CUET
-
యూజీసీ కంటే అడుగు ముందే ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అమల్లోకి తెచ్చింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. దీనిద్వారా విద్యార్థులకు బహుళ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పడంతోపాటు ఫీజుల వ్యయమూ తగ్గుతుందని పేర్కొంది. అలాగే వర్సిటీలకు కూడా ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ భారమూ ఉండదని తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు సీయూఈటీలో చేరాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ కంటే ముందే గతేడాది ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్టును ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని పోస్ట్రుగాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీపీజీసెట్–2021ను నిర్వహించింది. ఈ ఏడాది కూడా నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్ర వర్సిటీలు యూజీసీ నిర్వహించాలనుకుంటున్న సీయూఈటీలో చేరలేదు. రాష్ట్రం నుంచి సీయూఈటీకి కేవలం 1,080 దరఖాస్తులు మాత్రమే అందాయి. అవి కూడా రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ వర్సిటీ (అనంతపురం)తో పాటు ఇతర సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాల కోసం దాఖలైనవే. ఒక అడుగు ముందే ఏపీ.. రాష్ట్రంలో 15 సంప్రదాయ వర్సిటీలు ఉండగా వాటిలో పోస్ట్రుగాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆయా వర్సిటీలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఆయా వర్సిటీల్లో చేరాలనుకునే విద్యార్థులు పలు ప్రవేశపరీక్షలు రాయాల్సి వచ్చేది. దీనివల్ల వేర్వేరుగా ఫీజులను చెల్లించడంతోపాటు పరీక్షలకు హాజరవడానికి వ్యయప్రయాసలు తప్పేవి కావు. ఇక ఆయా వర్సిటీల్లో ప్రవేశాలు ఒకే తేదీల్లో ఉంటే ఏదో ఒకదానికే హాజరు కావలసి వచ్చేది. ఈ దుస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహించేలా గతేడాదే చర్యలు చేపట్టాయి. యూజీసీ ఇప్పుడు చేస్తున్న ఆలోచనలను ఏడాది ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఏపీపీజీసెట్ విషయంలోనే కాకుండా విద్యారంగ పురోగతికి చేపట్టే వివిధ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్.. ఇతర రాష్ట్రాలు, వ్యవస్థలకంటే అడుగు ముందే ఉంది. నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్న అనేక సంస్కరణలు అమల్లోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల ఏర్పాటు, కరిక్యులమ్ సంస్కరణలు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇలా అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఉన్నత విద్యలో చేరికలు పెంచేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన ఖర్చులను సైతం అందిస్తోంది. ఒక్క పీజీసెట్‌తో 15 వర్సిటీల్లో ప్రవేశం ఏపీపీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా 15 వర్సిటీల్లో చేరడానికి విద్యార్థులకు అవకాశం దక్కింది. దీనివల్ల ఫీజుల భారం తగ్గడంతోపాటు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవస్థ తప్పింది. గతేడాది ఏపీపీజీసెట్ నిర్వహణ బాధ్యతలను యోగి వేమన వర్సిటీ చేపట్టింది. ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున, శ్రీ పద్మావతి మహిళా, యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి, ద్రవిడియన్, కృష్ణా, ఆదికవి నన్నయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ, కర్నూలు క్లస్టర్ వర్సిటీలతోపాటు జేఎన్టీయూ అనంతపూర్– ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (జేఎన్టీయూఏ–ఓటీపీఆర్‌ఐ)లలోని సీట్లను ఏపీపీజీసెట్ ద్వారా భర్తీ చేశారు. అలాగే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆయా వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండేవి. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఆర్‌సెట్ (రీసెర్చ్సెట్)ను కూడా ఇంతకుముందే అమల్లోకి తెచ్చింది. ఈ సెట్లో మెరిట్ సాధించినవారికి మాత్రమే ఆయా వర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టుల వల్ల ఆయా సామాజికవర్గాలకు రిజర్వేషన్లపరంగా అందాల్సిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దక్కుతున్నాయి. -
సెంట్రల్ వర్సిటీల ఎంట్రన్స్‌లో ఇంటర్ వెయిటేజి రద్దు
సాక్షి, అమరావతి: కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులకు ఎలాంటి వెయిటేజి ఉండదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. కొన్ని సెంట్రల్ వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)పై యూజీసీ ఇటీవల పబ్లిక్ నోటీసు విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. సీయూఈటీ పరిధిలోకి ఈసారి 45 సెంట్రల్ వర్సిటీలు ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని వర్సిటీలు ఇంటర్ మార్కులను కూడా వెయిటేజిగా తీసుకొంటున్నాయి. ఇకపై ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉండదని, ఆయా వర్సిటీలు ఇంటర్మీడియట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ పేర్కొంది. ప్రవేశాలు పూర్తిగా సీయూఈటీలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటాయని స్పష్టంచేసింది. అయితే, యూనివర్సిటీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ అర్హత మార్కులను ఏ మేరకు తీసుకోవాలో ఆ వర్సిటీలే నిర్ణయించుకుంటాయి. అంటే విశ్వవిద్యాలయం నిర్ణయించిన అర్హత మార్కులు పొందిన విద్యార్థులకు మాత్రమే సీయూఈటీలో వచ్చిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ (12వ తరగతి) మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండటం, కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థులకు మేలు చేసేలా ఎక్కువ మార్కులు వేస్తుండడం వల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని యూజీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకూ సీయూఈటీతో ప్రవేశాలకు అవకాశం 2022–23 విద్యా సంవత్సరానికి సీయూఈటీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 13 భాషల్లో నిర్వహిస్తుంది. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష ఉంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూఈటీని అనుసరించి ప్రవేశాలు నిర్వహించవచ్చని యూజీసీ పేర్కొంది. సీయూఈటీ ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్‌లో ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచుతారు. పూర్తి నోటిఫికేషన్ ఎన్టీఏ విడుదల చేస్తుంది. సీయూఈటీలో మార్కుల ప్రాతిపదికగా ఎన్టీఏ మెరిట్ జాబితా విడుదల చేస్తుంది. వర్సిటీలు తమ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తూనే సీయూఈటీ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తాయని యూజీసీ ప్రకటించింది. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకాల ఆధారంగా సీయూఈటీకి బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులుంటాయి. తప్పుడు సమాధానాలకు మార్కుల్లో కోత పడుతుంది. -
యూజీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు. జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. సోమవారం ఆయన వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్ తప్పనిసరి అని, ఈ ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించినట్టు వివరించారు. ఈ పరీక్షకు క్లాస్–12 ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి సిలబస్ ఉంటుందని జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండబోదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. సీయూఈటీతో ప్రయోజనాలు అధిక కట్-ఆఫ్‌ల ఒత్తిడి నుంచి విద్యార్థులకు సీయూఈటీతో ఉపశమనం కలగనుంది. అంతేకాదు తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గుతుంది. వర్సిటీకో ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆమేరకు వ్యయప్రయాసలు తప్పుతాయి. అయితే సీయూఈటీపై విద్యావేత్తలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్య ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఎలా ఉంటుంది? సీయూఈటీ అనేది మూడున్నర గంటల పాటు జరిగే కంప్యూటరైజ్జ్ మల్టిఫుల్ చాయిస్ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది అభ్యర్థులు ఎంచుకున్న భాషలో వారి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్ వంటి అదనపు భాషలలో మరొక ఐచ్చిక పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో అభ్యర్థులు ప్రామాణిక సబ్జెక్ట్‌లు ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న 27 సబ్జెక్టుల్లో కనీసం ఒకటి, గరిష్టంగా ఆరు ఎంచుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లోని రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం.. కామర్స్ నుంచి అకౌంట్స్ లేదా బిజినెస్.. హ్యుమానిటీస్ నుంచి సైకాలజీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. మూడవ విభాగంలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సహా సాధారణ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్దిష్ట పరీక్షలు అవసరం కావచ్చు. కొన్నింటికి భాష, సాధారణ సామర్థ్య పరీక్షలు రాస్తే సరిపోతుంది. (క్లిక్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల) రిజర్వేషన్ ప్రస్తుతం ఉన్న అడ్మిషన్, రిజర్వేషన్ విధానాన్ని సీయూఈటీ ప్రభావితం చేయదు. విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా పాత పద్ధతిలోనే జనరల్, రిజర్వేషన్ సీట్లు భర్తీ చేస్తాయి. మైనారిటీ విద్యార్థుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసే జేఎంఐ, ఏఎంయూ కాలేజీల రిజర్వేషన్ విధానాలను సీయూఈటీ ప్రభావితం చేయదు. అయితే, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశ అర్హత సాధించాలంటే విద్యార్థులందరూ తప్పనిసరిగా సీయూఈటీ రాయాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు మినహాయింపు విదేశీ విద్యార్థులకు సీయూఈటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు వారికి ప్రవేశం కల్పిస్తాయి. సంగీతం, ఫైన్ ఆర్ట్స్, థియేటర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ప్రాక్టికల్, ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతిస్తుంది. నీట్, జేఈఈ పరీక్షలకు సీయూఈటీ వర్తించదు. సీయూఈటీ స్కోర్ వాడుకోవచ్చు 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సులు చదవాలంటే సీయూఈటీ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడే సంస్థలు.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్లను ఉపయోగించుకోవచ్చు.