
పాత పద్ధతిలోనే ప్రమోషన్ క్రెడిట్స్
- పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న జేఎన్‌టీయూహెచ్
- ‘సాక్షి’ కథనంతో స్పందన..
సాక్షి, హైదరాబాద్: వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేసిన ప్రమోషన్ క్రెడిట్స్ అంశంపై జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్(జేఎన్‌టీయూహెచ్) వెనక్కి తగ్గింది. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు గతంలో ఉన్న ప్రమోషన్ క్రెడిట్స్ విధానాన్నే అమలు చేస్తామని గురువారం వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు మూడు నుంచి నాలుగో సంవత్సరంలోకి ప్రమోట్ కావడానికి అవసరమైన క్రెడిట్స్‌ని పెంచుతూ కొద్దిరోజుల క్రితం అధికారులు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.
దీనిపై ఈ నెల 23న ‘సాక్షి’లో ‘విద్యార్థులపై క్రెడిట్స్ పిడుగు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో స్పందించిన ఇన్‌చార్జి వీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం వర్సిటీలో అకడమిక్ సెనేట్ భేటీ అయింది. రిజిస్ట్రార్, ఎవాల్యుయేషన్, అకడమిక్ అండ్ ప్లానింగ్ డెరైక్టర్లు, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు జరిగిన సమావేశంలో క్రెడిట్స్ పెంపు, దీని ప్రభావం, అందుకు దారితీసిన అంశాలపై అధికారులను అడిగి ఇన్‌చార్జి వీసీ తెలుసుకున్నారు. ‘సాక్షి’ కథనం వాస్తవానికి అద్దం పట్టిందని, వేల మంది విద్యార్థులు డిటెన్షన్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఇన్‌చార్జి వీసీకి వివరించారు.
ఈ నేపథ్యంలో క్రెడిట్స్ పెంపు సమంజసం కాదని.. పాత విధానాన్నే అవలంబించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సమావేశం అనంతరం రిజిస్ట్రార్ యాదయ్య మాట్లాడుతూ.. క్రెడిట్స్ పెంపును విరమించుకుంటున్నామని, గత ఏడాది వరకు అమలైన క్రెడిట్స్ విధానాన్నే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకూ క్రెడిట్స్ అర్హతలో కొంత మినహాయింపు ఇచ్చారు. దీంతో డిటెన్షన్‌కు గురవుతామని ఆందోళన చెందిన విద్యార్థులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు ఈ నెల 25తో పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ గడువును అక్టోబర్ ఒకటి వరకు పొడిగించారు.