Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు | Supreme Court directs NTA to publish centre-wise results of 2024 NEET UG exam | Sakshi
Sakshi News home page

Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు

Published Fri, Jul 19 2024 5:57 AM | Last Updated on Fri, Jul 19 2024 5:57 AM

Supreme Court directs NTA to publish centre-wise results of 2024 NEET UG exam

అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంచండి 

నీట్‌–యూజీపై ఎనీ్టఏకు సుప్రీంకోర్టు ఆదేశం 

సాక్షి, న్యూఢిల్లీ: పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్‌–యూజీ, 2024 ఫలితాలను ప్రకటించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సమగ్ర ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని తెలిపింది. నీట్‌–యూజీ పేపర్‌ లీక్, నిర్వహణలో అవకతవకలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం విచారించింది. 

పరీక్షను రద్దుచేసి కొత్తగా నిర్వహించాలని, కోర్టు పర్యవేక్షణలో లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరగాలని వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ‘‘ పరీక్షలో సెంటర్లవారీగా విద్యార్థులు పొందిన మార్కుల వివరాలను బహిర్గతంచేయండిగానీ అభ్యర్థుల ఐడెంటిటీ కనిపించకూడదు. గోప్యత పాటించండి. డమ్మీ రోల్‌ నంబర్లు వేసి అభ్యర్థుల మార్కుల వివరాలు ఇవ్వండి.

 ప్రశ్నాపత్రం సోషల్‌మీడియా ద్వారా ఎక్కువ మందికి షేర్‌ అయి, విస్తృతస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతింటేనే పరీక్షను మరోమారు నిర్వహించేందుకు అనుమతిస్తాం. అంతేగానీ ఒకటి రెండు కేంద్రాలకు మాత్రమే లీకేజీ పరిమితమైతే రీటెస్ట్‌కు ఒప్పుకోం. కేసు సీబీఐ చేతికి వెళ్లకముందు బిహార్‌ పోలీసులు సేకరించిన ఆధారాలు, సమర్పించిన ఆర్థికనేరాల విభాగ నివేదికను రేపు సాయంత్రం ఐదింటికల్లా మాకు అందజేయండి’ అని కోర్టు ఆదేశించింది. 

తర్వాత కొందరు పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది నరేందర్‌హూడా వాదించారు. ‘‘ పరీక్షను రద్దుచేయాల్సిందే. ఎందుకంటే లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగింది. హజారీబాగ్‌లో ప్రశ్నపత్రాలు ఆరురోజులపాటు ఒక ప్రైవేట్‌ కొరియర్‌ కంపెనీ అ«దీనంలో ఉండిపోయాయి. ఎగ్జామ్‌ సెంటర్‌కు ఒక సాధారణ ఈ–రిక్షాలో తరలించారు. ఈ ఉదంతంలో ఆ సెంటర్‌ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు’ అని అన్నారు.

 అయితే ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. ‘ కేవలం 1.08 లక్షల మంది అడ్మిషన్‌ పొందే ఈ పరీక్ష కోసం 23.33 లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టలేం. పటా్న, హజారీబాగ్‌ సెంటర్లలో మాత్రమే లీకేజీ అయినట్లు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. గుజరాత్‌లోని గోధ్రాలోనూ ఇది జరిగి ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా పేపర్‌ లీకేజీ అయిందనే బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే రీ టెస్ట్‌కు ఆదేశాలిస్తాం. అయినా పేపర్‌ లీకేజీకి, పరీక్ష ప్రారంభానికి మధ్య ఎంత సమయం ఉంది? ఎంత మందికి పేపర్‌ చేరవేశారు? అనేవి కీలక అంశాలపై స్పష్టత రావాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement