కోర్టు ఆదేశంతో పెరిగిన 7 వేల ఇంజనీరింగ్ సీట్లు
సీట్ల పెంపును మొదటి నుంచీ వ్యతిరేకించిన ప్రభుత్వం
కోర్టు తీర్పు తర్వాత కూడాగుర్తించకుండా నాన్చవేత
సర్కారు జీవో ఇస్తేనే అనుమతిస్తామంటున్న జేఎన్‌టీయూహెచ్
డోలాయమానంలో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశంతో పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో పెరిగిన 7 వేల సీట్లపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. నిబంధనల మేరకే ఉన్నందున పెరిగిన సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని హై కోర్టు ఆదేశించిన తర్వాత కూడా ప్రభుత్వం అందుకోసం జీవో ఇవ్వకపోవటంతో విద్యార్థులు, సీట్లు పెంచుకొన్న కాలేజీల యాజమాన్యాలు డోలాయమాన స్థితిలో పడ్డాయి.
ప్రభుత్వం జీవో ఇస్తేనే పెరిగిన సీట్ల భర్తీకి అనుమతి ఇస్తామని జేఎన్‌టీయూహెచ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే విద్యా సంవత్సరం దాదాపు సగం పూర్తి కావటంతో పెరిగిన సీట్ల భర్తీ ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొన్నది. ఈ సీట్లలో ఇప్పటికే 450 మంది వరకు విద్యార్థులు చేరిపోయారు. ఇప్పుడు ఈ సీట్లకు అనుమతి ఇవ్వకపోతే ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎడతెగని పంచాయితీ..: రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు బాగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసుకోగా.. జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీట్ల పెంపునకు ససేమిరా అనటంతో ఆ కాలేజీలు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో ఆ 7 వేల సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
అయితే అప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయింది. దీంతో కాలేజీలే ఈ సీట్ల భర్తీ చేపట్టి 450 సీట్లు భర్తీ చేశాయి. ఈ సీట్లను ఉన్నత విద్యా మండలి ర్యాటిఫై చేయాలి. దీనికన్నా ముందు పెరిగిన సీట్లకు జేఎన్‌టీయూహెచ్ అనుమతివ్వాలి. ఈ ప్రక్రియ ఇంత వరకూ పూర్తవ్వలేదు. ప్రభుత్వం జీవో ఇస్తే తప్ప తాము అనుమతివ్వలేమని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పటికే చేరిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి.
వచ్చే ఏడాది అయినా పెరిగిన 7 వేల సీట్లు కౌన్సిలింగ్ పరిధిలోకి వస్తాయా? రావా? అనే సందిగ్ధత నెలకొంది. వీటిలో 4,900 సీట్లు కనీ్వనర్ కోటా కింద భర్తీ చేసే వీలుంది. మెరిట్ విద్యార్థులకు పెరిగిన సీట్లు మేలు చేస్తాయి. యాజమాన్య కోటా సీట్లు కూడా ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేస్తామని చెబుతోంది. కాబట్టి పెరిగిన సీట్లపై ప్రభుత్వం జీవో విడుదల చేయకపోతే వచ్చే ఏడాది కౌన్సిలింగ్‌కు సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment