బిహార్‌లో అభ్యర్థులకు విక్రయించిన బ్రోకర్లు
రహస్య స్థావరానికి తరలించి ప్రశ్నాపత్రం అప్పగింత
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
నిందితుల్లో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్
ఇప్పటిదాకా 14 మంది అరెస్టు
మరో 9 మందికి నోటీసులు
పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్‌లో నీట్ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
పకడ్బందీగా స్కెచ్
బిహార్‌లో పేపర్ లీక్ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.
నీట్ పేపర్ లీకేజీపై బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్‌లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్‌జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు.
కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో..
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు.
బిహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు.
పట్నాలోని రామకృష్ణానగర్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్ ఆనంద్ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కుంభకోణంలో నితీశ్ కుమార్ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్‌లో బయటపడిన నీట్ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment