పరీక్షలో అవకతవకలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు
కేంద్ర విద్యా శాఖ ఆకస్మిక నిర్ణయం
సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగింత
త్వరలో మళ్లీ పరీక్షను నిర్వహించనున్న ఎన్‌టీఏ
తేదీ, తదితర వివరాలు త్వరలో వెల్లడి
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్(ఓఎంఆర్) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
‘‘ నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్ జూన్ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు.
నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది.
ఐ4సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షనూ చేపట్టింది.
యూజీసీ–నెట్ ఎందుకు రాస్తారు?
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్( యూజీసీ–నెట్) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరొచ్చు.
శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్‌డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment