17 ఏళ్లుగా పరారీలోనే! | Dilsukhnagar blasts: Mastermind of blasts Riyaz Bhatkal On run for 17 years | Sakshi
Sakshi News home page

17 ఏళ్లుగా పరారీలోనే!

Published Wed, Apr 9 2025 5:14 AM | Last Updated on Wed, Apr 9 2025 5:14 AM

Dilsukhnagar blasts: Mastermind of blasts Riyaz Bhatkal On run for 17 years

ఇప్పటికీ చిక్కని పేలుళ్ల మాస్టర్‌ మైండ్‌ రియాజ్‌ భత్కల్‌

అతడి నేతృత్వంలో నగరంలో  ‘రెండు ఆపరేషన్స్‌’

2008 నుంచి పాకిస్తాన్‌లోనే తలదాచుకున్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది

సాక్షి, హైదరాబాద్‌: రియాజ్‌ భత్కల్‌.. 2007 నాటి గోకుల్‌ చాట్, లుంబినీ పార్క్, 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ళకు సూత్రధారిగా, ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతని పేరు ప్రముఖంగా ఉంది. 2008లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, 17 ఏళ్లుగా పరారీలో ఉన్న రియాజ్‌ భత్కల్‌ ఇప్పటికీ చిక్కలేదు.   

భత్కల్‌లో పుట్టి.. నేరబాట పట్టి
రియాజ్‌ భత్కల్‌ అసలు పేరు రియాజ్‌ అహ్మద్‌ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్‌ వ్యవహారాలు ఎక్కువ. వాటి ప్రభావంతో నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు మహారాష్ట్రలోని ముంబైలో నివసించింది. ఇతనికి ఆది నుంచీ డబ్బుపైన ఆశ ఎక్కువ. ఆ యావలోనే ముంబై గ్యాంగ్‌స్టర్‌ ఫజల్‌ ఉర్‌ రెహ్మాన్‌ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు.

ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబయి, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా..ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగు నుంచి బయటకు వచ్చిన తర్వాత కుర్లా ప్రాంతంలో ‘ఆర్‌ఎన్‌’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. అక్కడ స్థానికంగా ఓ ప్రార్థన స్థలానికి, ప్రత్యేక కార్యక్రమాలకు తరచూ వెళ్లేవాడు. ఆ క్రమంలో నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్‌ భత్కల్‌ పాక్‌ ప్రేరేపిత లష్కరే తొయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు.

ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్‌ రజా కమెండో ఫోర్స్‌ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్‌ రజా ఖాన్‌ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు ఏర్పాటు చేస్తుంటాడు. 

ధనార్జన కోసం రియల్టర్‌ అవతారం... 
జిహాద్‌ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్‌ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారి మళ్లించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పుణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్‌ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాల కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ఖాతాల్లోకి మార్చుకుంటూ మంగళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్‌ పరిసరాల్లో భారీగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నిర్వహించాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్‌ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. 

గుట్టు బయటపడింది ఇతని వల్లే..
ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్‌ భత్కల్‌ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్‌ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. ఇలా చేయడాన్ని మరో ఉగ్రవాదైన సాదిక్‌ షేక్‌ పూర్తిగా వ్యతిరేకించాడు. దీనివల్ల తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకా శం ఉందని వాదిస్తూ వచ్చాడు. ఈ మాటలను రియాజ్‌ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు.

తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదించాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్‌ పంపడం ప్రారంభించాడు. ఈ మెయిల్స్‌ వచ్చిన ఐపీ అడ్రస్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురట్టు అయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియాజ్‌... ప్రస్తుతం పాకిస్తాన్‌లోని డిఫెన్స్‌ ఏరియాలో తలదాచుకుంటున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement