కొద్దివారాలుగా కొనసాగుతున్న వివాదం కీలక ఘట్టానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కళాశాలల్లో ప్రవేశం కోసం ఏటా జరిపే జాతీయస్థాయి పరీక్ష ‘నీట్’లో అక్రమాలు జరిగాయన్న అంశంపై విచారణ చేస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నపత్రాల లీకైనమాట నిజమంటూనే, వ్యవస్థీకృతంగా భారీస్థాయిలో లీకులు జరగనందున పునఃపరీక్ష జరపాల్సిన అవసరం లేదని తేల్చే సింది. ‘నీట్’ వివాదంతో నెలన్నరగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్న విద్యార్థులకూ, వారి తల్లితండ్రులకూ ఇది ఒకింత ఊరట, మరింత స్పష్టత.
అభ్యర్థుల మానసిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని, దాదాపు 23 లక్షల మందికి పైగా హాజరైన పరీక్షను మళ్ళీ నిర్వహించాలని అనుకోకపోవడం మంచిదే. అయితే పేపర్ లీకులు, ఒకదాని బదులు మరొక ప్రశ్నపత్రం ఇవ్వడం, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయడం, నిర్ణీత కేంద్రాల నుంచి మునుపెన్నడూ లేనంత మంది టాపర్లుగా అవతరించడం – ఇలా ‘నీట్’ నిర్వహణలో ఈసారి వివిధ స్థాయుల్లో జరిగిన అవకతవకలు అనేకం. వీటన్నిటితో వ్యవస్థపై ఏర్పడ్డ అపనమ్మకాన్ని తొలగించడం ఎలా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న.
మొదట అసలు లోపాలు లేవని వాదించి, ఆనక తప్పుల్ని అంగీకరించినా కీలక చర్యలు చేపట్ట డానికి కార్యనిర్వాహక వ్యవస్థ వెనకాడడం చూశాం. చివరకు న్యాయవ్యవస్థ జోక్యంతో ప్రక్షాళన అవసరమనే అంశం చర్చకు వచ్చింది. సుప్రీమ్‌కోర్ట్ ఆదేశాలతో ‘జాతీయ పరీక్షా సంస్థ’ (ఎన్టీఏ) ‘నీట్’ పరీక్షా ఫలితాలను సవరించి, గురువారం ప్రకటించాల్సి వచ్చింది. భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నకు రెండు జవాబులూ సరైనవేనంటూ విద్యార్థులకు ఈ ఏటి పరీక్షలో గ్రేస్ మార్కులు కలిపిన ఘనత ‘నీట్’ది. అత్యధిక సంఖ్యలో టాపర్లు రావడానికీ అదే కారణమైంది.
సదరు వివాదాస్పద ప్రశ్నకు సరైన జవాబు ఒకటేనంటూ సుప్రీమ్ జోక్యం తర్వాత ఐఐటీ – ఢిల్లీ నిపుణుల సంఘం ఖరారు చేసింది. దాంతో అయిదేసి మార్కులు కోతపడి, దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల మార్కులు మారాయి. జూన్ 4న తొలుత ఫలితాలు ప్రకటించినప్పుడు టాప్ స్కోరర్ల సంఖ్య 61 కాగా, ఇప్పుడీ వివాదాలు, విచారణలు, మార్పుల తర్వాత అది 17కు తగ్గింది. మార్కులు, దరి మిలా ర్యాంకుల్లో మార్పులతో తాజా జాబితాను ఎన్టీఏ విడుదల చేయాల్సి వచ్చింది. పునఃపరీక్షఉండదని కోర్ట్ తేల్చేయడంతో, సవరించిన ర్యాంకుల్ని బట్టి ఇప్పుడిక ప్రవేశాలు జరVýæనున్నాయి.
ఎంబీబీఎస్ చదువు కోసం పెట్టిన ఈ దేశవ్యాప్త ‘నీట్ – యూజీ’ పరీక్షలు లోపభూయిష్ఠమనీ, మరీ ముఖ్యంగా స్థానిక విద్యార్థుల అవకాశాలకు హానికరమనీ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ‘నీట్’ వద్దంటూ తమిళనాడు కొన్నేళ్ళుగా పోరాడుతుంటే, పశ్చిమ బెంగాల్ సైతం బుధవారం గొంతు కలిపింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ సైతం ‘నీట్’ వద్దని గురువారం బిల్లును ఆమోదించింది. సొంతంగా రాష్ట్రస్థాయి మెడికల్ ఎంట్రన్ టెస్ట్ పెడతామంటూ తీర్మానించింది.
అది చట్టపరంగా సాధ్యమేనా, కేంద్రం, సుప్రీమ్ కోర్ట్ ఏమంటాయన్నది పక్కన పెడితే, ‘నీట్’ పట్ల పెరుగుతున్న అపనమ్మకం, రాష్ట్రాల్లో అసంతృప్తికి ఇది నిదర్శనం. అసలు ఒకప్పుడు ఎక్కడికక్కడ రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్షలే ఉండేవి. దేశంలో వైద్యవిద్య చదవదలచిన పిల్లలు ప్రతి రాష్ట్రంలో పరీక్షలు రాసే ఈ శ్రమ, ఖర్చును తప్పించడం కోసం జాతీయస్థాయిలో అందరికీ ఒకే పరీక్ష ‘నీట్’ను ప్రవేశపెట్టారు. మంచి ఆలోచనగా మొదలైనా, ఆచరణలో అది అవకతవకలకు ఆస్కారమిస్తూ, విద్యార్థుల్ని మరింత ఒత్తిడికి గురి చేసేదిగా మారడమే విషాదం.
మళ్ళీ పరీక్ష జరపనక్కర లేదని సుప్రీమ్ ప్రకటించింది కానీ, అసలు తప్పులేమీ జరగలేదని మాత్రం అనలేదని గుర్తించాలి. ఇప్పటికైతే పాట్నా, హజారీబాగ్ – ఈ రెండుచోట్లా పేపర్ లీకైనట్టు కోర్టు నిర్ధరించింది. అలాగే, మరిన్ని వివరాలు తవ్వి తీసేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందనీ స్పష్టం చేసింది. విద్యార్థుల కౌన్సిలింగ్ వగైరా కొనసాగించవచ్చని అనుమతిస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురవకుండా, పరీక్షల నిర్వహణ మరింత మెరుగ్గా ఎలా నిర్వహించాలన్న దానిపై మార్గదర్శకాలు రానున్నట్టు పేర్కొంది.
అభ్యర్థుల బంగారు భవిష్యత్తు ఆధారపడిన పరీక్ష లపై ఎన్టీఏలో నిర్లక్ష్యం ఎంతగా పేరుకుందో ఇటీవలి ‘నీట్’, యూజీసీ– నెట్ వివాదాలే నిదర్శనం. పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలు కీలకమైన పనిని బిడ్డింగ్‌లో అవుట్ సోర్సింగ్‌కు అప్పగించడం దాకా లోపాలు అనేకం. అసలు ముందుగా ఎన్టీఏను ప్రక్షాళన చేయాలంటున్నది అందుకే. ‘నీట్’ సంగతే తీసుకున్నా పెన్ను– పేపర్ల విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్షకు మారాలని నిపుణుల మాట. ‘జేఈఈ’లో లాగా రెండంచెల పరీక్షా విధానం ఉండాలనే సూచనా వినిపిస్తోంది. సంపూర్ణ అధ్యయనం, సమగ్ర చర్చతో తగిన చర్యలు చేపట్టడం ఇక భవిష్యత్ కార్యాచరణ కావాలి.
అసలు ఇవాళ దేశంలో అనేకచోట్ల చదువుల్లో పరీక్షా పత్రాల మొదలు పోటీపరీక్షల ప్రశ్నపత్నాల వరకు అన్నీ విపణిలో యథేచ్ఛగా లభిస్తున్న దుఃస్థితి. ఈ లీకుల జాడ్యాన్ని అరికట్టకపోతే ప్రతిభకు పట్టం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. రకరకాల పేపర్ లీకులతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బిహార్ సైతం ఎట్టకేలకు లీకు వీరులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నిరోధక) బిల్లును అసెంబ్లీలో బుధవారం ఆమోదించింది. అన్నిచోట్లా ఇలాంటి కఠిన చట్టాలు అవస రమే.
అయితే, అమలులో చిత్తశుద్ధి, అంతకన్నా ముందు ఆ చట్టాల దాకా పరిస్థితిని రానివ్వ కుండా లీకులకు అడ్డుకట్ట వేయడం ముఖ్యం. ‘నీట్’ పునర్నిర్వహణకు కోర్టు ఆదేశించకున్నా, తప్పులు జరిగాయని తేటతెల్లమైంది గనక మన పరీక్షా వ్యవస్థలు, విధానాలపై పునఃసమీక్ష, ప్రక్షాళనకు దిగాలి. అదీ పారదర్శకంగా జరగాలి. ‘నీట్’ లీకువీరులకు కఠిన శిక్షతో అందుకు శ్రీకారం చుట్టాలి.
పునః సమీక్ష జరగాలి!
Published Fri, Jul 26 2024 5:01 AM | Last Updated on Fri, Jul 26 2024 5:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment