JNTUH
-
‘సెర్చ్’ ఏదీ ?
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల(వీసీ) ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్‌లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఐఏఎస్‌లంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్టీయూహెచ్లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి వాటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. మరోవైపు ఐఏఎస్‌లు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధన ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండాపోయిందని మండలివర్గాలు అంటున్నాయి. వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. దీంతో కొత్తవారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఐఏఎస్ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్చ్ కమిటీలు ఏమైనట్టు? వీసీ ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోయాలి. అంతిమంగా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. మూడు వారాలైనా ఇంతవరకూ సెర్చ్ కమిటీల భేటీ జరగలేదు. వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పెద్దఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమని వారు అంటున్నారు. ఒత్తిడే కారణమా...? ప్రధాన యూనివర్సిటీల వీసీల కోసం పెద్దఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్టీయూహెచ్ వీసీ కోసం కేంద్రస్థాయిలో కాంగ్రెస్ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌కు చెందిన మరో కాంగ్రెస్ కీలకనేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్‌కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. జేఎన్టీయూహెచ్ వీసీ పోస్టుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్టు తెలిసింది. అయితే, తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. ఈ కారణంగానే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇంతవరకూ భేటీ అవ్వలేదని తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నా, యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతోందని ఉన్నతవిద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు.EAP CET టాపర్లు (ఇంజనీరింగ్)మొదటి ర్యాంక్ - సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం,ఏపీ) రెండో ర్యాంక్ - గొల్లలేక హర్ష (కర్నూల్, ఏపీ) మూడో ర్యాంక్- రిషి శేఖర్ శుక్లఇంజనీరింగ్ విభాగంలో టాట్టెన్లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచారు.EA PCET టాపర్లు ( అగ్రి కల్చర్ అండ్ ఫార్మసీ)మొదటి ర్యాంక్- ఆలూర్ ప్రణిత ( మదనపల్లి, ఏపీ) రెండో ర్యాంక్ - నాగుడసారి రాధా కృష్ణ (విజయనగరం, ఏపీ) మూడో ర్యాంక్- గడ్డం శ్రీ వర్షిణి (వరంగల్,తెలంగాణ)ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ‘ఎప్ సెట్‌ను మొదటి సారిగా నిర్వహించాం. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించాం’ అని తెలిపారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడారు. ‘ఈ ఏడాది ఈఎపి సెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు . ఈఎపి సెట్‌కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తాం’అని అన్నారు. -
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీ సెట్) బుధవారం ప్రశాంతంగానే ముగిసింది. అయితే, మంగళవారం కురిసిన అకాల వర్షం కారణంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పరీక్ష కేంద్రాల్లో అనేక చోట్ల విద్యుత్ లేకపోవడం, ఇంటర్నెట్ సదుపాయం గంటల తరబడి అందుబాటులోకి రాకపోవడంతో సెట్‌కు సమస్యలు తలెత్తాయి.హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాల్లో కొద్దిసేపు కంప్యూటర్లు మొరాయించినట్టు విద్యార్థులు తెలిపారు. కానీ తక్షణమే అధికారులు స్పందించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అదనంగా జనరేటర్లను సిద్ధం చేశారు. నెట్వర్క్ సమస్యలను కొన్ని నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం మొదలైన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగానికి చెందిన సెట్ రెండో రోజు కూడా జరిగింది. ఈ రెండు రోజులకు కలిపి 1,00,254 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 90 శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇంజనీరింగ్ సెట్‌కు పక్కా ఏర్పాట్లురాష్ట్రంలోని దాదాపు 175 కాలేజీల్లో ఉన్న 1.06 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జేఎన్టీయూహెచ్ నిర్వహించే సెట్ గురువారం మొదలవుతుంది. ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ నుంచి 2,54,532 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సగం మందికిపైగా విద్యార్థులు హైదరాబాద్ కేంద్రం నుంచే పరీక్ష రాస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో 4 జోన్లు ఏర్పాటు చేశారు. వర్షం, గాలి దుమారం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ జనరేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నెట్వర్క్ సమస్య రాకుండా కూడా అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
బోధన.. వేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్‌లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది. జేఎన్టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ ఫైల్‌ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు. 1,869 పోస్టులు ఖాళీ.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ప్రొఫెసర్లేరి? ♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది. ♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్‌తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు. క్రమబద్ధీకరణ చేయరా? గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. -
ప్రమాణాల్లేకున్నా సీట్లు పెంచాలట! ఇంజనీరింగ్ కాలేజీల తీరిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సరైన నాణ్యతా ప్రమాణాల్లేకుండానే డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ తాజా పరిశీలనలో వెల్లడైంది. పదేళ్ల నాటి కంప్యూటర్లు... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో దాదాపు 50 కాలేజీల్లో అన్ని సదుపాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన కాలేజీలు సమర్పించిన సదుపాయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా కంప్యూటర్ సైన్స్ కోర్సు బోధనకు కనీసం 10 మంది విద్యార్థులకు ఒక అత్యాధునిక కంప్యూటర్ ఉండాల్సి ఉండగా సెక్షన్ మొత్తానికి రెండు కంప్యూటర్లు కూడా లేవని తేలింది. అవి కూడా అతితక్కువ ప్రమాణాలతో ఉన్నాయని, సరికొత్త టెక్నాలజీ బోధించేందుకు ఏమాత్రం పనికి రావని అధికారులు గుర్తించారు. పదేళ్ల నాటి కాన్ఫిగరేషన్‌తో వాడే కంప్యూటర్లు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీకి వాడే అత్యాధునిక సాఫ్ట్వేర్ రన్ కావడానికి ఉపకరించే ఆధునిక కంప్యూటర్ల స్థానంలో నాసిరకం వాటితోనే కాలేజీలు బోధన సాగిస్తున్నట్లు తేలింది. ఇక అధ్యాపకుల విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చిన కొత్తలో ఉన్న వారే ఇప్పుడూ బోధకులుగా ఉన్నారు. వారు నైపణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు ఎలాంటి ఆధారాలను యాజమాన్యాలు చూపలేదని తెలిసింది. ప్రతిరోజూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే ప్రముఖ కంపెనీల్లో అధ్యాపకులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ దిశగా ఎలాంటి కసరత్తు జరగలేదు. అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే గుర్తింపు.. ఈ నెల 18 నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మొదలుపెడతాం. ప్రతి కాలేజీని పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే కాలేజీలకు గుర్తింపు ఇస్తాం. కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని ఎక్కువ కాలేజీలే కోరుతున్నాయి. వాటి సామర్థ్యం, బోధన విధానాలను లోతుగా పరిశీలించే ఉద్దేశంతోనే ఈసారి అఫిలియేషన్ ప్రక్రియను ముందే చేపడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ 78 కాలేజీల డొల్లతనం.. ఈసారి దాదాపు వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సివిల్‌లో 40 శాతం, మెకానికల్‌లో 35 శాతం, ఎలక్ట్రికల్‌లో 34 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడంతో ఈసారి ఆయా బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్లు తగ్గించుకుంటామని కోరాయి. వాటి స్థానంలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఆయా కాలేజీలు సమర్పించిన వివరాలను జేఎన్టీయూహెచ్ అధికారులు పరిశీలించగా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. కంప్యూటర్ కోర్సులు కోరుతున్న వంద కాలేజీలకుగాను 78 కాలేజీల్లో అత్యాధునిక కంప్యూటర్లు లేవని, కంప్యూటర్ లాంగ్వేజ్‌పై పట్టున్న ఫ్యాకల్టీ లేదని తేలింది. -
అఫిలియేషన్ ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. విశ్వవిద్యాలయాలు ఇప్పటికే కాలేజీల నుంచి సమాచారం సేకరించాయి. వాటిని సంబంధిత నిపుణులు పరిశీలిస్తున్నారు. అత్యధిక కాలేజీలు అనుబంధంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో ముందుంది. కాలేజీల నుంచి సేకరించిన సమాచారాన్ని సిబ్బంది కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున ఫ్యాకల్టీ నిపుణులు వెళ్తారని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న వాటిల్లో పెంచుకునేందుకు కాలేజీలు ప్రయ త్నిస్తున్నాయి. అయితే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా తగ్గించేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు. ఆయా కోర్సుల్లో 30 శాతం సీట్లు ఉండి తీరాలని చెబుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 200కు పైగా కాలేజీల్లో తనిఖీలకు సిద్ధం జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 వరకూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మరో 70 వరకూ ఫార్మసీ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, దానికి అనుబంధంగా వచ్చి న కొత్త కోర్సుల విషయంలోనే అధికారులు దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ సరైనది ఉందా? మౌలిక సదుపాయాలు ఏమేర ఉన్నాయి? అనే అంశాలను తనిఖీ బృందాలు నిశితంగా పరిశీలించాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని యూనివర్సిటీలు తప్పనిసరి చేసినా, పలు కాలేజీలు దీన్ని అనుసరించడం లేదు. ఈ ఏడాది నుంచి దీనిని కచ్చి తంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలో భాగం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫ్యాకల్టీ ప్రతిభ, ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా తనిఖీలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సదుపాయాలు లేకుండా గుర్తింపు కష్టం తనిఖీల విషయంలో యూనివర్సిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. తనిఖీ బృందాలు కాలేజీ యాజమాన్యాలతో మిలాఖత్ అవుతున్నాయని, మౌలిక సదుపాయాలు లేకున్నా అనుమతిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలేజీలో బోధించే సిబ్బంది వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడమే కాకుండా, వారి వ్యక్తిగత పాన్ కార్డుల ఆధారంగా ఆదాయ పన్నుశాఖ ద్వారా తనిఖీలు చేయాలనే యోచనలో ఉన్నారు. ఫ్యాకల్టీ కాలేజీలో బోధిస్తున్నాడా? ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని, కాలేజీలో ఫ్యాకల్టీగా నమోదు చేసుకున్నాడా అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా తనిఖీలు పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులు భావిస్తున్నారు. మే రెండో వారంకల్లా పూర్తి చేస్తాం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను మే రెండో వారంకల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాలేజీల్లో ఫ్యాక ల్టి, వసతులపై డేటా తెప్పించాం. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేని కాలేజీలు గుర్తింపు తేదీ నాటికి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున నిపుణులు వెళ్తారు. అన్నీ పరిశీలించి, నిబంధనల మేరకు సరిగా ఉంటేనే గుర్తింపు ఇస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడనే పరిస్థితి దాపురించింది
కేపీహెచ్‌బీకాలనీ: విద్యార్థులు గతంలో పరీక్షలంటే ఎలా చదవాలని అడిగే వారని.. ప్రస్తుతం ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడ జరుగుతోందని అడిగే పరిస్థితి దాపురించిందని రాష్ట్ర గవర్నర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించి పరోక్షంగా పోటీ పరీక్షల లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. పదేళ్ల కిందట మెడికల్ కళాశాలలో తాను విద్యార్థులకు క్లాస్ తీసుకుంటుండగా పరీక్షలు రాసేందుకు సర్వ సన్నద్ధమైన ఓ విద్యార్థి తనను ప్రశ్న పత్రాలు ఎక్కడ తయారవుతాయంటూ ప్రశ్నించడం ఆ నాడు జోక్‌గా ఉంటే ప్రస్తుతం అది వాస్తవరూపం దాల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూహెచ్ 11వ స్నాతకోత్సవం శనివారం వర్సిటీ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్డీ, ఎంటెక్, ఎం.ఫార్మ్. ఎంబీఏ, ఎంఎస్‌ఐటీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఎస్, ఫార్మ్–డి, ఫార్మ్ డి (పీబీ), పీజీ డిప్లొమా, బీటెక్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఎంఓయూ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు పట్టాలతో పాటు పతకాలను ప్రదానం చేశారు. విద్యార్ధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ గురువుల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా సమాజ వికాసానికి పంచినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు. సమాజానికి ఉపయోగపడని విద్యా డిగ్రీలు, పతకాలు ఎన్ని సాధించినా వ్యర్ధమేనని వ్యాఖ్యానించారు. నిత్యం టెక్నాలజీతో సహజీవనం చేస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆ సాంకేతికతను సన్మార్గంలో వినియోగించుకున్నప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇంటా, బయటా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కొంతమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థితి వద్దని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఎప్పుడూ కరెన్సీ మాత్రమే లెక్కబెట్టడం కాదని, కేలరీస్‌ను కూడా లెక్కించాలని పేర్కొంటూ ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేశారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్భోదించారు. -
ప్రైవేటు పీహెచ్‌డీలకు రెడ్ కార్పెట్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల నుంచి పీహెచ్డీ చేసేందుకు అనుమతించడం వివాదాస్పదమవుతోంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అధ్యాపక వర్గం అంటోంది. ఈ విధానం వల్ల పీహెచ్‌డీల నాణ్యతే దెబ్బతింటుందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్జనలో అత్యున్నత స్థాయి డిగ్రీ అయిన పీహెచ్డీ (పరిశోధన)ని యూనివర్శిటీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేసేందుకు అనుమతిస్తూ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ పీహెచ్డీ కేవలం యూనివర్శిటీల పరిధిలోనే జరుగుతోంది. వర్శిటీ నేతృత్వంలోని ఫ్యాకల్టీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీల్లో గత కొన్నేళ్ళుగా అధ్యాపకుల నియామకం జరగడం లేదు. దీంతో గైడ్‌గా ఉండే అధ్యాపకులకు కొరత ఏర్పడింది. పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవరోధంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం రీసెర్చ్‌కు అవసరమైన అన్ని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతిమంగా పీహెచ్‌డీలు ఇచ్చేది యూనివర్శిటీయేనని అంటున్నారు. అయితే, వర్శిటీ పట్టాలిచ్చే ఓ కర్మాగారంగా ప్రేక్షక పాత్ర పోషించే వీలుందని నిపుణులు సందేహిస్తున్నారు. నాణ్యత ఉంటుందా...? అఫ్లియేషన్ ఉన్న ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చేయడం వల్ల నాణ్యత ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టిని ఎంపిక చేయడం లేదని నిపుణులు అంటున్నారు. కాలేజీల్లో ఒక్కో విభాగానికి ప్రొఫెసర్లను అర్హులైన వాళ్ళనే నియమించాల్సి ఉన్నా... నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని చెబుతున్నారు. పీహెచ్‌డీల వ్యవహారంలోనూ ఇదే జరిగే వీలుందని, అర్హతలేని గైడ్ల చేత పీహెచ్డీ పర్యవేక్షణ చేయించే వీలుందనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి పీహెచ్డీ పూర్తయ్యే వరకూ అధ్యాపకుడు అదే కాలేజీలో పనిచేయాలనే నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని కాలేజీలు అధ్యాపకులను తమ కాలేజీలోనే ఉండాలని వేధించే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే వేతనాలు సకాలంలో ఇవ్వకపోయినా కాలేజీ యాజమాన్యాలను అడిగే దిక్కు ఉండటం లేదని వాపోతున్నారు. నిపుణులైన గైడ్స్ దీనివల్ల పైవేటు కాలేజీల్లో పనిచేసేందుకు మొగ్గు చూపకపోవచ్చనే విమర్శలొస్తున్నాయి. పీహెచ్‌డీకి గైడ్‌గా ఉండే వ్యక్తికి పీహెచ్డీ పూర్తయి.. ఏవైనా జనరల్స్‌లో మూడు ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉండాలి. అయితే, యూనివర్శిటీలు పూర్తి అనుభవం ఉన్న వాళ్ళతోనే పీహెచ్డీ మార్గదర్శకత్వం ఇప్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగిస్తే ఈ తరహా నాణ్యత ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాణ్యత దెబ్బతింటుంది ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు అనుమతిస్తే నాణ్యత దెబ్బతింటుంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. విద్యార్థి పీహెచ్డీ అయ్యే వరకూ అధ్యాపకులు అదే కాలేజీలో ఉండాలనే నిబంధన కూడా అన్యాయమే. దీనివల్ల ఫ్యాకల్టితో కాలేజీల యాజమాన్యాలు వెట్టి చాకిరీ చేయించుకుంటాయి. జేఎన్టీయూహెచ్ ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. – డాక్టర్ వి బాలకృష్ణా రెడ్డి టెక్నికల్, ప్రొఫెషనల్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అర్హత ఉన్న వారికే అవకాశం గత ఏడాది రీసెర్చ్ కేంద్రాలున్న కాలేజీలను గుర్తించాం. అదే కాలేజీలో అర్హులైన వారిని ఎంపిక చేసి పీహెచ్డీ చేసే విద్యార్థిని సూపర్ వైజ్ చేసే బాధ్యత అప్పగిస్తాం. అంతిమంగా పీహెచ్డీ ఇచ్చేది యూనివర్శిటీనే. ఇది యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం కాదు. – ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి వీసీ, జేఎన్టీయూహెచ్ -
పీజీ సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీజీఈ సెట్–2023 షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్ ఈ పరీక్షను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కోసం ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.600)తో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం https:// pgecet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని ఆయన సూచించారు. -
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మా, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే నెలలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) శుక్రవారం విడుదల చేసింది. వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో ఎంసెట్ దరఖాస్తులను వచ్చే నెల 3 నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్ 10లోగా అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లు (కర్నూలు విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు) ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్ ప్రక్రియ పూర్తయ్యేలోగానే అనుబంధ కాలేజీలకు అఫ్లియేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈసారి నర్సింగ్ కూడా.. నర్సింగ్ కోర్సుల సీట్లను కూడా ఈసారి ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వర్సిటీ నుంచి అనుమతి వచ్చిందన్నారు. ఎంసెట్‌కు ఇంటర్లో (జనరల్ 45 శాతం, రిజర్వేషన్ కేటగిరీకి 40 శాతం) కనీస మార్కులు సాధించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ తొలగించినట్టు ప్రకటించారు. వెయిటేజీ విధానం కష్టసాధ్యమవ్వడం, జాతీయ పరీక్షల్లోనూ దీన్ని అనుసరించకపోవడంతో తీసివేశామన్నారు. ఫస్టియర్ ఇంటర్ నుంచి 70 శాతం, సెకండి యర్ నుంచి వంద శాతం సిలబస్ ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డా.శ్రీనివాస్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం https://eamcet. tsche. ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు. -
ఎంసెట్ నోటిఫికేషన్‌పై ఎందుకు జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎంసెట్‌ను మే నెలలో నిర్వహిస్తామని తేదీలు ప్రకటించినా, ఇంతవరకూ వివరణాత్మక నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థుల్లో స్పష్టత కొరవడింది. ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ ఉండబోదని కూడా అధికారులు చెబుతున్నా దీనిపై జీవో వెలువడలేదు. దీంతో ఎంసెట్‌ను నిర్వహించే పరీక్షకు ఏర్పాట్లు చేయలేకపోతున్నట్టు జేఎన్టీయూహెచ్ చెబుతోంది. మరోవైపు కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియను జేఎన్టీయూహెచ్ వచ్చే వారంలో చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే కాలేజీల డేటా తెప్పించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఎంసెట్ నిర్వహణ, కౌన్సెలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేస్తే తప్ప, వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేసే వీలుండదని అంటున్నారు. వీలైనంత త్వరగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులు నిర్వహిస్తేనే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని యూనివర్సిటీల వీసీలు కూడా అంటున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ తొలిదశ పూర్తయింది. రెండో విడత ఏప్రిల్‌లో జరగనుంది. కోవిడ్ మూలంగా గత రెండేళ్ళుగా విద్యా సంవత్సరం ఆలస్యంగా నడుస్తోంది. ఈసారైనా సకాలంలో పూర్తి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అన్ని రాష్ట్రాలకూ సూచించింది. త్వరలోనే కొత్త విద్యా సంవత్సరంలో చేపట్టే మార్పులు, చేర్పులతో మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తోంది. కానీ మన రాష్ట్ర ఎంసెట్ విషయంలో మాత్రం అధికారులు నిర్లిప్తంగా ఉండటం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక వర్గాలను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. స్పష్టత కోరుతున్న విద్యార్థులు ఎంసెట్ వివరణాత్మక నోటిఫికేషన్ వస్తేనే అన్ని విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ ఏడాదికి 70 శాతం సిలబస్ ఉంటుందా? లేదా? వెయిటేజీ ఇస్తారా? ఇవ్వ రా? అనేది తెలిస్తే ఎంసెట్‌కు ఎలా సన్నద్ధమవ్వాలనే దానిపై స్పష్టత ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన ఎంసెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మే 7వ తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్, మే 12, 13, 14 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ ఎంసెట్ ఉంటా యని తెలిపారు. రెండురోజుల్లో వర్సిటీలు వివరణాత్మక నోటిఫికేషన్లు ఇస్తాయని చెప్పారు. కానీ ఇంతవరకు వెలువడకపోవడంతో ఎందుకు జాప్యం జరుగుతోందో అర్ధం కాక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. విడుదలకు ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయినా వీలైనంత త్వరలోనే జారీ చేస్తాం. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు సకాలంలోనే క్లాసులు మొదలవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
బ్లాక్ హాక్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేత జేఎన్టీయూహెచ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా జేఎన్టీయూహెచ్ (సౌత్‌జోన్) నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీబీఐటీ)పై 15-7, 15-13, 15-19 స్కోర్‌తో విజయం సాధించింది. ప్రాధమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే ప్రయత్నాల్లో భాగంగా జేఎన్టీయూహెచ్ స్పోర్ట్స్ కౌన్సిల్‌తో కలిసి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ వాలీబాల్ (మెన్స్) టోర్నమెంట్‌ను రెండు రోజుల పాటు జెఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన వాలీబాల్ టీమ్‌లు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నాయి. ‘భారతదేశంలో ప్రాధమిక స్థాయి నుంచి వాలీబాల్ అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించనున్నాము’’అని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని, అభిషేక్ రెడ్డి అన్నారు. ‘‘బ్లాక్ హాక్స్ టీమ్ ప్రాధమిక స్ధాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి ఉంది. ‘చోటు లీగ్స్’ను పాఠశాల విద్యార్థుల కోసం, అలాగే ‘మస్తీ లీగ్స్’ను టీనేజర్ల కోసం నిర్వహించడానికి ప్రణాళిక చేశాము. తద్వారా మన దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నాము’’ అని శ్యామ్ గోపు (సహ యజమాని) అన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌కు మన పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ ఆచార్యులు బోధించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరింది. త్వరలోనే ఈ మేరకు ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుంది. దీనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పలు దఫాలుగా చర్చించారు. ఉన్నత విద్యలో జేఎన్టీయూహెచ్ తీసుకొస్తున్న సంస్కరణలు ఛత్తీస్‌గఢ్ వర్సిటీలను ఆకర్షించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో నెలకొన్న ప్రొఫెసర్ల కొరతను కూడా ఆ రాష్ట్రం పరిగణలోనికి తీసుకుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు జేఎన్‌టీయూహెచ్‌ని సరైన భాగస్వామిగా ఎంచుకుంది. ముందుగా బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సును ప్రారంభించాలని భావిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని కోర్సులకు మన రాష్ట్ర అధ్యాపకుల తోడ్పాటు తీసుకునే అవకాశం ఉంది. కోర్సు నిర్వహణ, ఇతర అంశాలపై మరింత లోతుగా చర్చించాల్సి అవసరం ఉందని, ఆ తర్వాత అఖిల భారత సాంకేతిక విశ్వవిద్యాలయంతో పాటు మరికొన్ని సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉందని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. డిమాండ్ దృష్ట్యానే.. బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సు గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ–కామర్స్ వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో నిపుణుల అవస రం ఉందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. భారత్‌లో డేటా అనలిస్ట్ పూర్తి చేసిన విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో మంచి వేతనాలతో ఉపాధి పొందుతు న్నారు. మన దేశంలోనూ డేటా అనలిస్టుల కొరత 60 శాతం వరకూ ఉందని ఇటీవల సర్వేలు పేర్కొన్నాయి. దీన్ని దృష్టి లో ఉంచుకుని గత రెండేళ్ళుగా బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సు ను అంతర్జాతీయ ప్రమాణాలతో జేఎన్టీయూహెచ్ అభివృద్ధి చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సుకు మంచి డిమాండ్ వస్తోంది. అయితే అక్కడ నిష్ణాతులైన అధ్యాపకుల కొరత కారణంగా ఈ కోర్సుకు అన్ని కాలేజీల్లోనూ అనుమతి ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణతో భాగస్వామ్యానికి ఛత్తీస్‌గఢ్ సిద్ధమైంది. కోర్సు నిర్వహణ ఎలా? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో బీబీఏ అనలిస్ట్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియను ఆ రాష్ట్రమే నిర్వహిస్తుంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా జేఎన్టీయూహెచ్కు లాగిన్ అవుతారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రొఫెసర్లు ఆన్లైన్ ద్వారా వారికి బోధన చేస్తారు. దీనికి అనుగుణంగా రెండుచోట్లా ఒకే తరహా సిలబస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలు కూడా ఆన్లైన్లోనే చేపట్టినప్పటికీ, మూల్యాంకన విధానం మాత్రం తామే చేపడతామని ఛత్తీస్‌గఢ్ అధికారులు అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. బోధించే అధ్యాపకులే మూల్యాంకనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలావుండగా ఈ కోర్సు నిర్వహణ కారణంగా జేఎన్టీయూహెచ్కు ఆదాయం పెరిగే అవకాశం ఉందని, అవసరమైతే కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ ఇచ్చే అంశాలపైనా ఆలోచిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఛత్తీస్‌గఢ్ కోరిక మేరకు బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సుకు అవసరమైన బోధన తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అయితే కోర్సు నిర్వహణపై సమాలోచనలు జరుగుతున్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత ప్రారంభించే యోచనలో ఉన్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా విధానంలో సమూల మార్పులకు జేఎన్టీయూహెచ్ శ్రీకారం చుట్టింది. కంప్యూటర్ కోర్సులకు ధీటుగా సాంప్రదాయ బ్రాంచిలకు అదనపు హంగులు అద్దుతోంది. క్రెడిట్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్ కోర్సులకు రూపకల్పన చేసింది. నైపుణ్యంతో కూడిన ఇంజనీరింగ్ విద్య కోసం కొన్నేళ్ళుగా చేస్తున్న కసరత్తు ఈ ఏడాది నుంచే అమల్లోకి వచ్చిందని జేఎన్టీయూహెచ్ ఉప కులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక కంప్యూటర్ కోర్సుల వెంటే పడక్కర్లేదని స్పష్టం చేశారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ చేసినా బహుళజాతి కంపెనీల్లో సులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చని చెప్పారు. ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. అమల్లోకి ఆర్–22 ప్రతి నాలుగేళ్ళకోసారి ఇంజనీరింగ్ విద్య స్వరూప స్వభావాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య ఎలా ఉండాలనే అంశంపై 250 మంది నిపుణులతో అధ్యయనం చేశాం. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, అన్ని సబ్జెక్టులకు చెందిన నిష్ణాతులూ ఉన్నారు. వీరి సలహాల ఆధారంగా రూపొందించిందే ఆర్–22 రెగ్యులేషన్. ఇది యూజీసీ, అఖిలభారత సాంకేతిక విద్య నిబంధనలకు లోబడే ఉంటుంది. ఇక్కడ ఇచ్చే క్రెడిట్స్ ఏ దేశంలోనైనా చెల్లే విధంగా ఇది ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అనుసరిస్తాయి. అన్ని బ్రాంచ్‌లకు అదనంగా కంప్యూటర్ కోర్సులు ఇంజనీరింగ్‌లో సీఎస్సీ ఓ క్రేజ్‌గా మారింది. కానీ ఇప్పుడు దానికోసం అంతగా పోటీ పడాల్సిన పనిలేదు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అతి ముఖ్యమైన సాఫ్ట్వేర్ కోర్సులు చేయవచ్చు. ప్రధాన బ్రాంచినే చదువుతూ.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటాసైన్స్ (పైథాన్ లాంగ్వేజ్‌తో), క్లౌడ్ డెవలప్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఇండ్రస్టియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఇంటర్నెట్ థింక్స్ వంటి కోర్సులను అదనంగా చేసేందుకు జేఎన్టీయూహెచ్ వీలు కల్పిస్తుంది. ఒక్కో సబ్జెక్టులోనూ మూడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి మూడు క్రెడిట్స్ ఉంటాయి. ఈ కోర్సులను 70 శాతం ఆన్లైన్లో, 30 శాతం ప్రత్యక్ష బోధన ద్వారా నేర్చుకోవచ్చు. రోజుకు రెండు గంటల చొప్పున ఆరు నెలల్లో 48 గంటల్లో ఈ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌కు 160 క్రెడిట్స్ వస్తాయి. అదనపు కోర్సులు చేయడం వల్ల మరో 26 క్రెడిట్స్ వస్తాయి. ఏ బ్రాంచి విద్యార్థి అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేందుకు ఈ క్రెడిట్స్ సరిపోతాయి. అంతర్జాతీయంగా కూడా ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థుల ఉపాధికి ఢోకా ఉండదు. ఇంతకుముందు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని చేర్చుకుని తమకు అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడు చాలా సంస్థలు నైపుణ్యం వారినే చేర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసేసరికే కంప్యూటర్ నాలెడ్జి ఉండటం ఉపకరిస్తుంది. ఎగ్జిట్ విధానం.. డ్యూయల్ డిగ్రీ నాలుగేళ్ళ ఇంజనీరింగ్ పూర్తి చేస్తేనే పట్టా చేతికొచ్చే పాత విధానం ఇక ఉండదు. రెండేళ్ళు చదివినా డిప్లొమా ఇంజనీరింగ్‌గా సర్టిఫికెట్ ఇస్తారు. అంటే డిప్లొమాతో భర్తీ చేసే ఉద్యోగాలకు ఇది సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటే అంతకు ముందు ఇచి్చన డిప్లొమా సర్టిఫికెట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ మధ్యలో మానేసే వారికి ఒకరకంగా ఇది వరమే. రెండేళ్ళ వరకు క్రెడిట్స్‌ను కూడా లెక్కగడతారు. మరోవైపు డ్యూయల్ డిగ్రీ విధానం కూడా అందుబాటులోకి వచి్చంది. జేఎన్టీయూహెచ్ పరిధిలో బీబీఏ అనలిటికల్‌ను ఆన్లైన్ ద్వారా చేసే వెసులుబాటు కలి్పస్తున్నాం. ఇంజనీరింగ్ చేస్తూనే దీన్ని చేయవచ్చు. ఇక ఇంజనీరింగ్ మధ్యలోనే స్టార్టప్స్ పెట్టుకునే వాళ్ళు.. వీలైనప్పుడు (8 ఏళ్ళలోపు) మళ్ళీ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇంజనీరింగ్ విద్యకు గుర్తింపు తేవడమే ఈ మార్పుల లక్ష్యం. -
ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి
కేపీహెచ్‌బీ కాలనీ: విద్యార్థులు కేవలం ఉద్యోగులుగానే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. జేఎన్టీ యూహెచ్ గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవం పురస్కరించుకొని ‘‘ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’’అనే అంశంపై గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. మేధస్సు అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని, విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణల వైపు మొగ్గుచూపాలని సూచించారు. సరికొత్త ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చి ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా టీహబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రోజుకు 24 గంటలపాటు విద్యుత్, ఇంటింటికీ తాగునీటి సదుపాయం, సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై అన్ని పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత పారిశ్రామిక అభివృద్ధికి ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే మూడు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని విధానాలు రూపొందించాలని తాను సూచించినట్లు తెలిపారు. మౌలిక వసతుల సద్వినియోగం ఏదీ.. దేశంలో ఉన్న మౌలిక వసతులన్నింటినీ సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొందని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. దేశంలోనే వివిధ రూపాల్లో నాలుగు లక్షల ఆరువేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా గరిష్టంగా వినియోగించే విద్యుత్ రెండు లక్షల పన్నెండు వేల మెగావాట్లు మాత్రమేనని తెలిపారు. అయినప్పటికి విద్యుత్ ఉత్పత్తిలో దేశం వెనుకబడిందన్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, పారిశ్రామికవేత్త పద్మశ్రీ బి.వి.మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బయోమెట్రిక్’ అమలు చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఆటలకు చెక్ పెట్టేలా హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) చర్యలకు ఉపక్రమించింది. కాలేజీలకు వర్సిటీ అనుబంధ గుర్తింపుప్రక్రియలో భాగంగా అధ్యాపకులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిస రి చేసిన వర్సిటీ.. దానిని అమలు చేయని కాలేజీలకు నోటీసులు జారీచేస్తోంది. అధ్యాపకులకు రోజువారీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయా నోటీసుల్లో ప్రశ్నించింది. కనీస హాజరు శాతం కూడా ఉండడం లేదని పేర్కొంది. కాలేజీల తనిఖీల సమయంలో బయోమెట్రిక్ హాజరులేని బోధన సిబ్బందిని పరిగణనలోకి తీసుకోబోమని, వారిని ఫ్యాకల్టీగా భావించబోమని స్పష్టం చేసింది. ఈ విద్యాసంవత్సవరం నుంచి బయోమెట్రిక్ హాజరును పాటించకపోతే తదుపరి అనుబంధ గుర్తింపునకు అవకాశం ఉండబోదని తెలిపింది. దీనిపై ఈ నెల 8లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తనిఖీల్లో గుర్తింపుతో.. 2022–2023 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు కోసం వర్సిటీ కమిటీలు కాలేజీల్లో గతనెల 18 నుంచి 22 వరకు తనిఖీలు నిర్వహించాయి. వర్సిటీ సర్వర్‌లో అధ్యాపకుల బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాని విషయాన్ని గమనించి నివేదిక సమర్పించాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. సగానికి పైగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత జేఎన్టీయూహెచ్ పరిధిలో సుమారు 143 కళాశాలలు ఉండగా సగానికి పైగా కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత వెంటాడుతోంది. మరోవైపు అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా మరొకరు బోధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫార్మసీ లాబ్ల్లో, మెడికల్ షాపుల్లో పనిచేసేవారితో పాటు, సాఫ్ట్వేర్æ కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు (కాంట్రాక్ట్ పద్ధతిలో), ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నవారిని ఫ్యాకల్టీగా కళాశాలలు చూపించడం సర్వసాధారణమైంది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దే దిశలో జేఎన్టీయూహెచ్ చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. నాణ్యమైన విద్య అందుతుంది ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసి, దానిని అమలు చేయని కాలేజీల కు నోటీసులు జారీ చేయడం హర్షణీయం. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. కొన్ని కాలేజీల్లో సిలికాన్ వేలిముద్రలు వినియోగిస్తున్నారు. దానిపైనా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. – అయినేని సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్టీసీఈఏ -
ఆరోపణలొస్తే ఎప్పుడైనా తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్ జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఏదైనా కాలేజీపై నిర్ధిష్ట ఆరోపణలువస్తే ఎప్పుడైనా తనిఖీలు చేస్తామని పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త కోర్సులు ప్రవేశపెడితే, వాటికి సంబంధించిన ల్యాబ్‌లు, కోర్సులకు సరిపడా బోధన సిబ్బంది ఉన్నారా.. లేదా? అనేది పరిశీలించాకే అనుబంధ గుర్తింపు ఇస్తామని వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలపై ‘145 కాలేజీ లు.. మూడు రోజుల్లోనే తనిఖీలపై అనుమానా లు’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన కథనం లో వాస్తవం లేదని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ స్పష్టంచేశారు. కాలేజీల్లో సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించామని తెలిపారు. కొన్నేళ్లుగా నడుస్తున్న పాత కాలేజీల్లో సివిల్, మెకానికల్ కోర్సులకు సంబంధించి ల్యాబొరేటరీలు, అధ్యాపకుల వ్యవస్థ ఉంటుందని, అలాంటప్పుడు వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. పెరిగిన కంప్యూటర్ కోర్సులకు ల్యాబ్స్, బోధించే సిబ్బంది సక్రమంగా ఉన్నారా? లేదా? అనే అంశంపైనే తాము దృష్టిపెట్టినట్టు వివరించారు. నిజనిర్ధారణ కమిటీలు సమర్పించిన డేటాతో సంతృప్తిచెంది, కాలేజీల్లో ఉన్న లోపాలను యాజమాన్యాలకు వివరించకుండా, వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని, అనుబంధ గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గతేడాది నుంచి నిజనిర్ధారణ కమిటీలు ఎత్తిచూపిన లోపాలను కాలేజీ మేనేజ్మెంట్లకు చూపి, వాటిని సరిచేసుకునేలా కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. -
జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల ఘర్షణ
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల నడుమ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణ గురువారం బహిర్గతమైంది. బుధవారం రాత్రి మెటలర్జీ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని ఏబీవీపీ నాయకులు క్యాంటీన్ వద్దకు పిలిచి దాడి చేశారని, గురువారం ఉదయం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో సదరు ర్యాలీలో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు పాల్గొన్నారని, బయటి వ్యక్తులను ఎలా రానిస్తారంటూ ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల నడుమ మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు సంఘాల నాయకులు ఘర్షణ పడకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఏబీవీపీ నాయకులు అక్కడి కొన్ని జెండాలను తొలగించి దగ్ధం చేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన మఫ్టీ పోలీసును తోసేశారు. దీంతో అప్పటికే అక్కడే ఉన్న ఇతర పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు. అక్కడి విద్యార్థులను జీపుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ఘర్షణలో కొందరు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘర్షణకు కారమైన విద్యార్థి నాయకులు, విద్యార్థులపై కేసులు నమోదు చేస్తామని, మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని సీఐ కిషన్‌కుమార్ తెలిపారు. దాడిని ఖండిస్తూ ర్యాలీ... బుధవారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ జేఏసీ నాయకులు యూనివర్సిటీలోని అన్ని కళాశాల ముందు నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా వీసీ లేకపోవడంతో రిజిస్ట్రార్‌కు, ఓఎస్డీకి వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. కాగా విద్యార్థులను నడుమ సఖ్యతను పెంచి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తోడ్పడాల్సిన విద్యార్థి సంఘాల వ్యవహారాలను చూసే అధికారి పేరుతోనే విద్యార్థులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురు విద్యార్ధులు బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం యూనివర్సిటీ ఉన్నతాధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతుండటం గమనార్హం. (క్లిక్: ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్) -
నో సి‘విల్’ .. మెకాని‘కిల్’!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లనుందా? డిమాండ్ లేని కోర్సులను ఎత్తేసి, విద్యార్థులు కోరుకునే కోర్సులు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. గత మూడేళ్లుగా కంప్యూటర్ కోర్సుల్లో వచ్చిన ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీతో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో 95 శాతం సీట్లు ఈ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. మరోవైపు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు వందకుపైగా కాలేజీలు తమ సంస్థల్లో సివిల్, మెకానికల్ కోర్సులను ఎత్తివేసేందుకు హైదరాబాద్ జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు సోమవారం నుంచి విచారణ జరపనున్నారు. మూడేళ్లుగా 30 శాతం సీట్లు భర్తీ కాలేదని కాలేజీలు సరైన ఆధారాలు చూపిస్తే జేఎన్టీయూహెచ్ ఆ కోర్సులు ఎత్తివేసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇస్తుంది. దీని ఆధారంగా కాలేజీలు సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్, కంప్యూటర్ సంబంధిత సీట్లు తెచ్చుకునే వీలుంది. 10 వేలకు పైగా సీట్లకు ఎసరు రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 79 వేల సీట్లు ఉంటాయి. వీటిల్లో కూడా 38,796 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ కోర్సులే ఉన్నాయి. ఈసీఈ 13,935, ఈఈఈ 7,019 ఉంటే, సివిల్ 6,221, మెకానికల్ 5,881 సీట్లున్నాయి. ఇతర కోర్సుల సీట్లు మరికొన్ని ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ముగిసిన వెంటనే తక్షణ ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్‌ను ఎంచుకుంటున్నారు. కొంతమంది అమెరికా వంటి విదేశాలకు వెళ్లేందుకు కూడా కంప్యూటర్ కోర్సుల బాట పడుతున్నారు. కంప్యూటర్ కోర్సులకు సంబంధించి కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేకున్నా విద్యార్థులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవానికి ఈ కోర్సులు చేసినప్పటికీ కేవలం 8 శాతం మాత్రమే స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నట్టు ఇటీవల సర్వేలో వెల్లడైంది. కానీ విద్యార్థుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలు కంప్యూటర్ కోర్సుల సీట్లు వీలైనంత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ లేని మెకానికల్, సివిల్ కోర్సుల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశాయి. వర్సిటీ ఎన్వోసీ ఇస్తే వందకుపైగా కాలేజీల్లో 10 వేలకు పైగా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సీట్లు లేకుండా పోయే అవకాశం ఉంది. 2021లో ఈ రెండు కోర్సుల్లోనూ సగటున 30 శాతానికి పైగానే సీట్లు భర్తీ కావడం గమనార్హం. పాలిటెక్నిక్ విద్యార్థుల మాటేమిటి? సంప్రదాయ కోర్సులు కనుమరుగు కావడం భవిష్యత్‌లో దుష్పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందే వీలుంది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లన్నీ ఎత్తేస్తే వాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది. పాలిటెక్నిక్‌లో కేవలం సివిల్, మెకానికల్ వంటి కోర్సులు మినహా కంప్యూటర్ కోర్సులు లేకపోవడం గమనార్హం. అలాగే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో సివిల్, మెకానికల్ కోర్సుల ఎత్తివేత వల్ల భవిష్యత్తులో సంబంధిత నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం. ముఖ్యంగా పాలి టెక్నిక్ విద్యార్థులకు భవిష్యత్ ఉండదు. అందువల్ల సంప్రదాయ కోర్సు లు వందకు వంద శాతం రద్దుకు అనుమతించే ప్రసక్తే లేదు. కాలేజీలతో సంప్రదింపులు జరిపి సా ధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు రద్దవ్వకుండా చూస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ఆ కోర్సుల రద్దుకు అనుమతించకూడదు సంప్రదాయ కోర్సుల రద్దుకు యూనివర్సిటీ అనుమతించకూడదు. కంప్యూటర్ కోర్సులు చేసిన వారందరికీ ఉపాధి లభిస్తోందనేది అవాస్తవం. కంప్యూటర్ సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాలేజీలు అనేకం ఆయా కోర్సులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కంప్యూటర్ కోర్సుల కోసం ఎగబాకే ప్రైవేటు కాలేజీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఎంటెక్ చేసిన వాళ్లకు నెలకు కేవలం రూ.35 వేల వేతనం ఇస్తూ నాణ్యతలేని విద్యను అందిస్తున్నాయి. ఇవన్నీ విద్యార్థులు గ్రహించాలి. – డాక్టర్ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
జేఎన్టీయూహెచ్లో టెక్నికల్ ఫెస్ట్-2022 (ఫొటోలు)
-
విద్యార్థినులకు కొత్త వసతి గృహాన్ని నిర్మించండి
కేపీహెచ్‌బీకాలనీ: జేఎన్టీయూహెచ్లో విద్యార్థినుల కోసం కొత్త వసతి గృహాన్ని నిర్మించాలని ఓఎస్డీ స్కూడెంట్స్ అఫైర్ బానోతు ధర్మాను కోరారు. ఈ మేరకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్ఠి నాయకురాలు శేషుశ్రీ పంచాల మాట్లాడుతూ... ఇటీవల వసతి గృహాల్లోనే లైబ్రరీ సదుపాయం కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థినుల సంఖ్య పెరిగిందన్నారు. విద్యార్థినుల సంఖ్యకు అందుకనుగుణంగా మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరాన్నారు. మెస్ బిల్లులు సైతం ఎక్కువగా వస్తున్నాయని, మెస్ బిల్లులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కార్యక్రమంలో హాస్టల్ కో ఆర్డినేటర్ పవిత్ర, కీర్తన, శ్రీజ, జ్ఞాన ప్రసీద, శ్రేయ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
ఐదు జవాబులు రాస్తే సరి..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సాంకేతిక విద్య కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస హాజరుశాతం నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే సులభతరమైన పరీక్షావిధానాన్ని ప్రకటించింది. గతానికి భిన్నంగా ఈ సారి కేవలం 8 ప్రశ్నలనే పరీక్షల్లో ఇస్తారు. ఇందులో ఐదింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ) కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ బుధవారం ‘సాక్షి’ప్రతినిధికి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల (నాలుగేళ్లకు కలిపి)మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. గతానికి ఇప్పటికీ తేడా ♦సాధారణంగా కాలేజీ పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ఇందులో 10 శాతం మెడికల్ గ్రౌండ్లో మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ♦కరోనాకు ముందు ప్రశ్నపత్రం రెండు భాగాలుగా (పార్ట్–ఏ, పార్ట్–బీ) ఉండేది. పార్ట్–ఏ నుంచి మూడు మార్కుల ప్రశ్నలు ఐదు, రెండు మార్కులవి 5.. మొత్తం 25 మార్కులుంటాయి. పార్ట్–బీలో ఐదు మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. దీంతో రెండు పార్టుల్లో మొత్తం 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులకు పరీక్ష విధానం ఉండేది. ♦ఇప్పుడు ఒకే పార్ట్‌గా పరీక్ష ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలిస్తారు. ఇందులో ఐదింటికి జవాబులు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 15 మార్కులు.. మొత్తం 75 మార్కులుంటాయి. ఇంటర్నల్స్‌కు 25 మార్కులు ఉంటాయి. కనీస పాస్ మార్క్ 40 (ఇంటర్నల్స్‌తో కలిపి)గా నిర్ణయించారు. -
2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులకు కొన్ని పేపర్లలో సున్నా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగగా.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ 2, 3 సంవత్సరాల విద్యార్థుల ఆఖరి సెమిస్టర్ మార్కులను ఇటీవల ప్రకటించారు. ఈ ఫలితాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో జీరో మార్కులు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పాలిటెక్నిక్ డిప్లొమా చేసి, ఐసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలు పొందిన వాళ్లు కావడం గమనార్హం. ఇంటర్నల్ పరీక్షల్లో వీరిలో చాలామందికి 25కు గాను 23 వరకు మార్కులొచ్చాయి. అయితే ఎక్స్టర్నల్స్లో మాత్రం ఏకంగా జీరో రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధంగా మార్కులొచ్చిన వారు ఇప్పటివరకు 2 వేల మందిని గుర్తించినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అన్ని కాలేజీల నుంచి డేటా తెప్పిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం దశలోనో, మార్కుల వెల్లడిలోనో జరిగిన సాంకేతిక లోపం ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు ) ఇప్పటికీ వినియోగంలో పాత సాఫ్ట్వేర్ కళాశాలలకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత మార్కులను ఆయా కాలేజీల వారీగా జేఎన్టీయూహెచ్ సాఫ్ట్‌వేర్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. దీనికోసం వర్సిటీ ఇప్పటికీ ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట్‌వేర్‌నే వాడుతోంది. ఆప్‌లోడ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని తప్పుగా గుర్తించే విధానం ఈ సాఫ్ట్‌వేర్‌లో లేదని, తప్పులు ఆటోమేటిక్‌గా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను వర్సిటీ ఇప్పటికీ అందిపుచ్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు అధ్యాపకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో జరిగిన పరీక్షలకు దాదాపు రెండు లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో వాల్యుయేషన్ చేయించడం, వేగంగా మార్కులు అప్లోడ్ చేయించడం జరిగిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జీరో మార్కులు రావడానికి ఇవన్నీ కారణాలై ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) సాంకేతిక సమస్యలు సరిదిద్దుతాం ఎంతమందికి జీరో మార్కులొచ్చాయో డేటా తెప్పిస్తున్నాం. సమాధాన పత్రాలు పరిశీలిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అవకాశం లేదు. సాంకేతికపరమైన సమస్యలుంటే సరిదిద్దుతాం. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – మంజూర్ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్టీయూహెచ్ అధ్యాపకులపై ఒత్తిడే కారణం.. వాల్యుయేషన్ నేపథ్యంలో అధ్యాపకులపై విపరీ తమైన ఒత్తిడి ఉంటోంది. వర్సిటీ అధికారులు త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తున్నారు. వాల్యుయేషన్‌కు వెళ్లినా కాలేజీల్లో బోధన చేయాల్సి వస్తోంది. జీరో మార్కులు రావడానికి ఈ పరిస్థితులే కారణమని భావిస్తున్నాం. – అయినేని సంతోష్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం అప్పుడు 82 శాతం.. ఇప్పుడు జీరో ఇంటర్నల్స్‌లో నాకు 82% మార్కులొచ్చాయి. రెండో ఏడాది మ్యాథ్స్ పేపర్లో సున్నా మార్కులు వేశారు. పరీక్ష బాగానే రాశాను. అందుకే ఇదేం అన్యాయమని కాలేజీ వాళ్లను అడిగాను. జవాబు పత్రం మూల్యాంకనం చేసేది మేము కాదు యూనివర్సిటీ వాళ్లని, అక్కడకెళ్లి అడగాలని చెబుతున్నారు. – సంజయ్, విద్యార్థి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ అధికారులే బాధ్యత వహించాలి వర్సిటీ అధికారుల మొద్దు నిద్రకు ఇది ఓ ఉదాహరణ. ఇంటర్నల్స్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన విద్యార్థులకు ప్రధాన పరీక్షలో సున్నాలు ఎలా వస్తాయి? విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడటం అన్యాయం. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
OU: 2016కు ముందు పీహెచ్డీ అడ్మిషన్లు రద్దు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): వచ్చే నెల చివరి నాటికి పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేయకుంటే 2016 కంటే ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం పీహెచ్డీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు రెండేళ్ల గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరేళ్లు దాటిన పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని, ఇంత వరకు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే థీసిస్‌ను సమర్పించాలని అన్నారు. బయోమెట్రిక్ లేకుంటే జరిమానా సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామని, అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూ హెచ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీటెక్ మేనేజ్మెంట్ సీట్ల గడువు 20 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాలేజీలను ఆదేశించింది. వాస్తవానికి యాజమాన్య కోటా సీట్ల భర్తీని గతనెల 30వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్ సైన్స్ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
బయోమెట్రిక్ హాజరు లేకుంటే అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ–హైదరాబాద్ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అప్డేషన్ సిస్టం (ఏబీఏఎస్)ను పక్కాగా అమలు చేయాలని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. నూతన సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని, నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏబీఏఎస్ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. బోధన సిబ్బంది, పోస్ట్రుగాడ్యుయేషన్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం తప్పకుండా వేలిముద్రలతో కూడిన హాజరు ఇవ్వాలని తేల్చిచెప్పింది.ఏబీఏఎస్ హాజరు అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యాజమాన్యాలపై నెలకు రూ.20వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపును రద్దు చేసేందుకు సైతం వెనుకాడబోమని జేఎన్టీయూహెచ్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.