ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న లింబాద్రి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మా, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే నెలలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) శుక్రవారం విడుదల చేసింది. వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్ దరఖాస్తులను వచ్చే నెల 3 నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్ 10లోగా అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లు (కర్నూలు విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు) ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్ ప్రక్రియ పూర్తయ్యేలోగానే అనుబంధ కాలేజీలకు అఫ్లియేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈసారి నర్సింగ్ కూడా..
నర్సింగ్ కోర్సుల సీట్లను కూడా ఈసారి ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వర్సిటీ నుంచి అనుమతి వచ్చిందన్నారు. ఎంసెట్‌కు ఇంటర్‌లో (జనరల్ 45 శాతం, రిజర్వేషన్ కేటగిరీకి 40 శాతం) కనీస మార్కులు సాధించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ తొలగించినట్టు ప్రకటించారు.
వెయిటేజీ విధానం కష్టసాధ్యమవ్వడం, జాతీయ పరీక్షల్లోనూ దీన్ని అనుసరించకపోవడంతో తీసివేశామన్నారు. ఫస్టియర్ ఇంటర్ నుంచి 70 శాతం, సెకండి యర్ నుంచి వంద శాతం సిలబస్ ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డా.శ్రీనివాస్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం https://eamcet. tsche. ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment