కేబినెట్ కీలక నిర్ణయాలివీ..
► కాళేశ్వరం ప్రాజెక్టుతో మూసీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్,హుస్సేన్ సాగర్‌ల అనుసంధానం.. వీటికి గోదావరి జలాల తరలింపు
► వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ.. వివిధ శాఖల్లో సర్దుబాటు.. పేస్కేల్ వర్తింపు
► రాష్ట్రంలో పంటల సాగు కాలాన్ని ఒక నెల ముందుకు జరిపేలా చర్యలు
► కొత్త జిల్లాలకు అనుగుణంగా జిల్లా వైద్యాధికారి పోస్టుల పెంపు.. 40 కొత్త మండలాలకు పీహెచ్‌సీలు.. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో శాశ్వత నియామకాలకు నిర్ణయం
► మైనారిటీ కమిషన్‌లో జైనులకూ ప్రాతినిధ్యం
► టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేసేందుకు కొత్తగా 10 పోస్టులు మంజూరు
► వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల ద్వారా మక్కలు, జొన్నల కొనుగోళ్లు
► 10, 15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం
► అచ్చంపేటకు ఉమామహేశ్వర లిఫ్టు తొలి, రెండో దశ పథకాలు మంజూరు
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం
రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని.. ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి హరీశ్ ప్రకటించారు. దీని విధివిధానాల ఖరారుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక సాయంలో సబ్సిడీ ఎంత? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నదానిపై ఉప సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభిస్తామన్నారు.
సాక్షి, హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు, పరీవాహక ప్రాంతం పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఎత్తివేసింది. కొన్నేళ్ల కిందటి దాకా హైదరాబాద్ నగర దాహర్తిని తీర్చిన ఈ జలాశయాల పరిరక్షణ కోసం.. వాటి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో.. అన్నిరకాల నిర్మాణాలను నిషేధిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే. 111 జీవో కారణంగా ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల నీటి అవసరం పెద్దగా లేనందున.. జీవోను రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
దీని పరిధిలో ఉన్న 84 గ్రామాల్లో ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండవని.. ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)’కు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలే వర్తిస్తాయని ప్రకటించింది. గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలిసారిగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రులు గంగుల, తలసాని, వేముల, మల్లారెడ్డిలతో కలసి మంత్రి హరీశ్‌రావు కేబినెట్ భేటీ వివరాలను వెల్లడించారు.
గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
నీటి కోసం ఇబ్బంది లేదని..
హైదరాబాద్ చుట్టుపక్కల అంతా అభివృద్ధి జరుగుతుంటే తమ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని 111 జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజలు చాలా కాలం నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో వారికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకే 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు గోదావరి, కృష్ణా, మంజీరా నదుల నుంచి సరిపడా నీళ్లు వస్తున్నాయని.. నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణతోపాటు కాలుష్యం బారిపడకుండా.. వాటి చుట్టూ రింగ్ మెయిన్, ఎస్టీపీల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. హైదరాబాద్ నుంచి శంకర్‌పల్లి, చేవెళ్ల రోడ్లను 150 అడుగుల నుంచి 200 అడుగులకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కాళేశ్వరంతో జంట జలాశయాలు, మూసీ అనుసంధానం
రాబోయే రోజుల్లో కొండపొచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం (గోదావరి) జలాలతో మూసీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను అనుసంధానించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరంతో అనుసంధానం చేసి మూసీని స్వచ్ఛమైన నదిగా మార్చాలని సూచించారన్నారు. మురికి కూపంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను సైతం రాబోయే రోజుల్లో గోదావరి జలాలతో అనుసంధానం చేయడానికి అవసరమైన విధి విధానాలు, డిజైన్లను రూపొందించనున్నట్టు తెలిపారు.
ఘనంగా దశాబ్ది ఉత్సవాలు
రాష్ట్రం 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గత 9 ఏళ్లలో సాధించిన విజయాల ఫలాలను అందుకుంటున్న ప్రజలను భాగస్వాములను చేస్తూ 21 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేందుకు వీలుగా విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు.
వైద్యారోగ్య శాఖ పునర్వ్యస్థీకరణ
కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖను పునర్వ్యస్థీకరించే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 33 జిల్లాలకు జిల్లా వైద్యారోగ్య అధికారి (డీఎంఅండ్‌హెచ్‌ఓ) పోస్టులతోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 6 జోన్లకు ఆరు పోస్టులు కలిపి.. మొత్తంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ పోస్టుల సంఖ్యను 38కి పెంచాలని నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 40 మండలాలకు పీహెచ్‌సీలను మంజూరు చేసింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులే పనిచేస్తుండగా.. శాశ్వత నియామకాలు జరపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రాథమిక వైద్య సేవలు బలోపేతం అవుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
పంట కాలం.. నెల ముందుకు..
అకాల వర్షాలు, వడగళ్ల వానలతో ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలో పంట కాలాన్ని నెల రోజుల పాటు ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అకాల వర్షాలు కురిసే ఏప్రిల్‌లో కాకుండా మార్చి నెలాఖరులోగానే రైతులు పంట కోతలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయనుంది.
వచ్చే వానాకాలం పంటలను ఒక నెల ముందుకు జరిపితే.. యాసంగి పంట కూడా నెల ముందుకు జరుగుతుందని, రైతులు నష్టపోకుండా కాపాడుకోవచ్చని మంత్రి హరీశ్ తెలిపారు. ఈ దిశగా వ్యవసాయ రంగంలో మార్పులు, రైతులను చైతన్యవంతం చేయడంపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, పువ్వాడ, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలివీ..
► రాష్ట్రంలో ఎవరు, ఎక్కడ నకిలీ విత్తనాలు అమ్మినా పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలని డీజీపీ, సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
► మక్కలు, జొన్నల ధర తగ్గి రైతులు నష్టపోతుండటంతో కొనుగోళ్లకు వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖలకు అనుమతి ఇచ్చింది.
► నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం మొదటి, రెండో విడత పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
► రెండో విడత గొర్రెల పంపిణీని 10, 15 రోజుల్లో ప్రారంభించాలని.. కేంద్రం నుంచి ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కేబినెట్ నిర్ణయించింది.
► రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.
► ఖమ్మంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఖమ్మం జర్నలిస్టు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 23 ఎకరాలను కేటాయించింది. వనపర్తిలో జర్నలిస్టు అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించింది.
► మైనారిటీ కమిషన్‌లో జైనులకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించింది.
► టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేసేందుకు కొత్తగా 10 పోస్టులు మంజూరు చేసింది.
► వనపర్తి జిల్లా గణపురం మండలం కర్నె తండాకు పీహెచ్‌సీ, 8 పోస్టులు మంజూరు.
► నిర్మల్ జిల్లా ముధోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు 27 పోస్టులను మంజూరు చేసింది.
► ఇటీవల గవర్నర్ తిరస్కరించిన బిల్లులను మళ్లీ ఆమోదించి పంపేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని మంత్రివర్గం ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది.
► గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల ఖరారు కోసం త్వరలో మరోసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని.. అలా సాధ్యం కాకుంటే సర్క్యులేషన్ విధానంలో ఆమోదించి గవర్నర్‌కు సిఫార్సు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment