సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్టు (సెట్)ల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు 9 రకాల సెట్స్‌ను నిర్వహించనుంది. ఆయా వర్సిటీలకు ఒక్కో సెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ కన్వీనర్లను నియమించింది. త్వరలోనే సెట్స్ కమిటీలతో సమావేశం నిర్వహించి దశలవారీగా ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులకు మేలుచేస్తూ ఎంసెట్ స్థానంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ టెస్టు (ఈఏపీసెట్) నిర్వహిస్తున్నారు. ఈ విధానం సత్ఫలితాలివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది నుంచి అక్కడి ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చింది.
గతంలో పీజీ ప్రవేశాలకు వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు వచ్చేవి. విద్యార్థి వర్సిటీలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఫలితంగా పేద విద్యార్థులపై ఆర్థికభారం ఎక్కువయ్యేది. దీన్ని గమనించిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఒకే ఎంట్రన్స్ టెస్టును తీసుకొచ్చింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా వర్సిటీల్లో సీట్లు భర్తీచేస్తోంది. దీంతో ప్రతిభగల విద్యార్థికి ఏ వర్సిటీలోనైనా చదువుకునే అవకాశం దక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment