
కింది కోర్టు తీర్పును యథాతథంగా సమర్థించిన హైకోర్టు
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో దోషులకు ఉరి ఖరారు
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఉగ్రవాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వేసిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించడం తెలిసిందే. అయితే ఓ కేసులో నిందితులందరికీ ఉరి శిక్ష పడటం, కింది కోర్టు తీర్పును హైకోర్టు యథాతథంగా సమర్థించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉండగా.. ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. మిగతా ఐదుగురికి ఉరి శిక్షను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. దేశంలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, కింది కోర్టులో శిక్షపడి, దాన్ని హైకోర్టు ఖరారు చేసిన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
ఎవరీ ఐదుగురు? ఇప్పుడెక్కడ ఉన్నారు?
పాకిస్తాన్‌లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు జరి ్డగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (పాకి స్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాల్గొన్నారు. పేలుళ్లపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ దేశంలోని వేర్వే రు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుంది. వివిధ కేసులకు సంబంధించి కొంతకాలం ముంబై, పుణే జైళ్లలో ఉన్న ఈ ఐదుగురూ ప్రస్తుతం తిహార్ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు.
ఎప్పుడు.. ఎక్కడ చిక్కారంటే..
ఎజాజ్ షేక్‌ను 2013 సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నట్లు ఎన్‌ఐఏ రికార్డుల్లో పేర్కొంది. యాసీన్, హడ్డీలు 2013 ఆగస్టు 29న బిహార్‌లోని రక్సుల్ ప్రాంతంలో దొరికారని తెలిపింది. జియా ఉర్ రెహ్మాన్‌ను రాజస్తాన్‌లోని అజ్మీర్ రైల్వేస్టేషన్‌లో 2014 మార్చ్ 22న, తెహసీన్ అక్తర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న పట్టుకున్నట్లు పేర్కొంది. యాసీన్ అరెస్టు తర్వాత ఎజాజ్ షేక్‌కు దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళలో పాత్ర ఉన్నట్లు తేలింది. కాగా వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్‌ఐఏ హైదరాబాద్‌కు తీసుకువచ్చి అరెస్టు చేసింది.

రెండు కేసులు .. ఒకే ఉదంతం
2013 ఫిబ్రవరి 21న తొలుత దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్ వద్ద , తర్వాత ఏ–1 మిర్చి సెంటర్ వద్ద కొన్ని సెకన్ల తేడాతో జరిగిన పేలుళ్లలో ఓ గర్భస్థ శిశువు సహా 18 మంది మరణించగా.. 131 మంది క్షతగాత్రులయ్యారు. మొదటిది సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 38 సెకండ్లకు పేలగా, రెండోది 6 గంటల 58 నిమిషాల 44 సెకండ్లకు పేలింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో నమోదైన ఈ కేసులు దర్యాప్తు నిమిత్తం ఎన్‌ఐఏకు బదిలీ అయ్యాయి.
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లకు సంబంధించి సాంకేతికంగా రెండు కేసులు నమోదైనప్పటికీ ఒకే ఘటన కింద పరిగణనలోకి తీసుకున్నారు. నగరంలో 1990ల నుంచీ ఉగ్రవాద ఛాయలు ఉండటంతో అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏ కేసులోనూ ఎవరికీ ఉరి శిక్ష పడిన దాఖలాలు లేవు. అలాగే ఒకే ఉదంతానికి సంబంధించి మొత్తం దోషులందరికీ ఉరి శిక్షలు వేసిన కేసులు కూడా లేవు.
ఏ ప్రాంతానికి చెందినవాళ్లు?
⇒ రియాజ్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న తెంగినగుడి
⇒ అసదుల్లా అక్తర్: ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో ఉన్న గులమ్కాపూర్
⇒ జకీ ఉర్ రెహ్మాన్: పాకిస్తాన్ పంజాబ్‌లో ఉన్న గోజారా
⇒ తెహసీన్ అక్తర్: బిహార్‌లోని సమిస్తిపూర్ జిల్లా ముట్కాపూర్
⇒ యాసీన్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న ముగ్దుం కాలనీ.
⇒ ఎజాజ్ షేక్: మహారాష్ట్రలోని పుణే ఘోర్‌పేట్
ఎవరి పాత్రలు ఏంటి?
రియాజ్ భత్కల్: కీలక సూత్రధారి
యాసీన్ భత్కల్: నేపాల్‌లో ఉండి కుట్రను అమలు చేశాడు
వకాస్: 107 బస్‌స్టాప్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ పెట్టాడు
మోను: ఏ–1 మిర్చి సెంటర్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ వదిలాడు
హడ్డీ: అబ్దుల్లాపూర్ మెట్‌లో షెల్టర్ తీసుకున్నాడు. సైకిళ్ళు తదితరాలు కొనుగోలు చేశాడు.
ఎజాజ్: అవసరమైన పేలుడు పదార్థాలు, నగదు సమకూర్చాడు
విచారణ పూర్తి, శిక్షలు..
2016 నవంబర్ 21న కేసుల విచారణ పూర్తి కాగా.. డిసెంబర్ 13న పరారీలో ఉన్న రియాజ్ మినహా మిగిలిన ఐదుగురినీ ఎన్‌ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. అదే నెల 19న వారికి ఉరి శిక్ష విధించింది.