1,563 మంది అభ్యర్థులకు వాస్తవ మార్కుల కేటాయింపు
వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష... జూన్ 30లోగా ఫలితాలు
షెడ్యూల్ ప్రకారమే జూలై 6 నుంచి కౌన్సెలింగ్
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి
గ్రేసు మార్కులు రద్దయిన వారికి రెండు ఐచి్ఛకాలు
మరోసారి పరీక్ష రాయవచ్చు లేదా వాస్తవ మార్కులతో కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చు
కౌన్సెలింగ్ నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌తోపాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)–2024లో 1,563 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దుచేసి, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నియమించిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఆయా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం చెప్పిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 1,563 మంది అభ్యర్థుల ప్రస్తుత స్కోరు కార్డు రద్దుచేసి, వాస్తవ మార్కులు కేటాయించి, జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ఎన్‌టీఏ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎన్‌టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయమైనవి, సహేతుకమైనవి, సమర్థనీయమైనవి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మే 5న నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో వివిధ కారణాలతో 1,563 మందికి గ్రేసు మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేయడంతోపాటు నీట్–యూజీ–2024ను మొత్తంగా రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కనూ అగర్వాల్ వాదనలు వినిపించారు. 1,563 మందికి ఇచ్చిన గ్రేసు మార్కులు రద్దుచేసి, వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నీట్‌కు హాజరైన అభ్యర్థుల్లో భయాందోళన తొలగించడానికి ఎన్‌టీఏ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 1,563 మంది అభ్యర్థుల స్కోరు కార్డును రద్దు చేయాలంటూ కమిటీ సిఫార్సు చేసిందన్నారు.
గ్రేసు మార్కులు రద్దయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్‌టీఏ తరఫు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ జూలై 6 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రేసు మార్కులు రద్దయినవారికి రెండు ఐచి్ఛకాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు మరోసారి పరీక్ష రాయవచ్చు లేదా గ్రేసు మార్కులు రద్దయిన తర్వాత వచ్చిన వాస్తవ మార్కులతో కౌన్సిలింగ్‌కు హాజరు కావొచ్చని వెల్లడించింది. జూలై 6న ప్రారంభం కానున్న కౌన్సెలింగ్‌ను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది.
పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం..
‘‘కోర్టు ముందుంచిన అన్ని అంశాలనూ పరిశీలించాం. జూన్ 12న ఎన్‌టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయబద్ధంగా, సహేతుకంగా, సమర్థనీయంగా ఉన్నాయి. 1,563 మందికి మళ్లీ నీట్ నిర్వహించడానికి ఎన్‌టీఏకు అనుమతిస్తున్నాం. ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం. పరిహార మార్కులకు సంబంధించి అన్ని అంశాలను మూసివేసినట్లే. ఇతర సమస్యలకు సంబంధించి ప్రతివాదుల స్పందనకు రెండు వారాల గడువు ఇస్తున్నాం. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
అసలు ఏమిటీ వివాదం?
ఈ ఏడాది నీట్–యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు.
ఈ ఏడాది మొత్తం 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించారు. వీరందరికీ 720కి 720 మార్కులు రావడం గమనార్హం. ఇలా జరగడం ఎన్‌టీఏ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కేవలం ఇద్దరికే ఫస్టు ర్యాంకు వచ్చింది. ఈసారి ఫస్ట్ట్ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ఫస్టు ర్యాంకు కొట్టినవారు 50 మంది ఉన్నారు. ఫిజిక్స్ ఆన్సర్ కీలో మార్పుల వల్ల 44 మంది, ఎగ్జామ్‌లో సమయం కోల్పోవడం వల్ల ఆరుగురు గ్రేసు మార్కులు పొందారు.
కొందరికి ఇచ్చిన గ్రేసు మార్కుల వల్ల తాము నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మార్కుల కేటాయింపులో డబ్బు చేతులు మారిందని విమర్శించారు. కోర్టును ఆశ్రయించారు. అలాగే పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని, ఎగ్జామ్‌లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చివరకు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేసు మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని నీట్‌ను నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. అభ్యర్థుల్లో పోటీతత్వం పెరగడం వల్లే ఈసారి ఎక్కువ మందికి ఫస్టు ర్యాంకు వచ్చిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంటోంది. మరోవైపు, అభ్యర్థులకు ఇచ్చిన గ్రేసు మార్కులను పునఃసమీక్షించడానికి కేంద్ర విద్యా శాఖ యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment