‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్‌ విచారణ వాయిదా | Neet-ug 2024 Hearing Supreme Court Live Updates | Sakshi
Sakshi News home page

‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్‌ విచారణ వాయిదా

Published Thu, Jul 18 2024 1:39 PM | Last Updated on Thu, Jul 18 2024 4:31 PM

Neet-ug 2024 Hearing Supreme Court Live Updates

న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్‌ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్‌సైట్‌లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. 

ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. 

అలాగే.. 
మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? 
పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? 
అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?

అని న్యాయవాదుల్ని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రశ్నించారు.

‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్‌ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్‌ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement