జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూహెచ్)లో ప్రమోషన్ క్రెడిట్స్ పెంపు అంశం దుమారం రేపుతోంది.
- జేఎన్‌టీయూహెచ్‌లో ‘క్రెడిట్స్’ పెంపు రిజిస్ట్రార్ ఏకపక్ష నిర్ణయమే
- వెల్లువెత్తుతున్న ఆరోపణలు
- ‘సాక్షి’ కథనంతో దుమారం..
సాక్షి, హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూహెచ్)లో ప్రమోషన్ క్రెడిట్స్ పెంపు అంశం దుమారం రేపుతోంది. వర్సిటీ అధికారులు అర్ధంతరంగా క్రెడిట్స్ పెంచడంతో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ‘విద్యార్థులపై క్రెడిట్స్ పిడుగు’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అధికారుల నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే పరి స్థితి ఏర్పడటంతో ఈ కథనం యూనివర్సిటీలో చర్చనీయాం శంగా మారింది. రిజిస్ట్రార్ ఏకపక్ష నిర్ణయంతోనే ఈ దుస్థితి దాపురించిందని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
వర్సిటీ లో కిందిస్థాయి అధికారులు సైతం క్రెడిట్స్ పెంపు పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్‌వీ రమణారావు పదవీ విరమణ తర్వాత రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ యాదయ్య తన మార్క్ ప్రదర్శించాలన్న తహతహతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోధనలో నాణ్యత, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచాలన్న ఉద్దేశం మంచిదే అయినా.. ఉన్నఫళంగా అమలు చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయమై ‘సాక్షి’ రిజిస్ట్రార్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ కాల్‌ని స్వీకరించలేదు.
నేడు సమావేశం.. ధర్నా: ‘సాక్షి’ కథనం నేపథ్యంలో సమస్య వర్సిటీ ఇన్‌చార్జి వీసీ రాజీవ్ ఆచార్య దృష్టికి వెళ్లింది. ఆయన ప్రమోషన్ క్రెడిట్స్ విషయాన్ని ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో క్రెడిట్స్ పెంపుపై చర్చ కోసం గురువారం భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ ఆచార్య, రిజిస్ట్రార్, రెక్టార్, ఇవాల్యూషన్ డెరైక్టర్, అకడమిక్ అండ్ ప్లానింగ్ డెరైక్టర్‌తోపాటు సంబంధిత విభాగాధిపతులు పాల్గొననున్నారు. అటు రిజిస్ట్రార్, వర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత విద్యార్థులు సిద్ధమవుతున్నారు. వర్సిటీ లో గురువారం ధర్నా నిర్వహించేందుకు పిలుపునిచ్చారు.