పరీక్షలో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాల డిమాండ్
అంగీకరించని స్పీకర్, చైర్మన్
ఉభయ సభలు పలుమార్లు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ) వ్యవహా రం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. నీట్ పరీక్షలో అవినీతి అక్రమాలపై, పేపర్ లీకేజీపై వెంటనే చర్చ చేపట్టాలని శుక్రవారం ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. నినాదాలతో హోరెత్తించాయి. ఇతర వ్యవహారాలు పక్కనపెట్టి నీట్ అభ్యర్థుల భవితవ్యాన్ని కాపాడడంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. తర్వాత చర్చిద్దామని సభాపతులు కోరినన్పటికీ ప్రతిపక్ష నేతలు శాంతించలేదు. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.
దిగువ సభలో విపక్షాల ఆందోళన
లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సుశీల్‌కుమార్ మోదీ సహా పలువురు మాజీ సభ్యుల మృతి పట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విపక్ష సభ్యులు నీట్ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందిస్తూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై చర్చ వాయిదా వేయడం కుదరని, ఈ నేపథ్యంలో జీరో అవర్ చేపట్టలేమని అన్నారు. కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నీట్–యూజీపై చర్చించాలని అన్నారు.
డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు వారి సీట్ల వద్దే నిల్చొని నినాదాలు ప్రారంభించారు. రాహుల్ గాంధీ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్య క్రమాలు ప్రారంభించారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభాపతి ఎంతగా వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిద్దామని, ఆ తర్వాత నీట్‌పై చర్చకు సమయం కేటాయిస్తానని సభాపతి పేర్కొన్నప్పటికీ విపక్షాలు పట్టువీడలేదు.
దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పశి్చమ బెంగాల్‌కు చెందిన నురుల్ హసన్‌తో ఎంపీగా స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం లోక్‌సభలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. మరోవైపు నీట్–యూజీపై విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్‌సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచి్చన ఖర్గే
నీట్ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. విపక్షాల నిరసనలు, నినాదాల వల్ల శుక్రవారం ఎగువ సభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మూడుసార్లు వాయిదా వేశా రు. రాష్ట్రప తి ప్ర సంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. నీట్‌పై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్‌లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని జేడీ(ఎస్) సభ్యుడు హెచ్.డి.దేవెగౌడ గుర్తు చేశారు. సభ సక్రమంగా జరిగేలా విపక్ష సభ్యులంతా సహకరించాలని కోరారు.
నీట్‌పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు. నీట్‌పై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాల నుంచి 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. దీనిపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావడంపై రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకు డు వెల్‌లోకి రావడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని, పార్లమెంట్‌కు ఇదొక మచ్చ అని ఆక్షేపించారు.
పార్లమెంటరీ సంప్రదాయం ఈ స్థాయికి దిగజారిపోవడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కరినీ మానసికంగా గాయపర్చిందని చెప్పారు. నీట్‌పై చర్చకు సభాపతి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, సభలో మాట్లాడేందుకు చైర్మన్ ధనఖఢ్ అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాను వెల్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. అయితే, ధన్‌ఖడ్ చెబుతున్నట్లుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత వెల్‌లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో అప్పటి విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్‌లోకి వెళ్లారని గుర్తుచేశారు.
స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవి నేతమ్ శుక్రవారం స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటు కారణంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. పార్లమెంట్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. నేతమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కోలుకుంటున్నారని, ఈ మేరకు ఆసుపత్రి నుంచి తనకు సమాచారం అందిందని చైర్మన్ ధన్‌ఖఢ్ సభలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment