ప్రగతి నిరోధక శక్తులకు.. పరాజయమే | CM KCR Comments At Telangana Liberation Day Celebrations | Sakshi
Sakshi News home page

ప్రగతి నిరోధక శక్తులకు.. పరాజయమే

Published Mon, Sep 18 2023 5:29 AM | Last Updated on Mon, Sep 18 2023 5:29 AM

CM KCR Comments At Telangana Liberation Day Celebrations - Sakshi

ఆదివారం అసెంబ్లీ వద్దనున్న గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ ప్రగతి రథచక్రాలు దూసుకుపోతున్నాయని.. దేశంలో ఎక్కడ, ఎవరినోట విన్నా తెలంగాణ మోడల్‌ మార్మోగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని.. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని పేర్కొన్నారు. మన సమైక్యతే మనకు బలమని.. జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ స్టేట్‌ భారత యూనియన్‌లో కలసిన ‘సెప్టెంబర్‌ 17’ సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ తొలుత అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు.

హైదరాబాద్‌ సంస్థానం 1948 సెప్టెంబర్‌ 17న రాచరికం నుంచి పరిణామం పొంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిందని.. ఈ చారిత్రాక సందర్భాన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

‘‘తెలంగాణ అనేక రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకు 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ రాష్ట్రం నంబర్‌ వన్‌. రూ.3,12,398 తలసరి ఆదాయంతోనూ నంబర్‌ వన్‌గా నిలిచింది.

రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలన్న ధ్యేయంతో ముందడుగు వేస్తోంది. సకల జనులకు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. కొత్త వైద్య కళాశాలలతో ఏటా పది వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటోంది.

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం ఆగదు
హైదరాబాద్‌లో పేదలకు లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నాం. ఎవరైనా అర్హులకు ఇళ్లు రాకపోయినా ఆందోళన చెందవద్దు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుంది. సొంత జాగా ఉన్న పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తంగా 44 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాం. ఇక అణగారిన దళితజాతి అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంకొత్త చరిత్రను సృష్టించింది.

బలహీన వర్గాల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. మద్యం దుకాణాల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు, ఈత, తాటిచెట్లపై పన్నురద్దు, 5 లక్షల వరకూ బీమా సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. రజకులు, నాయీ బ్రాహ్మణులకు విద్యుత్‌ రాయితీ, ఆర్థికసాయంతో అండగా నిలుస్తున్నాం. ఆదివాసీలు, గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చాం.

రాష్ట్రంలో ఐటీ దూకుడు
తెలంగాణ ఏర్పడే నాటికి 3,23,390 మంది ఐటీ ఉద్యోగులుంటే.. ఇప్పుడు 9,05,715 మందికి పెరిగారు. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు వృద్ధిచెందాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ టవర్లు నిర్మించుకున్నాం.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని నివారించి సిగ్నల్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూ.67 వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను పూర్తిచేస్తున్నాం. కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నగరానికి మరింత శోభ చేకూర్చాయి.’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

మరో నాలుగేళ్లలో 1.25 కోట్ల మాగాణగా..
తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, 10 లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. వీటితోపాటు కాళేశ్వరం, పాలమూరు, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్‌ వంటి ప్రధాన ఎత్తిపోతల పథకాల ద్వారా 75లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలు సాగవుతాయి. మొత్తంగా మరో నాలుగేళ్లలో కోటీ 25 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో వ్యవసాయం పండుగగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement