National Entrance Eligibility Test
-
Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్–యూజీ, 2024 ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సమగ్ర ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది. నీట్–యూజీ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం విచారించింది. పరీక్షను రద్దుచేసి కొత్తగా నిర్వహించాలని, కోర్టు పర్యవేక్షణలో లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరగాలని వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ‘‘ పరీక్షలో సెంటర్లవారీగా విద్యార్థులు పొందిన మార్కుల వివరాలను బహిర్గతంచేయండిగానీ అభ్యర్థుల ఐడెంటిటీ కనిపించకూడదు. గోప్యత పాటించండి. డమ్మీ రోల్ నంబర్లు వేసి అభ్యర్థుల మార్కుల వివరాలు ఇవ్వండి. ప్రశ్నాపత్రం సోషల్‌మీడియా ద్వారా ఎక్కువ మందికి షేర్ అయి, విస్తృతస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతింటేనే పరీక్షను మరోమారు నిర్వహించేందుకు అనుమతిస్తాం. అంతేగానీ ఒకటి రెండు కేంద్రాలకు మాత్రమే లీకేజీ పరిమితమైతే రీటెస్ట్‌కు ఒప్పుకోం. కేసు సీబీఐ చేతికి వెళ్లకముందు బిహార్ పోలీసులు సేకరించిన ఆధారాలు, సమర్పించిన ఆర్థికనేరాల విభాగ నివేదికను రేపు సాయంత్రం ఐదింటికల్లా మాకు అందజేయండి’ అని కోర్టు ఆదేశించింది. తర్వాత కొందరు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్‌హూడా వాదించారు. ‘‘ పరీక్షను రద్దుచేయాల్సిందే. ఎందుకంటే లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగింది. హజారీబాగ్‌లో ప్రశ్నపత్రాలు ఆరురోజులపాటు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీ అ«దీనంలో ఉండిపోయాయి. ఎగ్జామ్ సెంటర్‌కు ఒక సాధారణ ఈ–రిక్షాలో తరలించారు. ఈ ఉదంతంలో ఆ సెంటర్ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు’ అని అన్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్ కాలేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘ కేవలం 1.08 లక్షల మంది అడ్మిషన్ పొందే ఈ పరీక్ష కోసం 23.33 లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టలేం. పటా్న, హజారీబాగ్ సెంటర్లలో మాత్రమే లీకేజీ అయినట్లు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. గుజరాత్‌లోని గోధ్రాలోనూ ఇది జరిగి ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ అయిందనే బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే రీ టెస్ట్‌కు ఆదేశాలిస్తాం. అయినా పేపర్ లీకేజీకి, పరీక్ష ప్రారంభానికి మధ్య ఎంత సమయం ఉంది? ఎంత మందికి పేపర్ చేరవేశారు? అనేవి కీలక అంశాలపై స్పష్టత రావాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేసింది. -
ఏడేళ్లు.. 70 లీకేజీలు
నీట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతం నానాటికీ పెరిగి పెద్దదవుతోంది. రోజుకోటి చొప్పున సంచలనాత్మక విషయాలు బయట పడుతూ దేశమంతటినీ కుదిపేస్తున్నాయి. మరోవైపు యూజీసీ–నెట్ ప్రశ్నపత్రం లీకైనట్టు తేలడంతో ఆ పరీక్షే రద్దయింది. వీటి దెబ్బతో దేశవ్యాప్తంగా ప్రవేశ, పోటీ పరీక్షల సమగ్రత, విశ్వసనీయతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్న దుస్థితి! నిజానికి ప్రశ్నపత్రాల లీకేజీ మన దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న జాఢ్యమే. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడం సమస్య తీవ్రతకు, భారత్‌లో పరీక్షలపై పేపర్ లీకేజీ మాఫియాకు ఉన్న తిరుగులేని పట్టుకు అద్దం పడుతోంది. ఇవన్నీ అధికారికంగా వెలుగులోకి వచి్చనవి, దర్యాప్తు జరిగిన, జరుగుతున్న కేసులు మాత్రమే. అసలు వెలుగులోకే రాకుండా పకడ్బందీగా జరిగిపోయిన ప్రవేశ, పోటీ పరీక్షల లీకేజీ ఉదంతాలు ఇంకా ఎన్నో రెట్లుంటాయని విద్యా రంగ నిపుణులే అంటున్నారు! వాటి ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వోద్యోగాలు కొట్టేసిన అనర్హులు వేలు, లక్షల్లో ఉంటారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్–యూజీ పేపర్ లీక్ కావడంతో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది. ఇలా గత ఏడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 70 పరీక్షల పేపర్లు లీకయ్యాయి. వాటికి 1.7 కోట్ల మందికి పైగా ఉన్నత విద్యార్థులు, ఉద్యోగార్థుల కలలు కల్లలైపోయాయి. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ వంటి పలు పెద్ద రాష్ట్రాలతో పాటు హరియాణా వంటి చిన్న రాష్ట్రాల్లో కూడా తరచూ పలు ప్రవేశ, పోటీ పరీక్షల పేపర్లు లీకవుతున్నాయి. ఈ లీకేజీ భూతం ఉన్నత విద్యకు, భారీ స్థాయి నియామక పరీక్షలకే పరిమితం కాలేదు. పదో తరగతి వంటి స్కూలు పరీక్షలకు కూడా పాకి కలవరపెడుతోంది. బిహార్‌లో పదో తరగతి ప్రశ్నపత్రాలు గత ఏడేళ్లలో ఆరుసార్లు లీకయ్యాయి. పశి్చమబెంగాల్లోనైతే స్టేట్ బోర్డు పరీక్ష పత్రాలు గత ఏడేళ్లలో ఏకంగా పదిసార్లు లీకయ్యాయి. తమిళనాడులో 2022లో 10, 12 తరగతుల ప్రశ్నపత్రాలు లీకై కలకలం రేపాయి. ఆ రాష్ట్రాల్లో అంతే...! రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు కొన్నేళ్లుగా పరీక్షల లీకేజీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 2015–23 మధ్య రాజస్తాన్‌లో పలు పోటీ పరీక్షలకు సంబంధించి 14కు పైగా పేపర్లు లీకేజీ బారిన పడ్డాయి. 2022 డిసెంబర్లో సీనియర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ల నియామకానికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రం లీకవడంతో ఆ పరీక్షనే రద్దు చేయాల్సి వచి్చంది. యూజీసీ నెట్, పోలీస్ రిక్రూట్మెంట్ గత రెండేళ్లు వరుసగా లీకయ్యాయి. గుజరాత్‌లోనూ గత ఏడేళ్లలో 14 లీకేజీ ఉదంతాలు నమోదయ్యాయి. సీపీఎస్సెస్సీ చీఫ్ ఆఫీసర్ పరీక్ష (2014), తలతీ పరీక్షలు (2015, 2016), టీచర్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ (2018), ముఖ్య సేవిక, నాయబ్ చిట్నిస్, డెక్ లోక్ రక్షక్ దళ్, నాన్ సచివాలయ క్లర్క్స్, హెడ్ క్లర్క్, సీఎస్‌ఎస్సెస్బీ (2021), సబ్ ఆడిటర్ (2021), ఫారెస్ట్ గార్డ్ (2022), జూనియర్ క్లర్క్ (2023), వంటి పలు పరీక్షలు ఈ జాబితాలో ఉన్నాయి. యూపీలో కూడా 2017–24 మధ్య కనీసం 9 లీకేజీ కేసులు వెలుగు చూశాయి. ఇన్స్పెక్టర్ ఆన్లైన్ రిక్రూట్‌మెంట్‌పరీక్ష (2017), యూపీ టెట్ (2021), 12వ తరగతి బోర్డు పరీక్ష వంటివి వీటిలో ముఖ్యమైవి. తాజాగా ఈ ఏడాది జరిగిన కానిస్టేబుల్ పేపర్ లీకేజీ ఏకంగా 48 లక్షల మంది దరఖాస్తుదారులను ఉసూరు మనిపించింది.అమల్లోకి పేపర్ లీక్ నిషేధ చట్టం నోటిఫై చేసిన కేంద్రం న్యూఢిల్లీ: పేపర్ లీకేజీల కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అనైతిక కార్యకలాపాల నిరోధ) చట్టం, 2024ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్, యూజీసీ–నెట్ పేపర్ల లీకేజీ వివాదాలు దేశవ్యాప్తంగా కాక రేపుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. పేపర్ల లీకేజీ ఉదంతాల్లో శిక్షలను కఠినతరం చేస్తూ గత ఫిబ్రవరిలో పార్లమెంటు ఈ చట్టం చేయడం తెలిసిందే. దీని ప్రకారం లీకేజీ కేసుల్లో మూడు నుంచి పదేళ్ల జైలు, రూ.కోటి దాకా జరిమానా విధించవచ్చు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది. -
యూజీసీ–నెట్ రద్దు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్(ఓఎంఆర్) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్ జూన్ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐ4సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షనూ చేపట్టింది. యూజీసీ–నెట్ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్( యూజీసీ–నెట్) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరొచ్చు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. -
‘నీట్’లో అక్రమాల ఆరోపణలు..
పట్నా: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బిహార్ పోలీసుల దర్యాప్తు మరింత పురోగతి సాధించింది. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న బిహార్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) పోలీసులు ఆరు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన మాఫియా ముఠా సభ్యులకు చెందాల్సినవిగా వీటిని భావిస్తున్నామని ఈఓయూ డీఐజీ మానవ్‌జీత్ సింగ్ ధిల్లాన్ ఆదివారం చెప్పారు. సంబంధిత బ్యాంకుల నుంచి ఆయా ఖాతాదారుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా, పట్నాలో ప్రశ్నాపత్రాన్ని, జవాబులను అభ్యర్థులకు మాఫియా సభ్యులు వెల్లడించిన ఇంట్లో పాక్షికంగా కాల్చివేసిన ప్రశ్నాపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఎన్టీఏ నుంచి రిఫరెన్స్ ప్రశ్నాపత్రం కోరామని, అది అందాక రెండింటిని సరిపోల్చుతామని డీఐజీ చెప్పారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 9 మంది అభ్యర్థులతోపాటు నలుగురు ఎగ్జామినర్లున్నారు. వీరంతా బిహారీలే. అదేవిధంగా, ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న బిహార్‌కే చెందిన మరో ఏడుగురు, యూపీ, మహారాష్ట్రలకు చెందిన ఓక్కో అభ్యర్థికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. -
NEET-UG 2024: ‘నీట్’పై కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి నోటీసులు జారీ చేసింది. హతేన్‌సింగ్ కాశ్యప్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజస్తాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అనవసరమైన భావోద్వేగపూరిత వాదనలు చేయొద్దని హితవు పలికింది. -
NEET: లోదుస్తుల వివాదం.. బాధిత అమ్మాయిలకు మళ్లీ ‘నీట్’ పరీక్ష
న్యూఢిల్లీ: కేరళలో నీట్ పరీక్షకు హాజరైన సందర్భంగా ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో లోదుస్తులు విప్పించి.. ఆ తర్వాతే పరీక్ష రాయడానికి వెళ్లాలని సిబ్బంది ఆదేశించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద అవమానం ఎదుర్కొన్న బాధిత అమ్మాయిలు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎన్టీఏ. వారికి సెప్టెంబరు 4న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యార్థినులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం చేరవేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 17న నీట్ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో అది పెను దుమారం రేపింది. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్‌లో గల మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని నియమించింది ఎన్టీఏ. ఈ కేసులో కేరళ పోలీసులు తనిఖీలు చేపట్టిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!? -
అదే జరిగితే పీహెచ్‌సీల్లో డాక్టర్లు కనిపించరు!
నీట్ ఎగ్జామ్‌ను గనుక కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు కనిపించరని ఆందోళన వ్యక్తం చేశారు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, విద్యావేత్త ఏకే రాజన్. నీట్ పరీక్ష-ప్రజాభిప్రాయసేకరణ కోసం రాజన్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను సమర్పించింది కూడా. చెన్నై: ‘నీట్ వల్ల పేదలకు ఇబ్బందులే ఎదురవుతాయి. ఉన్నత వర్గాలకు చెందినవాళ్లే ఎక్కువ సీట్లను దక్కించుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు స్థానికులకు వైద్య విద్య దక్కదు. బాగా డబ్బున్నవాళ్లు మారుమూల పల్లెల్లో వైద్య సేవలను అందించేందుకు ముందుకొస్తారా? విదేశాలకు వెళ్లడానికి, వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికే ఇష్టపడతారు. అప్పుడు పీహెచ్‌సీలు ఖాళీగా ఉంటాయి. వైద్యం అందక పేదల ప్రాణాల మీదకు వస్తుంది’అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రాజన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలేవీ నీట్‌ను వ్యతిరేకించట్లేదని, కానీ, త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా తమిళనాడు బాటలోనే డిమాండ్ వినిపిస్తాయని, ‘హిందీ తప్పనిసరి’ ఆదేశాల విషయంలో జరిగిందే నీట్ విషయంలోనూ జరగొచ్చని రంజన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 86 వేల మంది నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిశీలనలోకి తీసుకుని.. మరికొందరితో మాట్లాడి, విద్యావేత్తలతో చర్చించాకే ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు రాజన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన తప్పనిసరి ఎగ్జామ్ నీట్ వల్ల వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంత పిల్లలకు వైద్య విద్యలో అవకాశాలు దక్కవని, సిలబస్ సమస్యతో పాటు కోచింగ్ లాంటి వాటితో ఆర్థిక భారం పడుతుందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావిస్తూ రాజన్ కమిటీ తన ప్రాథమిక రిపోర్ట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. అందరికీ సమాన హక్కులు దక్కనప్పుడు.. అడ్డుగా ఉన్న నిబంధనలను(నీట్) మార్చాల్సిన అవసరం ఉంటుందని రాజన్ అంటున్నారు కూడా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ వల్ల విద్యార్థులకు సామాజిక న్యాయం దక్కదనే అంశంపై పార్టీలకతీతంగా తమిళనాడు నుంచి పరీక్ష రద్దు డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్‌కు పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతుండడం విశేషం. అయితే ఇవేం పట్టించుకోని కేంద్రం నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘స్కూళ్లు, కాలేజీలు మూసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలె ప్రధాని మోదీని కోరారు. ఇంకోవైపు విద్యార్థులు కూడా అక్టోబర్ వరకు ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ట్విటర్లో ట్రెండ్ కొనసాగిస్తున్నారు. -
24 గంటలు.. 700 కి,మీ ప్రయాణం.. కానీ
పట్నా: ‘‘మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష మొదలైంది. నిజానికి నేను ఒంటి గంట నలభై నిమిషాలకు అక్కడికి చేరుకున్నాను. కానీ సెంటర్‌కు 10 నిమిషాల అలస్యమైందన్న కారణంతో నన్ను లోపలికి అనుమతించలేదు. అధికారులను ఎంతగానో బతిమిలాడాను. వాళ్లు నా అభ్యర్థనను మన్నించలేదు’’ అంటూ సంతోష్ కుమార్ యాదవ్ అనే విద్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కఠిన శ్రమకోర్చి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినా లాభం లేకుండా పోయిందని ఉద్వేగానికి లోనయ్యాడు. పది నిమిషాల ఆలస్యం తనను నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు దూరం చేసిందని, దీంతో ఏడాది సమయం వృథా అయిందని వేదన చెందాడు. వివరాలు.. బిహార్‌లోని దర్బంగాకు చెందిన సంతోష్ కోల్‌కతా లో నీట్ పరీక్ష రాసేందుకు ఏకంగా 700 కి.మి ప్రయాణం చేశాడు. శనివారం ఉదయం 8 గం బస్సు ఎక్కి ముజఫర్‌పూర్ చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పట్నాకు వెళ్లే బస్సు ఎక్కాడు. (చదవండి: విషాదం: ఎస్సై కూతురు ఆత్మహత్య) ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం వల్ల ఆరు గంటలు ఆలస్యమైంది. దీంతో పట్నాలో 9 గంటలకు బస్సు ఎక్కి రాత్రి ఒంటి గంటకు కోల్‌కతాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ట్యాక్సీలో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. కానీ అప్పటికే పది నిమిషాలు ఆలస్యమైనందున అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో సంతోష్ పడిన శ్రమకు ఫలితం లేకుండా పోయింది. కాగా గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిమిషం ఆలస్యం వల్ల కూడా అనేక మంది విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. కాగా అనేక విమర్శల నడుమ కరోనా విజృంభిస్తున్న వేళ భద్రత, వైద్య పరీక్షల నిమిత్తం విద్యార్థులు మూడు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని నీట్ పరీక్ష నిర్వాహకులు సూచించిన విషయం తెలిసిందే. ఇక నీట్ పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక కొన్నిరోజుల క్రితం మదురైకి చెందిన 19 ఏళ్ల యువతి, మరో ఇద్దరు వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీంతో అక్కడి ప్రతిపక్ష పార్టీలు నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో రవాణా వ్యవస్థ లేకపోడం, వరదల కారణంగా విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్న తరుణంలో నీట్ పరీక్ష నిర్వహణ తీవ్ర విమర్శలకు దారితీసింది. -
నీట్ ప్రత్యేక రైళ్లు, షాక్ తిన్న అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పరీక్ష కోసం వేసిన ప్రత్యేక రైలును చూసి డెహ్రాడూన్ అధికారులు ఖంగుతిన్నారు. ఆదివారం నీట్ పరీక్ష జరగగా కోవిడ్ పరిస్థితుల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడకుండా కేంద్రం వారి కోసం ప్రత్యేకరైళ్లను సిద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే పరీక్షకు హాజరుకావడానికి విద్యార్థులకు పరీక్షలు చేయడానికి వచ్చిన రైల్వే సిబ్బందికి మొండి చేయ్యె ఎదురయ్యింది. డెహ్రాడూన్‌లో మొత్తం 18 పరీక్ష సెంటర్లు, రూర్కీలో 12 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే చాలా తక్కువ మంది ఆ రైలులో ప్రయాణించారు. కేవలం 21 మంది మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రయాణించారు. దీని గురించి డెహ్రాడూన్ రైల్వే అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక రైలును ఎక్కువ మంది విద్యార్థులు వినియోగించుకోలేదు. కోవిడ్ కారణంగా జాగ్రత్తగా ఉండటం కోసం వారు తమ సొంత వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోంది. పరీక్షల కోసం ప్రత్యేక రైలును నడుపుతున్న రైల్వే శాఖ వీటి కోసం చాలా డబ్బును వెచ్చించింది. అయితే కేవలం రూ. 1040 మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రభుత్వానికి లభించాయి. చదవండి: నీట్‌పై వ్యాఖ్యలు : చిక్కుల్లో హీరో సూర -
‘అమ్మా, అప్పా.. అలసిపోయా.. క్షమించండి’
చెన్నై: ‘‘నేను మెడికల్ సీటు సాధించకపోతే .. ఇన్నాళ్లు పడిన శ్రమంతా వృథా అయిపోతుంది. నన్ను క్షమించండి. నేను అలసిపోయాను. పరీక్ష కోసం బాగానే చదివాను. కానీ నాకు భయంగా ఉంది. నా కోసం ఎవరినీ నిందించవద్దు. సారీ అప్పా, అమ్మా’’ అంటూ ఓ విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో ప్రాణాలు తీసుకుంది. ఈ మేరకు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాయడంతో పాటుగా.. చనిపోవడానికి ముందు ఓ వీడియోను రికార్డు చేసింది. పరీక్షకు ఒకరోజు ముందు కూతురు ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన మురుగసుందరం సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబంతో కలిసి మధురైలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె జ్యోతి శ్రీదుర్గ 2019లో క్లాస్ 12లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. గత కొన్ని రోజులుగా నీట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. (చదవండి: ‘నా తమ్ముడి జీవితం నాశనం చేశారు’) ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన జ్యోతి శ్రీదుర్గ శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, పాస్ అవుతానో లేదోనన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అరియలూర్ చెందిన విగ్నేష్ అనే విద్యార్థి సైతం నీట్ పరీక్షకు సిద్ధమవుతూ ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. ఇక ఈ వరుస ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి దయచేసి విద్యార్థులెవరూ ఒత్తిడికి లోనుకావద్దని, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక మూడేళ్ల క్రితం అనిత అనే మెరిట్ విద్యార్థిని సైతం ఇదే తరహాలో ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో నీట్ పరీక్ష నిర్వహణను వాయిదా వేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో.. మహమ్మారి కారణంగా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం కోల్పోరాదన్న సుప్రీంకోర్టు.. నిబ్బందనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబరు 13న నిర్వహించే నీట్ పరీక్షలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి కొనసాగున్న విషయం విదితమే. -
‘నీట్, జేఈఈపై ఇప్పుడేం చేయలేం’
న్యూఢిల్లీ: సమాజంలో జరిగే కీలక అంశాలపై విశ్లేషించే రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా నీట్, జేఈఈ పరీక్షలపై ట్విటర్ వేదికగా స్పందించారు. సుబ్రహ్మణ్యస్వామి ఆదివారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో నీట్ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని కొందరు తనను కలిసారని, కానీ తనను ముందే సంప్రదిస్తే మరో విధంగా ఉండేదని తెలిపారు. పరీక్షలు రద్దు చేయాలని కొందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేయలేదని, వారు సైతం రద్దుకు మద్దతిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే నీట్, జేఈఈ పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు, కొందరు సామాజికవేత్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రవేశ పరీక్షలు(నీట్, జేఈఈ) నిర్వహించాలని పట్టుదలతో ఉంది. కాగా ఇది వరకే కోవిడ్ నిబంధనలు పాటించి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలను ఆపడం అసాధ్యమని, సుప్రీం తన తీర్పును సమీక్షించే అవకాశం లేదని పేర్కొన్నారు. మరోవైపు నీట్ పరీక్షలను రద్దు చేయాలని ఆగస్ట్ 4న కొందరు రివ్యూ పిటిషన్ వేశారు. కానీ సుప్రీం కోర్టు వాదనలను(రివ్యూ పిటిషన్) వినడానికి నిరాకరించింది. కాగా పరీక్షలు రద్దు చేయాలని రివ్యూ పిటిషన్ వేసిన వారిలో పశ్చిమ బెంగాల్ న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్, జార్ఖండ్ ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఒరాన్, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ, పంజాబ్ కార్మిక శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ, మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్ తదితరులు ఉన్నారు. (చదవండి: గాంధీ హత్యకేసుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు) -
మరోసారి కేంద్రానికి మమత విజ్ఞప్తి
కోల్‌కతా: విద్యార్థుల క్షేమం దృష్ట్యా జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(ఎన్ఈఈటీ–నీట్), సంయుక్త ప్రవేశ పరీక్ష (జేఈఈ)- 2020 పరీక్షలను వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో పరిస్థితులు చక్కబడేంత వరకు వేచి చూడాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబరులో నీట్, జేఈఈ నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో మరోసారి నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాద తీవ్రతను అంచనా వేసి, పరీక్షలు వాయిదా వేయాలి. విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడం మన బాధ్యత’’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మమత ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ గైడ్‌లైన్స్‌పై ఆమె అభ్యంతరాలు లేవనెత్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సైతం పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆదివారం ప్రధాని మోదీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే నీట్, జేఈఈ జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. (జేఈఈ, నీట్ పరీక్షలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు) ఇక నీట్ ఎగ్జామ్‌కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ ఏర్పాట్లను చేయనున్నారు. ప్రతి విద్యార్థికి తాజా మాస్కులు, గ్లౌవ్స్‌ను అందించి సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం సమాయత్తమవుతోంది. -
నీట్ పరీక్షపై ఎన్టీఏ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు రద్దవుతాయని వస్తున్న వార్తలు అవాస్తవమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. నీట్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార వార్తను నమ్మవద్దని ఎన్టీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. 2020, జులై 26న నీట్ పరీక్ష ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, నీట్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు జూన్ నెల 15 వ తేదీన నిరాధార వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. కాగా విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే నిరాధార వార్తపై విచారణ జరుపుతామని ఎన్టీఏ స్పష్టం చేసింది. అయితే, నీట్ పరీక్షలకు సంబంధించి మే 11, 2020న విడుదల చేసిన ప్రకటన ప్రామాణికమని ఎన్టీఏ తెలిపింది. సరైన సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు(www.nta.ac.inand ntaneet.nic.in) ఎన్టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. వైద్య విద్య ప్రవేశాల కోసం ఎన్టీఏ నీట్ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘నీట్’గా దొరికిపోతున్నారు) -
మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్
చెన్నై : వైద్య విద్యలో ప్రవేశాలకై నిర్వహించే నీట్ పరీక్ష కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జీవితాలు కోల్పోతున్నారని నటి జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 35 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, అందులో మాతృబాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు నీట్లో ఎలా రాణించగలరని ప్రశ్నించారు. పెళ్లి తర్వాత తిరిగి సినిమాల్లో ప్రవేశించిన జ్యోతిక ప్రస్తుతం ‘రాక్షసి’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో ఆమె విద్యా వ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక పరిస్థితి అర్థం కాదా? ‘అసలే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు చాలా తక్కువగా ఉంటుంది. ఇక నీట్ వంటి పరీక్షలకు విద్యార్థులు ప్రత్యేకంగా శిక్షణ ఎలా తీసుకుంటారు. జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక్కసారిగా నీట్ వంటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల మానసిక పరిస్థితి ఎలా వుంటుందో ప్రభుత్వాలకు అర్థం కాదా. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తుకై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే లక్షలాది మంది జీవితాలు బాగుంటాయి’ అని జ్యోతిక అభిప్రాయపడ్డారు. కాగా వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణులు కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. -
‘హంపి’ ఎంత పనిచేసింది...
సాక్షి, బెంగళూరు : ‘నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవిత కాలం లేటు’ అని ఆరుద్ర అన్నట్లుగానే...రైలు ఆలస్యం కారణంగా సుమారు 500మంది విద్యార్థులు ‘నీట్’ పరీక్షకు దూరమయ్యారు. కర్ణాటకలో హంపి ఎక్స్‌ప్రెస్ సుమారు ఆరు గంటల పాటు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు భవితవ్యం సందిగ్ధంగా మారింది. షెడ్యూల్ ప్రకారం రావాల్సిన హంపి రైలు ఆదివారం ఆరు గంటలు ఆలస్యంగా నడవటంతో విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. వీరంతా ఉత్తర కన్నడ నుంచి బెంగళూరుకు హంపి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. ఉదయం ఏడింటికి బెంగళూరు చేరుకోవాల్సిన ట్రైన్.. మధ్యాహ్నం రెండున్నరకి వచ్చింది. ఒంటిగంటన్నరలోపు పరీక్ష కేంద్రాలకు రానందుకు అక్కడి అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. అంతకు ముందు రైలు ఆలస్యంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రితో పాటు, రైల్వే మంత్రికి మెసేజ్‌లు పంపించినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్ నిర్వహించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై సిద్దరామయ్య ట్విటర్ ద్వారా ధ్వజమెత్తారు. ఇతరులు సాధించిన దానికి కూడా తన ఖాతాలో వేసుకుని జబ్బలు చరుచుకునే మోదీ... ఇటువంటి వైఫల్యాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఘాటుగా విమర్శించారు. రైళ్లు సకాలంలో నడవకపోవడం వల్ల వందలాదిమంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారని, వారిని మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్దరామయ్య కోరారు. ఇక ఈ ఘటనపై సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్వో మాట్లాడుతూ.. హంపి ఎక్స్‌ప్రెస్ ఆలస్యం కారణంగా పరీక్షకు సకాలంలో హాజరుకాలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లేఖ రాయనున్నట్లు తెలిపారు.