Undergraduate course
-
Parliament Special Session: పార్లమెంట్లో నీట్ రగడ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ) వ్యవహా రం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. నీట్ పరీక్షలో అవినీతి అక్రమాలపై, పేపర్ లీకేజీపై వెంటనే చర్చ చేపట్టాలని శుక్రవారం ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. నినాదాలతో హోరెత్తించాయి. ఇతర వ్యవహారాలు పక్కనపెట్టి నీట్ అభ్యర్థుల భవితవ్యాన్ని కాపాడడంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. తర్వాత చర్చిద్దామని సభాపతులు కోరినన్పటికీ ప్రతిపక్ష నేతలు శాంతించలేదు. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. దిగువ సభలో విపక్షాల ఆందోళన లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సుశీల్‌కుమార్ మోదీ సహా పలువురు మాజీ సభ్యుల మృతి పట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విపక్ష సభ్యులు నీట్ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందిస్తూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై చర్చ వాయిదా వేయడం కుదరని, ఈ నేపథ్యంలో జీరో అవర్ చేపట్టలేమని అన్నారు. కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నీట్–యూజీపై చర్చించాలని అన్నారు. డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు వారి సీట్ల వద్దే నిల్చొని నినాదాలు ప్రారంభించారు. రాహుల్ గాంధీ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్య క్రమాలు ప్రారంభించారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభాపతి ఎంతగా వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిద్దామని, ఆ తర్వాత నీట్‌పై చర్చకు సమయం కేటాయిస్తానని సభాపతి పేర్కొన్నప్పటికీ విపక్షాలు పట్టువీడలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పశి్చమ బెంగాల్‌కు చెందిన నురుల్ హసన్‌తో ఎంపీగా స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం లోక్‌సభలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. మరోవైపు నీట్–యూజీపై విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్‌సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచి్చన ఖర్గే నీట్ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. విపక్షాల నిరసనలు, నినాదాల వల్ల శుక్రవారం ఎగువ సభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మూడుసార్లు వాయిదా వేశా రు. రాష్ట్రప తి ప్ర సంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. నీట్‌పై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని జేడీ(ఎస్) సభ్యుడు హెచ్.డి.దేవెగౌడ గుర్తు చేశారు. సభ సక్రమంగా జరిగేలా విపక్ష సభ్యులంతా సహకరించాలని కోరారు. నీట్‌పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు. నీట్‌పై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాల నుంచి 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. దీనిపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావడంపై రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకు డు వెల్‌లోకి రావడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని, పార్లమెంట్‌కు ఇదొక మచ్చ అని ఆక్షేపించారు. పార్లమెంటరీ సంప్రదాయం ఈ స్థాయికి దిగజారిపోవడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కరినీ మానసికంగా గాయపర్చిందని చెప్పారు. నీట్‌పై చర్చకు సభాపతి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, సభలో మాట్లాడేందుకు చైర్మన్ ధనఖఢ్ అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాను వెల్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. అయితే, ధన్‌ఖడ్ చెబుతున్నట్లుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత వెల్‌లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో అప్పటి విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్‌లోకి వెళ్లారని గుర్తుచేశారు. స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవి నేతమ్ శుక్రవారం స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటు కారణంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. పార్లమెంట్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. నేతమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కోలుకుంటున్నారని, ఈ మేరకు ఆసుపత్రి నుంచి తనకు సమాచారం అందిందని చైర్మన్ ధన్‌ఖఢ్ సభలో ప్రకటించారు. -
NEET UG Result 2024: నీట్లో ఆరుగురి ఫస్ట్ ర్యాంకు గల్లంతు!
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. నీట్–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్టీఏ పునర్ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్ఏటీ స్పష్టంచేసింది. యథాతథంగా కౌన్సెలింగ్! నీట్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ నిలిపివేసేందుకు నిరాకరించింది. -
30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం!
పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్‌లో నీట్ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పకడ్బందీగా స్కెచ్ బిహార్‌లో పేపర్ లీక్ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నీట్ పేపర్ లీకేజీపై బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్‌లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. బిహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు. పట్నాలోని రామకృష్ణానగర్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్ ఆనంద్ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కుంభకోణంలో నితీశ్ కుమార్ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్‌లో బయటపడిన నీట్ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
NEET UG 2024: ‘నీట్’ గ్రేసు మార్కులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌తోపాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)–2024లో 1,563 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దుచేసి, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నియమించిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఆయా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం చెప్పిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 1,563 మంది అభ్యర్థుల ప్రస్తుత స్కోరు కార్డు రద్దుచేసి, వాస్తవ మార్కులు కేటాయించి, జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ఎన్టీఏ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయమైనవి, సహేతుకమైనవి, సమర్థనీయమైనవి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మే 5న నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో వివిధ కారణాలతో 1,563 మందికి గ్రేసు మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేయడంతోపాటు నీట్–యూజీ–2024ను మొత్తంగా రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కనూ అగర్వాల్ వాదనలు వినిపించారు. 1,563 మందికి ఇచ్చిన గ్రేసు మార్కులు రద్దుచేసి, వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నీట్‌కు హాజరైన అభ్యర్థుల్లో భయాందోళన తొలగించడానికి ఎన్టీఏ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 1,563 మంది అభ్యర్థుల స్కోరు కార్డును రద్దు చేయాలంటూ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. గ్రేసు మార్కులు రద్దయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్టీఏ తరఫు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ జూలై 6 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రేసు మార్కులు రద్దయినవారికి రెండు ఐచి్ఛకాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు మరోసారి పరీక్ష రాయవచ్చు లేదా గ్రేసు మార్కులు రద్దయిన తర్వాత వచ్చిన వాస్తవ మార్కులతో కౌన్సిలింగ్‌కు హాజరు కావొచ్చని వెల్లడించింది. జూలై 6న ప్రారంభం కానున్న కౌన్సెలింగ్‌ను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం.. ‘‘కోర్టు ముందుంచిన అన్ని అంశాలనూ పరిశీలించాం. జూన్ 12న ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయబద్ధంగా, సహేతుకంగా, సమర్థనీయంగా ఉన్నాయి. 1,563 మందికి మళ్లీ నీట్ నిర్వహించడానికి ఎన్టీఏకు అనుమతిస్తున్నాం. ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం. పరిహార మార్కులకు సంబంధించి అన్ని అంశాలను మూసివేసినట్లే. ఇతర సమస్యలకు సంబంధించి ప్రతివాదుల స్పందనకు రెండు వారాల గడువు ఇస్తున్నాం. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసలు ఏమిటీ వివాదం? ఈ ఏడాది నీట్–యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించారు. వీరందరికీ 720కి 720 మార్కులు రావడం గమనార్హం. ఇలా జరగడం ఎన్టీఏ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కేవలం ఇద్దరికే ఫస్టు ర్యాంకు వచ్చింది. ఈసారి ఫస్ట్ట్ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ఫస్టు ర్యాంకు కొట్టినవారు 50 మంది ఉన్నారు. ఫిజిక్స్ ఆన్సర్ కీలో మార్పుల వల్ల 44 మంది, ఎగ్జామ్‌లో సమయం కోల్పోవడం వల్ల ఆరుగురు గ్రేసు మార్కులు పొందారు. కొందరికి ఇచ్చిన గ్రేసు మార్కుల వల్ల తాము నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మార్కుల కేటాయింపులో డబ్బు చేతులు మారిందని విమర్శించారు. కోర్టును ఆశ్రయించారు. అలాగే పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని, ఎగ్జామ్‌లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చివరకు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేసు మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని నీట్‌ను నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. అభ్యర్థుల్లో పోటీతత్వం పెరగడం వల్లే ఈసారి ఎక్కువ మందికి ఫస్టు ర్యాంకు వచ్చిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంటోంది. మరోవైపు, అభ్యర్థులకు ఇచ్చిన గ్రేసు మార్కులను పునఃసమీక్షించడానికి కేంద్ర విద్యా శాఖ యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. -
మద్రాస్ ఐఐటీలో స్పోర్ట్స్ కోటా
న్యూఢిల్లీ: అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటీగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. 2024–25 అకడమిక్ సెషన్ నుంచి ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అదనంగా రెండు సీట్లను ఇందుకోసం సృష్టించాలని నిర్ణయించినట్లు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్(ఎస్ఈఏ) ప్రోగ్రాం కింద సృష్టించిన ఈ రెండు సీట్లలో భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో ఒకటి విద్యార్థినులకు రిజర్వు చేస్తామన్నారు. ఐఐటీల్లో ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా లేదు. -
యూజీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు. జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. సోమవారం ఆయన వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్ తప్పనిసరి అని, ఈ ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించినట్టు వివరించారు. ఈ పరీక్షకు క్లాస్–12 ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి సిలబస్ ఉంటుందని జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండబోదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. సీయూఈటీతో ప్రయోజనాలు అధిక కట్-ఆఫ్‌ల ఒత్తిడి నుంచి విద్యార్థులకు సీయూఈటీతో ఉపశమనం కలగనుంది. అంతేకాదు తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గుతుంది. వర్సిటీకో ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆమేరకు వ్యయప్రయాసలు తప్పుతాయి. అయితే సీయూఈటీపై విద్యావేత్తలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్య ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఎలా ఉంటుంది? సీయూఈటీ అనేది మూడున్నర గంటల పాటు జరిగే కంప్యూటరైజ్జ్ మల్టిఫుల్ చాయిస్ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది అభ్యర్థులు ఎంచుకున్న భాషలో వారి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్ వంటి అదనపు భాషలలో మరొక ఐచ్చిక పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో అభ్యర్థులు ప్రామాణిక సబ్జెక్ట్‌లు ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న 27 సబ్జెక్టుల్లో కనీసం ఒకటి, గరిష్టంగా ఆరు ఎంచుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లోని రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం.. కామర్స్ నుంచి అకౌంట్స్ లేదా బిజినెస్.. హ్యుమానిటీస్ నుంచి సైకాలజీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. మూడవ విభాగంలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సహా సాధారణ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్దిష్ట పరీక్షలు అవసరం కావచ్చు. కొన్నింటికి భాష, సాధారణ సామర్థ్య పరీక్షలు రాస్తే సరిపోతుంది. (క్లిక్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల) రిజర్వేషన్ ప్రస్తుతం ఉన్న అడ్మిషన్, రిజర్వేషన్ విధానాన్ని సీయూఈటీ ప్రభావితం చేయదు. విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా పాత పద్ధతిలోనే జనరల్, రిజర్వేషన్ సీట్లు భర్తీ చేస్తాయి. మైనారిటీ విద్యార్థుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసే జేఎంఐ, ఏఎంయూ కాలేజీల రిజర్వేషన్ విధానాలను సీయూఈటీ ప్రభావితం చేయదు. అయితే, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశ అర్హత సాధించాలంటే విద్యార్థులందరూ తప్పనిసరిగా సీయూఈటీ రాయాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు మినహాయింపు విదేశీ విద్యార్థులకు సీయూఈటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు వారికి ప్రవేశం కల్పిస్తాయి. సంగీతం, ఫైన్ ఆర్ట్స్, థియేటర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ప్రాక్టికల్, ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతిస్తుంది. నీట్, జేఈఈ పరీక్షలకు సీయూఈటీ వర్తించదు. సీయూఈటీ స్కోర్ వాడుకోవచ్చు 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సులు చదవాలంటే సీయూఈటీ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడే సంస్థలు.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్లను ఉపయోగించుకోవచ్చు. -
ఓబీసీలకు 27%.. ఈడబ్ల్యూఎస్‌కు 10%
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో అఖిల భారత కోటా(ఏఐక్యూ) పథకంలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2021–22) నుంచే ఇది అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న కీలకమైన ఈ నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఏటా వేలాది మంది యువత ప్రయోజనం పొందుతారు. వారికి మరిన్ని గొప్ప అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలో సామాజిక న్యాయానికి ఇదొక నూతన ఉదాహరణ’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. చరిత్రాత్మక నిర్ణయం ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. ‘‘వెద్య విద్య రంగంలో కేంద్ర సర్కారు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్/పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీ విద్యార్థులు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 10 శాతం రిజర్వేషన్ పొందుతారు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రిజర్వేషన్ అంశానికి ప్రభావవంతమైన పరిష్కారం కనిపెట్టాలని ప్రధాని మోదీ సోమవారం సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏటా ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీ విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 2,500 మంది ఓబీసీ విద్యార్థులు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 1,000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ధి పొందుతారు. వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు తగిన రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది’’ అని పేర్కొంది. ఆరేళ్లలో 179 కొత్త మెడికల్ కాలేజీలు దేశంలో గత ఆరేళ్లుగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఏకంగా 56 శాతం పెరగడం విశేషం. 2014లో 54,348 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 2020 నాటికి ఆ సంఖ్య 84,649కి చేరింది. ఇక మెడికల్ పోస్టుగ్రాడ్యుయేట్(పీజీ) సీట్లు సైతం 80 శాతం పెరిగాయి. 2014లో కేవలం 30,191 పీజీ సీట్లు ఉండగా, 2020 నాటికి 54,275కు చేరుకున్నాయి. దేశంలో 2014–2020 కాలంలో179 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశంలో 558 మెడికల్ కాలేజీలు(289 ప్రభుత్వ, 269 ప్రైవేట్ కాలేజీలు) ఉన్నాయి. ఆలిండియా కోటా అంటే... అఖిల భారత కోటా(ఏఐక్యూ) పథకంలో దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులంతా ప్రయోజనం పొందవచ్చు. కేవలం సొంత రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లోని ఏఐక్యూ మెడికల్, డెంటల్ సీట్ల కోసం పోటీ పడవచ్చు. ఇది కేంద్ర పథకమే కాబట్టి ఓబీసీలు ఎవరన్నది కేంద్ర జాబితా ఆధారంగా ఖరారు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలుత 1986లో ఆలిండియా కోటా పథకాన్ని ప్రవేశపెట్టారు. స్థానికతతో సంబంధం లేకుండా ప్రతిభను బట్టి ఇతర రాష్ట్రాల్లోని అత్యున్నత మెడికల్ కాలేజీల్లో సైతం చదువుకొనే అవకాశాన్ని కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ సీట్లలో 15 శాతం, మొత్తం పీజీ సీట్లలో 50 శాతం సీట్లను ఆలిండియా కోటా కిందకు చేరుస్తారు. వాస్తవానికి 2007 దాకా ఈ కోటా సీట్ల భర్తీకి ఎలాంటి రిజర్వేషన్లు ఉండేవి కావు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ 2007లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు సైతం 27 శాతం రిజర్వేషన్ ఇస్తూ 2007లో ‘కేంద్ర విద్యా సంస్థలు(ప్రవేశాల్లో రిజర్వేషన్) చట్టాన్ని’ అమల్లోకి తీసుకొచ్చింది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ వంటి కేంద్ర విద్యా సంస్థల్లోని ఈ రిజర్వేషన్లు అమలయ్యాయి. రాష్ట్రాల పరిధిలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఆలిండియా కోటా భర్తీకి రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో కేంద్ర సర్కారు రాజ్యాంగ సవరణ చేసింది. ఈ వర్గం కోసం 2019–20, 2020–21లో మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను (సూపర్ న్యూమరరీ సీట్ల ద్వారా) పెంచింది. దాంతో అన్‌రిజర్వుడ్ కేటగిరీకి అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య తగ్గలేదు. అయితే, ఆలిండియా కోటా సీట్ల భర్తీ విషయంలో ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ లభించలేదు. 2021–22 నుంచి ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. -
ఇరానీ మౌనం
న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సును రద్దు వివాదంపై మాట్లాడేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నిరాకరించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సమావేశం అనంతరం ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగపరమైన అభ్యంతరాలను ఇందుకు సాకుగా చూపారు. ‘రాజ్యాంగం పరిధిలోని ఈ అంశంపై మాట్లాడాలంటూ నన్ను అనేకసార్లు మీడియా వెంట పడింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా దయచేసి నాపై ఒత్తిడి చేయకండి’ అని అన్నారు. -
నాలుగేళ్ల కోర్సుపై నిరసన వ్యతిరేకోద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: ఒకవైపు నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)కు ప్రవేశ ప్రక్రియ జరుతుండగా, మరోవైపు ఈ కోర్సు ఉపసంహరణకోసం చేపట్టిన ఉద్యమం మరింత ఊపందుకుంది.ఈ కోర్సు విషయంలో గత సంవత్సరం తటస్థంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూ) ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణంలో శుక్రవారం నుంచి నిరాహార దీక్షకు దిగింది. ఈ విషయమై ఎన్ఎస్యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే దీక్షా శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘గత ఏడాది కొత్తగా ఈ కోర్సును ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రవేశపెట్టింది. అది ఏవిధంగా ఉంటుందనే విషయం సరిగా అర్ధం కాకపోవడంతో మేము నిరసించడంగానీ మద్దతు పలకడం చేయకుండా ఉండిపోయాం. అయితే ఈ కోర్సును ప్రవేశపెట్టి ఏడాది కాలం గడిచిపోయింది. దీనిపై ఓ అధ్యయనం చేశాం. ఇది విద్యార్థులకు అంత ఉపయుక్తం కాదనే విషయం ఆ అధ్యయనంలో తేలింది. మరోవైపు విద్యార్థులు కూడా ఈ విషయంలో సంతృప్తి చెందడం లేదు’ అని అన్నారు. ఇదిలాఉంచితే ఈ కోర్సుకు వ్యతిరేకంగా కొంతకాలంగా ప్రతిరోజూ ఆందోళనకు దిగుతున్న ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శుక్రవారం ఉదయం కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ విషయమై ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సాకేత్ బహుగుణ మీడియాతో మాట్లాడుతూ ‘డీయూ కోర్సును ప్రారంభించిననాటినుంచీ తాము ఆందోళన చేస్తూనే ఉన్నాం. యూజీసీ అత్యున్నత ప్రాధికార సంస్థ. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం’ అని అన్నారు. మరోవైపు ఈ కోర్సుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా), ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) సైతం ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి విదతమే. ఇదిలాఉంచితే ‘సేవ్ డీయూ’ పేరిట ఏడాదికాలంగా మరికొంతమంది ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్న అభయ్ దేవ్ అనే విద్యార్థి మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన మరోసారి ఆందోళనకు దిగనున్నామన్నారు. ఇటువంటి సత్తాలేని కోర్సుల వల్ల విద్యార్థులు మున్ముందు జీవితంలో బాధితులు కాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆందోళన చేస్తున్నామన్నారు. కాగా ఈ కోర్సు రద్దుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తి చూపుతున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఉద్యమ ఉధృతికి దోహదం చేస్తున్నాయి.