common Entrance test
-
‘సెట్’ చేసేశారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం నిర్వహించిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) నిధులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. వీసీలు మారడంతో సెట్ కన్వీనర్లపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులొస్తున్నాయి. ‘సెట్’కు కేటాయించిన నిధులు కన్వినర్లు, ఆయా యూనివర్సిటీ వీసీలు అడ్డగోలు లెక్కలతో కాజేశారని పెద్దఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ వ్యవహారం ఇప్పటికే తీవ్ర వివాదంగా మారింది. జేఎన్టీయూహెచ్ నేతృత్వంలో సాగిన ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై మండలి చైర్మన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవాలు తెలియజేయాలని కొత్త వీసీలను కోరారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపాలని చైర్మన్ భావిస్తున్నట్టు తెలిసింది. అసలేం జరిగింది? రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏటా ఈఏపీ, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పాలిసెట్, పీజీసెట్ నిర్వహిస్తారు. వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెట్ నిర్వహణను ఒక్కో వర్సిటీకి అప్పగిస్తారు. ప్రతీ సెట్‌కు ఒక కన్వీనర్, కొంతమంది సభ్యులను ఎంపిక చేస్తారు. అతిపెద్ద సెట్ అయిన ఈఏపీ సెట్‌ను సాధారణంగా జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది. మరికొన్ని కీలకమైన సెట్స్‌ను ఉస్మానియా వర్సిటీకి అప్పగిస్తారు. ఐసెట్‌ను కొన్నేళ్లుగా కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. సెట్ రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత విద్యామండలి కాన్ఫిడెన్షియల్ నిధులు ఇస్తుంది. సెట్ ప్రశ్నపత్రం కూర్పు, ప్రింటింగ్, రవాణా, నిర్వహణకు వీటిని ఉపయోగిస్తారు. ఈ వ్యవహారం మొత్తం రహస్యంగా ఉంటుంది. కాబట్టి ఏ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నారనేది ముందే చెప్పరు. పరీక్ష పూర్తయిన తర్వాత బిల్లులు పెట్టడం, ఆడిట్ నిర్వహించి, వాటిని ఉన్నత విద్యా మండలి అనుమతించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధం లేని వ్యక్తులు, ఊహించని విధంగా కంప్యూటర్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లు చేపట్టినట్టు బిల్లులు ఉండటంతో కొత్త వీసీలు సందేహాలు లేవనెత్తుతున్నారు. ఐసెట్ నిధులు గందరగోళం కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ నిధుల లెక్కలపై ప్రస్తుత వీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్టు సమాచారం. దీనిపై అందిన ఫిర్యాదులను మండలి చైర్మన్‌కు పంపినట్టు తెలిసింది. ఐసెట్ నిర్వహణ కోసం ఈ వర్సిటీ రూ.99.50 లక్షలు ప్రతిపాదించగా, మండలి రూ. 92.76 లక్షలు మంజూరైంది. ఈ నిధులను కన్వినర్ ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకూ ఖర్చు చేసినట్టు గుర్తించారు. దాదాపు రూ.16 లక్షలు సెల్ఫ్ చెక్కుల ద్వారానే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని మండలి వర్గాలు సందేహిస్తున్నాయి. సంబంధమే లేని ఓ వ్యక్తికి రూ.2 లక్షలు ఇవ్వడం, అవసరం లేని రవాణాకు రూ. 40 వేలు వెచ్చించడం, కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చిన్న ఉద్యోగి ఖాతాలో నగదు జమవ్వడం, ఏ సంబంధం లేని మహిళకు రూ.82 వేలు వెళ్లడం, సరైన ప్రమాణాలు లేకున్నా రూ.87 వేల చొప్పున 6 కంప్యూటర్లు కొనడం అనుమానాలకు తావిస్తోంది.ఇందులో రూ.29 లక్షల వరకూ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈఏపీసెట్ నిర్వహణ నిధుల విషయంలోనూ పలు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో మండలి వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు రూ.3 కోట్లు వెచ్చించారు. పరిశీలిస్తున్నాంకాకతీయ నిర్వహించిన ఐసెట్పై ఆరోపణలు వచ్చిన మాట నిజమే. ఇందులో వాస్తవాలు ఏమిటనేది పరిశీలిస్తున్నాం. ఇతర సెట్ల విషయంలోనూ ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఏం జరిగిందనేది వెల్లడిస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
మే 13 నుంచి ఏపీఈఏపీ సెట్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్టు (సెట్)ల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు 9 రకాల సెట్స్‌ను నిర్వహించనుంది. ఆయా వర్సిటీలకు ఒక్కో సెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ కన్వీనర్లను నియమించింది. త్వరలోనే సెట్స్ కమిటీలతో సమావేశం నిర్వహించి దశలవారీగా ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులకు మేలుచేస్తూ ఎంసెట్ స్థానంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ టెస్టు (ఈఏపీసెట్) నిర్వహిస్తున్నారు. ఈ విధానం సత్ఫలితాలివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది నుంచి అక్కడి ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చింది. గతంలో పీజీ ప్రవేశాలకు వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు వచ్చేవి. విద్యార్థి వర్సిటీలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఫలితంగా పేద విద్యార్థులపై ఆర్థికభారం ఎక్కువయ్యేది. దీన్ని గమనించిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఒకే ఎంట్రన్స్ టెస్టును తీసుకొచ్చింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా వర్సిటీల్లో సీట్లు భర్తీచేస్తోంది. దీంతో ప్రతిభగల విద్యార్థికి ఏ వర్సిటీలోనైనా చదువుకునే అవకాశం దక్కుతోంది. -
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మా, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే నెలలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) శుక్రవారం విడుదల చేసింది. వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో ఎంసెట్ దరఖాస్తులను వచ్చే నెల 3 నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్ 10లోగా అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లు (కర్నూలు విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు) ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్ ప్రక్రియ పూర్తయ్యేలోగానే అనుబంధ కాలేజీలకు అఫ్లియేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈసారి నర్సింగ్ కూడా.. నర్సింగ్ కోర్సుల సీట్లను కూడా ఈసారి ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వర్సిటీ నుంచి అనుమతి వచ్చిందన్నారు. ఎంసెట్‌కు ఇంటర్లో (జనరల్ 45 శాతం, రిజర్వేషన్ కేటగిరీకి 40 శాతం) కనీస మార్కులు సాధించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ తొలగించినట్టు ప్రకటించారు. వెయిటేజీ విధానం కష్టసాధ్యమవ్వడం, జాతీయ పరీక్షల్లోనూ దీన్ని అనుసరించకపోవడంతో తీసివేశామన్నారు. ఫస్టియర్ ఇంటర్ నుంచి 70 శాతం, సెకండి యర్ నుంచి వంద శాతం సిలబస్ ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డా.శ్రీనివాస్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం https://eamcet. tsche. ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు. -
మేథ్స్‌లో తిప్పలు... కెమిస్ట్రీలో స్కోర్..
సాక్షి, హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్) తొలి రోజు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలంగాణలో 1.5 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. రాష్ట్రంలోని 17 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. మంగళవారం ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువ భాగం క్రితం సంవత్సరాల్లో ఇచ్చిన ప్రశ్నలు వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే గణితంలో ఇచ్చిన ప్రశ్నలు కష్టంగానే ఉన్నట్టు చెప్పారు. ఫిజిక్స్ మధ్యస్తంగా ఉందని, కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసే వీలుందని తెలిపారు. పూర్తిగా ఆన్లైన్ మోడ్‌లో జరిగిన ఈ పరీక్షలో మేథ్స్ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందన్నారు. రీజనింగ్ ఈజీనే... మేథమెటిక్స్‌లో కొన్ని బేసిక్ ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగారు. అయితే చాలా ప్రశ్న లకు సుదీర్ఘంగా విశ్లేషించక తప్పలేదని చెప్పారు. త్రీడీ, వెక్టర్‌ఆల్‌జీబ్రా, మేథమెటికల్ రీజనింగ్ ప్రశ్న లకు కష్టపడకుండా సమాధానాలు ఇవ్వగలి గారు. ఫిజిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు సెమీ కండక్టర్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, మ్యాగ్నటిజం, మోడ్రన్ ఫిజిక్స్, ఈఎంఐ, ఫిక్షన్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఏసీ కరెంట్ నుంచి వచ్చాయి. థియరీ ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ఇచ్చారు. కెమిస్ట్రీలో ఎన్సీఈఆర్టీ పుస్తకా లు అనుసరించిన వారికి పేపర్ తేలికగానే ఉన్నట్టు కెమిస్ట్రీ అధ్యాపకులు చెబుతున్నారు. ఆర్గా నిక్, ఇన్ ఆర్గానిక్, కెమికల్ కైనటిక్స్, గ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు, కెమికల్ బాండింగ్ ప్రశ్నలు తేలికగానే సమాధానా లిచ్చే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. -
యూజీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు. జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. సోమవారం ఆయన వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్ తప్పనిసరి అని, ఈ ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించినట్టు వివరించారు. ఈ పరీక్షకు క్లాస్–12 ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి సిలబస్ ఉంటుందని జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండబోదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. సీయూఈటీతో ప్రయోజనాలు అధిక కట్-ఆఫ్‌ల ఒత్తిడి నుంచి విద్యార్థులకు సీయూఈటీతో ఉపశమనం కలగనుంది. అంతేకాదు తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గుతుంది. వర్సిటీకో ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆమేరకు వ్యయప్రయాసలు తప్పుతాయి. అయితే సీయూఈటీపై విద్యావేత్తలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్య ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఎలా ఉంటుంది? సీయూఈటీ అనేది మూడున్నర గంటల పాటు జరిగే కంప్యూటరైజ్జ్ మల్టిఫుల్ చాయిస్ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది అభ్యర్థులు ఎంచుకున్న భాషలో వారి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్ వంటి అదనపు భాషలలో మరొక ఐచ్చిక పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో అభ్యర్థులు ప్రామాణిక సబ్జెక్ట్‌లు ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న 27 సబ్జెక్టుల్లో కనీసం ఒకటి, గరిష్టంగా ఆరు ఎంచుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లోని రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం.. కామర్స్ నుంచి అకౌంట్స్ లేదా బిజినెస్.. హ్యుమానిటీస్ నుంచి సైకాలజీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. మూడవ విభాగంలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సహా సాధారణ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్దిష్ట పరీక్షలు అవసరం కావచ్చు. కొన్నింటికి భాష, సాధారణ సామర్థ్య పరీక్షలు రాస్తే సరిపోతుంది. (క్లిక్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల) రిజర్వేషన్ ప్రస్తుతం ఉన్న అడ్మిషన్, రిజర్వేషన్ విధానాన్ని సీయూఈటీ ప్రభావితం చేయదు. విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా పాత పద్ధతిలోనే జనరల్, రిజర్వేషన్ సీట్లు భర్తీ చేస్తాయి. మైనారిటీ విద్యార్థుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసే జేఎంఐ, ఏఎంయూ కాలేజీల రిజర్వేషన్ విధానాలను సీయూఈటీ ప్రభావితం చేయదు. అయితే, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశ అర్హత సాధించాలంటే విద్యార్థులందరూ తప్పనిసరిగా సీయూఈటీ రాయాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు మినహాయింపు విదేశీ విద్యార్థులకు సీయూఈటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు వారికి ప్రవేశం కల్పిస్తాయి. సంగీతం, ఫైన్ ఆర్ట్స్, థియేటర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ప్రాక్టికల్, ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతిస్తుంది. నీట్, జేఈఈ పరీక్షలకు సీయూఈటీ వర్తించదు. సీయూఈటీ స్కోర్ వాడుకోవచ్చు 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సులు చదవాలంటే సీయూఈటీ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడే సంస్థలు.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్లను ఉపయోగించుకోవచ్చు. -
ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల
-
AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీ పీజీసెట్ ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు. తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే పీజీ సెట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించాం. ఆన్లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించాము. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారు. పీజీ సెట్లో 87.62 శాతం మంది అర్హత సాధించారు. చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులకి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చు. ఉన్నత విద్యలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ప్రవేశపరీక్షలలో ఎటువంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా కట్డుదిట్టంగా విజయవంతంగా నిర్వహించాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అదే జరిగితే పీహెచ్‌సీల్లో డాక్టర్లు కనిపించరు!
నీట్ ఎగ్జామ్‌ను గనుక కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు కనిపించరని ఆందోళన వ్యక్తం చేశారు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, విద్యావేత్త ఏకే రాజన్. నీట్ పరీక్ష-ప్రజాభిప్రాయసేకరణ కోసం రాజన్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను సమర్పించింది కూడా. చెన్నై: ‘నీట్ వల్ల పేదలకు ఇబ్బందులే ఎదురవుతాయి. ఉన్నత వర్గాలకు చెందినవాళ్లే ఎక్కువ సీట్లను దక్కించుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు స్థానికులకు వైద్య విద్య దక్కదు. బాగా డబ్బున్నవాళ్లు మారుమూల పల్లెల్లో వైద్య సేవలను అందించేందుకు ముందుకొస్తారా? విదేశాలకు వెళ్లడానికి, వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికే ఇష్టపడతారు. అప్పుడు పీహెచ్‌సీలు ఖాళీగా ఉంటాయి. వైద్యం అందక పేదల ప్రాణాల మీదకు వస్తుంది’అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రాజన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలేవీ నీట్‌ను వ్యతిరేకించట్లేదని, కానీ, త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా తమిళనాడు బాటలోనే డిమాండ్ వినిపిస్తాయని, ‘హిందీ తప్పనిసరి’ ఆదేశాల విషయంలో జరిగిందే నీట్ విషయంలోనూ జరగొచ్చని రంజన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 86 వేల మంది నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిశీలనలోకి తీసుకుని.. మరికొందరితో మాట్లాడి, విద్యావేత్తలతో చర్చించాకే ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు రాజన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన తప్పనిసరి ఎగ్జామ్ నీట్ వల్ల వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంత పిల్లలకు వైద్య విద్యలో అవకాశాలు దక్కవని, సిలబస్ సమస్యతో పాటు కోచింగ్ లాంటి వాటితో ఆర్థిక భారం పడుతుందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావిస్తూ రాజన్ కమిటీ తన ప్రాథమిక రిపోర్ట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. అందరికీ సమాన హక్కులు దక్కనప్పుడు.. అడ్డుగా ఉన్న నిబంధనలను(నీట్) మార్చాల్సిన అవసరం ఉంటుందని రాజన్ అంటున్నారు కూడా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ వల్ల విద్యార్థులకు సామాజిక న్యాయం దక్కదనే అంశంపై పార్టీలకతీతంగా తమిళనాడు నుంచి పరీక్ష రద్దు డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్‌కు పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతుండడం విశేషం. అయితే ఇవేం పట్టించుకోని కేంద్రం నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘స్కూళ్లు, కాలేజీలు మూసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలె ప్రధాని మోదీని కోరారు. ఇంకోవైపు విద్యార్థులు కూడా అక్టోబర్ వరకు ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ట్విటర్లో ట్రెండ్ కొనసాగిస్తున్నారు. -
ఏపీ బీజీ ఇంటర్ సెట్–2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్).. 2021–2022 విద్యాసంవత్సరానికి 164 సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీలు, మూడు ఐఐటీ మెడికల్ అకాడెమీస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిం ది. బాలయోగి గురుకులం ఇంటర్మీడియెట్ కామన్ ఎం ట్రెన్స్ టెస్ట్(బీజీ ఇంటర్ సెట్–2021) ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ► ఏపీఎస్‌డబ్ల్యూఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు 2021–22. ► అర్హతలు: 2021 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బీజీ ఇంటర్ సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ► వయసు: 31.08.2021 నాటికి 17 ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక ఏడాది సడలింపు లభిస్తుంది. ∙విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: 2021–22 బీజీ ఇంటర్ సెట్లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, ఫిజికల్ సైన్స్ 15 ప్రశ్నలు, బయోసైన్స్ 15 ప్రశ్నలు, సోషల్ సైన్స్ 15 ప్రశ్నలు, ఇంగ్లిష్(కాంప్రెహెన్షన్ అండ్ గ్రామర్) 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ► ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే ఇందులో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ► ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఐఐటీ–మెడికల్ అకాడెమీస్ పరీక్ష ఐఐటీ–మెడికల్ అకాడెమీస్‌ను ఎంచుకొని.. బీజీ ఇంటర్ సెట్లో మెరిట్లో నిలిచిన విద్యార్థులకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు:ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2021 ► పరీక్షా తేదీ: త్వరలో వెల్లడిస్తారు ► వెబ్సైట్: https://apgpcet.apcfss.in/Inter చదవండి: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్ -
ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్ పరీక్షలపై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లతో పాటు చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని పిటిషనర్లు కోరగా, కోర్టు పరీక్షలు వాయిదా వేయగలదు.. కానీ, రద్దు చేయలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్-20కి సంబంధించి ఇటీవలే రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భేటీ అయిన అధికారులు ఈ మేరకు తేదీలను నిర్ణయించారు. తాజాగా ఈ తేదీలను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఆదివారం టీఎస్సీహెచ్ఈ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏడు ఎంట్రన్స్ టెస్ట్‌లకు సంబంధించి ఇందులో షెడ్యూల్ ఉంది. ఈ నెల 31న టీఎస్ఈసెట్-20 పరీక్ష జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 14 తేదీ వరకూ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 4లోగా ఈ ప్రవేశ పరీక్షలు పూర్తి కానున్నాయి. ఈ ఏడాది ఏడు ప్రవేశ పరీక్షలకు తెలంగాణ, ఏపీల నుంచి దాదాపు 4 లక్షలమంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
రాష్ట్రమంతా పీజీకి ఒకే ఎంట్రన్స్ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యు యేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ) నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ చాన్స్లర్ల (వీసీలు) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం లోని 6 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు వేర్వేరుగా పీజీ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో ప్రవేశాలకు కేయూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుండగా..తెలంగాణ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఉస్మానియా వర్సిటీయే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులకు ఆర్థిక భారంతోపాటు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా రెండు యూనివర్సిటీలపైనా నిర్వహణ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఒకే పీజీ ఎంట్రెన్స్ నిర్వహించాలన్న ఆలోచనన ఎప్పటినుంచో ఉన్నత విద్యామండలి మదిలో ఉంది. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి అన్ని వర్సిటీల వీసీల ఆమోదముద్ర పడింది. రానున్న విద్యా సంవత్సరంలో (2019–20) ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే పరీక్షను నిర్వహించే బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్షకు చైర్మన్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రంను నియమించారు. కమిటీలో మిగతా వర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణను నియమించారు. ఎంట్రెన్స్ టెస్టు కన్వీనర్‌ను నియమించే బాధ్యతను ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రంకు అప్పగించారు. -
మే 3 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్)లకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్ఈ) తేదీలను ఖరారు చేసింది. సెట్ల పరీక్షల సమయంతోపాటు వాటిని నిర్వహించే యూనివర్సిటీలను పేర్కొంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. సెట్ల నిర్వహణ యూనివర్సిటీల నుంచి కన్వీనర్ల నియామకం కోసం ముగ్గురు చొప్పున పేర్లు పంపించాలని సోమవారం ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాయనుంది. వర్సిటీలు పంపించే మూడేసి పేర్లలో ఒకరి పేరును ఖరారు చేసి సెట్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించనుంది. కన్వీనర్ల నియామకం పూర్తయిన వెంటనే సెట్లవారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మే 3 నుంచి 9 వరకు వరుసగా ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. తొలుత ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నిర్వహించిన తర్వాత అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. టీఎస్ పీఈసెట్ మినహా మిగతా అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే జరుగుతాయి. టీఎస్ పీఈసెట్ మాత్రం శారీరక దృఢత్వం, నైపుణ్యాల ఆధారంగా నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. -
తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలి..
సాక్షి, హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకై దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు రూ.3 కోట్లు ఖర్చుపెట్టి 26 కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతియేడు ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో కార్పొరేట్ కాలేజీల కన్నా ప్రభుత్వ కళాశాలలు ముందున్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రహించాలని అన్నారు. కార్పొరేట్ చదువుల మోజులో పడి డబ్బుని, విద్యార్థుల విలువైన సమయాన్ని వృథా చేయొద్దని కడియం శ్రీహరి సూచించారు. తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారినపుడే విద్య కార్పొరేట్ మయం కాకుండా అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.కార్పొరేట్ కాలేజీల్లో ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలపై చర్యలు తీస్కోండని విద్యార్థులు సమాచారం ఇస్తున్నారనీ.. అయితే ఆయా కళాశాలలపై విద్యాశాఖ చర్యలు ప్రారంభించిన వెంటనే యాజమాన్యాలు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నాయని అన్నారు. అన్ని కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించామని, కోచింగ్‌ల పేరిట ఎవరైన వేసవిలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్టుల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల షెడ్యూల్‌ని గురువారం విడుదల చేసింది. వచ్చే సంవత్సరం మే 2 నుంచి మే 5 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 25న లాసెట్, మే 31న ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. -
అంతా ‘సెట్’రైట్
* పది రోజుల్లో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు * ఇంటర్ బోర్డు ఏర్పాటుతో మార్గం సుగమం * పలు ‘సెట్’ల నిర్వహణ తేదీలపై దృష్టిపెట్టిన ఉన్నత విద్యాశాఖ * ఉన్నత విద్యా మండలి, వర్సిటీలతో ఉన్నతస్థాయి భేటీకి ఏర్పాట్లు * 15 శాతం సీట్లకు ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం * తెలంగాణ సెట్స్ రాసిన వారికే మెరిట్‌ను బట్టి అడ్మిషన్లు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటుతో తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు(సెట్స్) మార్గం సుగమమైంది. ఇంటర్ పరీక్షల వ్యవహారం ఇన్నాళ్లూ తేలకపోవడంతో ఈ నెల తొలి వారంలో ప్రకటించాల్సిన సెట్స్ నిర్వహణ తేదీలు ఖరారు కాలేదు. ప్రస్తుతం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకోవడంతో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలపై ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో సొంతంగానే సెట్స్‌ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో పది రోజుల్లో ఆయా పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీటెక్, ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ను, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ను, ఎంటెక్, ఎంఫార్మసీ కోసం పీజీఈసెట్‌ను, న్యాయ విద్యలో ప్రవేశాలకు లాసెట్‌ను, బీఎడ్‌లో చేరడానికి ఎడ్‌సెట్‌ను, డిప్లొమా విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు(లేటరల్ ఎంట్రీ) ఈసెట్‌ను, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం పీఈసెట్‌ను నిర్వహించేందుకు తేదీలను అధికారులు ప్రకటించనున్నారు. త్వరలో ఉన్నతస్థాయి సమావేశం సెట్స్ తేదీల ఖరారుపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. సెట్స్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై యూనివర్సిటీ వర్గాలతో చర్చించి అధికారులు సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించాలని వారు భావిస్తున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో అనుభవమున్న జేఎన్టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలకు కీలక సెట్స్ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. కొత్త వర్సిటీలైన పాలమూరు, తెలంగాణ, మహత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలకు తక్కువ మంది విద్యార్థులు పోటీ పడే సెట్స్‌ను నిర్వహించే బాధ్యతలను అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత పదేళ్లుగా ఎంసెట్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్ జేఎన్టీయూకే ఈసారి కూడా బాధ్యతలను అప్పగించనున్నారు. ఐసెట్ నిర్వహణను కూడా దానికే అప్పగించనున్నారు. కాకతీయ వర్సిటీకి లాసెట్, ఉస్మానియాకు పీజీఈసెట్, ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు విషయంలో విభజన చట్టం ప్రకారం నడుచుకుంటామని అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కోటాలో 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులు ఇకపై తెలంగాణలోని విద్యా సంస్థల్లో చేరాలంటే టీ సర్కార్ నిర్వహించే ప్రవేశ పరీక్షలను రాయాలి. కాగా, ఎంసెట్ తుదిర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకిచ్చే 25 శాతం వెయిటేజీ విషయంలోనూ సమస్య ఉండబోదని అధికారులు అంటున్నారు. ఓపెన్ కోటాలో తెలంగాణలోని విద్యా సంస్థల్లో చేరగోరే విద్యార్థులు ఏపీలో ఇంటర్ చదివితే అక్కడ సాధించిన ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకును ఖరారు చేస్తామంటున్నారు. ఆ ర్యాంకు ఆధారంగానే ఓపెన్ కోటా ను భర్తీ చేసి ఉమ్మడి ప్రవేశాల స్పూర్తిని కొనసాగిస్తామంటున్నారు. దీనిపై అనుమానాలుంటే జేఈఈ మెయిన్‌లో అవలంభించే పర్సంటైల్ విధానాన్ని ఇక్క డా అమలు చేస్తామని గతంలోనే టీ సర్కార్ స్పష్టం చేసింది. మరోవైపు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ వంటి జాతీయస్థాయి పోటీపరీక్షల్లో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారు కనక ఏ రాష్ర్టం విద్యార్థులకైనా నష్టం ఉండదని అధికారులు భావిస్తున్నారు. -
సెట్స్ షెడ్యూల్‌కు చర్యలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌కు సంబంధించిన పనులు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలిని విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. సోమవారం సచివాలయంలో మంత్రితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల వ్యవహారంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. పదో షెడ్యూల్లో ఉన్న మండలి విభజనలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని టీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఏపీ ఉన్నత విద్యామండలి విభ జనకు అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. పదేళ్లపాటు 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశాల విధానం అయినందున పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలా? కలిపి నిర్వహిద్దామా? అనేది తరువాత తేల్చుకుందామని, ముందుగా తెలంగాణలో షెడ్యూలుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. -
సెట్ల కాలం
సాక్షి, నల్లగొండ, టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ముగిశాయి. మరోవైపు ప్రభుత్వం వివిధ ‘సెట్’లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, డైట్‌సెట్, ఎడ్‌సెట్,లాసెట్, పీజీఈ సెట్, పీఈ సెట్, పాలిసెట్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. దీంతో విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లపై దృష్టిసారించారు. ఎంట్రెన్స్లలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. వివిధ సెట్లను ఒకసారి పరిశీలిస్తే.. - ఉన్నత విద్యాభ్యాసానికి వరుస ‘ఎంట్రెన్స్’లు - సమాయత్తమవుతున్న విద్యార్థులు - కోచింగ్ సెంటర్లవైపు పరుగులు కోచింగ్ సెంటర్లు ప్రారంభం జిల్లాలో నల్లగొండ పట్టణంతో పాటు సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి పట్టణాల్లో కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లు విద్యార్థులతో సందడిగా మారాయి. విద్యార్థులు సైతం మంచి ర్యాంకు సాధించాలన్న తలంపుతో కృషి చేస్తున్నారు. ఐసెట్ ఈ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏలలో అడ్మిషన్ పొందవచ్చు. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సు చేయడానికి అనేకమంది ఆసక్తి చూపుతున్నారు. రెగ్యులర్‌గా తరగతులకు వెళ్లి విద్యన భ్యసిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యావేత్తలంటున్నారు. ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ నెల 23న పరీక్ష నిర్వహించనుంది. జూన్ 9న ఫలితాలు వెల్లడించనుంది. లాసెట్.. న్యాయవాద వృత్తిలో ఆసక్తి ఉన్నవారు రాసే ఈ ప్రవేశ పరీక్షను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎల్ఎల్బీ మూడు లేదా ఐదేళ్ల కోర్సులో ప్రవేశం పొందవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన మార్చి 4న వెలువడింది. జూన్ 8న పరీక్ష ఉంటుంది. జూన్ 19న ఫలితాలు వెల్లడిస్తారు. పీఈసెట్ ఇది వ్యాయామ విద్యకు సంబంధించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెండు సంవత్సరాల వ్యవధి గల బీపీఈడీ/యూజీడీపీఈడీ కోర్సు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన మార్చి 7న వెలువడింది. ఈ నెల 5న పరీక్ష ఉంటుంది. ఫలితాలు వెల్లడించే తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పీజీఈ సెట్ ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అర్హత సాధించడం ద్వారా రెండేళ్ల వ్యవధి గల ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం.అగ్రికల్చరల్ కోర్సుల్లో చేరే అవకాశముంది. పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) నిర్వహిస్తోంది. పరీక్ష ప్రకటనను ఫిబ్రవరి 28న వెల్లడించింది. ఈనెల 26న పరీక్ష ఉంటుంది. జూన్ 17న ఫలితాలు విడుదల చేస్తారు. ఎడ్‌సెట్ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడానికి మొదటి స్టెప్‌గా ఉండే ఈ కోర్సు వ్యవధి ఏడాది. దీనిని ఈ సంవత్సరం ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మార్చి 5న ప్రకటన వచ్చింది. మే 30న పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 23న ఫలితాలు వెల్లడించనున్నారు. ఎంసెట్ ఈ ఎంట్రెన్స్ రాసి ర్యాంకు సాధించిన వారు ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగ కోర్సులు చేయడానికి అర్హులు. ఈ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదే శ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పక్షాన నిర్వహించనుంది. ఫిబ్రవరి 10న ప్రకటన వచ్చింది. మే 17న పరీక్ష నిర్వహిస్తారు. జూన్2న పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసెట్ ఈ పరీక్ష రాయడానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ(మ్యాథ్స్) చేసినవారు అర్హులు. పరీక్షను జేఎన్టీయూ(కాకినాడ) నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. ఈ నెల 10న పరీక్ష ఉంటుంది. ఇదే నెల 19న ఫలితాలు వెల్లడించనున్నారు. పాలీసెట్ ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ చేయవచ్చు. కోర్సు పూర్తి చేసి ఈసెట్ అర్హత సాధిస్తే ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ఏపీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 6న ప్రకటన చేయగా, ఈనెల 21న పరీక్ష ఉంటుంది. ఫలితాలు జూన్ 6న వెల్లడించనున్నారు. -
మే ఒకటి నుంచి కర్ణాటక సెట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సీఈటీ) మే ఒకటో తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనుంది. కర్ణాటక, కర్ణాటకేతరులు కూడా పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 5లోపు అందించాల్సి ఉంటుంది. హొరనాడు, గడినాడు విద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షలో 50కి కనీసం 12 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అప్పుడే సీఈటీలో సీటుకు అర్హులని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 080-23461575, 23568202, 23564583 లేదా www.kea.kar.nic.in లో సంప్రదించవచ్చని సూచించారు.