ఇంజనీరింగ్‌లో 10 వేల సీట్లు కోత! | 10 thousand seats cut in engineering | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో 10 వేల సీట్లు కోత!

Published Fri, Feb 8 2019 12:38 AM | Last Updated on Fri, Feb 8 2019 12:38 AM

10 thousand seats cut in engineering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈసారి దాదాపు 10 వేల సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాలేజీల మూసివేత, బ్రాంచీల రద్దుకు యాజమాన్యాల నుంచి వచ్చిన దరఖాస్తుల నేపథ్యంలో ఈ సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 173 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 13 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలోనే 6 వేలకుపైగా సీట్లు తగ్గిపోనుండగా, ఉన్న కాలేజీల్లో మరో 4 వేల వరకు సీట్లు తగ్గనున్నాయి. ఇందుకోసం యాజమాన్యాలే స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నాయి. అందులో బీటెక్‌లో 26 బ్రాంచీలు, ఎంటెక్‌లో 66 బ్రాంచీలు, ఎంబీఏలో ఐదు, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో 140 వరకు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు యూనివర్సిటీల అధికారులు అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీలతో (ఎఫ్‌ఎఫ్‌సీ) తనిఖీలు చేపట్టనున్నారు. ఆ సమయంలో నిబంధనల ప్రకారం ప్రమాణాలు, సౌకర్యాలు లేకుంటే మరిన్ని సీట్లకు కోత పడే అవకాశం ఉంది. కాలేజీల్లో చేరే సంఖ్యకు అనుగుణంగా కాకుండా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపిన సీట్ల సంఖ్య ప్రకారమే ఫ్యాకల్టీని నియమించాలని గురువారం జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయించింది. అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో దానినే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమిస్తామని చెబుతున్న యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది.

మూసివేతకు దరఖాస్తు  చేసుకున్న కాలేజీలివే.. 
అల్‌ హబీబ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, అయాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, జయముఖి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, కృష్ణమూర్తి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్, నిశిత కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, పల్లవి వీఐఎఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రిన్‌స్టన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, విద్యాభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, పీఆర్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజ్, ధ్రువ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, షాజ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కేబీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement