నీటిపారుదల రంగంలో 19 లక్షల కోట్ల పెట్టుబడి | 19 lakh crore investment in irrigation sector | Sakshi
Sakshi News home page

నీటిపారుదల రంగంలో 19 లక్షల కోట్ల పెట్టుబడి

Published Mon, Jul 17 2023 1:57 AM | Last Updated on Mon, Jul 17 2023 2:07 AM

19 lakh crore investment in irrigation sector - Sakshi

రాయదుర్గం: కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంలో రూ. 19 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతోందని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ నాలెడ్జిసిటీలోని టీ హబ్‌లో జిటో ఇంక్యుబేసన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (జేఐఐఎఫ్‌) రెండు రోజులుగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సమ్మేళనం, వ్యవ స్థాపక దినోత్సవాల్లో ఆదివారం ఆయన ప్రసంగించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట పునరుద్ధరణ కార్యక్రమా న్ని, భూగర్భజల స్థాయిని పునరుద్ధరించడానికి కార్యాచ రణ, నదుల అనుసంధానం చేప ట్టామని తెలిపారు. పారిశ్రామిక రంగాల కంటే వ్యవసాయం రంగమే ఎక్కువ నీటిని వినియోగి స్తోందన్నారు. వ్యవసాయ రంగంలో తలసరి నీటి వినియోగం ఏడాదికి 4,913 నుంచి 5,800 కిలోలీటర్ల వరకు ఉంటుందని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువన్నారు.

వ్యవసాయరంగంలో నీటిసంరక్షణకు స్టార్టప్‌ల అవసరం
వ్యవసాయరంగంలో నీటి సంరక్షణపై ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపడం లేదని, ఇక్కడే ప్రైవేట్‌ రంగ సహాయం, స్టార్టప్‌ల అవసరం ఏర్పడుతోందని కేంద్రమంత్రి షెకావత్‌ వ్యాఖ్యానించారు. మురుగునీటిని తిరిగి ఉపయోగించుకునే వ్యాపార నమూనాలను అభివృద్ధి చేసేందుకు స్టార్టప్‌ల కోసం మంత్రిత్వశాఖ కూడా ఎదురుచూస్తోందన్నారు.

దేశంలో దాదాపు 2వేల ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన నీటి పరీక్ష ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక పరీక్ష సౌకర్యం ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. కాఠిన్యం, పీహెచ్, కాపర్, ఐరన్, ఫాస్పేట్, క్లోరిన్, ఆమ్మోనియా, క్రోమియం వంటి 12 పారామీటర్లపై(ప్రామాణికాలపై) నీటి నాణ్యత పరీక్షలు జరుగుతాయన్నారు.

టెస్టింగ్‌ కిట్‌ల అభివృద్ధిలోనూ స్టార్టప్‌ల సాయం
టెస్టింగ్‌ కిట్‌లను అభివృద్ధి చేయడంలో స్టార్టప్‌లు తమకు ఎంతో సహాయ పడ్డాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇందులో 19 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని, 1.5 కోట్ల నమూనాలను సేకరించి పరీక్షించడం జరిగిందన్నారు. సెన్సార్‌ ఆధారిత తాగునీటి పరీక్ష కోసం పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్‌ల కోసం తాము హ్యకథాన్‌ కూడా నిర్వహించామన్నారు.

ఇందులో 250 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా అందులో 20 స్టార్టప్‌లను షార్ట్‌ లిస్ట్‌ చేశామని కేంద్రమంత్రి షెకావత్‌ వెల్లడించారు. ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని,  జేఐఐఎఫ్‌ వంటి సంస్థల నుంచి సహాయం కావాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఐఐఎఫ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement