నీటి పారుదలకు రూ.70 వేల కోట్లు
చెరువుల పునరుద్ధరణ సదస్సులో సీఎం కేసీఆర్
* సాగు నీటి రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత
* రాష్ర్టంలోని 45,300 చెరువుల పునరుద్ధరణకు చర్యలు
* ఐదేళ్లలో రూ. 22,500 కోట్లు అవసరమని అంచనా
* శిఖం భూముల పక్కా సర్వే, ఆక్రమణల తొలగింపునకు చర్యలు
* సాగునీటి శాఖలో పలు మార్పులకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగంలో సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకమైన నీటి పారుదల రంగం అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ. 70 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ర్టవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జేఎన్టీయూహెచ్‌లో నిర్వహించిన ‘చిన్ననీటి పారుదల-చెరువుల పునరుద్ధరణ సదస్సు’కు కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇరిగేషన్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అన్ని స్థాయిల్లోని అధికారులు ఇందులో పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ... ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది ఇరిగేషన్ రంగానికే. దీని అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ. 70 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు.
రాష్ర్టంలోని 45,300 చెరువులను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సాగునీటి శాఖ అధికారులకు కేసీఆర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఒక్కో చెరువు మరమ్మతుకు సగటున రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 22,500 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు జపాన్ సంస్థలు కూడా ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఈ నిధులతో అన్ని మండలాల్లో పనులు సమాంతరంగా జరగాలని సూచించారు.
వచ్చే నెలంతా చెరువులపైనే దృష్టి పెట్టాలని, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులను సంప్రదించి ప్రాధాన్యతల మేరకు పనులు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. చెరువుల సర్వేకు ఉన్నతాధికారులే అధునాతన సామగ్రిని సమకూర్చాలని చెప్పారు. చెరువుల్లో నీళ్లు తప్ప తుమ్మచెట్లు కనిపించకూడదని సీఎం వాఖ్యానించారు. చెరువుల ఆవశ్యకతపై కొత్త తరానికి అవగాహన కల్పించేలా వారోత్సవాలు నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సీఎం వరకు అందరూ శ్రమదానం చేయాలని, కళాబృందాల ద్వారా ైచె తన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు.
సీఎం ఇంకా ఏమన్నారంటే..
* కాకతీయుల కాలం(11వ శతాబ్దం)లోనే వాటర్‌షెడ్ ప్రాజెక్టులను అద్భుతంగా నిర్మించారు. ఆ తర్వాత బహమనీ సుల్తాన్‌లు, కులీకుతుబ్ షా కూడా చెరువులు, కుంటలకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే తెలంగాణ ప్రాంతంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. 265 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెరువులు ఉన్నాయి.
* సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు మైనర్ ఇరిగేషన్‌కు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కుట్ర పూరితంగానే చెరువులను నాశనం చేశారు. అడవులు నరకడం వలన కరువు కాటకాలు వచ్చాయి. చెరువుల బాగుపై చైతన్యం లేక భూగర్భ జ లాలపైనే ఆధారపడాల్సి వచ్చింది.
* ప్రతి జిల్లాకు ఒక ఎస్‌ఈ పోస్టు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఈఈ పోస్టు, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డీఈ, ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్, రెండు వర్క్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాం. రూ. 5 ల క్షల వరకు పనులను నామినేషన్ల మీదే ఇస్తాం. ఈపీసీ, కన్సల్టెన్సీ వ్యవస్థలు ఉండవు.
* అడవుల సంరక్షణ నిమిత్తం‘హరితహారం’ పేరిట రాష్ర్టంలో 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. దీనికోసం 40 వేల నర్సరీలను ఎంపిక చేశాం. ప్రతి గ్రామంలోనూ లక్షలాదిగా మొక ్కలు నాటుతాం. 6,517 చెక్ డ్యాంలను ఆధునీకరిస్తాం. ఇకపై ఇరిగేషన్ శాఖ అనుమతితోనే చెక్‌డ్యాంల నిర్మాణం జరగాలి.
సదస్సులో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలివి...
* మండల ఇంజనీర్లకు ల్యాప్‌ట్యాప్‌లు
* క్వాలిటీ కంట్రోల్ విభాగం విస్తరణ
* అధికారులు వాహనాలు కొనుక్కునేందుకు బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు
* మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయ సమావేశాలు
* శిఖం భూములపై సర్వే, చెరువుల ఎఫ్‌టీఎల్, కట్టు కాలువల వివరాలు సమగ్రంగా ఉండాలి
* మైనర్ ఇరిగేషన్‌కు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక గది ఏర్పాటు
* ఎన్‌ఆర్‌ఈజీఎస్(ఉపాధి హామీ) పథకాన్ని చెరువుల పునరుద్ధర ణకు వినియోగించాలి
* జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణకు చర్యలు
* పరిపాలన, ఆర్థిక అనుమతుల కోసం అధికారాల బదిలీ
* ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రప్పిస్తాం
* గోదావరి, కృష్ణా రివర్ వ్యాలీ అథారిటీల ఏర్పాటు పరిశీలన
* తెలంగాణ మైనర్ ఇరిగేషన్‌కు కొత్త చట్టం, ఇరిగేషన్‌కూ మరో చట్టం
* చెరువు భూముల పరిరక్షణ బాధ్యత వీఆర్వోలకు
* ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం
* చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు, అధికారి నియామకం
* ఇరిగేషన్ మంత్రి కార్యాలయంలో హెల్ప్‌లైన్ (76800 72440) ఏర్పాటు
* చెక్‌డ్యాముల్లో పూడికతీతకు చర్యలు
కబ్జాదారులపై ఉక్కుపాదం..
చెరువులు, శిఖం భూముల కబ్జాలను ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. సదస్సులో భాగంగా సాగునీటి అధికారుల తో జరిగిన అంతర్గత సమీక్షలో కేసీఆర్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు స మాచారం. చెరువు భూములను ఆక్రమిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ‘చెరువుల్లో ఆక్రమణలను పూర్తిగా తొలగించాల్సిందే. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోండి. చెరువుల సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు చేపట్టండి. ఏడాదికి 9,060 చెరువుల మరమ్మతులు పూర్తి చేసేలా ప్రణాళిక లు సిద్ధం చేయాలి.
అటవీ శాఖ పరిధిలోని 1,230 చెరువుల మరమ్మతుకు ఆ శాఖ అధికారులు ఇరిగేషన్ విభాగంతో సమన్వయం గా ముందుకెళ్లాలి’ అని మార్గనిర్దేశం చేశా రు. శిఖం భూముల్లో పట్టాలున్న వారితో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు పేర్కొనడంతో.. రెవెన్యూ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చెప్పారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని పలువురు అధికారులు కోరగా.. అందరికీ ఆమోదయోగ్యమైతే తనకు అభ్యంతరం లేదని తెలిపారు.