రమ కట్టడాలను తొలగించాల్సిందేనని ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆక్రమణల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. 150 చెరువులు కబ్జా జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రకారం చిన్న, పెద్ద చెరువులు కలిపి 1,870 వరకు ఉన్నాయి. నిర్మల్ ధర్మసాగర్ చెరువు మాదిరిగా సుమారు 150కి పైగా చెరువులు కబ్జాలకు గురై ఏకంగా ఆనవాళ్లే కోల్పోయినట్లు ఇటీవల అధికారులు చేపట్టిన సర్వేలో ప్రాథమికంగా తేలింది. ఈ నివేదిక సర్వే చేసిన అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. నీటిపారుదల, రెవెన్యూ, డ్వామా, అటవీ, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సమన్వయంతో ఈ సర్వే జరుగుతోంది. ఆనవాళ్లు కోల్పోయిన చెరువుల్లో కొన్ని.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే మావల చెరువులో కూడా అక్రమ కట్టడాలు వెలిశాయి. గతంలో జాయింట్ కలెక్టర్ ఈ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేసినా ఆక్రమణల తొలగింపు అటకెక్కింది. పైగా ఈ చెరువు శిఖం భూముల్లో ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లే వెలిశాయి. అలాగే ఖానాపూర్ చెరువు కూడా కబ్జాకోరల్లో చిక్కుకుంది. నిర్మల్ పట్టణ పరిసరాల్లో కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులైన కంచరోణి, పల్లె, మంజులాపూర్, సూరన్నపేట చెరువులు కుచించుకుపోయాయి. ఈ భూముల్లో ప్లాట్లు వెలిశాయి. అక్రమార్కులు ఈ భూముల్లో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. జిల్లాలోనే అత్యధికంగా మంచిర్యాలలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. రాముని చెరువు భూ ములనైతే బడాబాబులు చెరబట్టారు. ఈ అక్రమ కట్టడాల్లో అన్ని పార్టీల నేతలతోపాటు, జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులకు కూడా ప్లాట్లు, భవనాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే పోచమ్మ చెరువు, సాయికుంట, చీకటి వెలుగుల చెరువు ఇలా పలు చెరువులు రియల్ ఎస్టేట్ వెంచర్లు అక్రమంగా వెలిశాయి. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. పట్టణాల్లోనే కాదు.. చిన్న, సన్నకారు రైతుల భూ ములకు సాగునీటిని అందించే గ్రామీణ ప్రాంతాల్లో ని చెరువులు కూడా కబ్జాదారుల పరమయ్యాయి. ముఖ్యంగా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీ ల్లోని చెరువులు కూడా అక్రమార్కుల పరమయ్యా యి. సర్కారు హడావుడి కొద్ది రోజులకే పరిమితమవుతుందా.. కబ్జాలను, అక్రమ కట్టడాలను తొలగిం చి చెరువులను చెరవిడిపిస్తుందా వేచి చూడాలి. -
నీటి పారుదలకు రూ.70 వేల కోట్లు
చెరువుల పునరుద్ధరణ సదస్సులో సీఎం కేసీఆర్ * సాగు నీటి రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత * రాష్ర్టంలోని 45,300 చెరువుల పునరుద్ధరణకు చర్యలు * ఐదేళ్లలో రూ. 22,500 కోట్లు అవసరమని అంచనా * శిఖం భూముల పక్కా సర్వే, ఆక్రమణల తొలగింపునకు చర్యలు * సాగునీటి శాఖలో పలు మార్పులకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగంలో సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకమైన నీటి పారుదల రంగం అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ. 70 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ర్టవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన ‘చిన్ననీటి పారుదల-చెరువుల పునరుద్ధరణ సదస్సు’కు కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇరిగేషన్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అన్ని స్థాయిల్లోని అధికారులు ఇందులో పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ... ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది ఇరిగేషన్ రంగానికే. దీని అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ. 70 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు. రాష్ర్టంలోని 45,300 చెరువులను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సాగునీటి శాఖ అధికారులకు కేసీఆర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఒక్కో చెరువు మరమ్మతుకు సగటున రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 22,500 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు జపాన్ సంస్థలు కూడా ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఈ నిధులతో అన్ని మండలాల్లో పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. వచ్చే నెలంతా చెరువులపైనే దృష్టి పెట్టాలని, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులను సంప్రదించి ప్రాధాన్యతల మేరకు పనులు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. చెరువుల సర్వేకు ఉన్నతాధికారులే అధునాతన సామగ్రిని సమకూర్చాలని చెప్పారు. చెరువుల్లో నీళ్లు తప్ప తుమ్మచెట్లు కనిపించకూడదని సీఎం వాఖ్యానించారు. చెరువుల ఆవశ్యకతపై కొత్త తరానికి అవగాహన కల్పించేలా వారోత్సవాలు నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సీఎం వరకు అందరూ శ్రమదానం చేయాలని, కళాబృందాల ద్వారా ైచె తన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. * కాకతీయుల కాలం(11వ శతాబ్దం)లోనే వాటర్‌షెడ్ ప్రాజెక్టులను అద్భుతంగా నిర్మించారు. ఆ తర్వాత బహమనీ సుల్తాన్లు, కులీకుతుబ్ షా కూడా చెరువులు, కుంటలకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే తెలంగాణ ప్రాంతంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. 265 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెరువులు ఉన్నాయి. * సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు మైనర్ ఇరిగేషన్‌కు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కుట్ర పూరితంగానే చెరువులను నాశనం చేశారు. అడవులు నరకడం వలన కరువు కాటకాలు వచ్చాయి. చెరువుల బాగుపై చైతన్యం లేక భూగర్భ జ లాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. * ప్రతి జిల్లాకు ఒక ఎస్ఈ పోస్టు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఈఈ పోస్టు, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డీఈ, ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్, రెండు వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాం. రూ. 5 ల క్షల వరకు పనులను నామినేషన్ల మీదే ఇస్తాం. ఈపీసీ, కన్సల్టెన్సీ వ్యవస్థలు ఉండవు. * అడవుల సంరక్షణ నిమిత్తం‘హరితహారం’ పేరిట రాష్ర్టంలో 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. దీనికోసం 40 వేల నర్సరీలను ఎంపిక చేశాం. ప్రతి గ్రామంలోనూ లక్షలాదిగా మొక ్కలు నాటుతాం. 6,517 చెక్ డ్యాంలను ఆధునీకరిస్తాం. ఇకపై ఇరిగేషన్ శాఖ అనుమతితోనే చెక్‌డ్యాంల నిర్మాణం జరగాలి. సదస్సులో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలివి... * మండల ఇంజనీర్లకు ల్యాప్‌ట్యాప్‌లు * క్వాలిటీ కంట్రోల్ విభాగం విస్తరణ * అధికారులు వాహనాలు కొనుక్కునేందుకు బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు * మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయ సమావేశాలు * శిఖం భూములపై సర్వే, చెరువుల ఎఫ్టీఎల్, కట్టు కాలువల వివరాలు సమగ్రంగా ఉండాలి * మైనర్ ఇరిగేషన్‌కు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక గది ఏర్పాటు * ఎన్ఆర్ఈజీఎస్(ఉపాధి హామీ) పథకాన్ని చెరువుల పునరుద్ధర ణకు వినియోగించాలి * జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణకు చర్యలు * పరిపాలన, ఆర్థిక అనుమతుల కోసం అధికారాల బదిలీ * ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రప్పిస్తాం * గోదావరి, కృష్ణా రివర్ వ్యాలీ అథారిటీల ఏర్పాటు పరిశీలన * తెలంగాణ మైనర్ ఇరిగేషన్‌కు కొత్త చట్టం, ఇరిగేషన్‌కూ మరో చట్టం * చెరువు భూముల పరిరక్షణ బాధ్యత వీఆర్వోలకు * ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం * చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు, అధికారి నియామకం * ఇరిగేషన్ మంత్రి కార్యాలయంలో హెల్ప్‌లైన్ (76800 72440) ఏర్పాటు * చెక్డ్యాముల్లో పూడికతీతకు చర్యలు కబ్జాదారులపై ఉక్కుపాదం.. చెరువులు, శిఖం భూముల కబ్జాలను ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. సదస్సులో భాగంగా సాగునీటి అధికారుల తో జరిగిన అంతర్గత సమీక్షలో కేసీఆర్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు స మాచారం. చెరువు భూములను ఆక్రమిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ‘చెరువుల్లో ఆక్రమణలను పూర్తిగా తొలగించాల్సిందే. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోండి. చెరువుల సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు చేపట్టండి. ఏడాదికి 9,060 చెరువుల మరమ్మతులు పూర్తి చేసేలా ప్రణాళిక లు సిద్ధం చేయాలి. అటవీ శాఖ పరిధిలోని 1,230 చెరువుల మరమ్మతుకు ఆ శాఖ అధికారులు ఇరిగేషన్ విభాగంతో సమన్వయం గా ముందుకెళ్లాలి’ అని మార్గనిర్దేశం చేశా రు. శిఖం భూముల్లో పట్టాలున్న వారితో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు పేర్కొనడంతో.. రెవెన్యూ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చెప్పారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని పలువురు అధికారులు కోరగా.. అందరికీ ఆమోదయోగ్యమైతే తనకు అభ్యంతరం లేదని తెలిపారు. -
ప్రాజెక్టులన్నింటిపై రీసర్వే: కేసీఆర్
* సాగునీటి రంగం, ప్రాజెక్టులపై అధికారులతో కేసీఆర్ సమీక్ష * జూరాల -పాకాల, పాలమూరు ఎత్తిపోతలకు తొలి ప్రాధాన్యం * ఈ బడ్జెట్లోనే వాటికి నిధులిస్తాం.. పనులు ప్రారంభిస్తాం * సాగునీటి రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తాం * 17 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన, ఏరియల్ సర్వే * స్వయంగా తిరిగి చూసి ప్రాజెక్టులను పరిశీలిస్తానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటిపై మళ్లీ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి రంగం, ప్రాజెక్టులపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో కృష్ణా, గోదావరి బేసిన్లో నీటి పారుదల వ్యవస్థ, రాష్ట్రంలో ప్రాజెక్టుల పురోగతి, మధ్య తరహా ప్రాజెక్టుల పరిస్థితిపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చూడాలని, రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. జూరాల-పాకాల ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రాజెక్టులని, వాటికి సంబంధించిన సర్వేను మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించి, పనులను ప్రారంభించాలని స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా చాలా ముఖ్యమైందని.. పూర్తిగా లిఫ్టులతోనే కాకుండా గ్రావిటీ ద్వారా కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించవచ్చని చెప్పారు. కొండలు, గుట్టలపై సిస్టర్న్లు నిర్మించి వాటి ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని పంపించాలని సూచించారు. ఈ మేరకు సమీక్షకు సర్వేయర్లను కూడా పిలిపించి, పలు సూచనలు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ కూడా నీటిని సమర్థంగా, ఎక్కువగా వినియోగించుకునేలా లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సిద్ధిపేట, పాములపర్తిల్లో భారీ రిజర్వాయర్లను నిర్మించి ఎక్కువ నీటిని నిలువ చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసమే కొన్ని తెలంగాణ ప్రాజెక్టులను చేపట్టారని... దుమ్ముగూడెం ప్రాజెక్టు అందుకు పెద్ద ఉదాహరణ అని కేసీఆర్ చెప్పారు. సాగర్ టెయిల్ పాండ్ రైతులకు నీరు ఇవ్వడానికి గోదావరిపై ఎత్తిపోతల పథకం నిర్మించాలనుకోవడం దారుణమన్నారు. అలాంటివాటికి తెలంగాణలో చోటు ఉండకూడదని వ్యాఖ్యానించారు. బైక్‌పై కొండల్లోనూ తిరిగి చూస్తా.. కృష్ణా గోదావరి నదుల ప్రవాహం తీరు, వాటిపై ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే అంశాలపై తానే స్వయంగా తిరిగి పరిశీలిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హెలికాప్టర్లలో తనతోపాటు అధికారులను, నిపుణులను కూడా తీసుకెళ్లి ఏరియల్ సర్వే చేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల ప్రాంతంలో అవసరమైతే బైక్‌లపై తిరిగి చూస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.