సంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానం
వేగంగా డిగ్రీ పూర్తికి వీలుగా యూజీసీ చర్యలు
మూడేళ్ల కోర్సు రెండు, రెండున్నరేళ్లలో పూర్తి చేసే వెసులుబాటు
విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి, తిరిగి ప్రవేశించే అవకాశం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్రణాళిక
త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న యూజీసీ చైర్మన్
సాక్షి, అమరావతి: ఇక నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు మూడేళ్ల డిగ్రీని రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చు. వ్యక్తిగత అవసరాలు ఉంటే రెండేళ్ల తర్వాత కోర్సు నుంచి బయటకు వెళ్లి మళ్లీ ప్రవేశించి నాలుగేళ్లలో ముగించవచ్చు. ఈ మేరకు సంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రణాళికలు రూపొందిస్తోంది. సామర్థ్యం కలిగిన విద్యార్థులు వేగంగా చదువును పూర్తి చేసుకునేందుకు వీలుగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.
ఇందులో ఒక విద్యార్థి కోర్సు వ్యవధిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే మూడేళ్ల డిగ్రీని రెండు లేదా రెండున్నరేళ్లలో, నాలుగేళ్ల డిగ్రీని మూడేళ్లలోనే పూర్తి చేయవచ్చు. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చు. ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ డిగ్రీ విద్యలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ మార్పులను వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
సమయం.. ఆర్థిక వనరులు ఆదా!
నూతన జాతీయ విద్యావిధానం–2020తో దేశ ఉన్నత విద్యలో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా సామర్థ్యం కలిగిన విద్యార్థులు తక్కువ వ్యవధిలో డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను పూర్తి చేసుకునేందుకు వీలుగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి నేతృత్వంలోని కమిటీ యాక్సిలరేటెడ్, స్లో–పేస్డ్ డిగ్రీలపై సిఫార్సులు చేసింది. దీనికి యూజీసీ సైతం ఆమోదం తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయి.
ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ముందుగానే విద్యార్థి తన డిగ్రీ చదువును ముగించడం ద్వారా త్వరగా వర్క్ ఫోర్స్‌లోకి, ఉన్నత విద్యలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా సమయంతోపాటు ఆర్థిక వనరులను ఆదా చేసుకోవచ్చు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలతో సమతుల్యం చేసుకోవడానికి కూడా ఈ విధానం సహాయపడుతుందని యూజీసీ భావిస్తోంది.
విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తల ఆందోళన
యూజీసీ ఇప్పటికే డిగ్రీ విద్యలో నిష్క్రమణ ఎంపికలను ప్రవేశపెట్టింది. ఈసారి విద్యాపరమైన సవాళ్ల ఆధారంగా విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించాలనుకునే వారికి అవకాశం ఇస్తోంది. ఇది ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ జీవిత బాధ్యతలను సమతుల్యం చేసుకోవాడానికి అనువుగా ఉంటుందని భావిస్తోంది.
అయితే డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ఇప్పటికే కోర్ కంటెంట్ తగ్గిపోతుందని, ఇలాంటి చర్యలతో విద్య నాణ్యత దిగజారుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఉపాధి సంక్షోభానికి దారి తీసిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని నిర్వహిస్తున్న క్రమంలో కోర్సు కాల వ్యవధిని తగ్గించడం అంటే విద్య నాణ్యతను ప్రశ్నార్థకంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment