యూజీ కోర్సులకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌.. పూర్తి వివరాలు | CUET 2022: What We Know About UGC Common Entrance Test for Undergrad Admissions | Sakshi
Sakshi News home page

కేంద్రీయ వర్సిటీల యూజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష

Published Tue, Mar 22 2022 6:38 PM | Last Updated on Tue, Mar 22 2022 6:57 PM

CUET 2022: What We Know About UGC Common Entrance Test for Undergrad Admissions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. 

సోమవారం ఆయన వర్చువల్‌ విధానంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్‌ తప్పనిసరి అని, ఈ ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించినట్టు వివరించారు. 

ఈ పరీక్షకు క్లాస్‌–12 ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి సిలబస్‌ ఉంటుందని జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండబోదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలు, డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీలు అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. 

సీయూఈటీతో ప్రయోజనాలు
అధిక కట్-ఆఫ్‌ల ఒత్తిడి నుంచి విద్యార్థులకు సీయూఈటీతో ఉపశమనం కలగనుంది. అంతేకాదు తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గుతుంది. వర్సిటీకో ఎంట్రన్స్‌ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆమేరకు వ్యయప్రయాసలు తప్పుతాయి. అయితే సీయూఈటీపై విద్యావేత్తలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్య ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

పరీక్ష ఎలా ఉంటుంది?
సీయూఈటీ అనేది మూడున్నర గంటల పాటు జరిగే కంప్యూటరైజ్జ్‌ మల్టిఫుల్‌ చాయిస్‌ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్ష మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది అభ్యర్థులు ఎంచుకున్న భాషలో వారి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. 

అభ్యర్థులు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్ వంటి అదనపు భాషలలో మరొక ఐచ్చిక పరీక్ష రాయాల్సి ఉంటుంది. 

రెండో విభాగంలో అభ్యర్థులు ప్రామాణిక సబ్జెక్ట్‌లు ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న 27 సబ్జెక్టుల్లో కనీసం ఒకటి, గరిష్టంగా ఆరు ఎంచుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లోని రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం.. కామర్స్‌ నుంచి అకౌంట్స్‌ లేదా బిజినెస్..  హ్యుమానిటీస్ నుంచి సైకాలజీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. 

మూడవ విభాగంలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సహా సాధారణ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్దిష్ట పరీక్షలు అవసరం కావచ్చు. కొన్నింటికి భాష, సాధారణ సామర్థ్య పరీక్షలు రాస్తే సరిపోతుంది. (క్లిక్‌: తెలంగాణ ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల)

రిజర్వేషన్
ప్రస్తుతం ఉన్న అడ్మిషన్, రిజర్వేషన్ విధానాన్ని సీయూఈటీ ప్రభావితం చేయదు. విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా పాత పద్ధతిలోనే జనరల్, రిజర్వేషన్‌ సీట్లు భర్తీ చేస్తాయి. మైనారిటీ విద్యార్థుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసే జేఎంఐ, ఏఎంయూ కాలేజీల రిజర్వేషన్ విధానాలను సీయూఈటీ ప్రభావితం చేయదు. అయితే, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశ అర్హత సాధించాలంటే విద్యార్థులందరూ తప్పనిసరిగా సీయూఈటీ రాయాల్సి ఉంటుంది. 

విదేశీ విద్యార్థులకు మినహాయింపు
విదేశీ విద్యార్థులకు సీయూఈటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు వారికి ప్రవేశం కల్పిస్తాయి. సంగీతం, ఫైన్ ఆర్ట్స్, థియేటర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ప్రాక్టికల్, ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతిస్తుంది. నీట్‌, జేఈఈ పరీక్షలకు సీయూఈటీ వర్తించదు.

సీయూఈటీ స్కోర్‌ వాడుకోవచ్చు
45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సులు చదవాలంటే సీయూఈటీ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడే సంస్థలు.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్‌లను ఉపయోగించుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement