సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్‌ను తమ సమీపంలోని కాలేజీల్లో చేసుకునేలా వెసులుబాటు కల్పించేందుకు జేఎన్‌టీయూ కసరత్తు చేస్తోంది. కరోనా అదుపులోకి రాకపోవడం, కాలేజీలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులకు పట్టణ ప్రాంతాల్లో 90 శాతం వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం వరకు విద్యార్థుల హాజరు ఉంటోందని గుర్తించింది. గత మూడు రోజులుగా యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపైన చర్చించింది. ఆన్‌లైన్ తరగతుల హాజరు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ప్రత్యామ్నాయ తరగతులను నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించింది. అప్పుడు సెమిస్టర్ పరీ క్షలు నిర్వహించడం సాధ్యం అవుతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా యాజమాన్యాల సంసిద్ధతపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించింది. జేఎన్‌టీయూ పరిధిలోని 180కి పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో సెమిస్టర్‌లో 50 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు.
ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, ప్రథమ సెమిస్టర్‌లో ప్రవేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రథమ సెమిస్టర్ విద్యార్థులు మినహా మిగతా ఐదు సెమిస్టర్ల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అయితే వారంతా ప్రస్తుతం తాము చదువుతున్న కాలేజీలున్న ప్రాంతాల్లో ఉండటం లేదు. కరోనా కారణంగా తమ తమ జిల్లాలు, గ్రామాల్లోనే ఉంటున్నారు. అక్కడే ఉండి ఆన్‌లైన్ తరగతులను వింటున్నారు. వారందరికీ వచ్చే ఒకటీ రెండు నెలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పాఠ్యాంశాల బోధన ఏ మేరకు పూర్తయిందన్న దానిపైనా యాజమాన్యాలతో సమీక్షించింది. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సిలబస్ బాగానే అయినా, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సగమే అయినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్లో అదనపు తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని యాజమాన్యాలను ఆదేశించింది. ఇక విద్యార్థులు తమ కాలేజీలకు వెళ్లి పరీక్షలు రాయడం, ప్రాక్టికల్స్ చేయడం వంటివి లేకుండా, వారికి సమీపంలో ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. షెడ్యూలు జారీ చేసిన వెంటనే విద్యార్థులు తమకు సమీపంలోని కాలేజీ వివరాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి ఆయా కాలేజీల్లో సెమిస్టర్ పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment