సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): జేఎన్‌టీయూహెచ్‌లో విద్యార్థి సంఘాల నడుమ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణ గురువారం బహిర్గతమైంది. బుధవారం రాత్రి మెటలర్జీ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని ఏబీవీపీ నాయకులు క్యాంటీన్ వద్దకు పిలిచి దాడి చేశారని, గురువారం ఉదయం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో సదరు ర్యాలీలో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు పాల్గొన్నారని, బయటి వ్యక్తులను ఎలా రానిస్తారంటూ ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల నడుమ మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొంది.
అప్పటికే ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు సంఘాల నాయకులు ఘర్షణ పడకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఏబీవీపీ నాయకులు అక్కడి కొన్ని జెండాలను తొలగించి దగ్ధం చేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన మఫ్టీ పోలీసును తోసేశారు. దీంతో అప్పటికే అక్కడే ఉన్న ఇతర పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు. అక్కడి విద్యార్థులను జీపుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ఘర్షణలో కొందరు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘర్షణకు కారమైన విద్యార్థి నాయకులు, విద్యార్థులపై కేసులు నమోదు చేస్తామని, మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని సీఐ కిషన్‌కుమార్ తెలిపారు.
దాడిని ఖండిస్తూ ర్యాలీ...
బుధవారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ జేఏసీ నాయకులు యూనివర్సిటీలోని అన్ని కళాశాల ముందు నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా వీసీ లేకపోవడంతో రిజిస్ట్రార్‌కు, ఓఎస్‌డీకి వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. కాగా విద్యార్థులను నడుమ సఖ్యతను పెంచి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తోడ్పడాల్సిన విద్యార్థి సంఘాల వ్యవహారాలను చూసే అధికారి పేరుతోనే విద్యార్థులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురు విద్యార్ధులు బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం యూనివర్సిటీ ఉన్నతాధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతుండటం గమనార్హం. (క్లిక్: ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment