సాక్షి, అమరావతి: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అమల్లోకి తెచ్చింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. దీనిద్వారా విద్యార్థులకు బహుళ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పడంతోపాటు ఫీజుల వ్యయమూ తగ్గుతుందని పేర్కొంది. అలాగే వర్సిటీలకు కూడా ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ భారమూ ఉండదని తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు సీయూఈటీలో చేరాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ కంటే ముందే గతేడాది ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్టును ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని పోస్ట్రుగాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీపీజీసెట్–2021ను నిర్వహించింది. ఈ ఏడాది కూడా నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్ర వర్సిటీలు యూజీసీ నిర్వహించాలనుకుంటున్న సీయూఈటీలో చేరలేదు. రాష్ట్రం నుంచి సీయూఈటీకి కేవలం 1,080 దరఖాస్తులు మాత్రమే అందాయి. అవి కూడా రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ వర్సిటీ (అనంతపురం)తో పాటు ఇతర సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాల కోసం దాఖలైనవే.
ఒక అడుగు ముందే ఏపీ..
రాష్ట్రంలో 15 సంప్రదాయ వర్సిటీలు ఉండగా వాటిలో పోస్ట్రుగాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆయా వర్సిటీలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఆయా వర్సిటీల్లో చేరాలనుకునే విద్యార్థులు పలు ప్రవేశపరీక్షలు రాయాల్సి వచ్చేది. దీనివల్ల వేర్వేరుగా ఫీజులను చెల్లించడంతోపాటు పరీక్షలకు హాజరవడానికి వ్యయప్రయాసలు తప్పేవి కావు. ఇక ఆయా వర్సిటీల్లో ప్రవేశాలు ఒకే తేదీల్లో ఉంటే ఏదో ఒకదానికే హాజరు కావలసి వచ్చేది. ఈ దుస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహించేలా గతేడాదే చర్యలు చేపట్టాయి.
యూజీసీ ఇప్పుడు చేస్తున్న ఆలోచనలను ఏడాది ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఏపీపీజీసెట్ విషయంలోనే కాకుండా విద్యారంగ పురోగతికి చేపట్టే వివిధ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్.. ఇతర రాష్ట్రాలు, వ్యవస్థలకంటే అడుగు ముందే ఉంది. నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్న అనేక సంస్కరణలు అమల్లోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల ఏర్పాటు, కరిక్యులమ్ సంస్కరణలు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇలా అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఉన్నత విద్యలో చేరికలు పెంచేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన ఖర్చులను సైతం అందిస్తోంది.
ఒక్క పీజీసెట్‌తో 15 వర్సిటీల్లో ప్రవేశం
ఏపీపీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా 15 వర్సిటీల్లో చేరడానికి విద్యార్థులకు అవకాశం దక్కింది. దీనివల్ల ఫీజుల భారం తగ్గడంతోపాటు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవస్థ తప్పింది. గతేడాది ఏపీపీజీసెట్ నిర్వహణ బాధ్యతలను యోగి వేమన వర్సిటీ చేపట్టింది. ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున, శ్రీ పద్మావతి మహిళా, యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి, ద్రవిడియన్, కృష్ణా, ఆదికవి నన్నయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ, కర్నూలు క్లస్టర్ వర్సిటీలతోపాటు జేఎన్‌టీయూ అనంతపూర్– ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (జేఎన్‌టీయూఏ–ఓటీపీఆర్‌ఐ)లలోని సీట్లను ఏపీపీజీసెట్ ద్వారా భర్తీ చేశారు.
అలాగే పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆయా వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండేవి. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఆర్‌సెట్ (రీసెర్చ్‌సెట్)ను కూడా ఇంతకుముందే అమల్లోకి తెచ్చింది. ఈ సెట్‌లో మెరిట్ సాధించినవారికి మాత్రమే ఆయా వర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టుల వల్ల ఆయా సామాజికవర్గాలకు రిజర్వేషన్లపరంగా అందాల్సిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దక్కుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment